
‘అడక్కుండానే దొరికిన ముత్యం‘
మొదటి రోజు: రెండవ సంభాషణ
ఎండ నెమ్మదినెమ్మదిగా పెరుగుతోంది. కాని మేం కూచున్న మందిరంలోకి రాగానే గాలులు చల్లబడుతున్నాయి. లోపల కప్పుమీద పిచుకలు కూడా తమలో తాము మాటలు మొదలుపెట్టాయి. గురుపత్ని మాకోసం టీ తీసుకొచ్చారు. గురూజీ ఒక గుక్క టీ తాగి మళ్ళా చెప్పడం మొదలుపెట్టారు.
‘మా ఇంట్లోవాళ్ళు దీని పట్ల చాలా వ్యతిరేకంగా ఉండేవారు. వ్యతిరేకం అని కూడా కాదు, అసలు దీని అంతూపొంతూ తెలియదు వాళ్ళకి ‘ అని అన్నారు.
‘దేని గురించి?’ అనడిగాను, ఆయన ఇంతకు ముందు సంభాషణ ఎక్కడ ఆపారో గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ.
‘ఈ కళావళా- వీటన్నిటీ గురించీను. వాళ్ళకి దీంతో ఏమీ పనిలేదు. అందుకని ఆ టైములో నేనేం చేసేవాణ్ణంటే- కుమ్మరుల ఇళ్ళు నా కార్యశాలగా మార్చుకున్నాను. నకాషీల ఇల్లు నా కార్యశాల. ఇక్కడ తబలా పేటీల దుకాణం ఉండేది. అక్కడ కూర్చుని పనిచేసేవాణ్ణి. అక్కడ పనిముట్లు, ఆయుధాలు మొదలైనవన్నీ ఉండేవి. అక్కడ తోలుపని చాలానే నేర్చుకున్నాను. కంసాలి దుకాణంలో కూడా నా వర్క్ షాపు నడిచేది. వాళ్ళ ఇళ్ళల్లోనే ఉంటూ వాళ్ళ కోసమే పని చేయాల్సి ఉండేది.’
‘మా ఇంట్లో ప్రత్యేకత ఏమిటంటే, నేనేం చేస్తున్నా వాళ్ళెప్పుడూ నాకు అడ్డుపడలేదు. ‘ఇదెందుకు చేసావు? ఏం చేసావు?’ అని అడగలేదు. అప్పట్లో అఖాడా నడిచేటప్పుడు రాత్రుళ్ళు చాలా పొద్దుపోయాక ఇంటికి వచ్చేవాణ్ణి. బయట బాగా తిరుగుతుండేవాణ్ణి. ఒక రోజు బాగా రాత్రయ్యాక ఇంటికొస్తే మా పితాజీ అప్పుడు మేల్కొనే ఉన్నారు. ఆయన నన్ను పిలిచి ‘చూడు, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయడం లేదు అనేదాంతో మాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నీమీద మాకు నమ్మకం, భరోసా ఉన్నాయి’ అని అన్నారు.
కానీ ఆయనింకా ఇలా అన్నారు:
‘ఏదైనా పని చెయ్యాలనుకుంటే, అది దునియాకి మేలు చేసేలా ఉండాలి, అది కూడా చేయలేకపోతే కనీసం దేశానికి మేలు జరగాలి. అది కూడా కాకపోతే కనీసం మన ఇలాకాకైనా మేలు జరగాలి. అది కూడా చేయలేకపోతే కనీసం మన ఇంటికైనా మేలు చెయ్యి. అదీ కాకపోతే కనీసం నీకైనా నువ్వు మేలు చేసుకో.’
(నవ్వుతూ) ‘హ్హ.హ్హ. మా నాన్నగారు నాతో అన్న మాట ఇది. ఎవరికైనా మేలు జరగాలి. ఎవరికీ మేలు చెయ్యలేకపోతే కనీసం నీకైనా నువ్వు మేలు చేసుకో’ అని చెప్పి వదిలేశారు. ఎప్పుడూ నన్ను ఆపలేదు. ఎందుకంటే అప్పట్లో మేం చేసే పనులు కూడా చాలా మంచిపనులనే అనిపించుకునేవి. ఊళ్ళో రథోత్సవం జరిగితే మా అఖాడా పిల్లలే అక్కడ ఏర్పాట్లలో సాయం చేసేవాళ్ళు. ఎవరి ఇళ్ళల్లోనైనా పెళ్ళిళ్ళు జరిగితే అన్నం వడ్డన దగ్గరనుంచి ఆ విస్తరాకులు ఎత్తేదాకా పిల్లలే సాయం చేసేవారు. మొత్తం జిమ్మేదారీ వాళ్ళే తీసుకునేవారు. అందుకని ప్రజలకి మేం చేసే పనులు చెడ్డవనిపించేది కాదు.’
‘చాలాసార్లు నేను పిల్లల ఇళ్ళకు వెళ్ళి వాళ్ళని నిద్రలేపుతుంటే వాళ్ళ తల్లిదండ్రులే ఆ పిల్లల్ని తిట్టిపోసేవారు. ‘అరే, మిమ్మల్ని గురూజీ వచ్చి నిద్రలేపాలా? మీ అంతట మీరే లేచి వెళ్ళలేరా?’ అని మందలించేవారు. అఖాడా తెల్లవారు జామునే మొదలయ్యేది. ఆశన్న అని ఒక చాకళ్ళ అబ్బాయి ఉండేవాడు. వాడు చాలా పొద్దున్నే వచ్చేవాడు. వచ్చి అక్కడ సఫాయీ వఫాయీ అంతా చేసేవాడు. నేను కూడా అంత పొద్దున్నే లేచి పాదుకలు తొడుక్కుని వెళ్తుంటే, ఇక్కడ మనోహర్ అని ఒక పట్వారీ ఉండేవాడు, వాడు కాంగ్రెసులో ఉండేవాడు, సైతాన్ లాంటి మనిషి, రాత్రి మూడింటినుంచీ బయటే తిరుగుతుండేవాడు, అక్కడా ఇక్కడా చాయ్ తాగుతుండేవాడు, వాడు నాకు ఎదురైతే, ‘జై దయ్యాల గురు’ అనేవాడు. ‘నువ్వు భూతాలకు గురువ్వి’ అనేవాడు. ‘నేనే భూతం అనుకుంటే, నువ్వు నాకన్నా పెద్ద భూతానివిరా, మరీ ఇంత పొద్దున్నే బయట తిరుగుతున్నావు కదా అనేవాణ్ణి.’
‘ఆయన ఇప్పుడు లేడు, మరణించాడు. ఆ టైములో నేను చాలా రాత్రిపూట ఇంటికి వచ్చేవాణ్ణి. నన్నెవరూ ఆపేవారు కాదు. ఎవరూ ఏమీ అనేవారు కాదు. ఆ సమయంలో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ పక్కన కూచుని పని నేర్చుకోవడం నా అలవాటుగా ఉండేది. నకాషీ చేసే జింగర్ గోవిందు ఉన్నాడు కాదా. ఆ గోవిందు దగ్గర మేం చాలా పనులు నేర్చుకున్నాం. ఎల్లప్ప తాత అతనికి బాబాయి అవుతాడు.’
‘గోవిందు వాళ్ళ తాత కుండయ్య. ఆయన ఆ రోజుల్లో నిజాం రాజ్యం మొత్తం మీద రెండో నంబరు కళాకారుడిగా గుర్తింపు పొందారు. ఆ కాలంలో ఆయనకు బంగారు పతకాలు వచ్చాయని చెప్పుకునేవారు. ఆయన నకాషీ చిత్రకారుడు. ఆయనకు చాలా బిళ్ళలూ వళ్ళలూ వచ్చాయని వాళ్ళు చెప్తుంటే. ‘గురూజీ, ఆ బంగారు బిళ్ళలన్నీ ఏమి చేసుకుంటాం? వాటితో ఉంగరాలు చేయించుకున్నాం’ అని నవ్వుతుండేవారు. ఆయన చాలా పెద్ద కళాకారుడు. మీనియేచర్ పెయింటింగ్ చేసేవాడు. చాలా జబర్దస్త్ విషయం మీనియేచర్ పెయింటింగ్ అంటే. ఆ ఎల్లప్ప తాత దగ్గర కూచుని మేము కూడా పని నేర్చుకున్నాం.’
నాకు ఆ ఎల్లప్పతాత ముఖచిత్రపటం గుర్తొచ్చింది. నేను గురూజీని కలుసుకున్న తొలిరోజుల్లో వాళ్ళ ఇంట్లో హాల్లో ఒక తైలవర్ణ ముఖచిత్రం ఉండేది. అది చూపించి ‘ఈయనే మా గురువు’ అని గురూజీ పరిచయం చెయ్యడం గుర్తొచ్చింది.
గురూజీ సంభాషణ కొనసాగించారు. ‘గోవిందు ఆయనకి మనమడు. ఎల్లప్ప ఆయనకి తమ్ముడి కొడుకు. ఎల్లప్ప తాతదగ్గర చాలా పరిజ్ఞానం ఉండేది. చాలా గొప్ప పనులు చెయ్యడం తెలుసు ఆయనకి. గోవిందుకు లోకజ్ఞానం చాలా ఉండేది. ఆయన అదిలాబాదు మఠానికి ఆస్థానశిల్పిగా ఉండేవారు. ఆ మఠం ప్రతి ఒక్క కులం నుంచి ఒక్కొక్కరిని తన ఆస్థానంలో నియమించుకునేది. ఒకరు ఆస్థాన కళాకారులు, మరొకరు ఆస్థాన దర్జీ, ఇంకొకరు ఆస్థాన కుమ్మరి- ఇలా. ఈ విధంగా ఆ మఠంతో మనుషులు ముడిపడి ఉండేవారు. వీళ్ళందరికీ మఠం తరఫున రెండేసి ఎకరాల పొలం ఇచ్చేవారు. దాన్ని ‘ధర్మడియా’ అనేవారు. దాని మీద వచ్చే ఆదాయంతో వాళ్ళు బతుకుతూ దేవాలయం కోసం పనిచేస్తుండాలి. ఏడాదికి ఒకటి రెండు సార్లు ఇంకేదైనా పని చెప్తే దానికి విడిగా చెల్లించేవారు.’
‘గోవిందు ఆ మఠంలో ఆస్థానశిల్పి. అది వంశపారంపర్యంగా వచ్చే పని. మఠంలో రంగులు వెయ్యడం, చిత్రలేఖనం మొత్తం వాళ్ళే చేసేవాళ్ళు. ఆ గోవిందు దగ్గర కూచుని నేను చాలా పని నేర్చుకున్నాను.
ఒకరోజు గోవిందు నాతో ‘గురూజీ, మీకు కాగితం ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఎలా తయారు చెయ్యాలో చెప్తాను’ అని అన్నాడు. అప్పట్లో మట్టిపనుల్లో వాడటానికి కాగితం నానబెట్టేవారు. ఆ కాగితాన్ని బాగా రుద్ది గుజ్జుగా చేసాడు. పిండి జల్లించే జల్లెడ ఉంటుందికదా, దాంతో ఆ గుజ్జుని కాగితంగా యెలా తయారు చేస్తారో చూపించాడు. కాగితం తయారు చెయ్యడం, హాండ్ మేడ్ పేపరు తయారు చెయ్యడం మొదటిసారి చూసాను అవాళ.’
‘ఇంకా అక్కడ ఎన్నో రకాల కులాలవాళ్ళతో పరిచయమయ్యేది. భిక్షావృత్తిమీద బతికే కులాలవాళ్ళు గోవిందు దగ్గరికి వచ్చేవారు. వాళ్ళ ఇంట్లో ఒక జొన్నల సంచీ ఉండేది. ఆ కాలంలో ప్రతి ఇంటి వాకిలి దగ్గర ఒక జొన్నల సంచి ఉండేది. భిక్షావృత్తి వాళ్ళు వచ్చినప్పుడు ఆ సంచీలోంచి జొన్నలు తీసి వాళ్ళకు ఇచ్చేవారు.’
‘గుడ్డ మీద చిత్రలేఖనం చేసేవాళ్ళు కూడా గోవిందు దగ్గరికి వచ్చేవారు. ఈ రకరకాల కులాలవాళ్ళని నేను మొదటిసారి అక్కడే చూసాను. ఆ భిక్షావృత్తుల వాళ్ళని, అంటే ఎవరి జీవితం భిక్షమీద నడుస్తుందో వాళ్ళందరినీ కలుసుకున్నాను. అప్పటినుండీ నాకు జిజ్ఞాస మొదలయ్యింది. అసలు ఇదంతా ఏమిటి? వీళ్ళ పద్ధతులు ఏమిటి? ఎలా ఉంటాయని.’
‘ఒక్కొక్కరి దగ్గర నలభై అడుగుల పొడవుండే చిత్రపటాలుండేవి. పటచిత్రాలు. బొమ్మలుండేవి. వాటిని అక్కడే మొదటిసారి చూసాను. సంగతేమిటంటే, ఎల్లప్ప తాత దగ్గర పని నేర్చుకోడానికి నాకు ఐదారేళ్ళు పట్టింది. అందుకోసం చాలా కష్ట పడాల్సి వచ్చింది. రోజూ ఆయనదగ్గరికి వెళ్ళవలసి రావడం. కొన్నిసార్లు తిట్లు కురిపిస్తూ తరిమేసేవారు: ‘ఈ పనికిమాలిన పనులు నేర్చుకుని ఏం చేస్తావురా?’ అని.
ఒక రోజు నేను రాతితో విగ్రహం చేసాను. ఆ మూర్తి చూపిద్దామని వాళ్ళింటికి బయల్దేరాను. గోవిందూ, ఎల్లప్పా దారిలోనే కలిసారు. ‘తాతా పదండి, ఆ విగ్రహం చూపిస్తాను’ అంటే ‘లేదు లేదు మాకు చాలా అర్జెంటు పని ఉంది, మళ్ళా ఎప్పుడేనా చూద్దాం ‘ అని అన్నారు. కాని గోవిందు ‘తాతా, వాడెప్పణ్ణుంచో రమ్మంటున్నాడు కదా, పోయి చూద్దాం ‘ అని అంటే వాళ్ళిద్దరూ వచ్చారు. ఆ గణేశుడి మూర్తి చూసారు. ఆ విగ్రహం చూసి అక్కడే కూర్చుండిపోయారు. తమ పనులన్నీ మర్చిపోయారు. ఆ మధ్యాహ్నందాకా అక్కడే కూర్చుండిపోయారు.’
‘ఎల్లప్ప తాత నాకు పని నేర్పడం మొదలుపెట్టారు. ఆయనతో నాకు బంధం ఏర్పడింది. వాళ్ళ శైలిలో చిత్రలేఖనం నేర్పించడానికి వాళ్ళ ఇంట్లోనే పిల్లల కోసం ఒక స్కూలు మొదలుపెట్టాం. కొంతమంది పిల్లలు రోజూ రాత్తి పూట కూర్చుని ఆయన దగ్గర పని నేర్చుకునేవారు. పెయింటింగ్ ఎలా నేర్చుకోవాలా అని చూస్తే, ఆ టైములో పెన్సిల్ ఉండేది కాదు, పెన్సిల్ పట్టుకోవడం అంత మంచిది కాదని భావించేవారు. డైరక్టుగా బ్రష్షుతోనే పని నేర్చుకోవాలి.’
‘సుడ్గులు అంటారు. అలా గోల్ గోల్, సున్నాలు చుట్టడం, ఆ తర్వాత గీతలు గియ్యడం- అలా మేము ఆయన దగ్గర నేర్చుకోడం మొదలుపెట్టాం. ఆయనది చాలా జబర్దస్త్ టెక్నిక్.’
‘వాళ్ళ పని గురించి గోవిందు హమేశా ఒక మాట చెప్పేవాడు: ‘బిన్ మాంగే మోతీ మిలే. గురూజీ, మా పని అడక్కుండానే దొరికిన ముత్యం లాంటిది. ఎందుకంటే మా మెటీరియల్ లో ఏ ఒక్కటి కూడా పైసలు పెట్టి కొనే అవసరమే లేనిది. జనం పారేసే చింతగింజలు, ఎందుకూ పనికి రాని కుళ్ళిపోయిన చెక్కముక్కలు, పాత గుడ్డల పీలికలు- ఇవే మా పనికి పనికొస్తాయి. మా మెటీరియల్ అంతా ఆవు పేడ, చెక్కపొట్టు. ఇవన్నీ ఉచితంగా దొరుకుతాయి. వీటితోటే మేము పైసలు సంపాదించవచ్చు.’
‘అదే విషయం నేను కూడా నేర్చుకోడానికి చూసాను. వాళ్ళ పని డ్రాయింగు. ఎల్లప్ప దగ్గర మేము చాలా నేర్చుకున్నాం. ఈ పెయింటింగ్ మీద ఒక పుస్తకం రూపొందించాలని నాకు అప్పుడే అనిపించింది. ఈ శైలి మీద ఒక పుస్తకం రావడం చాలా అవసరమని ఇప్పటికీ అనిపిస్తోంది. ఎందుకంటే ఈ విషయం గురించి తెలిసిన పెద్దమనుషులెవరూ ఇప్పుడు మిగల్లేదు.’
‘ఎల్లప్పా, గోవిందూ ఆ టైములో చాలా అసాధారణమైన మనుషులు. వాళ్ళతో పాటు వెంకటయ్య అని మరొకాయన ఉండేవాడు. వాళ్ళంతా చాలా సరదా మనుషులు. పేదవాళ్ళు. అన్నీ కోల్పోయిన వాళ్ళు. కాని మానసికంగా మాత్రం వాళ్ళు నిర్వీర్యం కాలేదు. వాళ్ళల్లో ఒక ఔన్నత్యం, ఒక గరిమా ఉండేవి. ఆ గరిమ వాళ్ళకి వాళ్ళదగ్గరున్న జాన్ కారీ వల్ల వచ్చింది. వాళ్ళ దగ్గర చాలా పరిజ్ఞానాలు ఉండేవి. నేటి కారీగార్ల దగ్గర ఎటువంటి జ్ఞానం లేదు. కాని ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానం వల్ల వాళ్ళల్లో ఒక పెద్దరికం, ఒక హుందాతనం ఉండేవి. ‘
వాళ్ళు చాలా సహజమైన జీవితం గడిపేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ నాకు దారిలో కనబడ్డారు. ‘ఎక్కడికి వెళ్తున్నారు?’ అనడిగితే, ‘మునిసిపాలిటీలో ఏదో పని ఉంది, వెళ్ళొస్తాం’ అన్నారు. ‘మీరెక్కడికైనా వెళ్ళాలా?’ అని నన్నడిగితే, ‘నేను దేవాపూరు వెళ్దామనుకుంటున్నాను’ అన్నాను. ‘అక్కడ భిక్షాటన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని చూసి, కలిసి, మాట్లాడివద్దామని అనుకుంటున్నాను ‘అని అన్నాను. ‘అట్లనా, అయితే పదండి, మేం కూడా వస్తాం ‘ అని తమ పని పక్కనపెట్టేసి నాతో పాటు తాము కూడా బయల్దేరారు.’
‘మేం ముగ్గురం దేవాపూర్ మోడ్ దాకా బస్సులో వెళ్ళి అక్కడినుండి మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి భిక్షావృత్తి వాళ్ళ చౌధరీ, అంటే వాళ్ళ పెద్దమనిషి, భోజన్నను కలిసాం. అక్కడ ‘మసాన్ జోగీ’అనే కాటిపాపలోడు ఒకడున్నాడు. వాడు వింతవింత ఆటలు చూపిస్తాడు. వాడి ఆటలు చూద్దామని వెళ్ళాం. వాణ్ణి పిలిపించి ‘అరే, ఇటు రా, నీ ఆట చూపించు, నీకు తాగడానికి పైసలిస్తాం’ అన్నాం. వాడు గంట వాయిస్తూ భలే అద్భుతమైన ఆటలు ఆడి చూపించాడు. నోట్లోంచి లింగాల్లాంటి పెద్దపెద్ద గోళీలు తీశాడు, ఇప్పుడు మహాత్ములు తీస్తున్నారే, అలా.’
‘కర్రతో చెక్కిన ఒక చిన్న మూర్తిని చూపిస్తూ ‘మూత్రం పొయ్యి’ అనగానే ఆ కర్రబొమ్మ టక్కున మూత్రం పోసింది. ఇలాంటి ఆటలన్నీ వాడు చాలా చూపించాడు. ‘ఇదెలా సాధ్యం?’ అనడిగితే ‘ఇందులో ఏమీ లేదు గురూజీ, ఇదంతా హాథ్ కీ సఫాయీ, హస్తలాఘవం మాత్రమే’ అని చెప్పాడు. అది చూసాక, మేం బయటకి వచ్చి, దారిలో శనగలు అమ్ముతుంటే కొనుక్కుని, ఒక నాలా గట్టున కూర్చుని తిన్నాం. అలా ముచ్చట్లు చెప్పుకుంటూ మోడ దాకా వచ్చాం. మోడ్ కి వచ్చాక ‘ఇక్కడి నుండి మవాలా ఎంత దూరం? పదండి, నడుచుకుంటూ వెళ్దాం’ అనుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ మవాలా దాకా వచ్చేసాం. అక్కడినుంచి అదిలాబాద్ బస్సెక్కి వెళ్ళవచ్చు. దేవాపూరు నుండి దాదాపు పదిపదమూడు కిలోమీటర్లు నడిచే వచ్చాం. రాస్తా అంతా చాలా ముచ్చట్లు నడిచాయి.’
గురూజీ ఈ ఉదాహరణల ద్వారా ఏం చెప్తున్నారో నాకు అర్థమవుతూ ఉంది. ఆయన తరచూ చెప్పే మాట: మనది ఆత్మీయతతో వ్యవహారం, పాశ్చాత్యులది వ్యవహారంతో ఆత్మీయత అని. అంటే పూర్వకాలం నుంచీ మనదేశంలో మనుషులు కలిసి మెలిసి గడపడానికి ఏదో ఒక పని సాకుగా వెతుక్కుంటారు. పాశ్చాత్యులు ఏదో ఒక పని చెయ్యడానికి మనుషుల్ని సహచరులుగా మార్చుకుంటారు.
నేను చాలాకాలం కిందట The Geography of Thought అనే పుస్తకం చదివాను. అందులో ఆ రచయిత ఇలాంటి మాటలే చెప్పాడు. పూర్వకాలంలో ఒక గ్రీకుకి సెలవు దొరికితే ఏదన్నా కొత్త పని నేర్చుకోవాలని చూసేవాడట. అదే, పూర్వకాలపు చీనీయుడికి సెలవుదొరికితే స్వగ్రామానికి పోయి స్వజనాన్ని చూడాలనుకుంటాడు అని.

ఒకప్పుడు మన సమాజంలో వేసవి సెలవులంటే పిల్లలకి తమ స్వగ్రామానికి పోవడం, గ్రామాల్లో ఉన్న తమ బంధువుల దగ్గరకి పోవడం, అక్కడ వాళ్ళతో ఊరికే కలిసి గడపడం. కానీ ఇప్పుడు మనం పూర్తి పాశ్చాత్యీకరణ చెందాం. ఇప్పుడు మనకి వేసవి సెలవులనగానే ఏదో ఒక విద్యనేర్పే సమ్మర్ కాంపులే కనబడుతుంటాయి.
గురూజీ సంభాషణ కొనసాగించారు.
‘అలానే మరో రోజు వాళ్ళతో కలిసి, ‘పదండి ఎక్కడైనా రాళ్ళు చూసి వద్దాం’ అని వెళ్ళాం. ఇక్కడ అంకుశ గుట్ట ఉంది కదా. మేము ముగ్గురం తలలు దించుకుని ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తుంటే, మా ముందొక పెద్ద పాము కనిపించింది. పాముని చూసి గోవిందు భయంతో నా చేయి పట్టుకుని ఆపేసాడు: ‘గురూజీ, ఇక్కడ చాలా పెద్ద పాము ఉంది’ అని. ఆ పాము అక్కడ పడి ఉంది. ఇంతలో వాళ్ళు అడవికి కట్టెల కోసం వెళ్ళే ఆడవాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా పామును చూసి ఆగారు. ఒకావిడ రాయి తీసి విసిరితే ఆ పాము కదల్లేదు. ‘అది చచ్చిపోయిన పాము’ అని తెలుసుకుని వారు ఆరాంగా పక్కనుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాతే మేము కూడా కదిలాం.’
‘రాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళి, అక్కడ వడ్డెరవాళ్ళనుంచి రాళ్ళకోసం వాడే ఉలి గురించీ, దానికి పదును పెట్టడం గురించీ, ఆ సానబెట్టే పద్ధతి గురించీ తెలుసుకోవలసి ఉంది. ఎందుకంటే సానబెట్టడంలో చాలా పద్ధతులున్నాయి. అవన్నీ నేను మళ్ళా ఎప్పుడన్నా వివరంగా చెప్తాను. ఆ పద్ధతులు నేను ఆ వడ్డెరవాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నేను రకరకాల చేతి పనులు చేసే మనుషుల దగ్గర ఉన్నాను. వాళ్ళ దగ్గరే కూచుని ఆ పనులు మొత్తం నేర్చుకున్నాను. వాళ్ళెంత గొప్ప మనుషులంటే, వాళ్ళ దగ్గర నీచత్వం, కుసంస్కారం ఏ కోశానా కనబడేది కాదు.’
‘ఎక్కడన్నా పని జరుగుతోందంటే నేను కూడా చాలాసార్లు వాళ్ళతో కలిసి ఆ పనిచేసేవాణ్ణి. అంతకలిసి మెలిసి ఆ పనులు చేసేవాళ్ళం. ఇక వెంకటయ్య ఎటువంటి మనిషి అంటే ‘ఈ పని నాకు రాదు’ అనే మాట అతడి నోటినుంచి వచ్చేదే కాదు. ప్రతి ఒక్క పనీ అతడికి తెలుసు. బంగారపు పని చేసేవాడు. ఇత్తడిపోత పోసేవాడు. యంత్రాలు పాడైపోతే ఆ మెషీన్ వషీన్ మరమ్మత్తులు చేసేవాడు. ఆ మనుషుల్లో ఎంతటి గొప్ప సామర్థ్యం ఉండేదంటే, ఏదైనా పని చాతకాక ఆగిపోవడమంటూ ఉండేదే కాదు. ఒకసారి మేమంతా పోత పోస్తున్నాం. అప్పుడు ఆ బ్లోయరు, అంటే గాలి ఊదే యంత్రం, లోపల రెక్కలు విరిగిపోయాయి. గాలి రావడం లేదు. అప్పుడు అతను ఏం చేద్దామ అని ఆలోచించి, ఒక ఇనుపరేకు పట్టుకొచ్చి దాంతో రేకులు చేసి వాటిని జోడించి పంకా తిప్పడం మొదలుపెట్టేసాడు.’
‘వాళ్ళు ప్రతి ఒక్క వస్తువు తయారు చేసేవాళ్ళు. అంటే గాజుమీద ముద్రించడం ఉంటుంది కదా, బల్బు ఉంటుంది చూడండి, ఆ బల్బుమీద కూడా పేరు చెక్కి ఇచ్చేవాడు. వాడలా ఉండేవాడు. ‘ఈ పని నాకు రాదు ‘అనే మాటనే ఉండేది కాదు. కానీ వాళ్ళంతా బాగా దారూ వారూ అంటే మద్యం తాగేవారు. మేము వాళ్ళని గౌరవించేవాళ్ళం కదా, అందుకని ‘గురూజీ, మీ దగ్గరకు రావాలంటే మాకు ఇబ్బందిగా ఉంటోంది’అనేవారు. మేము వాళ్ళ మాటలకి అడ్డుపడేవాళ్ళం. ‘మీకు తాగాలనిపిస్తే తాగండి. దానికీ మాకూ ఏమీ సంబంధం లేదు. మాకు కావలసిందల్లా మీ దగ్గరున్న విద్య, మీ పని, అదే మాకు మహత్త్వశాలి’ అని చెప్పేవాళ్ళం.
అప్పట్లో నేను సైకిలు మీద తిరిగేవాణ్ణి. లచ్చీరాం అని ఒకాయన ఉండేవాడు. ఆయనకి పిండిగిర్ని ఉండేది. నేను వాడితో ‘లచ్చీరాం, ఎక్కడికైనా వెళ్దాం పద’ అని అంటే వాడు వెంటనే తయారైపోయేవాడు. ఆ పిండిగిర్ని దగ్గర ఎవర్నేనా కాపలా పెట్టి మేమిద్దరం సైకిలు మీద బయల్దేరిపోయేవాళ్ళం. కూడా రొట్టెలు పట్టుకుపొయ్యేవాళ్ళం. ఎందుకంటే కనీసం ఇరవై కిలోమీటర్లన్నా ప్రయాణం చేస్తుండేవాళ్ళం. అయితే ఏ దారమ్మట వెళ్ళామో ఆ దారమ్మట తిరిగి వచ్చేవాళ్ళం కాదు. మళ్ళా మరో కొత్త దారి పట్టుకోవాలి.’
‘ఒకసారి మేం యాపల్ గూడ అనే ఊరెళ్ళాం. అక్కడినుండి తిరిగి వచ్చేటప్పుడు ‘లచ్చీరాం, ఇప్పుడు ఇటునుండి వెళ్దాం, చిట్టాల్ బోరీ మీదుగా వెళ్దాం ‘ అన్నాను. అప్పుడు కచకంటి మీదుగా చిట్టాల్ బోరి వెళ్ళాం. నేను చిట్టాల్ బోరీ వెళ్ళాలి అనుకోడానికి ఒక కారణం ఉంది. చాలా కాలంగా నాకు అక్కడికి వెళ్ళాలని ఒక జిజ్ఞాస ఉండేది. కచకంటి గ్రామంలో గట్టయ్య అని ఒకాయన ఉండేవాడు. ఆయన మా ఇంట్లో పాలుపోసేవాడు. మామూలుగా జొన్నలు పండేటప్పుడు ఆ జొన్నబుట్టలు తయారయ్యాక వాటిని కాల్చుకునో, వేయించుకునో తింటూంటారు. ఇక్కడ వాటిని పిస్కుళ్ళు అంటారు. ఆ రోజుల్లో ఎవరికైతే పొలాలూ, , పొలం పనులూ ఉండేవి కావో, వాళ్ళకి ఈ పిస్కుళ్ళు తినిపించడానికి ఈ పాలుపోసే మనుషులు ఎడ్లబళ్ళ మీద వాళ్ళని తమ పొలాలకి తీసుకెళ్ళేవారు. పొలంలేని కుటుంబాల్ని అలా తీసుకెళ్ళి రోజంతా పొలంలోనే అట్టేపెట్టుకుని వాళ్ళకి ఆ పిస్కుళ్ళు తినిపించేవారు. ఆ తరువాత భోజనం కూడా పెట్టేవారు. నేనొకసారి అలా పిస్కుళ్ళు తినడానికి వెళ్ళినప్పుడు ‘ గట్టయ్యా, నేను చిట్టాల్ బోరీ వెళ్ళాలి ‘ అని అంటే, వాడు ఆ ప్రస్తావన దాటవేసాడు. ‘వద్దు గురూజీ, వద్దు, ఇప్పుడక్కడ అందరూ తాగిపడుంటారు. మీరిప్పుడు వెళ్తే మిమ్మల్ని కూడా పట్టుకుని తాగిస్తారు. అందుకని వెళ్ళొద్దు’ అని అన్నాడు.
‘నేను అప్పుడు వెళ్ళలేదు. కానీ ఆ రోజు లచ్చీరాం తో ‘లచ్చీరాం, పద ‘అన్నాను. అలా ఆ రోజు కచకంటినుంచి చిట్టాల్ బోరీలో అడుగుపెట్టగానే అక్కడ మట్టి తవ్వి ఉండటం చూసాను. అది చూడగానే ‘ఇక్కడ మట్టి తవ్వి ఉంది అంటే, ఇక్కడ ఎవరో ఒకరు పనిచేసేవాళ్ళు ఉండి ఉండాలి. అయితే కుమ్మరులేనా ఉండాలి లేదా ఎవరో ఒక చేతిపనివాళ్ళేనా ఉండి ఉండాలి’ అని అన్నాను. మేం ఊళ్ళోకి వెళ్ళాం. ఊరు మొత్తం తిరిగాం. మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు ఒక ఇంటి దగ్గర మట్టితో చేసిన కొన్ని అచ్చులు కనబడ్డాయి. అక్కడొక పిల్లవాడు కూచుని ఉన్నాడు. వాడితో మాటలు కలిపాం. ‘ఇవేమిటి?’ అనడిగాం. ‘ఇవి అచ్చులు. మేం ఇత్తడి పోత పనిచేస్తాం. మా నాన్న ఇప్పుడిక్కడ లేడు. ఊరెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చాక కలవండి’ అని అన్నాడు.
‘మేము ఆ సమాచారమంతా తీసుకుని ఆ రోజుకి తిరిగి వచ్చేసాం. మర్నాడే నేను మళ్ళా పొద్దుపొద్దున్నే సైకిలుమీద చిట్టాల్ బొరీ వెళ్ళిపోయాను. అక్కడ దూద్ రాం అని ఒకాయన ఉన్నాడు. మేము ముందురోజు కలుసుకున్న పిల్లవాడి తండ్రి. మేం ఆయనతో ముచ్చట్లు కలిపాం. అప్పుడాయన ఆ ఇత్తడిపోత పనులు ఎలా చేస్తారో ఆ వైనమంతా నాకు చెప్పాడు. అప్పణ్ణుంచీ అతనికీ నాకూ జట్టు కలిసింది. ఒకే కుటుంబీకుల మధ్యనుండే బంధం లాంటిదని చెప్పవచ్చు. ఆయన్నుంచి నేను చాలా పని నేర్చుకున్నాను. ఇత్తడి పోత పని మొత్తం ఆ దూద్ రాం దగ్గరే నేర్చుకున్నాను. మైనంతో పనిచేయడం, పోతపొయ్యడం మొదలైనవన్నీ.’
‘ఆ దూద్ రాం చాలా మజేదార్ ఆద్మీ. ఆయనకి కబీర్ దాసు దోహాలు చాలా వచ్చు. కబీరు దోహాలు గొంతెత్తి పాడేవాడు. ఆయన పోతపనిచేసేటప్పుడు ఆ తిత్తుల్లోంచి గాలి వదుల్తూ ఉంటే, ఆ తిత్తులు చేసే చప్పుడుతోపాటు ఆయన పాడే దోహాలు కలిసి చాలా వినసొంపుగా ఉండేది. కబీరుదాసు, తులసీదాసుల దోహాలు ఆయనకి చాలానే గుర్తుండేవి.’
(రెండవ సంభాషణ ఇంకా ఉంది)
Ravindra Kumar Sharma profile phot and Kalashramam photography by Sardara Harpal Singh, Adilabad
3-6-2026


Wow!! Just wow!!
What a life!! 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
వింటున్నాం సర్. Thanku
ధన్యవాదాలు మేడం!
ఇది కదా.. నిజమైన విద్యాభ్యాసం అంటే..ఆయన నిజంగా గురూజీయే.. మీరు ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం ఆయన సంభాషణలు రికార్డు చేసి ఉండకపోతే నాలాంటి పాఠకులు ఎంతో కోల్పేయవాళ్ళం.. ఎంత జ్ఞాన సంపద పెరుగుతుందో మీవల్ల మాకు. గురూజీ పితాజీ గారు చెప్పినట్టు
“ఏదైనా పని చెయ్యాలనుకుంటే, అది దునియాకి మేలు చేసేలా ఉండాలి, అది కూడా చేయలేకపోతే కనీసం దేశానికి మేలు జరగాలి. అది కూడా కాకపోతే కనీసం మన ఇలాకాకైనా మేలు జరగాలి. అది కూడా చేయలేకపోతే కనీసం మన ఇంటికైనా మేలు చెయ్యి. అదీ కాకపోతే కనీసం నీకైనా నువ్వు మేలు చేసుకో.’
మీరు రికార్డు చేసిన సంభాషణలకు ఇలా అక్షర రూపమిచ్చి చేస్తున్న మేలు రాబోయే తరాలకి ఎంత విలువైనదో ఊహించలేము.
ఎన్ని కొత్త పదాలు.. ఎన్ని కొత్త విషయాలు.. ఎన్ని కళారూపాలు, ఎంత సునిశిత పరిశీలన. ఎంత సహృదయత.. మీ గురూజీ ది నిజంగా సాధారణ జీవితం అనిపించే అసాధారణ జీవనం.. ఏం మనిషి ఈయన.. ఎంత గొప్ప వ్యక్తిత్వం.. ఆయనను కలవాలనే జిజ్ఞాస చదువుతున్న కొద్దీ ఎక్కువవుతోంది.. కలవలేమని తెలిసినా.. మీరు రాస్తున్న విధానం ఆయన ముందు కూర్చుని అబ్బురపడుతూ ఆయన నోటివెంట వస్తున్న ప్రతి వాక్యాన్ని ఆస్వాదించేలా ఉంది. రవీంద్ర నాథ్ ఠాగూర్ కి ఏ మాత్రం తీసిపోని వ్యక్తి ఈ రవీంద్ర కుమార్ శర్మ అనిపిస్తున్నారు. ఈ జీవనశిల్పి తన రెండవ సంభాషణ సగంలోనే ఇంతగా చెరిగిపోలేని ముద్ర మా మీద వేసారంటే.. మొత్తం సంభాషణలు చదవటం పూర్తయ్యేసరికి వారి పితాజీ చెప్పినట్టు కనీసం మాకైనా మేము మేలు చేసుకుంటామని కచ్చితంగా చెప్పగలను.
కృతజ్ఞతాభివందనాలు భద్రుడు గారు.
.
మీ వంటి మిత్రుల కోసమే ఈ సంభాషణలు ఇన్నేళ్లుగా వేచి ఉన్నాయి.
మీవంటి మిత్రుల కోసమే ఈ సంభాషణలు ఇన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాయి.
కళార్షీకృత జనేతిహాసం అద్భుతం అతిరమ్యం
ధన్యవాదాలు సార్