నేలకొండపల్లి-3

నేలకొండపల్లి వెళ్ళి వచ్చినప్పటినుంచీ ఈ వారం రోజులూ నా ఆలోచనల్లో రామదాసే ఉన్నాడు. రామదాసు కీర్తనల్లో ప్రధానమైంది ఆర్తి. అది ఆయన జైల్లో ఉండగా రాసిన పాటల్లో మరీ మరీ వినిపిస్తుంది. కాని అంతకన్నా ముందటి పాటల్లో ఉండేది ఉత్సాహం. ఆ ఉత్సాహం పొంగిపొర్లినప్పుడు ఇలాంటి పల్లవులు చిగురిస్తాయి:

ఆయనకి చిన్నప్పుడే రఘునాథభట్టారుల దగ్గర నారాయణమంత్ర దీక్ష దొరికిందనీ, అప్పుడు రాసిన గీతమే ‘తక్కువేమీ మనకు రాముండొక్కరుండు వరకు’ కావొచ్చని రజనీకాంతరావు గారంటారు. ఎందుకంటే ఆ ఒక్క కీర్తనలోనే ‘నారాయణదాసుని గాచిన శ్రీమన్ నారాయణు నెర నమ్మియుండగ’ అనే మాట కనిపిస్తుందని ఆయన అభిప్రాయం. కానీ ఆ కీర్తనలో కూడా చివర ‘రామదాసునిల రక్షించెదనని ప్రేమతో పలికిన ప్రభువిచటనుండగ’ అని రామదాసు ముద్ర ఉంది. కానీ రజనీకాంతరావు గారు చెప్పినదానిలో ఒక విశేషముంది. అది లక్ష్మణ చక్రవర్తిగారు రాసిన ఒక వ్యాసం చదివినప్పుడు నాకు బోధపడింది. రామదాసు సాహిత్యంపైన ఆళ్వారుల ప్రభావం గురించి రాస్తూ, విశిష్టాద్వైత దర్శనంలోంచి ఆ కీర్తనల్ని ఆయన వ్యాఖ్యానించారు. అది చాలా మౌలికమైన పరిశీలన. అసలు ‘రామదాసు’ అని పేరుపెట్టుకోవడంలోనే ఆ దాసానుదాస సంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంది.

భారతీయ భక్తి కవుల్ని చూసినప్పుడు మనకి ఒక విషయం బోధపడుతుంది. అదేమంటే వారు శివుడు, విష్ణువు, శక్తి మొదలైన pan-Indian దైవ స్వరూపాల దర్శనం లభించినందువల్ల కవులుగా మారినప్పటికీ, తాము ఆ దైవాన్ని తమ స్థానిక దేవాలయంలోనో, అర్చామూర్తిలోనో, లేదా ఒక ఊరిలోనో, నామంలోనో లేదా ఒక ముద్రలోనో కనుగొనడం. ఆండాళ్ కృష్ణగీతాలే రాసిందిగానీ, ఆ రేపల్లెని తన శ్రీవిల్లిపుత్తూరులో చూసింది. అలానే మీరా కూడా కృష్ణభక్తిగీతాలే ఆలపించిందిగానీ, ఆమె కృష్ణుణ్ణి గోవర్ధనగిరిధారి రూపంలోనే ఎక్కువ ఇష్టపడింది. కబీరు చూసిన రాముడు దశరథతనయుడు కానే కాడు. సంబంధర్ కీర్తించిన శివుడు స్పష్టంగా చోళకాలపు తమిళ శివుడు. అలానే రామదాసు కూడా తనకు నారాయణమంత్రంద్వారా లభించిన విష్ణు దర్శనాన్ని భద్రగిరీశ్వరుడిలో పోల్చుకున్నాడు. ఇది భక్తిసంప్రదాయంలోని మార్గ-దేశి లక్షణం.

అలా ఒక ఉపాస్యదేవత, ఆ దేవతకొక local anchoring దొరికాక, ఆ దైవం పట్ల తన నవవిధ భక్తిభావాల్నీ ప్రకటించడానికి ఎటువంటి ప్రక్రియ ఎంచుకున్నాడూ, ఎటువంటి శైలి, ఎటువంటి భాష వాడుకున్నాడన్నది పరిశీలించడం ఆసక్తిగా ఉంటుంది. ఈ కీర్తన చూడండి, సూర దాస్ నుంచి పెరియాళ్వారుదాకా ఈ వాత్సల్యభక్తిని ఎందరు కవులు చూపించలేదు? కాని తెలుగువాడు రాసినప్పుడు మాత్రమే ‘అల్లమూరుగాయ, పెరుగూ’ కూడా పాటలోకి వచ్చేస్తాయి!

రామదాసు కీర్తనల్లోని సాహిత్యం, సంగీతం రెండూ కూడా అకస్మాత్తుగా పుట్టినవి కావు. రామదాసు జీవించిన పదిహేడో శతాబ్దాన్ని దక్కన్ లో సాహిత్య-సంగీత స్వర్ణయుగంగా రజనీకాంతరావుగారు పేర్కొన్నారు. అది కుతుబ్ షాహీలు గోల్కోండ రాజధానిగా దక్కన్ ని పాలించిన కాలం. షియా శాఖకి చెందిన కుతుబ్ షాహీల పైన సూఫీల ప్రభావం ఉంది. అందువల్ల వారు మతసహనం కలిగి ఉండటమే కాక, సాహిత్యాన్నీ, సంగీతాన్నీ కూడా ప్రోత్సహించారు. పదహారో శతాబ్దంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా తెలుగు కవుల్ని ఆదరించాడు. కాబట్టే ఆయన్ని తెలుగు కవులు మల్కిభరాముడని ప్రేమగా పిలుచుకున్నారు. ఆ తర్వాత పాలకుడైన కులీ కుతుబ్ షా స్వయంగా కవి. హైదరాబాదు స్థాపకుడు. కాగా పదిహేడో శతాబ్ది పాలకులైన సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా (1612-26) అబ్దుల్లా కుతుబ్ షా (1626-1672), అబుల్ హసన్ కుతుబ్ షా (1672-86) ల కాలంలో షియా మతావలంబులైన కుతుబ్ షాహీలకీ, సున్నీ మతావలంబుడైన ఔరంగజేబూ కీ మధ్య వైరం పెరిగి, చివరకి అబుల్ హసన్ కుతుబ్ షా ని మొగలులు బందీగా తీసుకుపోవడంతో గోల్కొండ పతనమైంది.

వీరిలో చివరి ఇద్దరు పాలకుల్నీ కూడా తానాషాలుగా పిలిచేరు. కాబట్టి అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో అక్కన్న, మాదన్నల వల్ల కంచెర్ల గోపన్నకి భద్రాచలం తహసీలుదారు ఉద్యోగం లభించింది. అబ్దుల్లా కుతుబ్ షా పాలనకాలంలోనే రామదాసు భద్రాచల దేవాలయ నిర్మాణం చేపట్టడం, అందుకు ప్రభుత్వం తాలూకు సొమ్ము వినియోగించడం, దాంతో జైలు పాలు కావడం జరిగాయి. పన్నెండేళ్ళ జైలు (1665-77) తర్వాత చివరి పాలకుడైన అబుల్ హసన్ తానాషా కాలంలో తిరిగి మళ్ళా అక్కన్న, మాదన్నల సహాయంతో రామదాసు జైలునుంచి విడుదలవడం జరిగాయి. రామలక్ష్మణులు స్వయంగా పైకం చెల్లించి రామదాసును విడుదలచేసారని ఐతిహ్యం. ఇరవయ్యవ శతాబ్దిలో ఆరుద్రలాంటి సాహిత్యచరిత్రకారులు ఆ ఐతిహ్యాన్ని హేతుబద్ధంగా వివరించే ప్రయత్నం చేసారు. కాని రాముడే పైకం చెల్లించి రామదాసును విడుదల చేసాడని  హావర్ట్, మార్టిన్ అనే ఇద్దరు డచ్చి ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులు రాసారని రజనీకాంతరావుగారు రాసారు.

ఇటువంటి సంఘటన మనకి భారతీయ భక్తిసాహిత్యంలో మరెక్కడా కనిపించదు. దేవుడిపట్ల భక్తిపారవశ్యంతో కీర్తనలు పాడుకుంటూ సర్కారు సొమ్ముతో దేవుడికి రామదాసు గుడికట్టి ఉండవచ్చునని ఇదుగో ఇలాంటి మధురమైన కీర్తనలు వింటే తెలుస్తుంది. తాను రాముడికి సేవ చేస్తున్నప్పుడు, తన అన్నిరకాల senses నీ పక్కకు తప్పుకొమ్మని ఎలా చెప్తున్నాడో చూడండి:

ఇలా మరొక మూడు చరణాల పొడుక్కీ సాగే కీర్తన ఇది. ఇటువంటి కీర్తనసాహిత్యానికి అతనికి కూచిపూడి భాగవతుల యక్షగానాలు కొంత దారి చూపించి ఉంటాయని రజనీకాంతరావుగారి ఊహ. 1678 లో తానాషా కూచిపూడి సందర్శించి పారిజాతాపహరణం యక్షగానం చూసి ఆ గ్రామాన్ని బాగవతులకు ఈనాముగా ఇచ్చాడన్నది జగద్విదితం. సిద్ధేంద్రయోగి భద్రాచలం సందర్శించాడని కూడా అంటారు. అలానే క్షేత్రయ్య కూడా 1650 ప్రాంతంలో భద్రాచలం సందర్శించి ఉంటాడనీ, అప్పుడు రామదాసు తహశీల్ దారుగా ఆయన్ని ఆలయమర్యాదలతో స్వాగతించి ఉంటాడనీ రజనీకాంత రావు గారు చెప్తున్నారు. మరొకవైపు పురందరదాస కీర్తనల ప్రభావం కూడా రామదాసుమీద ఉంది. ముఖ్యంగా అన్నమయ్య, క్షేత్రయ్యల పదాల్లో పల్లవి సమదైర్ఘ్యంలో ఉండే రెండుపంక్తుల పల్లవి. కాగా క్షేత్రయ్య ఒకే ఒక్క పంక్తికలిగిన పల్లవి, రెండు పంక్తుల అనుపల్లవితో కలిసి కూడా కొన్ని పదాలు రాసాడు. ఆయన ఆ నిర్మాణాన్ని పురందరదాసునుంచి గ్రహించి ఉండవచ్చు. రామదాసు ఆ పద్ధతినే స్వీకరించాడు. చూడండి, ఒక పురందరదాస కీర్తన:

అదే పద్ధతిలో ద్వితీయాక్షర ప్రాస పాటిస్తూ రామదాస కీర్తన:

ఆయన జీవితకాలంలో ఆయన్ని ఒక కబీరు పంథీ కలిసినట్టు చరిత్ర కూడా చెప్తున్నది. కాబట్టి ఆయనకు కబీరు పదాలతో కూడా పరిచయం ఉందనుకోవచ్చు. కాబట్టే, ఇటువంటి వాక్యాలు కబీరును తలపించడంలో ఆశ్చర్యం లేదు.

అలాగే స్వయంగా పారశీకంలోనూ, ఉర్దూలోనూ కూడా పండితుడు కాబట్టి, అప్పుడప్పుడే వికసిస్తున్న ఉర్దూ గజల్ ప్రక్రియ కూడా రామదాసును ఆకర్షించి ఉంటుదనడానికి

అనే కీర్తన సాక్ష్యమిస్తుంది. ఇందులో మత్లా, మక్తా, కాఫియా, రదీఫు వంటి నియమాలతో పాటు చివరి ద్విపదలో తఖల్లుస్ కూడా కనిపిస్తుంది.

7

పదకర్తలకీ, కృతికర్తలకీ మధ్య రామదాసు ఒక సేతువుగా నిలబడ్డాడనే పరిశీలన నిజానికి ప్రొ.పి.సాంబమూర్తిగారిది. ఆ పరిశీలనని రజనీకాంతరావుగారు తన పుస్తకంలో సోదాహరణంగా వివరించారు. తన తర్వాతి వాగ్గేయకారుల్లో త్యాగయ్యను రామదాసు అపరిమితంగా ప్రభావితుణ్ణి చేసాడన్నది అందరూ అంగీకరించే విషయమే అయినప్పటికీ, రజనీకాంతరావుగారు ఆ ప్రభావాన్ని మరింత లోతుగా పట్టుకున్నారు.

రామదాసు కీర్తనలు మొట్టమొదట కనవచ్చేది పద్ధెనిమిదో శతాబ్దానికి చెందిన యాదవదాసు అనే ఆయన రాసిన ‘రామదాసు చరిత్ర యక్షగానం’ లో. యాదవదాసుది భద్రాచలం. ఆ యక్షగానం ప్రభావంతో చిత్తూరుకు చెందిన తిరుక్కడయుర్ కృష్ణదాసు అనే ఆయన రామదాసు జీవితాన్ని హరికథగా రాశాడు. ఆ యక్షగానాన్నీ, హరికథనీ విన్న ఇద్దరు మిత్రులు- గుంటూరుకి చెందిన తూమునరసింహదాసు, కంచికి చెందిన వరరామదాసు-దక్షిణదేశ యాత్ర చేస్తున్నప్పుడు, 1825-30 ప్రాంతంలో మద్రాసులో వీణ కుప్పయ్యరు ఇంట్లో త్యాగరాజ స్వామిని కలుసుకున్నారు. వారి ద్వారా త్యాగయ్య మొదటిసారిగా రామదాసు గురించి విన్నాడు. అప్పటికి వర రామదాసు  ‘రామదాసు చరిత్ర’ అనే యక్షగానాన్ని, నారాయణతీర్థుల (1650-1745) ‘శ్రీకృష్ణలీలా తరంగిణి’ పద్ధతిలో భజననాటకంగా రాసే ఆలోచనలో ఉన్నాడు. ఆ తర్వాత 1832 లో ఆ మిత్రులిద్దరూ భద్రాచలం చేరుకున్నాక అక్కడ ఆ నాటక రచన పూర్తిచేసి ఉండవచ్చు.

త్యాగయ్యని రామదాసు చరిత్రా, రామదాసు కీర్తనలూ రెండూ ఆకర్షించాయి. ‘క్షీరసాగర శయన’ కృతిలో

అని అనడమే కాక, ‘కలిగియుంటే కదా కల్గును, కామితఫలదాయక’ అనే కృతిలో

అని రామదాసును పౌరాణికభక్తపరంపరతో సమానంగా తలుచుకున్నాడు. అక్కడితో ఆగకుండా, ‘బృందావనలోల గోవిందా అరవింద నయన’ అనే కృతిలో

అని అనుకోకుండా ఉండలేకపోయాడు. రామదాస దాసుడట! కాని తాను రామదాసులాగా దుస్సాహసానికి ఒడిగట్టలేనని కూడా త్యాగయ్యకు తెలుసు. ‘ఏమి దోవ బల్కుమా ఇకను నేనెందుపోదు శ్రీరామ’ అనే కృతి ఎత్తుకుంటూ, ‘రామదాసువలె నైతే సీతాభామ మందలించును నీతో తన . ..’ అని అంటాడు. తాను రామదాసులాగా కాకపోడానికి కారణం ఆ తల్లిదయ అనే త్యాగయ్య నమ్మాడు.

ఇక ‘ప్రహ్లాద భక్తి విజయము’ యక్షగానం ప్రథమాకంలోనే తులసీదాసు, పురందరదాసులతో సమానంగా రామదాసును తలచుకుంటూ ఇలా అన్నాడు:

అని స్తుతించాడు.

ఇలా ప్రశంసించడమే కాక, తన కృతుల నిర్మాణంలో కూడా రామదాసు కీర్తనల్ని ఆయన ఎక్కడెక్కడ అనుసరించాడో రజనీకాంతరావు గారు చాలానే ఉదాహరణలిచ్చారు. ముఖ్యంగా తన ‘ఉత్సవ సంప్రదాయ కీర్తనలు’, ‘దివ్యనామ సంకీర్తనలు’పైన రామదాసు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

అలానే సారంగపాణి గీతాలపైన కూడా రామదాసు ప్రభావాన్ని రజనీకాంతరావు గారు కొన్ని ఉదాహరణల్తో వివరించారు.

8

ఇదంతా చదివాక నా మనస్సు సంతోషానికి బదులు దిగులుతో నిండిపోయింది. త్యాగయ్య తెలుగు కవి. కాని ఆయన్ని కర్ణాటక సంగీత ప్రపంచం స్వంతం చేసుకుంది. బెంగుళూరు నాగరత్నమ్మ పుణ్యమా అని ప్రతి ఏడాదీ తిరువైయ్యారులో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు కన్నులపండువుగా, వీనుల విందుగా జరుగుతాయి. కాని తాను ఏ రామదాసుకి దాసుణ్ణి అని త్యాగయ్య చెప్పుకున్నాడో ఆ రామదాసు పుట్టిన నేలకొండపల్లి పరిస్థితి ఏమిటి?

12-4-2026

12 Replies to “నేలకొండపల్లి-3”

  1. Yet another absolutely fantastic post, sir.
    You clearly show us the historical timelines, influences on Ramadasu’s poetry, his impact on Tyagaraja, and how deeply Tyagaraja revered Ramadasa!! Very sad that we are not able to recognize and value our treasures.

    Very much admire how you make every moment, every experience count, sir. 🙇🏻‍♀️

  2. మళ్లీ బెంగుళూరు నాగరత్నమ్మ గారి లాంటి ఏ మహానుభావులో కల్పించుకొని, నేలకొండపల్లిలో కూడా రామదాసు ఆరాధనోత్సవాలు ప్రారంభిస్తే బాగుండు..🙏🙏

  3. ఎంత లోతుగా తరచి చూసారు రామదాసుని?
    సాహిత్య చరిత్ర ఒక పసిడిగని అనిపిస్తున్నది.
    ఒక్క సారిగా రామదాసు ఎత్తు ఎంతగా పెరిగి పోయిందో . సదాశివ గారి నా రాముడు కను మరుగైంది కారణాంతరాలవల్ల . అది కూడా దొరికి ఉంటే మరో పరిణత కోణ దృష్టి కనబడేది . మాకు కులదైవం భద్రాచల రాముడు. మా గుళ్లో చిన్నప్పుడు రామదాసు కీర్తనలు మాత్రమే పాడటం తెలుసు. బాపు రాసిన ఒకే ఒక పుస్తకం భద్రాచలరామదాసు చరిత్ర పద్యకావ్యం. అలా తెలియకుండానే రామదాసు అంటే ఒక అంతర్లీన
    ఆకర్షణ ఉంది . అందుకే నేలకొండపల్లి వ్యాసాలు
    కుతూహలంతో చదువుతున్నా . మీకు నమస్సులు.

  4. A Spellbounding Series భద్రుడు గారు. నేలకొండపల్లి మూడు భాగాలు మూడు సార్లు చదివినా తనివి తీరలేదు. బంగారు రామాచారి గారి గురించిన భాగం ఇతరుల ఔన్నత్యాన్ని యే భేషజాలు లేకుండా గుర్తించి ప్రశంసించే మీ మహోన్నత ఔదార్యానికి మచ్చుతునక. అంతే కాదు బౌద్ధ స్థూపం గురించి ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. ఇంక రామదాసు జన్మస్థలం, బావి , అక్కడ విగ్రహం గురించి రెండో భాగంలో మీరు రాసిన విషయాలు చదువుతుంటే ఈ మధ్యనే నేను చూసిన విట్మన్ పుట్టిన ఇల్లు, బావి , అక్కడే ఎదురు గుండా ఉన్న విగ్రహం తలుచుకుని ఎంత కోయిన్సిడెన్స్ అని అనుకోకుండా ఉండ లేకపోయాను.. ఇంక రామదాసు కీర్తనల గురించి మీరు తెలిపిన విశేషాలు ఈ కాలంలో మరెక్కడా ఏ విధంగానూ మాకు తెలిసే అవకాశమే లేదు. మీకు ఎంతో రుణపడి ఉంటాం.
    గొప్ప ఆలోచనలు మీవి.. తాళ్ళపాక నుంచి తిరుమలకి, నేలకొండ పల్లె నుంచి భద్రాచలానికి ఏటేటా వార్కరి యాత్ర చేయడం… నేలకొండపల్లి రామదాసు ఆరాధనోత్సవాలు జరిపించడం.. ఆ ఊహలు వింటేనే మనసు పులకించి పోతోంది.. ఇంక ఉంటేనా…వాటిని కంటేనా.. మన జీవితకాలంలో అలా జరిగి వాటిలో పాల్గొంటేనా.. జన్మ ధన్యం.

    కొంచెం అప్రస్తుతమైన ఇక్కడ మీకో విషయం చెప్పాలి అనిపిస్తోంది. భద్రాచలం నాకు చాలా ఇష్టమైన తీర్థం, క్షేత్రం రెండూనూ. 2008 లో నాకు అక్కడికి వెళ్ళి పాపికొండల మధ్య బోటు రైడ్ కి వెళ్ళాలనిపించి నేను, మా నాన్నగారు ఇద్దరమే కలిసి వెళ్ళాం. అప్పుడు ఆయన చూసిన చిన్న దృశ్యం తరువాత ‘గుడి లో పువ్వు’ అనే పేరుతో గొప్ప కథగా మలిచారు. నాకు చాలా ఇష్టం ఆ కథ.. ఆ కథని ఒక ఔత్సాహిక సినీ దర్శకుడి చేత షార్ట్ ఫిలిం గా తీయించాను కూడా. కథ స్క్రీన్ మీద అంత బాగా రాలేదనుకోండి.

    1. చాలా సంతోషం సార్! శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టు మీరు చదివాకనే ఆ పోస్టు సార్ధకమవుతుంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading