ముప్పై ఏళ్ళల్లో

129

తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించి ముప్పై ఏళ్ళయిన సందర్భంగా, ముప్పైఏళ్ళ (1985-2015) తెలుగు సాహిత్యం మీద ఒక గోష్ఠి ఏర్పాటు చేసారు. అందులో కీలకప్రసంగం చేయవలసిందిగా మృణాళిని నన్నడిగారు.

ముప్పై ఏళ్ళ తెలుగు సాహిత్యం గురించి ఆలోచించగానే నా జీవితంలో గడిచిన ముఫ్ఫై ఏళ్ళూ కళ్ళముందు కదిలాయి. 1985 లో రాజమండ్రిలో ‘ప్రబంధ పరిమళం’ పేరిట మల్లంపల్లి శరభయ్యగారు కొన్ని ప్రసంగాలు చేసారు. ఆ ప్రసంగాల మీద, సదనంలో పిల్లలకి, సమాచారం సుబ్రహ్మణ్యం ఒక వ్యాసరచన పోటీ పెట్టాడు. ఆ బహుమతులు ఇవ్వడం కోసం సమాచారం మేడమీద ఏర్పాటు చేసిన సమావేశంలో నేను మాష్టారికొక ప్రేమలేఖ రాసి వినిపించాను. ‘సహృదయునికి ప్రేమలేఖ’ పేరిట రాసిన ఆ వ్యాసంతో సాహిత్య విమర్శకుడిగా నా ప్రయాణం కూడా మొదలయ్యింది.

ముప్పై ఏళ్ళ తరువాత ఒక సారి నిలబడి ఆలోచిస్తే, సాహిత్యం గురించీ, సమాజం గురించీ, సాహిత్యానికీ సమాజానికీ ఉన్న సంబంధం గురించీ నా ఆలోచనల్లో సముద్రమంత మార్పు వచ్చింది. ఈ మార్పు నాలో మటుకే వచ్చిందికాదు, తెలుగు సమాజంలోనూ, సాహిత్యసృజనలోనూ, సాహిత్యానుశీలనలోనూ వచ్చిన మార్పు.

ఈ మార్పుని అర్థం చేసుకోవడమెట్లా?

ఎంతో సంక్లిష్టమైన ఈ మార్పుని ఎంతో సవివరంగా చర్చించుకోవలసి ఉంటుంది. కాని దీన్ని సులభంగానూ, సరళంగానూ ప్రతిపాదించగలమా? ఆ నా ప్రసంగంలో అటువంటి సరళ సూత్రీకరణలు మూడింటినివ్వడానికి ప్రయత్నించాను.

మొదటిది, ముప్పై ఏళ్ళ తెలుగు సాహిత్యపరిణామం గురించి అర్థం చేసుకోవడానికి, ఆ సాహిత్యపృష్టభూమిలో అక్షరాస్యతలో వచ్చిన మార్పు. తెలుగురాష్ట్రాల్లో 1981 లో ఉన్న అక్షరాస్యత 2011 కి వచ్చేటప్పటికి 40 శాతం పెరిగింది. దళితుల్లో యాభై శాతం, గిరిజనుల్లో 45 శాతం అక్షరాస్యత పెరిగింది. స్త్రీపురుష అక్షరాస్యత మధ్య ఉన్న అంతరం ఒకప్పుడు 25 శాతం ఉన్నది కాస్తా ఇప్పటికి 15 శాతానికి తగ్గింది. పట్టణ, గ్రామీణ అక్షరాస్యతలో కూడా అంతరాలు తగ్గుముఖం పట్టాయి. స్థూలంగా ఉన్న ఈ అంకెలు చెప్తున్నదేమంటే, ఈ ముఫ్ఫై ఏళ్ళ కాలంలో లక్షలాదిమంది, కోట్లాదిమంది యువతీ యువకులు అక్షరాస్యులుగా సామాజిక జీవితంలోకి ప్రవేశించారు. దేశచరిత్రలోనూ, జాతిచరిత్రలోనూకూడా అక్షరాస్యత ఇంత శీఘ్రగమనం పొందిన తరుణమిదే. మనమిక్కడ ఈ సమావేశమందిరంలో పదిమందిమి కూచుని మాట్లాడుకుంటున్నామనుకుంటున్నాం గాని, మనవెనక ఈ లక్షలాదిమంది యువతీయువకుల నిశ్శబ్ద ఆకాంక్షలున్నాయి, స్వప్నాలున్నాయి.

రెండవది, 1981 లో జరిగినట్టుగా ప్రపంచ సాహిత్యవేత్తలు గుర్తిస్తున్న narrative turn. మనిషికి తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించిన జ్ఞానం ఎలా తెలుస్తుంది?  ఆమె తన చుట్టూ ఉన్న ‘వాస్తవాన్న’ ఎట్లా నిర్మించుకుంటుంది? ఈ జ్ఞాన సంపాదన రెండు మార్గాల్లో జరుగుతుందని 2500 ఏళ్ళుగా యూరోప్ చెప్తూ వచ్చింది. ఒకటి, ఆలోచన ద్వారా. రెండవది, ఇంద్రియానుభవం ద్వారా. ప్లేటో, అరిస్టాటిల్ సూత్రీకరించిన ఈ రెండు మార్గాలే 1980 దాకా కూడా కొనసాగుతూ వచ్చాయి. కాని గత ముప్పై ఏళ్ళుగా మనస్తత్వ శాస్త్రవేత్తలు, వైద్యవిజ్ఞానవేత్తలు చెప్తున్నది మరోలా వుంది.

జెరోమ్ బ్రూనర్ ( The Narrative Construction of Reality, 1991) ఇలా చెప్తున్నాడు:

‘మనం మన జీవితానుభవాన్ని మనకు సంభవిస్తున్న మానవీయ సంఘటనల స్మృతికోశాన్ని ప్రధానంగా కథారూపంలోనే క్రోడీకరించుకుంటున్నాం- కథలు, సాకులు, కల్పనలు, చెయ్యగలిగినవాటికీ, చెయ్యలేకపోయినవాటికీ మనం చెప్పుకునే సమర్థింపులు. కథనం మనుషులు తరతరాలుగా తమ శక్తిసామర్థ్యాల్ని బట్టి, తమ సహచరులు, గురువుల సామర్థ్యాన్ని బట్టి సాంస్కృతికంగా అందించుకుంటూవస్తున్న సాధనం.’

అంటే దానర్థం,బయటి ప్రపంచం గురించిన ‘వాస్తవం’ మనమెప్పటికీ నిశ్చయంగా చెప్పగలిగేది కాదు. అలా నిశ్చయంగా చెప్పగలుగుతున్నమనుకుంటున్న మన సిద్ధాంతాలన్నీ ‘నీరస తథ్యాలు’ మాత్రమే. ఒట్టి కథలు, కల్పనలు మాత్రమే. ప్రపంచం గురించి మనం చెప్పుకుంటున్నదంతా, ముందు మనకి మనం చెప్పుకుంటున్న కథ, కథనం. ఈ ప్రపంచాన్ని వివరించగలమని చెప్పడానికి ప్రయత్నించిన సిద్ధాంతాలు, మార్క్సిజంతో సహా, ప్రతి ఒక్కటీ మహాకథనాలూ మాత్రమే.

అంతేకాదు, మనం భాష అనేది ఒకటున్నదనీ, ఆ భాషలో మన భావాలు వ్యక్తం చేస్తామనీ, రచనలు చేస్తామనీ అనుకుంటున్నాం, కానీ నిజానికి భాష అంటూ విడిగా లేదు, మన భావాలు ప్రకటితమవుతున్నప్పుడే భాష కూడా రూపొందుతూ వస్తుంది. అందుకనే ఒక మహారచయిత పుట్టినప్పుడల్లా ఆ భాషా స్వరూపం మారిపోతూంటుంది.

ఇక అన్నిటికన్నా ముఖ్యమైంది, ‘నేను’ అనేది. ఆధునిక యుగం ‘నేను’ ని ఆవిష్కరించడంతో మొదలయ్యింది. ఆధునిక సాహిత్యం ప్రధానంగా self conscious. అంటే- నేనున్నాను, నా అనుభవాలున్నాయి, వాటిని చెప్పుకుంటున్నాను- అనుకోవడం. కాని గత ముప్పై ఏళ్ళుగా వచ్చిన మెలకువ ఏమిటంటే, ‘నేను’ అంటూఏదీ విడిగా లేదు. నా గురించి ‘నేను’ చెప్పుకునే కథలోతోనే ‘నేను’ రూపొందుతుంది. నేను కథ చెప్పడం కాదు, నేను చెప్పే కథ నన్ను రూపొందిస్తుంది. దీన్నే మనం identity అంటున్నాం.

ఇప్పుడు మూడవ ముఖ్య విషయం. నేనిందాకా ప్రస్తావించిన రెండు అంశాల్నీ కలిపి చూద్దాం. గత ముప్పై ఏళ్ళుగా రూపొందుతూ వస్తున్న లక్షలాది మంది అక్షరాస్యులు తమకై తామొక భాషని రూపొందించుకుంటూ తమదైన ఒక అస్తిత్వముద్రను అన్వేషిస్తూన్న మహాదృశ్యమొకటి మీ కళ్ళముందు ఆవిష్కరించుకోండి. గత ముఫ్ఫై ఏళ్ళుగా తెలుగు సాహిత్యం ఎంత పురిటినొప్పులు పడుతున్నదో మీరే గ్రహించుకోగలుగుతారు.

ఇప్పుడు అస్తిత్వ ఉద్యమాలుగా ( ఎంత అసంబద్ధ పదబంధం! ఐడెంటిటీ ఉద్యమాలకు తెలుగులో ఈ పదబంధాన్ని సృష్టించిన పత్రికాసంపాదకుడెవరోగాని అతడికి అస్తిత్వవాదమూ తెలియదు, ఐడెంటిటీ వాదమూ తెలియదు) రూపుదిద్దుకుంటూ గళం విప్పుతున్న సాహిత్యధోరణుల మూల సూత్రం ఇదే. వాళ్ళు సార్వత్రికంగానూ, సార్వజనీనంగానూ ఉండే తర్కాన్నీ, తాత్త్వికతనూ విశ్వసించడంలేదు, సత్యం ఎవరికి వారు నిర్మించుకునేదీ, ఎవరికి వారు చెప్పుకునేదీ, నమ్మించుకునేదీ అనే భావిస్తున్నారు. అట్లా చెప్పుకోవడంలో అసంఖ్యాక సత్యాలు వెల్లడవుతున్నాయి. ఆ అసంఖ్యాక సత్యశకలాలు ఆధారంగా మనమొక మానవముఖచిత్రాన్ని పున: పరికల్పన చేసుకోవలసి ఉంటుంది.

ఇదీ ఈ ముఫ్ఫై ఏళ్ళ తెలుగు సాహిత్యం గురించి నాకై నేను చెప్పుకుని అక్కడ చెప్పిన కథ.

ఈ కథతో పాటు మరొక రెండు హెచ్చరికలు కూడా చెప్పాను.

మొదటిదేమంటే, యూరోప్ లోనూ, పాశ్చాత్య ప్రపంచంలోనూ, ఏళ్ళ మీదట వృద్ధి చెందిన భావజాలం ఇక్కడ అతి తక్కువ వ్యవధిలోనే తలెత్తి వికసించవలసివచ్చినందువల్ల, మన ఆలోచనల్లోనూ, అవగాహనా క్రమంలోనూ తలెత్తిన అనివార్యమైన సంక్షోభం. ఉదాహరణకు, స్త్రీవాదం. యూరోప్ లో స్త్రీవాదం మూడు తరంగాలుగా తలెత్తింది. మొదటితరం స్త్రీవాదులు మేరీ వోల్స్టన్ క్రాఫ్ట్ (1759-1797) వంటివాళ్ళు స్త్రీలకి పురుషులతో పాటు సమానంగా హక్కులు కావాలని వాదించారు. రెండవ తరం స్త్రీవాదులు, అసలు స్త్రీ అనే భావాన్నే ప్రశ్నించారు. స్త్రీ అనే ఒక లింగదేహానికీ, స్త్రీ అనే సామాజిక సంజ్ఞ కీ మధ్య తేడా ఎత్తి చూపారు.  స్త్రీ పురుష జైవిక విభేదం (sex) స్త్రీ పురుష సాంస్కృతిక విభేదం (gender) గా ఎలా మారిందో సైమన్ డి బోవా (1908-1986) వివరించింది. ఇక మూడవ తరం స్త్రీవాదులు, లూసీ ఇరిగరే, జూలియా క్రిస్టేవా వంటివారు పురుష స్వభావమనేది ఒక ఆధికారిక నిర్మాణమనీ, ఒక పాలక జాతి పాలిత జాతిపట్ల చూపించే వైఖరి ఒక పురుషుడు స్త్రీ పట్ల చూపించే వైఖరిలాంటిదేననీ వాదించారు. గత ముప్పై ఏళ్ళుగా తెలుగులో స్త్రీవాద సాహిత్యం మూడవతరం స్త్రీవాదుల ఆలోచనను అందుకోలేకపోగా, మొదటి రెండు తరంగాల దగ్గరే కొట్టుమిట్టాడుతూ వుంది. అక్కడ రెండువందల ఏళ్ళ పాటు జరిగిన పరిణామం ఇక్కడ మూడు దశాబ్దాలకు truncate కావడంలోని సంక్షోభం ఇంతా అంతా కాదు. జాతిజనులు తమ అనుభవాల ఆధారంగా చెప్తూన్న కథనాల్ని సిద్ధాంతాలకు అన్వయించి చూసుకోవాలన్న ఆతృత ఇందుకు కారణం. తెలుగు రచయితలూ, విమర్శకులూ ఈ విషయంలో మెలకువ వహించాలి.

ఇక రెండవ హెచ్చరిక, అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించింది. ఆధునిక మహాకథనాలు తమని అప్రధానీకరణకు గురిచేసాయని ధిక్కరిస్తూ ఈ ఉద్యమాలు ముందుకొచ్చాయి. తిరిగి ఈ ఉద్యమాలు తమకై తాము చెప్పుకుంటున్న కథనాలకు ఆ మహాకథనాల్నే నమూనాలుగా స్వీకరించకుండా జాగ్రత్తపడాలనేది. ఎవరికి వారు నిర్మించుకుంటున్న ‘సత్యాన్న’ తిరిగి మళ్ళా ఏ కొద్దిమందో చేజిక్కించుకోకుండా సాహిత్య సృజనకారులూ, ఆ సృజనను సిద్ధాంతీకరీంచాలనుకుంటున్న విమర్శకులూ ఈ విషయంలో కూడా మెలకువ వహించి తీరాలి.

25-11-2015

arrow

Painting: Imants Tillers, ‘Namatjira’, Musi Zhang

Leave a Reply

%d bloggers like this: