చెన్నబసవయ్య రుమాలె

మిట్టమధ్యాహ్నం, నగర వీథుల్లో, వైశాఖం నిప్పులు చెరుగుతున్నవేళ, సాలార్ జంగ్ మూజియానికి బయల్దేరాను.చెన్నబసవయ్య రుమాలె అనే నీటిరంగుల చిత్రకారుడి చిత్రాలు చూడటానికి. ‘ఈ తుపాను రాత్రి, ప్రాణసఖా, నువ్వు ప్రేమయాత్రకై బయలుదేరావా’ అన్న కవి వాక్యాన్ని గుర్తుచేసుకుంటూ. సాలార్ జంగ్ మూజియం స్థాపించి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా’వర్ణమైత్రి’ పేరిట ఆయన చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసారని నిన్న తెలిసింది. తెలిసినవెంటనే వెళ్ళి చూడకుండా ఎలా ఉంటాను?

నేను వెళ్ళేటప్పటికే మధ్యాహ్నం ఒంటిగంట కావొస్తోంది. అయినా ఆ ఎండలో సందర్శకులు క్యూ కట్టి ఉన్నారు. వేసవి సెలవులైనందువల్లనో లేక వారాంతమనో తెలీదుగానీ, కొత్త సినిమా రిలీజైనప్పుడు కనబడేటంత జనం ఒక మూజియం దగ్గర దగ్గర గుమికూడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.

మూజియంలో  ఆ ప్రదర్శన ఎక్కడుందా అని వెతుక్కుంటూ వెళ్ళబోతుంటే, కింద ఫ్లోరులోనే మీనియేచర్ల హాలు ఒకటి కనబడింది. అడుగుపెట్టి చూద్దును కదా, భారతీయ మీనియేచర్ సంప్రదాయాలన్నంటినీ ప్రతిబింబించే పెద్ద ప్రదర్శన అది. సాలార్ జంగ్ లో మీనియేచర్లకు అంత పెద్ద హాలు కేటాయించినట్టు నాకింతకు ముందు తెలీదు. లోపల అడుగుపెట్టానుగాని, ఇది మరోసారి రోజంతా చూడవలసింది అని నాకు నేను చెప్పుకుని వెస్టర్న్ బ్లాకు వైపు అడుగులేసాను.

70 వర్ణచిత్రాలు, 9 డ్రాయింగుల్తో పాటు, ఆయన జీవితప్రయాణాన్ని వివరించే డాక్యుమెంటేషను ఆ ‘వర్ణమైత్రి’ ప్రదర్శనలో ఉన్నాయి. దాదాపు రెండుగంటల పాటు అదంతా చూసేక  చాలా విలువైన ఒక సృజనని చూసాననిపించింది. అంతకన్నా కూడా అత్యంత విలువైన ఒక వ్యక్తిత్వం, సంస్కారం పరిచయమయ్యాయి అనిపించింది. చెన్నబసవయ్య రుమాలె (1910-88) దేశభక్తుడు, శాసనసభ్యుడు, పాత్రికేయుడు, పురావస్తుప్రేమికుడు, యోగి, ఆధ్యాత్మిక సాధకుడు అని కూడా తెలిసింది.

ఆయనకి మొదటినుంచీ చిత్రకళ పట్ల ఆసక్తి ఉంది. ఒక ఏడాది పాటు చిత్రకళ నేర్చుకోడానికి కళాశాలలో చేరారు కూడా. కాని ఇంతలో మహాత్ముడి పిలుపు విని జాతీయోద్యమంలో దూకారు. మహాంతుడు ఆయనతో రెండూ సాధన చేయమని చెప్పారట, చిత్రలేఖనం, సత్యాగ్రహం. కాని ఏదో ఒకదానిమీదనే దృష్టిపెట్టగలని అనుకున్నాడు ఆయన. సత్యాగ్రహంలో భాగంగా కఠిన కారాగార శిక్ష అనుభవించాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, ఇకనైనా చిత్రకళకి అంకితమవుదామనుకున్నాడు. కాని రాజకీయ మిత్రులు మరో పదేళ్ళ పాటు ఆయన్ని తమతో పాటే అట్టేపెట్టేసుకున్నారు. రెండు పర్యాయాలు శాసనమండలి సభ్యుడిగా పనిచేసాడు. ఇక 1962 లో అన్ని ప్రాపంచిక బంధాలనుంచీ బయటపడి చిత్రకళ ఒక తపస్సుగా కొనసాగించాడు.

ఎక్కడా ఏ కళాశాలలోనూ, లేదా ఏ గురువు దగ్గరా చిత్రకళ అభ్యసించనందువల్ల, ఆయన రేఖావిన్యాసంలో, ముఖ్యంగా వర్ణలేపనంలో అనితరసాధ్యమైన ఒక స్వాతంత్ర్యం సాధ్యపడింది. ఆ విషయంలో ఆయన మనకి వాన్ గో ని తలపిస్తాడు. వాన్ గో లానే చెన్నబసవయ్య వర్ణలేపనంలో, expressionistic energy కనిపిస్తుంది. నా అంచనా తప్పుకాదని, ఆ తర్వాత తెలిసింది. ఇంతకముందు ఆయన చిత్రకళా ప్రదర్శన చూడటానికి వచ్చిన ఒక ఆస్ట్రేలియన్ చిత్రకారుడు ఆ హాల్లో అడుగుపెడుతూనే ‘వాన్ గో, వాన్ గో ‘ అని అన్నాడట. అయితే రుమాలె ఆర్ట్ హౌస్ వారి వెబ్ సైటు చూస్తే, అందులో రుమాలె ని Van Gogh of India గా పరిగణిస్తారని రాసి ఉంది! నా చిత్రకళా పరిజ్ఞానం లెక్కపెట్టుకోదగ్గదే అనిపించింది.

అయితే చెన్నబసవయ్యకి వాన్ గో ఎవరో తెలీదు. అలాగే ఆయన వాన్ గో అనుకరించాడని చెప్పడం కూడా పొరపాటే అవుతుంది. ఇద్దరిలోనూ మనకి కనిపించేది, ఆ expressionistic brush work, ఆ curly, swirling, whirlwind-styled brush strokes. కాని వాన్ గో లో ఆ శక్తిప్రసారమంతా ఒకే దిక్కుకి, లేచి పడుతున్న కెరటం లాగా కనిపిస్తుంది. కానీ ఈయన చిత్రలేఖనాల్లో ఆ శక్తి మొత్తం కాన్వాసు అంతా సమతూకంగా సర్దుబాటు అవుతుంది. కాబట్టి ఈ చిత్రకారుడికి తన ఉద్వేగాల మీదా, సంవేదనల మీదా పూర్తి అదుపు ఉందని చెప్పవచ్చు.

ఆయన చిత్రలేఖనాల్లో ప్రధానంగా కనిపించేవి ప్రకృతి దృశ్యాలు. అలాగని అవి ఎక్కడో,అడవుల్లోనో, కొండల్లోనో కనిపించేవి కావు. బెంగలూరులో నలుగురూ చూసే కబ్బన్ పార్కు, లాల్ బాగ్ లో కనిపించే చెట్లు. విరగబూసే పూలచెట్లు. మోదుగ, కొండగోగు, జకరండ, గుల్ మొహర్ లాంటి చెట్లమీద రంగురంగుల గొడుగుఎత్తి పట్టుకున్నట్టు కనిపించే పూల వైభవాన్ని ఆయన నిరుపమానంగా పట్టుకోగలిగారు. బెంగలూరులో మామూలు వాడలు, వీథులు, ఇంటిముందో, లేదా సందులోనో పక్కన విరబూసే పూలపొదలు, క్రోటన్లు, కొన్నిసార్లు ముళ్ళపొదలు కూడా ఆయన కావ్యవస్తువులు. వాటిని బెంగులూరు వాసులు చూస్తే తాము రోజూ చూసే బెంగలూరులోనే తాము ఎప్పుడూ గమనించి ఉండని ఒక సుందరమయలోకాన్ని కనుగొంటారంటే ఆశ్చర్యం లేదు. ఆ పూలవికాసాన్ని చిత్రించడానికి ఆయనకి తన అంతరంగ సంవేదన ఒక్కటే ప్రమాణంగా పెట్టుకున్నారని తెలుస్తుంది. అందుకనే ఆ చెట్లని చూస్తున్నప్పుడు నేను అంత ఎండవేళ ఆ మూజియానికి వెళ్ళిన సంగతి మర్చిపోయి వెలుగు కురుస్తున్న చెట్లనీడల్లో నిలబడ్డాననిపించింది.

ఉదాహరణకి పైనున్న చిత్రం చూడండి. ఇది బెంగలూరు లో రాజాజినగర్ లో ఒక వీథి. 1985 లో చిత్రించిన ఈ తైలవర్ణ చిత్రం (52x 348 సెం.మీ) ఎవరో నార్త్ యూరపియన్ చిత్రకారుడు గీసిన చిత్రంలాగా అనిపించడం లేదూ! ఆ రాజాజీనగర్ లో ఆ వీథిలో పొద్దస్తమానం ఎంత మంది వచ్చిపోతూ ఉంటారు! కాని ఆ ఆకాశం వైపు ఎత్తిపట్టుకున్న షాండ్లియరులాగా ఆ వీథినంతటినీ వెలిగిస్తున్న ఆ తురాయి చెట్టు కురిపిస్తున్న సౌందర్యాన్ని ఎంతమంది గుర్తించి ఉంటారు? కవి లేదా కళాకారుడు బ్రహ్మ అంటే అర్థమిదే. అతడు మనం రోజూ చూసే ప్రపంచంలోనే ఒక సరికొత్త ప్రపంచాన్ని దర్శించి మనకోసం శాశ్వతంగా నిలబెట్టి వెళ్ళిపోతాడు.

60 లు కర్ణాటకలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం మొదలైన కాలం. ఎన్నో గ్రామాలు, ఎన్నో దేవాలయాలు, ఎంతో విలువైన పురావస్తు సంపద ఆ జలాశయాల కింద మునిగిపోబోతున్నదని చెన్నబసవయ్య గుర్తుపట్టారు. అందుకని ఆయన ఆ ప్రాంతాల్లో తిరిగి ప్రాజెక్టులు కట్టక పూర్వమున్న దృశ్యాల్ని చిత్రించారు. కూడలసంగమం మీద అలా చిత్రించిన ఒక కాన్వాసు ఆ ప్రదర్శన మొత్తంలో నాకు అత్యంత విలువైనదే కాక, పవిత్రమైంది అని కూడా అనిపించింది.

ఆయన జీవితంలో ఇద్దరు ఆధ్యాత్మిక గురువులు లభించారు. వారి ద్వారా ఆయన కాయకల్ప యోగం సాధన చేసారు. దానివల్ల ఆయన్ని చివరిదాకా వార్ధక్యం తాకలేకపోయింది. తాను గీసిన బొమ్మలన్నీ ప్రకృతి ఎదట గీసినవేనని తెలిసినప్పుడు, అందుకే, నాకు ఆశ్చర్యం కలగలేదు.

అక్కడ ప్రదర్శనలో ఆయన మనమరాలు, అంటే ఆయన స్నేహితుడి మనమరాలు శబలాదేవి ఉన్నారు. చిత్రకారుడి గురించిన బ్రోచర్ ఏదైనా ఉందా అని ఆమెని అడిగాను. కాని ఆ ప్రశ్నతో మొదలై దాదాపు అరగంటసేపు ఆమె ద్వారా చెన్నబసవయ్య గారి గురించిన ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. ఆయన చిత్రకళపైన నా అభిప్రాయం చెప్పబోతుంటే, ఆమె ‘ఒక్క క్షణం’, అని తన మొబైలు తెరిచి ‘నేను రికార్డు చేసుకోవచ్చా? మీరు చెప్పే మాటలు’ అనడిగారు.

ఇక నేను సెలవు తీసుకునే ముందు, ‘ఇక్కడి చిత్రాలన్నిటిలోనూ మీకేది బాగా నచ్చింది?’ అనడిగారు. ఒక క్షణం ఆలోచించాను. ఎందుకంటే, బ్రహ్మకమలాన్ని చిత్రించిన ఒక చిన్న చిత్రంతో పాటు, హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు ని చిత్రించిన పెద్ద కాన్వాసుదాకా ప్రతి ఒక్కటీ నాకేసి ఆసక్తిగా చూస్తున్నాయి, నేను ఏ చిత్రాన్ని ఎంపిక చేయబోతానా అని. కాని అప్పటికే నా దృష్టిని ఒక చిత్రం నాలుగైదు సార్లు తన వైపు తిప్పుకుంటూ ఉంది. కబ్బన్ పార్క్ లో ఒక గుల్ మొహర్ నీడన ఒక తల్లీ, బిడ్డా నించున్న దృశ్యం. నేను దాన్ని ఎంపికచేసాను. ‘ఎందుకంటే, ఈ చిత్రంలో బాక్ గ్రౌండ్, ఫోర్ గ్రౌండ్, మిడిల్ గ్రౌండ్ మూడింటికీ చిత్రకారుడు తగిన చోటిచ్చాడు. ఫోర్ గ్రౌడ్ లో వీలైనంత ఖాళీ స్థలం వదిలిపెట్టడంతో మనం అక్కడ నిల్చుని, ఆ మిడిల్ గ్రౌండ్ లో ఆ చెట్టుకింద ఉన్న తల్లీబిడ్డల్ని దగ్గరగా చూడవచ్చు’ అని చెప్పాను.

‘అయితే, మీరు ఆ చిత్రం పక్కన నిల్చోండి, మీకొక ఫొటో తీస్తాను’ అన్నారామె. ఏమి భాగ్యం!

దాదాపు ఎనభై ఏళ్ళ వయసులో ఒక రోజు చెట్లనో, పూలనో చిత్రించడానికి లాల్ బాగ్ లో అడుగుపెడుతూ ఆయన ఒక యాక్సిడెంటులో మరణించారని విన్నప్పుడు ఒక సౌందర్య ఉపాసకుడు తన ఉపాసనలోనే తనువు చాలించారనిపించింది. ‘నా దృష్టిలో రాళ్ళు ఈశ్వరుడు, మొక్కలూ, నీళ్ళూ విష్ణువుకి ప్రతిరూపాలు, ఆకాశం సాక్షాత్తూ బ్రహ్మ, ఈ దృష్టివల్లనే నా చిత్రకళకి ఒక అద్వితీయత సమకూరింది. నేను నిమిత్త మాత్రుణ్ని మాత్రమే’ అని రాసుకున్నారట చెన్నబసవయ్య. అందుకనే ఆ చిత్రకళా ప్రదర్శనలో ఉన్నంతసేపూ నాకొక యోగిసన్నిధిలో గడిపినట్టే అనిపించింది.


ఈ ప్రదర్శన మే 25 దాకా ఉంటుంది. కాబట్టి చిత్రకళాభిమానులు తప్పకుండా సందర్శించగలరు.

Featured image: Painting by Rumale Chennabasaviah, Courtesy: Rumalearthouse.com

9-5-2026

9 Replies to “చెన్నబసవయ్య రుమాలె”

  1. Great introduction to a great artist, Sir. Such a distinct style of painting. Thank you 🙏🏽

  2. చిత్రకళాయోగసాధకుడు చెన్నబసవయ్య గారూ, నాదయోగసాధకుడు జాన్ హిగ్గిన్స్ గారూ రోడ్ ఏక్సిడెంట్స్ కారణంగా పరమపదించారు. కాకతాళీయం కావచ్చును.

    ఆకాశానికి దివిటీలెత్తుతున్న తురాయిచెట్టుబొమ్మ బాగా ఆకట్టుకుంది. మీకు బాగానచ్చిన ఆ తల్లీబిడ్డల బొమ్మ ఫోటోలో అంత స్ఫుటంగా లేకపోవటం విచారణీయం.

    ఈవ్యాసం నాకు చాలా సంతోషం కలిగించింది. ఇంకా ఒకపక్షం రోజులపాటు ఉండే ప్రదర్శనను మన భాగ్యనగరవాసులు తప్పక ఆదరంతో దర్శిస్తారని ఆశించవచ్చును. ఇంకా సరిగా నడవలేకపోతున్న నాకు ఆభాగ్యం లేకపోవటం విచారకరం కాని మీరు మీ అద్భుతవ్యాసం ద్వారా తగినంత ఊరట ఎలాగూ కలిగించారు. సో నైస్ ఆఫ్ యూ.

    (ఒక చిన్న అభ్యర్ధన. మీవద్ద ప్రసిధ్ధచిత్రకారులు మంథా లక్ష్మణమూర్తి గారి కాంటాక్ట్ ఉంటే తెలియజేయగలరా? ఆయన నాసహోద్యోగీ మంచి స్నేహితులూను. కాని దశాబ్దాలు గడవటంతో ఆయన కాంటాక్ట్ పోగొట్టుకున్నాను. ఆయన అమెరికాలో ఎక్కడ ఉన్నదీ కూడా తెలియదు. తెలుసుకుందుకు నేను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.)

    1. మీ స్పందనకు ధన్యవాదాలు. శ్రీ లక్ష్మణ మూర్తి గారి కాంటాక్ట్ నెంబర్ నా దగ్గర లేదు.

  3. great artist.
    I was in Bangalore during 1979-83.. used to go around cubban park,lal bagh, MG road and did some of my first pencil sketches..
    Thanks for writing about chenna basavayya garu. Surely I will visit show…

  4. Dear Shri Vadrevu Ch Veerabhadrudugaaru,

    Namskaaram.

    తెలుగు నా మాతృభాష. కానీ బెంగళూరులో పెరగడం వల్ల, నేను ఎక్కువగా కన్నడలోనే సంభాషిస్తాను. సాలార్ జంగ్ మ్యూజియంలోని శ్రీ రుమాలే చెన్నబసవయ్య చిత్రలేఖనాలపై మీ సూక్ష్మ పరిశీలన మరియు అంతర్దృష్టులు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

    As the curator of this retrospective, I am delighted about your visit to the exhibition and your insights here ( in telugu in your blog). Your well-considered views are one of the exceptional documents of visitors’ response to the Retrospective so far to my knowledge. You are not only a keen observer but very precise and thoughtful in your response to Shri Rumalejis art. Many visitors have invoked Van Gogh, while reflecting on Rumaleji’s art. But so far only your point of view in this regard appeals to me. Very impressive, sir!

    The observations you have added, after an initial association with Van Gogh, is particularly striking. You have written,

    “ అయితే చెన్నబసవయ్యకి వాన్ గో ఎవరో తెలీదు. అలాగే ఆయన వాన్ గో అయితే చెన్నబసవయ్యకి వాన్ గో ఎవరో తెలీదు. అలాగే ఆయన వాన్ గో అనుకరించాడని చెప్పడం కూడా పొరపాటే అవుతుంది. ఇద్దరిలోనూ మనకి కనిపించేది, ఆ expressionistic brush work, ఆ curly, swirling, whirlwind-styled brush strokes. కాని వాన్ గో లో ఆ శక్తిప్రసారమంతా ఒకే దిక్కుకి, లేచి పడుతున్న కెరటం లాగా కనిపిస్తుంది. కానీ ఈయన చిత్రలేఖనాల్లో ఆ శక్తి మొత్తం కాన్వాసు అంతా సమతూకంగా సర్దుబాటు అవుతుంది. కాబట్టి ఈ చిత్రకారుడికి తన ఉద్వేగాల మీదా, సంవేదనల మీదా పూర్తి అదుపు ఉందని చెప్పవచ్చు“

    It is factual, convincing and makes total sense to me. thank you for your precious time and kind gestures.

    With warm regards (from Bengaluru )
    K.S. Srinivasa Murthy
    kakarlasrinivasa@yahoo.com
    (Curator of the retrospective “Varna Mythri” at SJM, Hyderabad )

    1. Sir, I am extremely grateful for your kind feedback here. After posting my visit note on my blog, then I remembered that I did not mention the name of the curator of the exhibition. I am extremely sorry for that. The way the exhibition was curated and the years of journey and the evolution of the painter were well documented by you. You deserve all the appreciation. Thank you very much sir!

      1. Thank you for your kind words, sir.
        Your feedback is of immense value.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading