వెళ్ళిపోతున్న వసంతం

Reading Time: 3 minutes

178

వసంత ఋతువు అయిపోవచ్చింది. ఆకులు కూడా కనబడనంత నిండుగా పూసిన పూలు రాలిపోయి, ఆకుపచ్చ మాత్రమే మిగిలిన చెట్లు.

ఈ దృశ్యంలో ఏదో చెప్పలేని దిగులు, కాని ఇది ఏదో పోగొట్టుకున్న దిగులు కాదు. ఒక సంతోషానుభవం ముగిసిపోయినప్పటి మనఃస్థితి. పెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కల్యాణమంటపంలాగా.

వసంతం ఒక్కసారిగా తరలిపోదు, నెమ్మదిగా నెమ్మదిగా సాగిపోతూ ఉంటుంది, అది కూడా వెళ్ళడానికి కాళ్ళు రానట్టే వెళుతూంటుంది. ఆ క్షణాన్ని పట్టుకోవాలంటే నువ్వు బూసన్ లాంటి కవివి కావాలి.

యోసా బూసన్ (1716-1783) సుప్రసిద్ధ జపనీయ హైకూ కవులు నలుగురిలోనూ ఒకడు, బషో తర్వాతి వాడు. బషో చేతుల్లో ప్రాణం పోసుకున్న హైకూ ప్రక్రియని ఒక ఉద్యమంగా మార్చినవాడు. ప్రాచీన చీనా మహాకవుల్లో ఒకడైన వాంగ్ వీ లాగా, కవీ, చిత్రకారుడూ కూడా. కాబట్టే, వసంతం తరలిపోతున్న దృశ్యాన్ని ఇట్లా చిత్రించగలిగేడు:

వెళ్ళిపోతున్న వసంతం-
ఇంకా తచ్చాడుతూనే ఉంది
ఆలస్యంగా పూసిన పూల గుత్తుల్లో.

ఒకప్పుడు మోహన ప్రసాద్ ఇస్మాయిల్ గారిని కలుసుకోడానికి కాకినాడ వెళ్ళాడు. రోజంతా గడిపారు ఆ కవులిద్దరూ. రాత్రి పదింటికో, పదకొండింటికో ఇస్మాయిల్ ఆ కవిని బస్ స్టాండ్ కి తీసుకువెళ్ళి బస్ ఎక్కించారు. బస్ కదలడానికి ఇంకా ఆలస్యమయ్యేటట్టుందని ఇస్మాయిల్ గారు మిత్రుడి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. పొద్దున్నే ఆయన లేచి వీథి తలుపు తెరిచి చూస్తే, ఆ ఇంటి వరండాలో అరుగు మీద నిద్రపోతూ మోహన ప్రసాద్!

వెళ్ళిపోతున్న వసంతం ఇంకా తచ్చాడుతూనే ఉంది పూలగుత్తుల్లో అంటే అర్థమది.

వెళ్ళిపోయే వసంతం దిగులు పుట్టిస్తుంది కాని అది లేమి లోంచి పుట్టే వేదన కాదు, సంతృప్తి అంచులదాకా పయనించి తిరిగివచ్చేటప్పటి తీయని వేదన.

ఆ మెత్తని బాధ బహుశా బూసన్ కి తెలిసినట్టుగా మరెవరికీ తెలీదు. రాలిపోయిన పియొనీ పూలని చూస్తూ అతడిట్లా అంటున్నాడు:

పువ్వుల్లారా, మీరు రాలిపోయినా
మీ రూపమింకా
నా కళ్ళముందు నిలిచే ఉంది

పూలు రాలిపోయినా వసంతకాలవృక్షాలు శిశిరకాలవృక్షాల్లాగా బోసిపోవు. వాటి పచ్చదనం మరింత పచ్చబడుతుంది, వాటి నీడలు మరింత చిక్కబడతాయి. వేసవిలో చెట్ల నీడలు శరీరాన్ని మాత్రమే కాదు, మనసుని కూడ సేదదీరుస్తాయి.

పువ్వులన్నీ రాలిపోయి
ఈ గుడి మళ్ళా
ఆకుపచ్చవన్నె తిరిగింది.

ఆ గుడి గుడి మాత్రమేనా? లోకమంతానూ. జీవితంలోని క్షణభంగురత్వాన్ని రాలుతున్న పూలు స్ఫురింపచేసినంతగా మరే దృశ్యమూ స్ఫురింపచెయ్యలేదనుకుంటాను. కాని చిత్రమేమింటంటే, ఈ దృశ్యం వైరాగ్యాన్ని మేల్కొల్పదు. అంతకన్నా కూడా జీవితం పట్ల మరింత ఇష్టాన్నే పెంచుతుంది.

ఇప్పుడంటే జీవితంలో అదృశ్యమైపోయేయిగానీ, ఒకప్పుడు రైల్వే స్టేషన్లలో, నీ స్నేహితులో, ప్రేమికులో,బంధువులో వెళ్ళిపోయేటప్పుడు ఆ చివరి వీడ్కోలు క్షణాలెట్లా ఉండేవి. కొంతసేపు వాళ్ళతో పాటే కంపార్ట్ మెంటులో కూచుండేవాళ్ళం. ఆ కంపార్ట్మెంట్ లో ఎక్కడానికొచ్చినవాళ్ళు, సామాన్లు సర్దుకోడానికో, సెటిల్ కాడానికో అవస్థ పడుతున్నా పట్టించుకోకుండా అక్కడే ఇంకా చెప్పడానికేదో విలువైనవేవో మిగిలిపోయినట్టూ, అవి చెప్పకపోతే చాలా నష్టపోతామన్నట్టూ ఏదేదే చెప్పుకునేవాళ్ళం. గార్డు విజిల్ ఊదేవాడు. నెమ్మదిగా లేచి పెట్టె దిగి మళ్ళా కిటికీ పక్కకొచ్చి నిలబడేవాళ్ళం. వాళ్ళ చేతిని ఆ కిటికీలోంచే మన చేతుల్లోకి తీసుకునే కొంతసేపు మౌనంగా ఉండిపోయేవాళ్ళం. రైలు కదిలేది. అక్కడే నిలబడేవాళ్ళం. వాళ్ళు ఆ కిటికీలోంచో, లేదా ఆ తలుపు దగ్గరనుంచో మనకేసే చూస్తూండేవారు. రైలు ఇంకా ముందుకు కదిలి ప్లాట్ ఫాం విడిచిపెట్టి మొదటి మలుపు తిరిగినదాకా, చివరి పెట్టె కూడా తరలిపోయిందాకా అట్లానే నిల్చుండేపోయేవాళ్ళం.

కాని వసంతం వెళ్ళిపోవడంలోని నిజమైన విషాదం వీటిలో లేదు. అదెట్లాంటిదో మళ్ళా బూసన్ నే చెప్పాలి. మరవలేని ఒక హైకూలో అతడిట్లా అంటున్నాడు:

వసంతం ముగిసిపోయింది
కవి ధ్యాస ఇప్పుడు
సంపాదకుల మీద.

ఒకప్పుడు జపాన్ లో ఋతువులు ముగిసిపోయేకనో, సంవత్సరం గడిచిపోయేకనో ఆ కాలమంతా వచ్చిన హైకూల్లోంచి కొన్ని హైకూలు ఏరి పుస్తకంగా తెచ్చేవారు. తన కవిత సంకలనంలో చోటుచేసుకోవడం కన్నా, ఏ హైకూ కవికైనా, కోరుకోవలసింది మరేమీ ఉండేది కాదు . అట్లాంటి సందర్భంలో, వసంతం ముగిసిపోయాక, కవి రాబోయే సంకలనాల్లో తన కవిత చేరుతుందా లేదా అన్న ధ్యాసలో పడిపోతాడంటాడు బూసన్.

ఈ కవితలో లోతైన ఒక అర్థముంది. అదేమంటే, వసంతం జీవిత అశాశ్వతత్వాన్ని స్ఫురింపచేసినందుకు, కవి సత్యం లోకి మరింత మేల్కోవలసింది పోయి, తన జీవితాన్ని ఒక స్మారకంగా మార్చుకోవడమెట్లా అని ఆలోచిస్తున్నాడన్నమాట! అది కూడా ఎట్లా! తన కవిత సంకలనానికి ఎక్కడం ద్వారా!

కాని ఋతుపరిభ్రమణం ముందు మనం చెయ్య వలసిందేమిటి? ఏమీ చెయ్యకూడదు. చూస్తూ ఉండాలంతే. బూసన్ చెప్పేదదే. చేసిందదే.

పూలు బాగా పూసినప్పుడు:

పొలంలో ఒక చాప పరుచుకు మరీ
కూర్చున్నాను, తదేకంగా చూసాను
పూలు పూసే దృశ్యాన్ని.

ఇంతలోనే పూలు రాలిపోవడం మొదలయ్యింది. అప్పుడు:

రాలుతున్న పూలు-
రెండు, మూడు రేకలు,
ఒకదానిమీద మరొకటి.

25-5-2017

arrow

Painting: Yamamoto Shunkyo, Recesses of Shiobara, 1909

Leave a Reply

%d bloggers like this: