నేలకొండపల్లి-2

నేలకొండపల్లి, రామదాసుగా ప్రసిద్ధి చెందిన, కంచెర్ల గోపన్న (1620-1680) జన్మస్థలమని నాకు గుర్తులేదు, పుప్పాల కృష్ణమూర్తిగారు గుర్తుచేసినదాకా. ఆయన ఆ రోజు నాతో రాకపోయుంటే ఆ అపురూపమైన స్థలాన్ని చూడలేకపోయేవాణ్ణి. కాని ఆయనకి కూడా ఎప్పటిదో జ్ఞాపకం, నేలకొండపల్లిలో రామదాసు బావి ఒకటి ఉందనీ, ఊళ్ళోనే ఎవర్నేనా అడిగి తెలుసుకుందామనీ బండి ఊళ్ళోకి తిప్పారు. అక్కడ రామదాసు జన్మస్థలమని చెప్పే బోర్డులుగానీ, ప్రకటనలు గానీ ఏమీ లేవు. ఒక ఇరుకైనవీథిలో నలుగురైదుగురిని కనుక్కున్నాక చివరికి మేం చేరవలసిన చోటుకి చేరాం.

కాని ఆశ్చర్యం! అక్కడ వట్టి బావి కాదు, చూడవలసింది చాలానే ఉంది. అది రామదాసు పుట్టినచోటే. అక్కడ యాభై ఏళ్ళ కింద కట్టిన ఒక ధ్యాన మందిరం ఉంది. 1955 లో శంకుస్థాపన చేసిన ఆ మందిరాన్ని 1961 లో పూర్తిచేసారనీ, అప్పట్లో పదిహేనువేల రూపాయల వ్యయమయ్యిందనీ తెలిసింది. ఆ మందిరం మా ఊరి రామకోవెలలాగా కనిపించింది. ఆ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంది. ఆ బావి మీద ‘ఈ బావి శ్రీరామదాసుగారు వాడినది’ అని రాసి ఉంది. అటువంటి సజీవస్రవంతిని చూడటంలో ఒక పులకింత ఉంది. అయితే ఆయన ప్రవహింపచేసిన  కీర్తనాసాహిత్యమనే సుజలస్రవంతిలో ఒక్కసారేనా మునకలెయ్యని తెలుగువాడంటూ ఉండడుకాబట్టి, నేలకొండపల్లిలో ఆయన చేదుకున్న నీళ్ళబావిని చూడటంలో ఒక చిత్రమైన సంతోషముంది.

అది కూడా ఒక ఆనందబాష్ప జలాశయమే కదా. ఇంకా అందులో నీళ్ళూరుతూనే ఉన్నాయి. ఆ బావికి ఎదురుగా రామదాసు నిలువెత్తు విగ్రహం ప్రతిష్ఠించి ఉన్నారు. ‘అంచితముగ రామదాసుడననుకొని ఆనందించేదెన్నటికో’ అని తన్మయంగా పాడుకుంటున్న ఆ రామసంకీర్తకుడి పాదాలముందు మోకరిల్లాం.

అప్పుడు చూసాం, ఆ స్మారక మందిరం పక్కన మరొక పెద్ద భజనమందిరం నిర్మాణం. దాన్ని భద్రాచలం దేవస్థానం వారు మూడుకోట్ల వ్యయంతో నిర్మించారట. చాలా పెద్ద మందిరం. మేము వెళ్ళినప్పటికి ఆ మందిరం ఇంఛార్జి ఊళ్ళో లేకపోవడంతో ఆ తలుపులు మూసి ఉన్నాయి కాని కిటికీలోంచే లోపలకి తొంగిచూసాం. లోపల విశాలమైన హాలు, వేదికవెనక భద్రాచలంలో ఉన్న సీతారామలక్ష్మణ విగ్రహ మూర్తుల్ని పోలిన వర్ణచిత్రం ఉన్నాయి. గోడలమీద రామదాసు జీవితకథ కూడా చిత్రించి ఉంది.

ఎప్పుడో మూడున్నర శతాబ్దాల కింద భద్రాచల రాముడికి రామదాసు కట్టించిన గుడీ, చేయించిన నగలూ, అర్పించిన కైంకర్యాలూ దేవుడి మర్చిపోయినట్టులేదు. ‘చుట్టు ప్రాకారములు సొంపుగచేయిస్తి రామచంద్రా ఆ ప్రాకారమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా’ అని రామదాసు చెప్పిన లెక్కలకు తగ్గట్టుగా తాను తిరిగి తీర్చలేకపోయినా తన భక్తుడు పుట్టినచోట పెద్ద భజన మందిరం కట్టించాడు దేవుడనిపించింది. కాని మనుషులకే దాన్ని కాపాడుకునే మనసు లేనట్టుంది. అప్పుడే ఆ మందిరం ప్రహరీగోడమీద దీపాలు పగిలిపోయాయి. ఆ ప్రాంగణం మొత్తానికి ఒక ప్రహరీగోడ ఇంకా కట్టవలసి ఉంది. చుట్టూ గోడ కట్టి లోపల చిన్న పూలతోట పెంచి ఉదయాస్తమయవేళల్లో రామదాసు కీర్తనలు వినిపిస్తూ ఉంటే ఆ చోటుకి నిజమైన గుర్తింపు లభించినట్టనిపించింది.

తాళ్ళపాక వెళ్ళినప్పుడు కూడా నాకిదే అనిపించింది. మనవాళ్ళ దృష్టిలో దేవుడు గుళ్ళో తప్ప మరెక్కడా కనిపించడు. అందుకే ఆ గుళ్ళో దేవుణ్ణి చూడటానికి అంత తొక్కిసలాట. కాని దేవుడు సదా తన భక్తుడి సంకీర్తనలో వర్ధిల్లుతుంటాడు. భద్రాద్రిరాముడు భద్రాచలంలో మాత్రమే కాదు,

అని రామదాసు ఎలుగెత్తి ఆలపించిన సంబోధనల్లోనూ సంకీర్తనల్లోనూ కూడా ఉన్నాడని తెలిస్తే, ఆ గుడిని ఎంత ప్రేమిస్తామో, ఆ కీర్తనల్ని కూడా అంతే ప్రేమించగలుగుతాం.

ప్రతి ఏటా ఆషాఢమాసంలో పండరిపురానికి వార్కరి యాత్ర జరుగుతుంది. అప్పుడు తుకారం పుట్టిన దేహూనుంచి, జ్ఞానేశ్వరుడు పుట్టిన అలండినుంచి పల్లకీలు బయలుదేరతాయి. 200 కిలోమీటర్లకు పైగా, ఆ అభంగాలు పాడుకుంటూ, భక్తులు పండరిపురానికి యాత్రచేస్తారు. తాళ్ళపాక వెళ్ళినప్పుడు నాకనిపించింది, ప్రతి ఏటా తాళ్ళపాకనుంచి ఒక వార్కరి తిరుమలకి బయలుదేరితే ఎలా ఉంటుంది! ఇక్కడ కూడా అలానే అనిపించింది. ప్రతి ఉగాదికీ నేలకొండపల్లినుంచి భద్రాచలానికి (136 కిలోమీటర్ల దూరం) ఒక రామసంకీర్తనా యాత్ర ఎందుకు చేపట్టకూడదు!

5

ఇప్పుడు తెలుగువాళ్ళకి రామదాసు అంటే రెండు సినిమాలూ (అందులో నాగయ్యగారి సినిమా ఎంతమందికి గుర్తుందో తెలియదు) బాలమురళి ఆలపించిన రామదాసు కీర్తనలే గుర్తొస్తాయి. సాహిత్యకారుల దృష్టిలో ఆయన ఒక భక్తికవిమాత్రమే, అందుకనే సాహిత్యచర్చల్లో ఆయన పేరు పెద్దగా వినిపించదు. తెలంగాణా సాహిత్యచరిత్రలో తొలి వాగ్గేయకారుడిగా ఆయన్ని గుర్తుపడుతున్నప్పటికీ అందుకు తగినట్టుగా ఆయన స్మరిస్తున్నట్టు కనిపించదు.

కానీ తెలుగు సాహిత్య చరిత్రలోనూ, కర్ణాటక సంగీత చరిత్రలోనూ రామదాసు నిర్వహించిన పాత్ర ఎంతో అద్వితీయమైంది. అన్నమయ్య, క్షేత్రయ్యలాంటి పదకవులకీ, త్యాగయ్య లాంటి కృతికారులకీ మధ్య రామదాసు కీర్తనలు ఒక సంగీతసేతువు నిర్మించాయని ఎంతమందికి తెలుసు? ఈ సినిమాలూ, ఈ పాటలూ మరీ ఇవాల్టివి. కాని మూడు శతాబ్దాలకు పైగా యక్షగానాలూ, భజనకారుల బృందాలూ, భజనకూటములూ, రామసంకీర్తనలూ రామదాసు కీర్తనల్ని ప్రజాస్మృతిలో భద్రంగా నిలబెట్టాయి. కాబట్టి రామదాసు గురించి తెలుసుకోవడమంటే మూడు దశాబ్దాల తెలుగు వాగ్గేయకారచరిత్ర గురించి తెలుసుకోవడం.

రామదాసు కీర్తనలనగానే మనకి గుర్తొచ్చే కొన్ని కీర్తనలు: ‘తారకమంత్రము కోరిన దొరికెను’, ‘రామచంద్రులు నాపై చలము చేసినారు’, ‘సీతారామ స్వామీ నే చేసిన నేరంబేమీ’, ‘తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు’, ‘పలుకే బంగారమాయెనా కోదండపాణి’, ‘పావన రామనామ సుధారసపానముచేసేదెన్నటికో’, ‘చరణములే నమ్మితి నీ దివ్యచరణములే నమ్మితి’, ‘ పాహిరామప్రభో పాహిరామప్రభో’, ‘అంతా రామమయంబీ జగమంతా రామమయం’. ‘అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి’, ‘ఎన్నగాను రామభజన కన్న’, ‘ఓ రామ నీ నామమేమి రుచిరా’, ‘ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’, ‘అబ్బబ్బ దెబ్బలకు నోర్వలేనురా’, ‘రామదాసుగారు ఇదిగో రశీదందుకోండి’, ‘రామచంద్రాయ జనరాజజా మానోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం’ లాంటివి మొత్తం ఇరవైకి మించి ఉండవు. రామదాసు కీర్తనల పేరిట దొరికే చిన్న చిన్న పుస్తకాల్లో కూడా అరవై డెబ్భైకి మించి ఉండవు.  నేను పాతికేళ్ళ కింద కొనుక్కున్న ఒక పుస్తకంలో 69 కీర్తనలున్నాయి.

కానీ రామదాసు పేరిట కొన్ని వందల కీర్తనలు ప్రజల నాలుకలమీద ఉండేవనీ, వాటిల్లో చాలావరకూ భజనకర్తలు, యక్షగాన కర్తలూ తాము రాసి రామదాసు పేరుపెట్టినవేననీ రజనీకాంతరావుగారు రాసారు.

ఆయన రాసిన  ‘ఆంధ్రవాగ్గేయకార చరిత్రము’ (1958) లో రామదాసు గురించి రాసింది చదివితే మనకి ఒక అవగాహన కలుగుతుంది. కాని ఆయన సాహిత్య అకాడెమీ కోసం రాసిన మోనోగ్రాఫు ‘రామదాసు'(1988) కావడానికి ఎనభై పేజీల చిన్న పుస్తకమే అయినప్పటికీ, రామదాసుపైన అంత సమగ్రమైన రచన నేను మరొకటి చదవలేదు. అందులో ఆయన తాను చిన్నప్పుడు విన్న యక్షగానాల్లోంచి ఏరి కూర్చుకున్న కీర్తనల్లోంచి 108 దాకా రామదాసు కీర్తనలుగా గురుపట్టారని రాసారు. వాటిల్లో ఇరవై కీర్తనలు దాకా భజనగోష్ఠుల్లో జనరంజకంగా ప్రసిద్ధి పొందాయని చెప్తూ వాటి జాబితా కూడా ఇచ్చారు. అలాగే తన మిత్రుడు మంచాళ జగన్నాథ రావు 140 కీర్తనలదాకా సేకరించి వాటిని స్వరపరిచారని కూడా చెప్పారు. అలాగే టి.వి.నాగరంజని అనే పరిశోధకురాలు మరింత కృషి చేసి 190 కీర్తనల దాకా గుర్తించారనీ, వాటిలోంచి ఆమె 132 కీర్తనల్ని రామదాసు రచనలుగా నిర్ధారించారనీ చెప్పారు. ఆమె అంతటితో ఆగకుండా వాటిని మూడు విభాగాలుగా, రామదాసు జైలుకు వెళ్ళక ముందు రాసినవి (37), జైల్లో ఉండగా రాసినవి (64), చెరనుంచి బయటపడ్డాక రాసినవీ (31) గా కూడా పేర్కొన్నారని రాసారు.

నేను వారి పుస్తకం చూడలేదుగానీ, నా దగ్గర మంచాళ జగన్నాథరావుగారు స్వరసహితంగా వెలువరించిన ‘రామదాసు కీర్తనలు'(తెలుగు విశ్వవిద్యాలయం, 2010) ఉంది. ఆ పుస్తకం ప్రధానంగా సంగీతవిద్యార్థులకోసం ఉద్దేశించినప్పటికీ, ఆ కీర్తనలన్నీ చదివినప్పుడు, మనకి అంతదాకా కేవలం కొన్ని పాటలు వినడం ద్వారా మాత్రమే పరిచయమైన రామదాసు మరింత సమగ్రంగా సాక్షాత్కరిస్తాడు. ఆ సాహిత్యసౌందర్యం మనకి మరింత తేటతెల్లంగా కనిపిస్తుంది.

నిజానికి రామదాసు కీర్తనలన్నీ మనకి పుస్తకం ద్వారా పరిచయం కావలసినవి కావు. గ్రీకు లిరిక్ లాగా అవి చదవడానికి కావు. వినడానికి ఉద్దేశించినవి. కాని ఆ కీర్తలన్నింటినీ ఎవరేనా పాడగా రికార్డు చేసారో నాకు తెలియదు. కానీ అవి చదువుతున్నా కూడా మనలోపల ఒక గాయకుడు వాటిని గొంతెత్తి ఆలపిస్తున్నట్టే ఉంటుంది. ముఖ్యంగా ఆ తెలుగు పలుకుబడి, ఆ సంభాషణా శైలి, ఆ నిక్కచ్చితనం, ఆ అమాయికత్వం- ‘నారాయణ యనరాదా మీ- నాలికపై ముల్లు నాటియున్నదా’ అంటాడు చూడండి, ఆ వాక్యం చదవగానే రామదాసు మనముందు కూచుని మనతోటే ఆ మాటలంటున్నట్టు ఉంటుంది. అలానే ఈ వాక్యాలు:

అన్నమయ్యలాగా, పురందరదాసులాగా రామదాసు కీర్తనల్లో ద్వితీయాక్షర ప్రాస, కొన్ని సార్లు ప్రథమాక్షర ప్రాస తప్పనిసరిగా పాటిస్తాడు కాబట్టి, ఆ పదాలు వినడానికి ఎంతో శ్రవణ సుభగంగా ఉంటాయి. చూడండి:

ఆ తెలుగు నాలుకమీద పడగానే వెన్నలాగా కరిగిపోయే తెలుగు. చూడండి, బహుశా పోతన్న తరువాత ఇటువంటి తెలుగు మనకి రామదాసులోనే కనిపిస్తుంది.

అన్నమయ్యలాగా రామదాసు కూడా సంస్కృత కీర్తనలు రాసాడు. కాని అవి కృష్ణలీలా తరంగిణి తరహాలో సంబోధనాత్మకాలు. కానీ ఆ సంబోధనలు వింటుంటే అది తెలుగనే మన చెవులు భ్రమపడుతూ ఉంటాయి. చూడండి:

రామదాసు సంస్కృత కీర్తనలు- ‘పాలయమాం జయరామ జయభద్రాద్రీశ్వర రామ’, ‘దక్షిణాశాస్యం గురు వందే దక్షిణాశాస్యం’, ‘నందబాలం భజరే బృందావన వాసుదేవం’, ‘పాలయమాం రుక్మిణీనాయక భక్తకామితదాయక’, ‘నారాయణ నారాయణ జయగోపాల కృష్ణ హరేకృష్ణ’, ‘భావయే పవమాన నందనం భావయే’, ‘భజరే శ్రీరామం హే మానస భజరే రఘురామం రామం’, ‘దీనదయాళో దీనదయాళో దీనదయాళో పరదేవదయాళో’- వీటినే గాయకులు ప్రత్యేకించి ఒక సిరీస్ గా తీసుకురావచ్చు. అటువంటి పని ఇప్పటికే ఎవరన్నా చేసి ఉన్నారేమో నాకు తెలియదు. రామదాసు కీర్తనల్లో సంగీత ప్రదర్శనకు కావలసిన intellectualism తక్కువనే కారణం వల్ల ఏవో ఒకటి రెండు కీర్తనలు తప్ప ఆయన రచనలేవీ కర్ణాటక సంగీత కచేరీల్లో వినిపించవు. కాని ఈ సంస్కృత కీర్తనలు దీక్షితారు కృతులకు సాటిరాగలవనే నా అభిప్రాయం.

అయితే ఆయన తెలుగు కీర్తనలు మాత్రం తెలుగువాడి గుండెచప్పుళ్ళు. ఎంత ధారాళమైన తెలుగుపలుకుబడి! చూడండి, అంతగా ప్రసిద్ధి చెందని, కాని ఎంతో సుప్రసిద్ధం కావలసిన ఈ పాట వినండి. ప్రతి ఒక్క చరణం లోనూ, ఆ ప్రాసాక్షరంతో ఆ చరణాంతంలో సాగదీసిన ఉక్రోషం చూడండి. నాకు తెలిసి సుందరమూర్తి నాయనారు లాంటి దుడుకు భక్తుడు తప్ప మరెవ్వరూ రాయలేని పాట ఇది.

(ఇంకా ఉంది)

11-4-2026

17 Replies to “నేలకొండపల్లి-2”

  1. నా చిన్నప్పుడు మా నాన్న వాళ్ళ
    భజనమండలిలో పాడేవారు.
    ” ఓ రఘువీరా యని నే పిలచిన ఓహో యనరాదా!”

  2. దేవుడు సదా తన భక్తుడి సంకీర్తనలో వర్ధిల్లుతుంటాడు. తారకమంత్రము కోరిన దొరికెను’, ‘రామచంద్రులు నాపై చలము చేసినారు’, ‘సీతారామ స్వామీ నే చేసిన నేరంబేమీ’, ‘తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు’, ‘పలుకే బంగారమాయెనా కోదండపాణి’, ‘పావన రామనామ సుధారసపానముచేసేదెన్నటికో’, ‘చరణములే నమ్మితి నీ దివ్యచరణములే నమ్మితి’, ‘ పాహిరామప్రభో పాహిరామప్రభో’, ‘అంతా రామమయంబీ జగమంతా రామమయం’. ‘అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి’, ‘ఎన్నగాను రామభజన కన్న’, ‘ఓ రామ నీ నామమేమి రుచిరా’, ‘ననుబ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి’, ‘అబ్బబ్బ దెబ్బలకు నోర్వలేనురా’, ‘రామదాసుగారు ఇదిగో రశీదందుకోండి’, ‘రామచంద్రాయ జనరాజజా మానోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం’ లాంటివి.

    దయమయా!
    నన్ను మీ మాటలతో నేను చదువుకున్న భద్రాచలం తీసుకుపోయి… అక్కడే కొండమీద శ్రీబాలమురళీ గారి పాదాల సమీపంలో కూర్చుని ఆ రామదాసు కీర్తన లన్నీ మళ్లీ స్మరించుకునే అవకాశం ఇచ్చారు.
    చిన్నవారు తమరు.
    లేకపోతే పాదాభివందనం అని ఉండేదాన్ని.
    మీలో ఆ భగవత్ కృప చూసాను.
    నమొనమః.

  3. ‘జగన్నాథపుర నిశాంతం ….’ – రామదాసు ప్రస్తావించిన జగన్నాథ పురం ఏదైయుండవచ్చును?

  4. కొత్త విషయాలు, ఇంతకుముందు వినని కీర్తనలు తెలుసుకోవటం సంతోషంగా వుంది. ధన్యవాదాలు! 🙏

  5. శ్రీరామదాసు పుట్టిన ఊరు, వారి కీర్తనలు !!
    ఎన్నో తెలియని విషయాలు చెప్తున్నారు.
    Thank you, Sir.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading