కందుకూరి రమేష్ బాబు

కందుకూరి రమేష్ బాబుని రచయిత అనీ, పాత్రికేయుడనీ, ఫొటోగ్రాఫరు అనీ చెప్తే అతడిలోని అసాధారణవ్యక్తిత్వానికి, అతడి అద్వితీయ దార్శనికతకీ ఎంత మాత్రం న్యాయం చేసినట్టు కాదు. కాని అతడి గురించి తెలుసుకోడానికి అతడి రచనలూ,అతడు తీసిన ఫొటోగ్రాఫులే ఆధారం కావడం మరో వైచిత్రి.

ఇరవయ్యేళ్ళ కిందట ఒకరోజు వసంతలక్ష్మిగారు అతడు రాసిన పుస్తకాలు ‘సామాన్యశాస్త్రం’, ‘కోళ్ళమంగారం’ నాకు పంపిస్తూ, ‘చదవండి, మీకు ఆసక్తి కలిగిస్తాయనుకుంటున్నాను. మీకు నచ్చితే మాకు సమీక్ష రాసి పంపించండి’ అనడిగారు. అలా పరిచయమయ్యాడు రమేష్, ముందు అతడి పుస్తకాల ద్వారా, తర్వాత మరింత దగ్గరగా అతణ్ణి చూసిన కొద్దీ, జీవితపు విలువల పట్ల ఎంత మాత్రం రాజీ పడని వ్యక్తిగా, నిటారైన వెన్నెముక కలిగినవాడుగా. మనుషుల్ని గౌరవించాలంటే, అది కూడా మామూలుగా కనిపించే మనుషుల్ని గౌరవించాలంటే జీవితం పట్ల నీ దృక్పథం అసాధారణంగా ఉండాలన్నది అతడి ప్రతి ఒక్క అడుగులోనూ కనిపిస్తుంది. కాబట్టే ఇరవయ్యేళ్ళ కింద అతడు ఆర్థికంగా ఎక్కడున్నాడో ఇప్పుడూ అక్కడే ఉన్నాడు. ఒకరిని ఆశ్రయించడం అతడి నైజానికి విరుద్ధం కాబట్టే తెలంగాణా అవతరించాక కూడా అతడికి ఏ రాజకీయ శక్తులూ బాసటగా నిలబడలేదు.

కాని సరిగ్గా అందువల్లనే అతడంటే నాకు గౌరవం. అతడి కళ పట్ల నేను నతమస్తకుణ్ణవుతాను. అతణ్ణి కలిసిన ప్రతిసారీ తెలంగాణాని చాలా దగ్గరగా చూస్తున్నట్టుగా అనుభూతి చెందుతాను. సమకాలికులైన ఏ కవులూ, రచయితలూ, పత్రికా సంపాదకులూ చూపించలేనంత విశ్వసనీయంగా, సజీవంగా, రసార్ద్రభరితంగా అతడు నాకు తెలంగాణాని పరిచయం చేసూ ఉన్నాడు.

పోయిన నెల పదిహేడో తేదీనుంచీ గొథే-జెంట్రం లో అతడు ఏర్పాటు చేసిన Womanscape ఫొటో ప్రదర్శన రేపటితో ముగిసిపోతుందని తెలియగానే ఈ రోజు వెళ్ళి చూసాను. మళ్ళా అదే అనుభూతి. ఎన్నో పుస్తకాలు, కథలు, కవితలూ చిత్రించలేని జీవితాన్ని చెమ్మగిలిన నయనాలతో, విభ్రాంతితో, ఆదరంతో, ఆరాధనతో చూస్తుండిపోయాను.

నా మాటలు అతిశయోక్తులనుకుంటున్నారా? అయితే, ఇదుగో, ఈ చిత్రం చూడండి. గత పదేళ్ళుగా ఫేస్ బుక్ లో, ఇన్ స్టాగ్రాం లో ఈ ఫొటోను చూడనివారుండరు.

ఇందులో ఉన్నది ఇద్దరు స్త్రీలు. మామూలు మనుషులు. నడివయస్కులు. అందులో ఒకామె తన చీరచెరగుతో తన కళ్ళు తుడుచుకుంటూ ఉంది. రెండో ఆమె ముఖం మనకి కనిపించదు, ఎందుకంటే ఆమె మొదటి స్త్రీ మాటలు వింటున్నది కాబట్టి. కాని ఆమె వదనాన్ని కూడా మనం ఆ మొదటిస్త్రీ వదనంలో చూడవచ్చు. మనిషికి కావలసింది తన గోడు వినగలిగే మరొక మనిషి. కొన్ని క్షణాల పాటు తన పక్కన కూచోగలిగే తోటిమనిషి. అంతే. ఆ భరోసా చాలు. ఏ మనిషీ మరొక మనిషిని కష్టాలనుంచి గట్టెక్కించలేడు. ఎవరి కష్టాలనుంచి వాళ్ళే గట్టెక్కుతారు. తమంతటతామే చేతులు చాపి పైకి వస్తారు. నువ్వూ నేనూ చేయవలసిందల్లా వాళ్ళు తమ కష్టాలో, ముచ్చట్లో చెప్పుకుంటున్నప్పుడు పక్కన కూచోగలగడం. ఎంతసేపూ నీ విజయాలు, నీ సమస్యలు, నీ బాదరబందీ మాత్రమే చెప్పుకోకుండా ఎదటివాళ్ళ హృదయాన్ని ఆలకించగలగడం. ఆ రెండో ఆమె అది చేస్తున్నది కాబట్టే ఆ మొదటి ఆమె అంత నిస్సంకోచంగా కన్నీరుపెట్టుకోగలిగింది. ఇదంతా ఆ నిశ్శబ్ద చిత్రం నాతో చెప్తున్నది. ఇంతేనా? ఆ ఇద్దరిలోనూ మా మేనత్తలు కనిపిస్తున్నారు. తన పుట్టింటివారుండే కృష్ణదేవిపేటనుంచి, ఎవరేనా తనని పలకరించడానికి వస్తే, మధ్యాహ్నం పూట మా ఇంటి అరుగుమీద ఓ పక్కగా కూచుని, మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ, తన చీరెచెరగుతో తన కళ్ళట్లా ఒత్తుకున్న దృశ్యాలు నేనెన్నిమార్లో చూసాను. కాలం చెరిపివెయ్యలేని దృశ్యాలవి. కాబట్టి ఆ ఫొటో నాకు ఒక narrative, ఒక ఖండకావ్యసమానం.

ఇదుగో, ఈ ఫొటో చూడండి.

ఏముందిందులో? ఓరగా తెరిచిన ఒక గుమ్మం, సగం తెరిచిన తలుపు వెనక ఒకామె కాళ్ళు చాపుకుని బీడీ ఆకులు కత్తిరిస్తూ ఉంది. ఉత్తర తెలంగాణాలో ఏ గ్రామంలో చూసినా కనిపించే సర్వసాధారణ దృశ్యం. దీన్ని రమేష్ తన స్వగ్రామం సిర్సిల్లలో తీసాడు. చాలా మామూలుగా కనిపించే ఈ ఇమేజి వెనక ఒక సోషియాలజీ ఉంది. పాతికముప్ఫై ఏళ్ళ కిందటిదాకా ఆమె ఆ బీడీ ఆకులు ఇంటిముందు అరుగుమీద కూచుని కత్తిరించుకుంటూ ఉండేది. అప్పుడు ఆ వీథిని పొయ్యే తోటి గ్రామస్థులు, గృహిణులు, పిల్లలు, వృద్ధులు ప్రతి ఒక్కరూ ఆమెని పలకరించేవారు, వారిని కూడా ఆమె పలకరించేది. ఊళ్ళో ఏమి జరుగుతోందో, ఎవరు వచ్చారో, ఎవరు వెళ్తున్నారో మొత్తం ఆ అరుగుమీంచే ఆమెకి తెలిసేది. కాని ఇప్పుడు కాలం మారింది. ఆమె ఇంట్లోకి టెలివిజను ప్రవేశించింది. ఇప్పుడామె తన పళ్ళెం వీథరుగు మీంచి ఇంట్లోకి మార్చింది. ఇప్పుడామెకి సిర్సిల్లలోనూ, కోరుట్లలోనూ ఏం జరుగుతున్నదో తెలియదుగానీ, ప్రపంచమంతా ఏమి జరుగుతున్నదో తెలుస్తున్నది. కాని ఆ సమాచారం ఆమెకి ఏ విధంగానూ అక్కర్లేనిది, ఆమె జీవితంతో సంబంధంలేనిది. తానిప్పుడు ఊరికి దూరమైపోయింది. అలాగని ఆ వాస్తవాన్ని మనసింకా అంగీకరించడం లేదు. అందుకనే ఆ తలుపు పూర్తిగా మూసెయ్యలేదు. చెప్పండి! ఇటువంటి కథ మీరేదన్నా చదివారా? కనీసం ఏదేనా కథలో, నవలలో ఇటువంటి దృశ్యం కనిపించిందా మీకు?

ఇదుగో, ఈ ఫొటో చూడండి.

వయసుమళ్ళిన ఇద్దరు దంపతులు. ఎక్కడికో వెళ్తున్నారు. పల్లెటూరి వాళ్ళు కాబట్టి వాళ్ళకి మరీ వయసుమించకుండానే పెళ్ళయి ఉండవచ్చు. అంటే కనీసం నలభై ఏళ్ళు దాటిన వైవాహిక జీవితం ఉండి ఉండవచ్చు. కానీ చాలా మామూలుగా కనిపించే ఆ ఫొటోలో ఎంత అమానుషత్వం దాగిఉందో మనకి వెంటనే తెలియదు. చూడండి, ఆ ఎర్రటి ఎండలో ఆ మగాయన గొడుగువేసుకుని నడుస్తున్నాడు. అతడి ఆడమనిషి అతడికి రెండడుగులే వెనకనుంది. కానీ ఆమెకి కూడా ఆ గొడుగునీడలో చోటివ్వచ్చని అతడికి తెలియదు. ఆమె కూడా దాన్నట్లానే అంగీకరించినట్టుగానే కనిపిస్తున్నది. ‘అసలు ఆమెకి ఆ సోయే లేదు’ అన్నాడు రమేష్!

పితృస్వామ్యం అనీ, పురుష స్వామ్యం అనీ రెండు పదాలు సమానార్థకంగా వాడుతుంటారు కదా. నిజానికి ఆ ఎండలో తనతో పాటు తన కూతురు కూడా నడుస్తున్నట్లయితే ఆ పెద్దమనిషికి కూతురికే ముందు గొడుగుపట్టి ఉండేవాడు కాదా! ఆమె భార్యకాబట్టి ఆమెకి కూడా ఆ గొడుగునీడన ఇంత చోటివ్వాలన్న ఆలోచన కూడా అతడికి కలగలేదు. ఆ భార్యాభర్తలిద్దరూ సృష్ట్యాది నుంచీ కూడా ఆ అమరిక అలానే ఉందన్నట్టుగానే ఆ ఎండలో నడుస్తున్నారు. ఊహించండి. ఒక్క సినిమా దర్శకుడేనా ఇటువంటి ఒక్క దృశ్యాన్ని మనకే సినిమాలోనన్నా చూపించాడా?

ఇదుగో, మరో ఇమేజి చూడండి.

ఈ దృశ్యం తాండూరులోది కాని ఈ తెలంగాణా కనుమరుగవుతున్న తెలంగాణా. లంకంత ఇల్లు. కానీ ఎంత ఒంటరి తనం! ఆ తలుపు తెరిచే ఉంది, కాని ఎంత చీకటి! ఆ చీకట్లో ఆరిపోతున్న దీపంలాగా ఆ వృద్ధురాలొక్కత్తే. ఒక్కత్తే. ఆ దృశ్యం చూడగానే నా ‘ఒంటరిచేల మధ్య ఒక్కత్తే మన అమ్మ’ కవిత గుర్తొచ్చిందని చెప్పాడు రమేష్. అతడు ఏ అర్థరాత్రివేళనో ఆ కవిత తలుచుకుంటూ నాకో మెసేజి పెట్టాడు. కాని అతడికి ఆ కవితని గుర్తు చేసింది ఈ దృశ్యమని ఇప్పుడు తెలిసింది.

ఇదుగో, ఈ దృశ్యం చూడండి. ఇందులో ఉన్నవి  ఒకదానిలో ఒకటి ఇముడ్చుకున్న రెండు అరచేతులు, ఆ అరచేతి వేళ్ళు.

కాని ఆ చేతులు ఎన్నో పురుళ్ళు పోసిన చేతులు, ఎందరో పిల్లల్ని సాకిన చేతులు, ఎందరి పెళ్ళిళ్ళకో వంటలు వండి దగ్గరుండి వడ్డించినచేతులు, ఎన్ని వానాకాలాల్లోనో నాట్లు నాటిన చేతులు, పిల్లలకి, మనమలకి, మునిమనమలకి గోరుముద్దలు తినిపించిన చేతులు. ఈ చేతుల్ని చూడగానే నాకు రినైజాన్సు చిత్రకారులైన డావిన్సీ, మైకెలాంజిలో, రాఫేలులు గుర్తొచ్చారు. మానవదేహాల్ని ప్రేమించిన ఆ మహాచిత్రకారులు ఈ వేళ్ళని చూసి ఉంటే శిల్పాలుగా చెక్కిఉందురుకదా అనుకున్నాను. ఇదుగో, డావిన్సీ చిత్రించిన ఈ బొమ్మ (A Study of Hands, 1474) చూడండి.

ఇక ఈ కింది చిత్రం చూడండి. దీన్ని ఫొటో అనడం నాకిష్టం లేదు. ఎందుకంటే దీనిలో అత్యున్నతమైన abstraction అలవోకగా కుదిరింది.

గొప్ప చిత్రకారుల గురించి చదువుతున్నప్పుడు వారు తాము చిత్రించే ఆకృతుల్లో ఏ rhythm కోసం అన్వేషిస్తారో ఆ లయ ఈ చిత్రంలో ఒక సంగీతకృతిలాగా ఒదిగింది. ఆమె ఆకుపచ్చని రవికకి ప్రతిధ్వనులా అన్నట్టు ఆ ద్వారబంధం మీద ఆ పచ్చని చిలకలు చూడండి. ఆ గుమ్మాల పసుపు బంగారం పసుపు, ఆమె చీర పసుపు పొద్దుతిరుగుడు పసుపు. పసుపు మీద పసుపుని చిత్రించి మెప్పించినవాడు ఇప్పటిదాకా వాన్ గో ఒక్కడే. మీకు ఈ చిత్రం చూడగానే వాన్ గో పొద్దుతిరుగుడుపూలు గుర్తురావడం లేదూ!

సరే, ఆమె భంగిమలోని ఆ విలాసం చూడండి. ఆ వక్రతావిలాసం రమేష్ కి రామప్ప శిల్పాన్ని గుర్తుతెచ్చిదంటే ఆశ్చర్యమేముంది! ఇంతకీ తనలో ఒక అనిర్వచనీయ సౌందర్యముందని ఆ తల్లికి కూడా తెలుసన్నాడు రమేష్. ‘నువ్వు తొందరగా ఫుటోవు తీస్కొని పో బిడ్డా! మా కోడలొచ్చిదంటే సైపలేదు’ అని అన్నదట ఆమె!

ఈ దృశ్యం చూడండి. ఆ తల్లీకొడుకూ! దీన్ని చూడగానే మన హృదయం ద్రవీభూతం చెందటంలేదా! ఈ ఫొటోలో నేను చూస్తున్నదాన్ని మాటల్లో పెట్టి ఆ బెంగ బయలుపరచాలని లేదు నాకు.

ఇక ఈ దృశ్యం చూడండి. ఒక ఫొటోగ్రాఫరుగా రమేష్ అసాధారణ కౌశల్యానికి అద్దం పట్టే చిత్రమిది. ఒకామె నదీస్నానం చేస్తున్న దృశ్యం.

కాని ఇటువంటి అమరిక మొదటి మునకతో రాదట. మూడో మునకకి ఆ అమరిక మొత్తం చెదిరిపోతుందట. రెండో మునక తర్వాత మాత్రమే ఆ నదీజలాలు ఆమెచుట్టూ ఒక శాటిన్ వస్త్రంలాగా పరుచుకుంటాయట. ఆ ఒక్క క్షణం. ఆ క్షణాన్ని పట్టుకోవడమే కవిత్వం, కళ, తపస్సు.

ఇలా ప్రతి ఒక్క దృశ్యం గురించీ చెప్పాలని ఉంది నాకు. రాయాలని ఉంది. కానీ మీ అనుభూతికి అడ్డొస్తానేమో అని అనుమానంగా ఉంది. మరి మీ అంతట మీరే ఎందుకు సందర్శించకూడదు? ఈ ప్రదర్శన గొథే-జెంత్రంలో రేపటితో ముగుస్తుంది. కాని కందుకూరి రమేష్ బాబు ‘సామాన్య శాస్త్రం’ గాలరీ మణికొండలో 365 రోజులూ తెరిచే ఉంటుంది. ఆయనకు ఫోన్ చేసి (+91 99480 77893) వెళ్లండి. ఆయన రాసిన 13 పుస్తకాలూ కొనుక్కోడానికి లభ్యంగా ఉన్నాయి. సౌందర్యం ఎక్కడో లేదు, అది మనం చూసే దృష్టిలో ఉంటుంది, మనుషుల పట్ల మన ప్రేమలో ఉంటుంది అని చాటిచెప్తున్న అసామాన్యుడు కందుకూరి రమేష్ బాబు అని మీరు కూడా గుర్తుపడతారని నాకు నమ్మకంగా ఉంది.


Featured image photography by Kandukuri Ramesh Babu

9-4-2026

10 Replies to “కందుకూరి రమేష్ బాబు”

  1. ఒక సాధారణ పాఠకునిగా 10 సంవత్సరాలు పైగా శ్రీ రమేష్ బాబు గారితో పరిచయం ఉంది. నాకు ఆయన కోళ్ల మంగారం ద్వారా పరిచయం. ఆ”కోడి” ఇప్పటికీ నన్ను నా ఊహాలలో వెంటాడుతూ ఉంటుంది. ఆయన సామాన్యులలో అసమానుడు. మన చుట్టూ మట్టి కొట్టుకుపోయిన వజ్రాలు ఎన్నో ఉంటాయి. వాటిని మనం గుర్తించము. పట్టించుకోము. అలాంటి వజ్రం శ్రీ రమేష్ బాబు. ఇప్పుడు ఉన్న బురద లాంటి జీవన యానం లో అతను ఒక తామర పువ్వు. అలాంటి వారు తమ వ్యక్తిత్వంను ఎప్పుడూ కాపాడుకుంటూ ఉంటారు.

  2. Stunning review of each photograph sir! This also let us have a sneak-peak into your heart, the depth and expansiveness of your eye to encounter these images by Ramesh garu!

  3. Ordinary moments extraordinarily captured.

    We got to see each image through both lenses. Ramesh Babu garu’s camera and your interpretative insight.
    Thank you Sir.

  4. కందుకూరి రమేష్ బాబు గారి ఫోటోగ్రఫీ గురించి, వారి పుస్తకాల గురించి మంచి విషయాలు. నేను వారి ఫోటో గ్యాలరీ గతంలో చూసాను.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading