
నేలకొండపల్లి కోదాడకి అంత దగ్గరలో ఉందని తెలీదు. కోదాడ రమ్మని పిలిచినప్పుడే సోమిరెడ్డిగారు నేలకొండపల్లిలో ఒక ప్రాచీన బౌద్ధ స్థూపం ఉందని దాన్ని కూడా చూస్తారా అనడిగారు. ఆ విధంగా కోదాడ వెళ్ళినప్పుడు తేజ విద్యాలయమే కాక మరో మూడు దర్శనీయ ప్రదేశాల్ని చూడగలిగే భాగ్యం లభించింది. అందులో మొదటిది బంగారు రామాచారిగారి ఇల్లు, రెండోది నేలకొండపల్లి బౌద్ధస్తూపం, మూడోది ఆ ఊళ్ళోనే భక్తరామదాసు పుట్టిపెరిగినచోటూ, అక్కడ నెలకొల్పిన స్మారక మందిరాలూనూ.
2
‘జీవనలీల’ పుస్తకంలో కాకాసాహెబ్ కాలేల్కర్ ఆసక్తికరమైన ఒక సంఘటన గురించి రాసారు. బెల్గాం కాంగ్రెసు సభలు జరిగినప్పుడు అనుకుంటాను, మహాత్ముడితో పాటు, ఆయన సన్నిహిత మిత్రులు కూడా మొదటిసారి కర్ణాటకసీమలో అడుగుపెట్టారు. అప్పుడెవరో బిజాపూరులోని గోల్ గుంబాజ్ చూద్దామని ప్రతిపాదించారట. కాలేల్కర్ నీ, మహదేవ్ దేశాయినీ కూడా రమ్మని అడిగారట. మీకు తెలుసు కదా, మహదేవ్ దేశాయి గాంధీగారి ఆంతరంగిక సహాయకుడు. వాళ్ళు దేశాయిని కూడా తమతో పంపించమని గాంధీగారిని అడిగితే, ఆయన చిరునవ్వి, ‘దేశాయి వస్తానంటే తీసుకువెళ్ళండి, కానీ ఆయన వస్తాడనుకోను, ఆయనకి నేనే ఒక గోల్ గుంబాజ్ ని’ అని అన్నారట.
కోదాడ వెళ్ళినప్పుడు తేజ విద్యాలయం కాక మరేదన్నా ఒక్క చారిత్రిక స్థలాన్ని మించి చూడటానికి సమయం చాలదంటే, నేను బంగారు రామాచారి ఇంటికి తప్ప మరెక్కడికీ వెళ్ళాలనుకుని ఉండేవాణ్ణి కాను. నా వరకూ ఆయనే నాకొక గోల్ గుంబాజ్!
ఎందుకింత పెద్ద మాట వాడానా అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. కానీ నాసరరెడ్డి అన్నట్టుగా మనలో ఎంత దాహం ఉంటే మనం సమీపించే వ్యక్తులూ, స్థలాలూ కూడా అంత ప్రియంగా ఉంటాయి. నాలో ఉన్న పుస్తక దాహం, మరీ ముఖ్యంగా పాత పుస్తకాలు, పాత తెలుగు పుస్తకాల కోసం ఉండే దాహాన్ని తీర్చగల జలాశయం బంగారు రామాచారి మాత్రమే. ఇప్పుడు ఏ .ఐ వచ్చింది. నేను ఏ .ఐ ని తరచూ అడిగే ప్రశ్న, ఫలానా విషయం గురించి నీకు తెలిసిన పుస్తకాలేమిటి చెప్పంటాను. అది చెప్తుంది. జాబితాలిస్తుంది. ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తుంది. కానీ తెలుగు పుస్తకాల విషయంలో మాత్రం ఏ.ఐ కి ఇంకా సామర్థ్యం చిక్కలేదు. కాబట్టే, పాత తెలుగు పుస్తకాలు, ప్రాచీన, ఆధునిక సాహిత్యం, చరిత్ర, సంస్కృతికి సంబంధించి ఏ రిఫరెన్సు కావలసి వచ్చినా నా వరకూ బంగారు రామాచారి ఏ.ఐ కన్నా ఎక్కువ.
ఒక ఉదాహరణ చెప్తాను. మిత్రులు రామ్ భాస్కర్ కుమార్తె నమ్రత షేక్ స్పియర్ నాటకాలకి తెలుగులో వచ్చిన అనువాదాల మీద పరిశోధన చేస్తున్నారు. ఆ విషయం మీద నేనేదైనా అదనపు సమాచారం అందించగలనా అని నా దగ్గరికి వచ్చారు. తెలుగులో షేక్ స్పియర్ అనగానే మొదట గుర్తొచ్చేది, షేక్ స్పియర్ నాటకాల మొట్టమొదటి తెలుగు అనువాదం ‘సీజరు చరిత్రం’. రాజమండ్రికి చెందిన వావిలాల వాసుదేవ శాస్త్రి ఆ నాటకాన్ని 1876 లో తెలుగు చేసారు. అంతవరకే నాకు తెలుసు. నేను రాజమండ్రిలో అయిదేళ్ళున్నా ఆ నాటకం అక్కడ దొరకవచ్చుననే ఊహ నాకెప్పుడూ కలగలేదు. దాన్నొక చారిత్రిక విషయంగా మాత్రమే భావిస్తూ వచ్చాను.
‘ఇప్పుడు ఆ నాటకం దొరుకుతుందా’అనడిగారు నమ్రత. నేను వెంటనే గౌతమీ గ్రంథాలయం వారిని సంప్రదించాను. ఆరోజు ఆదివారం. రెండు రోజులు సమయమిస్తే చూసి చెప్తామన్నారు. ఏం చేద్దామా అని అనుకుంటూ ఉండగా రామాచారి గుర్తొచ్చారు. వెంటనే ఆయనకి ఫోన్ చేసాను. చూసి చెప్తాను అన్నారు. అయిదు నిమిషాల తర్వాత ఆ పుస్తకం గుంటూరులో అన్నమయ్య గ్రంథాలయంలో ఉందనీ, సుభాషిణిగారు పంపిస్తారనీ చెప్పారు. మరో పది నిమిషాల్లో ఆ పుస్తకం పి.డి.ఎఫ్ నా చేతుల్లో ఉంది! ఏమాశ్చర్యం! నూటయాభై ఏళ్ళ కిందటి ఆ మొదటి తెలుగు అనువాదాన్ని నేను నా జీవితకాలంలో కళ్ళారా చూడగలనని ఏ రోజూ అనుకోలేదు. ఆ పుస్తకం ఆత్రుతగా తిరగేసాను. శాస్త్రిగారు దాన్ని పద్యకావ్యంగా తెలిగించారు. అది కాదు గొప్ప విషయం. షేక్స్పియర్ నాటకాలు బ్లాంక్ వెర్స్ లో ఉంటాయని మీకు తెలుసు కదా, బ్లాంక్ వెర్స్ అంటే అంత్యప్రాస లేని అయాబింక్ పెంటామీటర్. తెలుగులో అటువంటి అయిదు గణాల ఛందస్సు, బ్లాంక్ వెర్స్ కి సమతుల్యమైందిగా తేటగీతిని పట్టుకున్నారు ఆయన. ఆ మొత్తం నాటకమంతా తేటగీతిలో అనువదించారు. అటువంటి అపురూపమైన గ్రంథం నేను అడిగిన పావుగంటలో నా చేతుల్లోకి వచ్చింది. అదీ రామాచారి అంటే!
రెండేళ్ళ కిందట సాహిత్య అకాడెమీ వారు తెలుగులో జాతీయోద్యమ కవిత్వం మీద నన్ను కీలకోపన్యాసం చెయ్యమని అడిగారు. నా దగ్గర ఒక్క రిఫరెన్సు పుస్తకం కూడా లేదు. కాని రామాచారి ఉన్నారన్న ధైర్యంతో వెంటనే ఒప్పుకున్నాను. అంతే! ఆయన్నుంచి వరదలాగా పుస్తకాలు. కవిత్వం, చరిత్ర, జాతీయోద్యమ రచనలు. ఆ కీలకోపన్యాసం సంగతి అలా ఉంచి ఆ వంకన తెలుగు సాహిత్యంలో జాతీయోద్యమ శకం అనేది ఒకటుందనీ, తెలుగు సాహిత్యచరిత్రకారులు దాన్ని కావాలనే మరుగున పరిచారనీ కనుగొన్నాన్నేను. రామాచారి నాకు అండగా లేకపోయుంటే ఆ అధ్యయనం నాకు సాధ్యమయి ఉండేదే కాదు.
ఆ మధ్య ఒక ప్రచురణకర్త తెలుగులో 1950 కి ముందు వచ్చిన కథలనుంచి కొన్ని కథల్ని ఎంపికచేసి ఇంగ్లిషులోకి అనువదింప చెయ్యాలని అనుకుంటూ నన్ను సంప్రదించారు. నేను వెలువరించిన ‘వందేళ్ళ తెలుగు కథ’ (2001) పుస్తకం వల్ల ఆమె నన్ను సంప్రదించారు. తొలినాటి తెలుగు కథ గురించి పాతికేళ్ళ కన్నా ఇప్పుడు మరెన్నో పుస్తకాలు లభ్యంగా ఉన్నాయని నాకు తెలుసు. కాని అవన్నీ ఒక్కచోట ఎక్కడ దొరుకుతాయి? మళ్ళా రామాచారినే నాకు శరణ్యమనుకున్నాను. ఎప్పటిలానే ఆయన నన్ను మళ్ళా పుస్తకాల వరదతో ముంచెత్తాడు.
ప్రభావశీలురైన కొందరు వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ‘ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ’ అంటాం. అది పడికట్టుపదంగా మారిపోయింది. కాని రామాచారిగారి గురించి చెప్పడానికి ఆ మాట తప్ప నాకు మరొక విశేషణమేమీ స్ఫురించడం లేదు. కానీ ఇన్నేళ్ళుగా పరిచయమున్నా, ఆయన ఉంటున్నది కోదాడలోనే అయినా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వారి ఇంటికి వెళ్ళింది లేదు. అందుకని ఈ సారి కోదాడ అనగానే రామాచారిని కలుసుకునే అవకాశమిలా లభించిందనుకున్నాను. మరో రెండు కారణాలు కూడా ఉన్నాయి. మొదటిది, ఆయన తీవ్ర అస్వస్థత నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కాబట్టి ఒకసారి వెళ్ళి ఆయన్నిచూడాలనుకున్నాను. రెండోది, ‘నన్ను వెన్నాడే కథలు’ (2026) అనిల్ బత్తుల పబ్లికేషన్స్ ప్రచురించారు. ఆ పుస్తకాన్ని రామాచారిగారికి కానుక చేసాను కాబట్టి ఆ పుస్తకం ఆయన చేతుల్లో పెట్టాలని కూడా అనుకున్నాను.
మొన్న ఆదివారం రామాచారిగారి ఇంటికి వెళ్ళినప్పుడు అది నేనూహించినట్టే ఉంది. అది ఇల్లు కాదు, గ్రంథాలయం. ఆ ఇంటికొక మేడమీద గది ఉంది. అది అత్యంత అరుదైన గ్రంథాలయం. తెలుగు వాళ్ళ దర్శనీయ స్థలం. ఆ పుస్తకాలు చూసాను. నేనేది చూస్తుంటే, ఆయన దాన్ని తీసి నా చేతుల్లో పెడుతున్నారు. కాని ఆ పుస్తకాలు అక్కడుంటేనే సోదరసమాజానికి అందుబాటులో ఉంటాయని నాకు తెలుసు. నవజీవన్ వారు ఎప్పుడో వెలువరించిన మహాత్మాగాంధీ రచనల అయిదు సంపుటాల సెట్టు తప్ప మరేదీ నేను అక్కణ్ణుంచి తెచ్చుకోలేదు.
ఆ రోజు అక్కడ మరో ఇద్దరు మిత్రులు కలిసారు. ఒకరు జి.లక్ష్మీనారాయణరెడ్డి, కోదాడలో పొలిటికల్ సైన్సు లెక్చరరుగా పనిచేస్తున్నారు. మరొకరు కిరణ్, ఖమ్మంలో జూనియర్ లెక్చరరుగా పనిచేస్తున్నారు. రామాచారి గారి శ్రీమతి కూడా విద్యాధికురాలు. ఆమె మొన్నటినుంచీ నాకు కూడా అక్క. ఆ నాగమణక్క ఆదరణ, వారింట్లో నాకు లభించిన ఆతిథ్యం నేను ఎప్పటికీ మర్చిపోలేనివి. ఆ రోజు భోజనంలో నాకు వడ్డించిన గడ్డపెరుగు కూడా.
3
ఆ మధ్యాహ్నం రామాచారి గారి ఇంట్లో భోంచేసాక కొంతసేపు అక్కడే విశ్రాంతి తీసుకున్నాను. నాకు నేలకొండపల్లి గురించి చెప్పడానికి ఆయన తన మిత్రులు పుప్పాల కృష్ణమూర్తిగారికి కబురంపారు. కృష్ణమూర్తిగారు తెలుగు సాహిత్యంలో ఎమ్మే చేసారు. కేతవరపు రామకోటి శాస్త్రిగారి శిష్యులు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసి ప్రస్తుతం విశ్రాంత జీవితం గడుపుతున్నారు. ఆయన రచయిత కూడా. మరో విశేషం నాలానే ఆయన కూడా తన రచన ఒకటి రామాచారిగారికి అంకితమిచ్చారు కూడా!’రంగు పూల వాగు'(2025) అనే ఆ పుస్తకం పిల్లలకోసం రాసిన కథల సంపుటి.
మేం నేలకొండపల్లి వెళ్ళేటప్పటికి సాయంకాలం నాలుగు కావొస్తూ ఉంది. ఆ ఊరి బయట ముజ్జు గూడెం అని పిలిచే చోట ఉంది ఆ పురాతన బౌద్ధ స్థూపం. స్థూపాలు మూడు రకాలు. అందులో దాన్ని శారీరిక స్థూపంగా లెక్కేస్తారు. అంటే బుద్ధుడి శారీరక ధాతు అవశేషాలపైన నిర్మించిన స్థూపం అన్నమాట. ఆ స్థూపం గురించిన విశేషాలతో డా.ఆనంద్ గోపగోని అనే ఆయన ‘నేలకొండపల్లి, ఓ చారిత్రిక సాక్ష్యం’ (2018) అని ఒక పుస్తకం రాసారు. రామాచారి గారు ఆ పుస్తకం కూడా నాకు అందచేసారు.
ఆ స్థూపందగ్గర రాసి ఉన్న సమాకారాన్ని బట్టీ, డా. ఆనంద్ పుస్తకంలో రాసిన వివరాల్ని బట్టీ సా.శ 3వ శతాబ్దం నాటికే నేలకొండపల్లి పెద్ద పట్టణం. టాలెమీ రచనల్లో పేర్కొన్న ‘నెల్ సిండా ‘నేలకొండపల్లినే. క్రీ.పూ. 3వ శతాబ్దినుంచి సా.శ.8వ శతాబ్దిదాకా కూడా నేలకొండపల్లి బౌద్ధకేంద్రంగా విలసిల్లింది. తక్కిన బౌద్ధక్షేత్రాల్లానే ఇది కూడా మొదట్లో థేరవాద కేంద్రంగా మొదలై, మహాయానాన్ని ఆదరించి చివరికి వజ్రయానందాకా ప్రయాణించింది. 106 అడుగుల వ్యాసం, 54 అడుగుల ఎత్తు ఉన్న బౌద్ధ స్థూపం వల్ల దక్షిణభారతదేశంలోని అతిపెద్ద బౌద్ధ క్షేత్రాలలో ఒకటిగా కూడా చారిత్రిక ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆ స్థూపానికి శాతవాహనుల కాలంలో ప్రాథమిక నిర్మాణం జరిగి ఉంటుందనీ, సా.శ 4-7 శతాబ్దాల మధ్య విష్ణుకుండినుల కాలంలో మరింత అభివృద్ధికి నోచుకుని ఒక సంఘారామంగా విలసిల్లిందనీ చరిత్రకారులు చెప్తున్నారు. 1977 లో నేలకొండపల్లి-ముజ్జుగూడెం రహదారి నిర్మాణంలో అనేక బుద్ధ ప్రతిమలు, పాత్రలు, ఇతర చారిత్రిక అవశేషాలు అక్కడ లభ్యమయ్యాయి. వాటిల్లో అత్యంత విలువైన ఒక పంచలోహ బుద్ధ ప్రతిమ కూడా ఉంది.
ఆ వసంతకాల సాయంసంధ్యలో ఆ స్థూపం చాలా గంభీరంగానూ, శతాబ్దాల చరిత్రకు మౌనసాక్షిగానూ ఉంది. పురావస్తు శాఖవారు ఆ నిర్మాణాన్ని పునరుద్ధరించినప్పటికీ అలా మరమ్మత్తు చేసిన కట్టడంలా కనిపించడం లేదు. ఆ నిర్మాణం యుగాలుగా చెక్కుచెదరకుండా ఉన్నట్టే కనిపిస్తున్నది. ఇంత సమగ్రంగా నిలబడ్డ చారిత్రిక కట్టడాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.

డా.ఆనంద్ గారు రాసినదాన్ని బట్టి, మౌర్యుల కాలం నుండి బౌద్ధ యాత్రీకులు రెండు దారుల్లో అమరావతి చేరేవారు. మొదటిది ఒరిస్సాలోని ధౌళి నుండి శాలిహుండం, రామతీర్థం, కళింగపట్నం, తొట్లకొండ, బావికొండ, బొజ్జన్న కొండ, కొత్తూరు, లింగరాజు పాలెం, పిఠాపురం, కుడవల్లి, ఆదుర్రు, ఆరుగొలను, గుండ్రాయిపల్లి, గుడివాడ, ఘంటసాలల మీదుగా అమరావతి చేరడం. రెండో మార్గం సాంచి నుండి పౌని, పౌనార్ల మీదుగా కోటిలింగాల, ధూళికట్ట, తిరుమలగిరి, గాజులబండ, ఫణిగిరిల మీదుగా నేలకొండపల్లి చేరి అక్కణ్ణుంచి అమరావతికి చేరడం.
ఇరవయ్యవ శతాబ్ది పూర్వార్థంలో ఆంధ్రప్రాంతం బ్రిటిష్ వారి పాలనలో ఉండేది కాబట్టి, అక్కడే మొదటగా బౌద్ధ చైత్యాలు, స్థూపాలు బయటపడ్డాయి కాబట్టి బౌద్ధం ప్రధానంగా ఆంధ్రప్రాంతలోనే వ్యాపించింది అని అనుకునేవారు అంటారు డా. ఆనంద్. కానీ ఈ మధ్యకాలంలో తెలంగాణాలో కూడా ప్రసిద్ధ బౌద్ధ స్థూపాలు, చారిత్రిక అవశేషాలు బయటపడటంతో, తెలంగాణాలో జైనంతో పాటు బౌద్ధం కూడా ప్రముఖ పాత్ర వహించిందని తెలుస్తున్నది.
డా.ఆనంద్ ఇచ్చిన జాబితా బట్టి నేను బౌద్ధుల మొదటి ప్రయాణపథంలో ఇప్పటిదాకా ధౌళి, శాలిహుండం, బొజ్జన్నకొండ, ఆదుర్రు, జీలకర్రగూడెం, ఘంటసాల, భట్టిప్రోలు, అమరవాతి, చందవరాలు చూసేనని అర్థమయింది. తెలంగాణాలోని ఆరు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలు కోటిలింగాల, ధూళికట్ట, కోండాపురం, ఫణిగిరి, నాగార్జునకొండ, నేలకొండపల్లిలలో మొన్నటితో నాలుగు క్షేత్రాల సందర్శన పూర్తయ్యిందనీ, ఒక ఫణిగిరి, ధూళికట్ట చూడవలసి ఉంటుందనీ గ్రహించాను.
10-4-2026


Another wonderful travelogue including history, superb paintings and inspiring people we should be proud of, sir.
🙏🏽
మీతో పాటు నేను కూడా వచ్చాసాను. అన్నీ చూసేసాను. అలాంటివి మీ అక్షరాలు
ధన్యవాదాలు మేడం.
మీ మాటలన్నీ ఎప్పుడూ స్పూర్తినిచ్చేవే. కానీ రామాచారి గారి గురించి చెప్పేటప్పుడు , మీరు ఇంకొంచం తెలిసారు. You are such an inspiring personality, sir..
చాలా సంతోషం మానసా!
రామాచారి గారు నడిచే గ్రంధాలయం..వారి గురించి మరిన్ని విషయాలు తెలియజేశారు.. నమస్సులు సార్
ధన్యవాదాలు సార్!
ధన్యవాదాలు సార్… మాపై మీ ఆశీస్సులు ఎప్పుడూ కొనసాగాలి అని ప్రార్థన.
రామాచారి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
హృదయపూర్వక ధన్యవాదాలు రామ్ భాస్కర్!
మీకు, రామాచారి గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు సర్. నన్ను ఎల్లప్పుడూ ఇలానే ప్రోత్సాహిస్తూ ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నా సర్. 🙏🏻
మీరు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేస్తారు. మీరు రాసే ప్రతీ బ్లాగులో ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తారు. ధన్యవాదాలు సర్.
హృదయపూర్వక ధన్యవాదాలు నమ్రతా! నీకు నా ఆశీస్సులు.
నేలకొండపల్లి జూనియర్ కాలేజీలో అయిదేళ్ళు పనిచేసిన రోజులను, ఆ మధుర స్మృతులను మరొక్క సారి తలుచుకునేందుకు, రామాచారి గురించి తెలుసుకునేందుకు మీ వ్యాసం దోహదపడింది. కృతజ్ఞతలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
బంగారు రామాచారి నావరకు బంగారమే! ఏ పుస్తకం అవసరమైనా విసుక్కోకుండా మనకు సమాచారం అందిస్తారు!
అవును సార్!