మోండ్రియన్ పూల బొమ్మలు

ఇప్పటి మన చిత్రకారులెవ్వరూ పూలబొమ్మలు గియ్యరు. ప్రసిద్ధ ఆధునిక తెలుగు చిత్రకారులు గీసిన పూలబొమ్మలేవీ నేను చూడలేదు. పూలబొమ్మలు గియ్యడం కూడా figurative art కిందకే వస్తుందనీ, అది చాలా తక్కువస్థాయి చిత్రకళ అనీ ఆధునిక చిత్రకారులు భావిస్తూండవచ్చు. ఆకృతిని నిరాకరించి, నైరూప్యం వైపు ప్రయాణం మొదలయ్యాక, తమ మనోసీమలో ఘూర్ణిల్లే రకరకాల విరూపాకృతులకి వ్యక్తీకరణనివ్వడమే తమ సాధనగా,తమ కళాసాఫల్యంగా భావిస్తున్నారు మన చిత్రకారులు.