పునర్యానం-54

నా జీవితం పొడుగునా నిందలు భరిస్తూనే వచ్చాను. నా ఉద్యోగజీవితంలో మరీను. ఒకసారి మా కమిషనర్ ఒకాయన, నా పట్ల ఎంతో ఆదరాభిమానాలతో ఒక మాటన్నాడు: you have to live with them అని.

కాని నింద మనలో రేకెత్తించే బాధ చాలా విచిత్రమైంది. కుటుంబరావు ఒకచోట రాస్తాడు, ఎవరేనా మనల్నేదన్నా అన్నప్పుడు, మనకి ఎందుకు బాధకలుగుతుందంటే, తక్కినవాళ్ళు ఏమనుకుంటారు అన్నదానికన్నా కూడా, అటువంటి నింద పడటానికి మనలో ఏదైనా లోపం కనీసం లేశమాత్రమేనా ఉందా అనే అనుమానం కలగడం వల్ల అని. మనల్ని నిందించేవాళ్ళూ, అవమానపరిచేవాళ్ళూ కోరుకునేది అదే. వాళ్ళు ప్రధానంగా మన ఆత్మవిశ్వాసాన్ని, నైతిక సమగ్రతని దెబ్బతీయాలని చూస్తారు. అత్యాచారం చెయ్యబోయేవాడు తాను ఎవరి మీద అత్యాచారం చెయ్యబోతున్నాడో ముందు ఆ మనిషి ఆత్మవిశ్వాసం మీద దెబ్బతియ్యడానికి ప్రయత్నిస్తాడు అని ఒక రచయిత రాసాడు. అంటే అత్యాచారి తన అత్యాచారం ఆ మనిషిని భౌతికంగా ఒక విక్టిమ్ గా మార్చకముందే, ఆత్మికంగా విక్టిమ్‌గా మార్చేస్తాడన్నమాట. నింద, దూషణ, పుకార్లు, ట్రోలింగ్- ఇవన్నీ కూడా అత్యాచారాలే. ఇవి మన సూక్ష్మశరీరం మీద జరిగే అత్యాచారాలు. మన మనోకాయమ్మీద జరిగే దాడి అది. దాన్నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం: స్టోయిక్కులు చెప్పినట్టుగా, ఆ అవమానం నీ చేతుల్లో లేదుగానీ, ఆ అవమానానికి ప్రతిస్పందించడం మాత్రం నీ చేతుల్లోనే ఉంది. నీ యశఃకాయం మీద దాడి చేస్తున్నవాడు కోరుకునేది ఇదే. వాడి మాటలకి నువ్వు కలతచెందాలి. అప్పుడు నువ్వు ఆ అత్యాచారంలో ఒక భాగస్వామిగా మారతావన్నమాట. అలాకాక, నువ్వు ఆ నిందని ఇగ్నోర్ చెయ్యగలిగావా, ఆ అత్యాచారం అత్యాచారంగా పరిణమించకుండానే సమసిపోతుంది.

అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, జీవితంలో ఎదురయ్యే ఈ మానావమానాలకే మనం ఇంతలా సతమతమవుతూ ఉన్నామే, సాధు కవులు, సంత్ కవులు తమ తమ జీవితాల్లో ఎన్ని నిందలు పడి ఉంటారు, ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారు, అయినా వారు చూస్తున్న వెలుగు మీద చిన్నపాటి మబ్బునీడ కూడా మసకపడినట్టుగా కనిపించదు. అంతదాకా ఎందుకు? చలంగారినే చూడండి. ఆయన డిప్యూటీ ఇన్ స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా పనిచేసారు. ఆయన పుస్తకాలు రాసి అమ్ముకుంటున్నాడని ఆయన మీద అభియోగాలు మోపారు. ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణాధికారి ఆయన మీద అభియోగపత్రం మోపి సంజాయిషీ అడిగాడు. తన మీద ఆరోపణలే అసత్యం అయినప్పుడు, ఆ అభియోగ పత్రానికి సంజాయిషీ ఎందుకివ్వాలి అనుకున్నారు చలంగారు. కాని ఒక డిసిప్లినరీ కేసు పరిష్కారం కాకపోతే, ఉద్యోగ విరమణ తర్వాత పెన్షన్ రావడం కష్టం. కాని చలంగారు ఆ అభియోగపత్రానికి సంజాయిషీ ఇవ్వలేదు. వాలంటరీ రిటైర్ మెంటు తీసుకుని భార్యాబిడ్డలతో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడ ఒక ఏడాదీ, రెండేళ్ళూ కాదు, దాదాపు ముప్ఫై ఏళ్ళు గడిపారు. పెన్షన్ లేకుండా. అదీ మనం గమనించవలసింది. ఆ ముప్ఫై ఏళ్ళల్లో ఆయన రాసిన రచనలు ఎటువంటివి? గీతాంజలితో టాగోర్ కవిత్వం మొత్తం, శుభవార్తలు, భగవద్గీత- ఇక అన్నిటికన్నా ముఖ్యం, సుధ.

రేపెలా గడుస్తుందో తెలియని అనిశ్చితిలో, తనని ఒంటరివాణ్ణి చేసిన సమాజం మీద నిప్పులు కక్కవలసిన వేళ ఆయన దయావర్షం కురిపించాడు. ఇదెలా సాధ్యమయ్యింది? లోకం నీ మీద దాడిచెయ్యడానికి ప్రయత్నించిన ప్రతిసారీ దాన్ని ఇగ్నోర్ చెయ్యగలగడం వల్ల మాత్రమే సాధ్యపడిందనుకుంటాను. ఆ మెలకువకు చేరుకున్నాక రాసిన కవిత ఇది.


(మచ్చలేని పెన్నిధి సంబంధర్‌ కూర్చిన కావ్యం : సంబంధర్‌)

అన్వేషించాను జీవితమంతా నిందలేని స్థలం గురించి
నిష్కళంక సంతోషం గురించి, నిన్ను నువ్వు వేలెత్తి చూపుకోని వేళ గురించి
వెతుక్కున్నానిన్నాళ్లూ వీగిపోని వాగ్ధానం గురించి, తెగిపోని స్నేహం గురించి
నాదని చెప్పుకోదగ్గదేదన్నా ఒక హృదయం గురించి, తరుఛాయ గురించి.

చేపట్టానెన్నో ప్రయత్నాలు, తప్పలేదు నిందలు
ప్రయత్నించానెన్నో నీడలు, తప్పలేదు నిందలు
ఆశ్రయించానెన్నో నీడలు, తప్పలేదు నిందలు
తలదాల్చానెన్నో బాధ్యతలు, తప్పలేదు నిందలు.

అన్ని ప్రయత్నాలకూ ఆవలనున్నదొక్క ఆకాశం మాత్రమే
అన్ని నిందలకూ ఆవలనున్నదొక ఆకాశం మాత్రమే
నిందించనీ, స్తుతించనీ, నాదని నేను చెప్పుకోగలది
ఈ ఒక్క వాక్యం మాత్రమే, ఈ స్తోత్రం మాత్రమే.

(పునర్యానం, 5.2.12)


(A song without blemish is Sambandar’s poem: Sambandar)

I have searched my whole life for a place without blame
A happiness free from taint, and a time free of blame.
I’ve searched my whole life for promises that won’t fail
Hearts that never break, and friendships that never fade.

Several endeavors, but couldn’t escape blame
Many friendships, but couldn’t escape blame
The shelters are plentiful, but not without blame
Lots of responsibility, but couldn’t escape blame.

There’s only one thing beyond all our efforts: the sky
There’s only one thing without blame: the firmament.
Let people praise me or curse me, but
The only poem I can call my own is this hymn.

25-9-2023

5 Replies to “పునర్యానం-54”

  1. నిందను నిర్లక్ష్యం చేయడానికి స్ఫూర్తి దాయకమైన కవిత. చలం గారి ఉదంతం ఆత్మవిశ్వాసానికి మంచి ఉదాహరణ.కవిత ఆలోచనామృతం.

  2. పాండవులకు ధౌమ్యుడు ఎంతో మాకు మీరు అంతకంటె ఎక్కువ సార్ 🛐

  3. పాండవులకు ధౌమ్యుడు ఎంతో మాకు మీరు అంతకంటె ఎక్కువ సార్🛐

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading