
దిమ్మరి చదవడం పూర్తి చేసాను. నూటయాభై పేజీల పుస్తకం. మామూలుగా అయితే గంటాగంటన్నరలో చదివెయ్యగలను. కాని రెండు రోజులు పట్టింది. ఆగీ ఆగీ చదువుతూ వచ్చాను.
కొన్ని పుస్తకాలు కూడా యోగుల్లాంటివే. వాటి సమక్షంలో మనలోపలి నాయిస్ అణగిపోతూండటం మనకే తెలుస్తూ ఉంటుంది. మనం ఎంత ప్రయత్నించినా, మనని మనం ఎప్పటికప్పుడు ఎంత పరిశుభ్రం చేసుకుంటున్నామని మనకి చెప్పుకుంటూ ఉన్నా, ఇంకా, లోపలి తావుల్లో గూడుకట్టుకున్న మాలిన్యాలూ, చింతలూ ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడు చెదిరిపోకుండా ఉండవు.
మొన్న పాండురంగాపురంలో మట్టిమనిషి కడుతున్న మూజియం ఆవరణలో ఈ పుస్తకం గురించి మాట్లాడుకోడానికి జయతిమిత్రులంతా కలిసారు. ఈ పుస్తకం గురించి మాట్లాడమని యింద్రవెల్లి రమేష్ అడిగాడు. పుస్తకమింకా పూర్తిగా చదవలేదనన్నాను. అయినా కూడా ఏదో ఒకటి చెప్పండి, ఆమె గురించి, తర్వాత ఆమెనీ, లోహినీ అడుగుతాను, వాళ్ళ గురించి వాళ్లనే చెప్పమని అని అన్నాడతను.
పుస్తకం గురించి మాట్లాడటానికి నేను చొరవ తీసుకోకపోడానికి మరో కారణం కూడా ఉంది. పోయినసారి ‘మనం కలుసుకున్న సమయాలు’ ఆవిష్కరణ రోజున ఇట్లానే మాట్లాడదామని లేచి నిల్చున్నాను. రెండు మాటలైనా మాట్లాడేనో లేదో కన్నీళ్లు ఉబికి రావడం మొదలయ్యింది. ఆపుకోడం కష్టమయ్యింది. ఇప్పుడు కూడా అలాంటిదేదో జరుగుతుందన్న సంకోచం కావచ్చు. కాని పాండురంగారావు గోడ మీద ‘దిమ్మరి’ అనే మాట చూసి యింద్రవెల్లి రమేష్ హైదరాబాదు నుంచి వచ్చేసాడు. అతడికి జయతి గురించి ఏమీ తెలీదు. ఆ రోజు అతణ్ణి హైదరాబాదులో ఒక పుస్తక సభలో మాట్లాడమని పిలిచారు. కాని దిమ్మరి అనే పదం అతణ్ణి అక్కడ ఉండనివ్వలేదు. అటువంటి మనిషి అడిగాక మాట్లాడకుండా ఎలా ఉండటం?
లేచి నిల్చున్నాను. ‘నేనేమీ మాట్లాడను గాని, ఇందులోంచి రెండు ఖండికలు చదివి వినిపిస్తాను’ అన్నాను.

మొదట ‘కంటిలో నలక’. ఇక్కడ ఎత్తి రాసాను. చూడండి.
ఆ తర్వాత ‘వసంతంలో ఒక మరణం’. జయతి తన తమ్ముడు మధుకర్ మీద రాసిన ఖండిక. ఈ పుస్తకం ఆమె అతడి స్మృతికే అంకితం చేసింది. ఆ రచన చదువుతూ ఉండగానే నా గుండె ఊడి చేతుల్లో పడిపోతుందేమో అనిపించింది. నా గొంతు గద్గదమవుతోందని అందరికీ తెలుస్తోనే ఉంది. కన్నీళ్ళు రాకుండా నిగ్రహించుకుంటూనే చదువుతూ ఉన్నానుగాని, ఆ వ్యాసం ముగించేటప్పటికి, నా చెంపల మీద జారిన కన్నీటిని నలుగురిదృష్టినుంచీ దాచలేకపోయాను.
కన్నీళ్ళు నాకే వస్తున్నాయా? ఆ గోష్ఠి ముగిసేక నేను హైదరాబాదు బయల్దేరడానికి సిద్ధమవుతూ ఉండగా, ఆ మధ్యాహ్నం మాకు అన్నం వండిపెట్టి, వడ్డించిన గిరిజన మహిళల్లో ఒకామె, ఆమె పేరు చిన్ని అనుకుంటాను, ఆమె నా దగ్గరకు వచ్చి ‘నువ్వు చదువుతున్నంతసేపూ నాక్కూడా ఏడుపొచ్చింది’ అంది. అభినందనపూర్వకంగా నేను ఆమెతో చేయి కలిపాను. నా చేయి ఆమె వదల్లేదు. ‘ఎందుకని నీకు ఏడుపొచ్చింది?’ అనడిగాను. ‘తెలీదు. నువ్వు చదువుతోంది వింటోంటే నాకు ఏడుపొస్తూనే ఉంది’ అంది.
ఒకప్పుడు చలంగారికి ఏదన్నా కవిత్వమో, కథలో ఎవరన్నా చదువుతో ఉంటో వింటోంటే అట్లా ఏడుపొచ్చేదట. భమిడిపాటి జగన్నాథ రావుగారికి కళ్ళు అట్లా అశ్రుసిక్తం కావడం కావడం నేనెన్నో సార్లు చూసాను. ఇప్పుడు నా మిత్రుల్లో సోమయ్యగారట్లా. ఆయనకి సున్నితమైంది ఏది చదివినా, విన్నా కళ్ళమ్మట నీళ్లొచ్చేస్తాయి. చలంగారూ, సోమయ్యగారూ, ఆ గిరిజన మహిళా ఒక్కలాంటివాళ్ళే. సున్నితహృదయులు. వాళ్ళకి కన్నీళ్ళు రావడం సహజం. నాకెందుకని కన్నీళ్ళొస్తున్నాయి?
అలాగని అన్ని పుస్తకాలూ కన్నీళ్ళు తెప్పించవు. చాలామంది ప్రసిద్ధ కథకులు, కవులు రాసిన రచనలు చదివితే బాగుందనిపిస్తుంది. వాళ్ళ శైలికో, శిల్పానికో ముగ్ధుణ్ణి కాకుండా ఉండలేను. నా సమకాలిక రచయితల రచనలు కూడా చాలావాటిని చదివినప్పుడు నా ప్రశంసని నేనెప్పుడూ దాచుకోలేదు. కాని కన్నీళ్ళు?
‘హృదయం గడ్డకట్టి ఎండిపోయినప్పుడు నువ్వొచ్చి నన్ను కరుణావర్షంతో తడిపెయ్యి’ అంటాడు టాగోర్. ఏ రచనైనా నాకు కన్నీళ్ళు తెప్పించినప్పుడు అది భగవంతుడి కరుణావర్షంగానే భావిస్తాను నేను. ఆ రచన నాకు భగవత్సమానమవుతుంది.
కాబట్టి, ఇప్పుడు, ఈ దిమ్మరి కూడా.
జయతి చెప్తున్నారు అవాళ: ‘నేనిప్పటిదాకా రాసిన పుస్తకాల్లో ఈ పుస్తకమే నాకెంతో ఇష్టమైంది’ అని. అవును. ఇది ముందటిపుస్తకాల్లాంటిది కాదు. ‘అడవినుండి అడవికి’ తో మొదలై ‘మనం కలుసుకున్న సమయాలు’ దాకా ఆమెలో ఒక తపస్వి, ఒక సౌందర్యారాధకురాలు, ఒక ప్రకృతి ప్రేమికురాలు కనిపిస్తారు. అందుకనే నేనొకప్పుడు ఆమెని spiritual ecologist అని అన్నాను. కాని ఈ పుస్తకం వేరు. ఇందులో విరాగి కాదు, రాగమయి కనిపిస్తుంది. ఒక ప్రేమసముద్రాన్ని గుండెలో మోసుకుంటూ తిరుగుతున్న ప్రేమికురాలు కనిపిస్తుంది. ఒక తల్లి కనిపిస్తుంది, ఒక చెల్లి, ఒక అక్క, ఒక క్లాస్ మేట్, ఒక సహచరి, ఒక క్షమామూర్తి, చివరికి, ‘నగ్నపాదాలు’ అనే రచనలో ఆమె కోపం కూడా కనిపిస్తుంది. ఎద్దేవా, హేళన కూడా కనిపిస్తాయి. ఇప్పటిదాకా ఈ streak ఆమెలో నేను చూడలేదు. కాని దేవాలయాన్నే అంగడిగా మార్చాక ఏసుక్రీస్తు లాంటివాడే కోపోద్రిక్తుడు కాకుండా ఉండలేకపోయాడు. అడవికి తూట్లుతూట్లుగా గాయాలు చేస్తున్న మనుషుల్ని చూసినప్పుడు జయతికి ఆగ్రహం కలగకపోతే ఆశ్చర్యపోవాలి మనం.
లేదు, ఇది మామూలు రచన కాదు. తెలుగులో ఇటువంటి పుస్తకం నేను చూడటం ఇదే మొదటిసారి. ఈ పుస్తకంలో ఆమె మూర్తీభవించిన అనురాగంగానూ, ఆగ్రహంగానూ కనిపించింది. ఆమెకి కోపం తెప్పించకుండా ఉన్నంతకాలమే ఈ లోకంలో వానలు పడతాయనిపించింది ఈ పుస్తకం పూర్తి చేసేటప్పటికి.
‘ఎందుకని ఆమె ఎక్కడా నాలుగురోజుల కంటే ఎక్కువ ఉండలేకపోతున్నారు’ అని అడిగిందొక మిత్రురాలు నన్ను. ‘ఆమె దయామయి కాబట్టి కనీసం నాలుగురోజులేనా అక్కడ ఉండగలుగుతోంది, ఇంకా మన మధ్య జీవించగలుగుతోంది. లేకపోతే, నిజమైన మనుషులు బతగ్గలిగే ప్రపంచమేనా ఇది?’ అని అన్నాను నా మిత్రురాలితో.
త్రిపురగారి ‘భగవంతం కోసం’ కథ చదివినప్పుడు, అప్పుడే నేను ఇంటర్మీడియేటు పూర్తిచేసిన రోజులు, ఆ కథ నన్ను నిలువెల్లా కదిలించేసింది. కాని త్రిపుర నిజంగా భగవంతుడికోసం వెతుక్కుని ఉంటే భగవంతుడు కనిపించి ఉండేవాడని, ఇదుగో, ఇందులో ‘పుష్ పుల్ పాసెంజరు రైలు’ చదివితే తెలుస్తుంది. త్రిపుర తెలుగువాళ్ళకి మొదటిసారి జెన్ అనే మాటని పరిచయం చేసిన రచయిత. కాని ఒక జెన్ సాధువు ఎలా ఉంటాడో జయతిని చూసాకనే నాకు తెలిసింది. ఎందుకంటే భగవంతుడు కనిపిస్తే ఆయనకేమివ్వాలో కూడా జయతికి తెలుసు.
ఇందులో ఆమె జీవితం ఉంది, ఇంతదాకా నడిచిన ప్రయాణం ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆమె చాలా చోట్లనే సంచరించింది. కనీసం నాలుగైదు రాష్ట్రాల్లో జీవికకోసం ఏదో ఒక ఉద్యోగం చేయడానికి ప్రయత్నించింది. కాని ఒక్కో ఏడూ గడుస్తున్నకొద్దీ ఆమె ఒక్కో బరువూ దించుకుంటో తనని తాను రిక్తం చేసుకుంటో ఉంది. కాని కాలం ఆమెకి కొత్త బంధాలు కూడా అందిస్తూ వచ్చింది. మొదట లోహి, తర్వాత వైటీ. ఆ వైటీకోసమే ఆమె కనీసం మూడు తావుల్ని వదిలిపెట్టేసింది. ఇప్పుడు లూసీ. ఇట్లానే ఒకప్పుడు రమణమహర్షి దగ్గరికి ఎక్కణ్ణుంచో ఒక ఆవూ, ఒక నెమలీ వచ్చేయని విన్నాను.
మొన్న నలుగురం కూచుని మాట్లాడుకుంటున్నప్పుడు దుశ్శర్ల సత్యనారాయణ గారు చెప్తున్నారు: ‘ We are not nature lovers అని అన్నాడు లోహీగారు. ఎందుకని అడిగాను. ఎందుకంటే we are nature అని చెప్పాడాయన’ అని.
అవును. ఇప్పుడు వాళ్ళు నలుగురూ ఒక కుటుంబం. ఒక ప్రకృతి కుటుంబం.
ఆ మూగజీవాల్ని వాళ్లు ప్రేమించినట్టుగా మనమూ ప్రేమించగలిగితే మనం కూడా ఆ కుటుంబంలో భాగం కాగలుగుతాం. మా చెల్లెలు సంధ్య హైదరాబాద్ నుంచి బస్సు, లారీ, అన్నీ ఎక్కి సాయంకాలానికి అక్కడ చేరుకుంది. ఆమె భుజాన పెద్ద బాగు. అక్కడ ఉండడానికి సిద్ధమై వచ్చిందేమో అనుకున్నాను. తీరా చూస్తే ఆ సంచీలోంచి నాలుగు ప్యాకెట్ల డాగ్ ఫుడ్ బయటకు తీసి పెట్టింది. ‘ చూస్తున్నావా! అదీ ఆ కుటుంబంలో భాగమయ్యే తీరు’ అని నాకు నేను చెప్పుకున్నాను.దిమ్మరిలో ఎన్నో వాక్యాలున్నాయి. అవన్నీ మీతో పంచుకుందామని ఎక్కడిక్కడ గుర్తులుపెట్టుకున్నాను. కాని, ఆ పుస్తకం ఎవరికి వారే చదువుకోవలసిన పుస్తకం. కనీసం ఆ పుస్తకం చదువుతున్న కొద్దిసేపేనా మన చాంచల్యాలూ, చిత్తభ్రమలూ మననుంచి దూరంగా జరుగుతాయి.
కంటిలో నలక
దిమ్మరి పుస్తకం పూర్తిచేసేముందు రెండు నెలలపాటు నా కంటిలో నలక ఉండిపోయింది, రాయడం పూర్తయింది.
కొండపోడుల్లో రైతులు కొట్టి పడేసిన చెట్లూ కొమ్మలు మాకు వంటకి పనికొస్తాయి. బాగా ఎండిన బిల్లుడు, సండ్ర కొమ్మలూ, వేరులు, వేపకొమ్మలు, తంగేడు కంప, పాత కర్రలు ఏరి ఎత్తుకొస్తాను. కొన్ని కట్టెలు పక్కన కూడబెట్టాను వర్షాకాలానికి. ఉన్నన్నాళ్ళు పొయ్యిలో మంటకి ఉపయోగపడతాయి. వెళ్లిపోయిన నాడు బైట పడేస్తాను. ఒకనాడు నాలుగు గట్టిమొద్దులు గొడ్డలితో పగలగొట్టి కట్టెపేళ్ళు వేశాను. చిన్న ముక్క ఎగిరి నా కంటిలో పడి ఉండవచ్చు. అప్పటికి కన్ను నలిపినా తరువాత దాని సంగతి మర్చిపోయాను. రాత్రీ పగలు ఒకటే గాలి ఈ కొండల నడుమ అడవి చుట్టుముట్టిన ఖాళీలో. రైతులు దున్నిన నేలల్లోంచి మట్టిరేణువులు లేచి కొట్టుకొస్తాయి. గాలిదుమారం సాధారణమే. గాలికేదైనా ఎగిరొచ్చి పడిందనుకున్నాను నాలుగోరోజు. లోహిని చూడమన్నాను. ఏమి కనబడలేదు. కంటిలో నీటిపొర ఏర్పడడం. కనురెప్ప వొత్తుకుంటూ నొప్పి పూట్టడం, ఒక్కోసారి కంటిలో ఏమీలేనట్టుంటుంది. కంటిపరీక్ష చేయవలసి ఉంది. వద్దన్నాను. నగరానికి, పరీక్షలకీ వెళ్లడం ఇష్టంలేకపోవడమొకటీ కాక, వెళ్ళే ఆలోచనే లేదు. ఎవరన్నా పరీక్ష మాట ఎత్తినప్పుడు దిమ్మరి పూర్తైతే చాలన్నాను. ఆ తరువాత చూపు పోయినా, ఏమైనా.
కన్ను ఇట్లా ఉండడం నొప్పిగానూ ఉంది. లేనప్పుడు రాయడం, నొప్పి ఉన్నప్పుడు పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ఏం చెయ్యకుండా ఉంటున్నాను. ఒక ఆదివారం మిత్రుడు క్రాంతి మమ్మల్ని కలవడానికి వచ్చి, మా యాత్రలూ, జీవితానుభవాల గురించి, దిమ్మరి గురించీ ముచ్చటించుకున్నాక, అంతసేపూ నా కంటిని గమనిస్తున్న క్రాంతి లేచి వెళుతూ, మీ కంటిలో ఏదో ఉందనిపిస్తుంది. దగ్గరివారొక డాక్టర్ ఉన్నారు, మీకు వీలైన రోజున నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని అన్న తరువాత పదిరోజులు గడిపేశాను. క్రాంతి, యాదగిరి ఒక ఉదయం వచ్చి మమ్మల్ని, వైటీనీ కూడా నల్గొండ తీసుకు వెళ్ళారు కంటిడాక్టరు దగ్గరికి. డాక్టర్ కంటిలోని నలక చూసి అది కట్టెపేడు ముక్క అని చెప్పిదానిపై రక్తనాళాలు అల్లుకుపోతున్నాయన్నారు. నలక తీసి చూపించారు. అడవి నుండి అడవికి గురించి విన్నారని, మేమే అక్కడికి రావడం ఆనందంగా ఉందని చెప్పారు, ఉచితంగా పరీక్ష చేసి కళ్లద్దాలు ఇచ్చారు. ఇంతకాలం ఒక కట్టెపేడుముక్క కంటిలో ఉండిపోవడం, ఏదో ఊహించుకుంటూనే దిమ్మరి పుస్తకం రాయడం పూర్తై పోవడం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు నలక వెళ్ళిపోయింది, నొప్పి వెళ్లిపోయింది.
దిమ్మరి, జయతి లోహితాక్షన్, మట్టిముద్రణలు, ఆలగడప, వెల. రు. 200/- పోస్టల్ చార్జీలు రు. 40 అదనం. పుస్తకం కావలసినవారు 9959493306 (Lohi Choichi Koran) నంబరుకు గూగుల్ పే చేసి తెప్పించుకోవచ్చు.
5-9-2023
As real as the soil…sir
Thank you
మీరు చదువుతున్నప్పుడు ఏడవాలి అనిపించింది… చదువుతున్న అక్షరాలన్నీ ఒకప్పుడు ఎదురైనవి కావచ్చు.. గడిచిన కాలం కంటి ముందు నిలిపింది ఏమో తెలియదు… కారణం ఏదో చెప్పడం కష్టం
మనిషిని మనసును ఒక్కటిగా కూర్చోబెట్టిన చోటు అది… కనులు తడి కాకపోతే ఆశ్చర్యమేమో..
Thank you
ధన్యవాదాలు మేడం
సమీక్ష అద్భుతంగా ఉంది సార్ 🙏
ధన్యవాదాలు సార్
నాకు ఏకదా నైమిశారణ్యే గుర్తుకు వచ్చింది. ప్రకృతి ఒడిలో పల్లవిస్తూ, పరవశిస్తూ ప్రకాశిస్తున్న జంట
ఆధునిక ఋషిదంపతులు.కాలంతో కాలు నిలువకుండా పయనిస్తున్న వాళ్లు. చీకూ చింతా లేని లోక సంచారులు.దిమ్మరి పదానికి దివ్యత్వం పొదిగిన అరుంధతీ వశిష్టులు. పుస్తకం గురించి చెప్పిన మీ కన్నీటి తడితో గుండెల్లో అలజడి.
మీ స్పందనకు నమః
దేశ దిమ్మరి, లోక సంచారి నాకున్న అప్రకటిత బిరుదులు. జయతి గారు అడవుల వెంట తిరుగుతుంటే నేను దేశాలు పట్టుకుని తిరుగుతున్నాను. మంచు పర్వతాలు లోయలు జలపాతాలు దాటుకుంటూ నన్ను నేను దాటేసుకుoటూ…
ప్రజా జీవితానికి ఆవల
వింతైన లోకాన్నేదో చూస్తూ ప్రయాణించడం
అనుక్షణం మనలోనుంచి మనమే కొత్తగా
పుట్టినట్టు అనుభవం లోకి రావడం
ఇవన్నీ ప్రతి దిమ్మరికి స్వానుభవాలేనేమో
మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు. ధన్యవాదాలు మీకు.
మీ స్పందనకు ధన్యవాదాలు
బాధ ఎదుటివారిదైనా అది తన బాధగా భావించే మనసు కన్నీళ్ళని చిందించటంలో
ఆశ్చర్యం ఏమి వుంది సర్!
ఇటువంటివారికి నిజమైన ఆనందాన్ని ఆస్వాదించే అదృష్టం కూడా వుంటుందేమో సర్.
అవును మేడం
చాలా మంచి పుస్తకాన్ని గురించి వివరించారు గురువు గారూ….
సున్నితమైన భావోద్వేగం మనసును తాకింది
ధన్యవాదాలు సార్