ఆ బావి మీద 'ఈ బావి శ్రీరామదాసుగారు వాడినది' అని రాసి ఉంది. అటువంటి సజీవస్రవంతిని చూడటంలో ఒక పులకింత ఉంది. అయితే ఆయన ప్రవహింపచేసిన కీర్తనాసాహిత్యమనే సుజలస్రవంతిలో ఒక్కసారేనా మునకలెయ్యని తెలుగువాడంటూ ఉండడుకాబట్టి, నేలకొండపల్లిలో ఆయన చేదుకున్న నీళ్ళబావిని చూడటంలో ఒక చిత్రమైన సంతోషముంది.
బాలాంత్రపు రజనీకాంతరావు
నిన్నసాయంకాలం గుంటూరులో వైశ్య హాస్టల్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున బాలాంత్రపు రజనీకాంతరావుగారికి విశిష్ట సేవా పురస్కారం అందించారు. ఆ సత్కార సభలో రజనీకాంతరావుగారితో వేదిక పంచుకోవడమే కాక, ఆయన గురించి మాట్లాడే అవకాశం కూడా నాకు కలిగింది. మరీ ముఖ్యంగా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారు రజనీకాంతరావుగారిమీద ప్రచురించిన విశేష సంచిక 'రజని ' నీ అవిష్కరించే అదృష్టం కూడ కలిగింది.
