
వేపపూల తీపిగాలి. ఏమాశ్చర్యం! 2014 లో నీటిరంగుల చిత్రం కవిత్వసంపుటి వెలువరిస్తున్నప్పుడు నేను ఆ పుస్తకానికి పెట్టాలనుకున్న పేరు. కాని భగవంతుడి నిర్ణయం వేరేలా ఉంది. ఆయన ఈ శీర్షిక ని 2026 దాకా నేను ముట్టుకోకుండా అట్టేపెట్టాడు. ఎందుకని?
నా మొదటి కవితాసంపుటి నిర్వికల్ప సంగీతం 1986 మార్చి 28 న రాజమండ్రిలో గౌతమీ గ్రంథాలయంలో మా బామ్మగారి చేతులమీదుగా విడుదల చేసాం. సరిగ్గా నలభై ఏళ్ళ కిందట. అప్పుడు నాకు 24 ఏళ్ళు పూర్తయి అది నా ఇరవై అయిదో పుట్టినరోజు (సర్టిఫికేటు ప్రకారం నేను 62 లో పుట్టినట్టు లెక్కకాబట్టి.)
ఆ లెక్క ప్రకారం ఈ రోజుకి 64 పూర్తి చేసుకుని 65 లో అడుగుపెడుతున్నాను. ఇప్పటిదాకా నేను రాసిన కవితల్లోంచి 64 కవితలు ఎంపికచేసి ఈ పుట్టినరోజుకి ఒక సంపుటిగా వెలువరించాలని అనల్ప బలరాం గారికి చాలా గట్టి సంకల్పం కలిగింది. అందుకని 64 కవితలు ఎంచి ఇమ్మని మానస చామర్తిని అడిగారు. ఆమె నేను ఇంతదాకా వెలువరించిన 8 సంపుటాల్లోంచీ, ఈ ఏడాది పొడుగునా నా బ్లాగులో రాస్తూ వచ్చిన కవితల్లోంచీ 64 కవితలు ఎంపికచేసారు. వాటిని ఆమే, అనల్ప బలరాం గారూ ఇద్దరూ కలిసి ఇలా ‘వేపపూల తీపిగాలి’ పేరిట ఈ రోజు విడుదల చేసారు. అంటే నలభై ఏళ్ళ తరువాత నా పుట్టినరోజు నాడు వెలువడ్డ రెండో సంపుటం ఇది. ఇంతకన్నా గొప్ప కానుక ఈ పుట్టినరోజుకి నాకు మరొకటి ఊహించలేను.
పుస్తకం చేతుల్లోకి రాగానే ఆత్రుతగా ఆమె ఏ కవితలు ఎంపికచేసారా అని చూసాను. వట్టి ఎంపిక మాత్రమే కాదు, తాను ఈ కవితలు మాత్రమే ఎందుకు ఎంపికచేసారో, ఆమె ఆరేడు పేజీల ఒక పరిచయ పత్రం కూడా రాసారు. చలంగారు శ్రీశ్రీ కవిత్వానికి రాసిన యోగ్యతాపత్రం గుర్తొచ్చింది నాకు ఆ వ్యాసం చదివితే. అది యోగ్యతాపత్రమైతే, ఇది మూల్యాంకనాపత్రం. ‘నిర్వికల్ప సంగీతం’ 1986 లో వెలువడ్డా, అది 76-86 మధ్యలో రాసిన కవితల సంపుటి కాబట్టి అప్పటినుండి ఇప్పటిదాకా, అంటే 1976 నుంచి 2026 దాకా నా యాభై ఏళ్ళ కవిత్వ ప్రస్థానాన్నిసమగ్ర మూల్యాంకనం చేసి రాసిన పత్రమన్నమాట అది.
ఒక కవికి తన జీవితకాలంలో ఇటువంటి మూల్యాంకన దొరకడం గొప్ప భాగ్యం. నాకు తెలిసి తెలుగులో నా పూర్వకవుల్లో ఇటువంటి భాగ్యం లభించినవాళ్ళని వేళ్ళమీద కూడా లెక్కపెట్టలేమేమో! నాకైతే ఆ మొత్తం వ్యాసాన్ని ఇక్కడ పంచుకోవాలని ఉంది.
ఆ ముందుమాట దానికదే ఒక విశిష్ట మూల్యాంకనం కాగా, ఆమె తాను ఎంపికచేసిన కవితల్ని కూర్చిన పద్ధతి మరీ సమ్మోహనీయంగా, మరీ challenging గా ఉంది. ఎందుకంటే, సాధారణంగా ఇటువంటి కూర్పుల్లో కవితల్ని కాలక్రమపద్ధతిలో సంకలనం చేస్తారు. ప్రతి కవిత కిందా అది ఏ సంపుటంలో వచ్చిందో, ఆ సంపుటం పేరూ, ఆ కవిత రాసిన సంవత్సరం లాంటి వివరాలు పొందుపరుస్తారు. కాని మానస ఆ సంప్రదాయాన్ని కావాలనే పక్కనపెట్టారు. ఆమె తన ముందుమాటలో ఒక వాక్యం రాసారు: ‘దేశాలకూ, కాలాలకూ అతీతమైన ఒక సార్వజనీయమైన భాషను, అనుభవాన్ని ప్రతిపాదించిన ప్రాకృతికమైన కవిత్వాన్ని ప్రధానంగా నేనిందులోకి చేర్చాను’ అని. మరో మాట కూడా అన్నారు: ‘ఒక కవి ఇరవైలలోనూ, అరవైలలోనూ కూడా ఒక వస్తువుకి, ఒక భావనకు ఎడం జరగలేకుండా ఉన్నాడంటే, దానిమీదే కాలం గడిచే కొద్దీ మరింత లోతుగా, మరింత సాంద్రంగా మరింత శక్తిమంతంగా కవిత్వం రాసే ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ కవితా వస్తువుల్లో ఆ కవిని ఆకర్షిస్తున్నదేదో ఉంది…’ అని. అందుకని ఈ కవితలు చదివినప్పుడు, వీటిల్లో ఏవి ఇరవైల్లో రాసినవో, ఏవి అరవైల్లో రాసినవో తెలియదు. కాలం మారుతున్నా కవి మారలేదనీ, ప్రతి ఏటా సంభవించే ఋతుపరిభ్రమణ మొక్కటే ఆ కవికి తెలిసిన కాలమానమనీ, అతడికి తెలిసిన దేశం వార్తాపత్రికల్లో కనిపించే దేశం కాదనీ చెప్పడానికి ఇంతకన్నా ప్రతిభావంతమైన పద్ధతి మరేముంటుందిగనుక!
ధన్యవాదాలు చిన్నమాట మానసా! పువ్వును సృష్టించిన భగవంతుడే భ్రమరాన్ని కూడా సృష్టించిపెడతాడు. లేకపోతే నా కవిత్వానికి ఇంత అపురూపమైన, అపూర్వమైన రసజ్ఞభ్రమరం నేను వెతుక్కుంటే దొరికేదా!
ధన్యవాదాలు చిన్నమాట బలరాం గారూ! ఒక ప్రచురణకర్త తన సొంతసొమ్ము ఖర్చుపెట్టి ఒక కవికి ఇటువంటి కానుక చెయ్యడం చిన్న విషయం కాదు. ఒక కవికి ఇంతకన్నా అత్యున్నతపురస్కారం మరొకటి ఉండగలదనుకోను.
మిత్రులు ఈ కవిత్వసంకలనం చదవాలనుకుంటే ఈ లంకె నొక్కి పుస్తకం ఆర్డరు చెయ్యవచ్చు. పేజీలు 120. ధర రు. 150.
28-3-2026


అభినందనలు… సర్.
ధన్యవాదాలు సార్!
Very beautiful title and cover page. ❤️
ధన్యవాదాలు మాధవీ!
అభినందనలు 🎉
ధన్యవాదాలు సార్!
అభనందనలండీ! 👏👏👏
ధన్యవాదాలు సార్!
భావనా పటిమ వెలార్చు చేవ గలిగి ,
పఠితల రసానుభూతితో పరవశింప
జేయు , తమ కవిత లనిన , హాయి కలుగు
ప్రియములు నభినందనలు వాడ్రేవు సారు !
ధన్యవాదాలు సార్!
ఆ వేప పూల తీపి పరిమళాల గాలి మా ఊరొచ్చి అలవోకగా తాకుతూనే ఉంది. రోజూ బడికి వెళుతూ, వస్తూ ఆ వేప పూల గాలి సోకినప్పుడల్లా మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటాను. ఇవన్నీ కూర్చడానికి మానస చామర్తి గారికి మించిన అర్హులెవరూ ఉండరు. హృదయ పూర్వక ధన్యవాదాలు ఇరువురకూ… 🌿💐🌿
హృదయపూర్వక ధన్యవాదాలు ప్రసూనా!
ఇదొక అద్భుతం..ఏయే కవితలు ఎందుకు ఎంపిక చేసారా అని ఇప్పుడున్న ఆగని ఆసక్తి
హృదయ పూర్వక అభినందనలు సర్, తప్పకుండా ఆర్డర్ చేస్తాను.
ధన్యవాదాలు మేడం!