రెల్లు పూసే కాలం

రెల్లు పూసే కాలం మొదలయ్యింది. వర్షాకాలం వర్షాకాలంలా నడిచినా నడవకపోయినా, కురిసిన ఆ రెండున్నర వానలూ చాలు, ఆ చిత్తడినేలల్లో రెల్లు వికసించడానికి. ఇప్పుడు చెరువుల్లో, దొరువుల్లో, ఏటి గట్లమీదా, నదీ తీరాలమ్మటా హంసలు వాలినట్టు రెల్లు విరబూస్తుంది. నేనిక్కడ ఈ నగరంలో, ఈ మేడమీద కూర్చుని, ఆ కాశవనాల్ని తలుచుకుంటున్నప్పుడు అప్రయత్నంగానే గాథాసప్తశతి గుర్తుకొస్తుంది. ఆ రెల్లు మరింత విరబూసాక, శరత్కాలపు వెన్నెలలు కూడా ఆకాశామంతా విరబూయడం మొదలయ్యాక, అప్పుడు కృష్ణుడూ, వేణుగానమూ, బృందావనగోపీగీతలూ గుర్తొస్తారు. కాని వర్షాకాలం శరత్కాలంలోకి మలుపు తిరిగే ఈ మలి భాద్రపదం మాత్రం నా మనసులో గాథాసప్తశతికే సొంతం.

మూడు నాలుగేళ్ళ కిందట మోదుగుల రవికృష్ణ గారినుంచి తెచ్చుకున్న రెండు పుస్తకాల్లో – పెదకోమటి వేమారెడ్డివి, ఒకటి గాథాసప్తశతిలోని 104 కవితలకు వ్యాఖ్య, మరొకటి అమరుకం పైన వ్యాఖ్య- ఇన్నాళ్ళకు గాథాసప్తశతి పైన వ్యాఖ్య తీసి చదవడం పూర్తిచెయ్యగలిగాను. కొన్ని పుస్తకాలు రాయడానికే కాదు, చదవడానికి కూడా వేళలుంటాయి. సప్తశతి గాథలు మాత్రమే కాదు, వాటి గురించిన తలపోతలకి కూడా ఇటూవంటి కాలమే కలిసి రావాలి.

పెదకోమటి వేమారెడ్డి పధ్నాలుగు-పదిహేను శతాబ్దాల మధ్య కాలానికి చెందిన వాడు. రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి కి (1325-53) అన్న అయిన మాచారెడ్డికి మనమడు. ప్రోలయ వేమారెడ్డి తరువాత అతడి కొడుకు అనపోతారెడ్డి (1353-64), ఆ తర్వాత అనపోతా రెడ్డి సోదరుడు అనవేమారెడ్డి (1364-86) కొండవీడుని పరిపాలించారు. కాని ఆ తర్వాత తిరిగి మళ్ళా అనపోతారెడ్డి కొడుకు కుమారగిరి రెడ్డి (1386-1402) రాజయ్యాడు. కుమారగిరి రెడ్డినే కర్పూర వసంతరాయలు అని కూడా అంటారు. అతడిది సంగీత, సాహిత్య సామ్రాజ్యం. రసరాజ్యం. అతడు తన రాజ్యంలో గోదావరికి ఎగువనున్న ప్రాంతాన్ని తన బావమరది అయిన కాటయవేమారెడ్డికి (1395-1414) అప్పగించాడు. కాటయవేమారెడ్డి కూడా గొప్ప సాహిత్య వైదుష్యం ఉన్నవాడే. కాళిదాసు నాటకాలకు అతడు రాసిన వ్యాఖ్యానాలు అత్యున్నత స్థాయి అభిరుచికి దర్పణాలు.

అంతకాలం పెదకోమటి వేమారెడ్డి ఒక చిన్నపాటి ప్రభువుగా కొనసాగాడు. కానీ రాజ్యాన్ని ఇలా కాటయవేమారెడ్డికి పంచడం మీద ఆగ్రహించి పెదకోమటి వేమారెడ్డి కుమారగిరి రెడ్డిమీద తిరుగుబాటు చేసి, అతణ్ణి తరిమేసి, తాను కొండవీడు ప్రభువుగా (1402-20) పరిపాలించాడు. కుమారగిరిరెడ్డి తన చివరిదినాల్లో తన బావమరది కాటయవేముడి సంరక్షణలో రాజమహేంద్రవరంలో గడిపాడు. అప్పణ్ణుంచీ పెదకోమటి వేమారెడ్డి రాజమహేంద్రవరాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోడానికి కాటయవేమారెడ్డితో, అతని తరువాత అతడి వియ్యంకుడు అల్లాడరెడ్డితో, అల్లుడు వీరభద్రారెడ్డితో యుద్ధాలు చేస్తూనే ఉన్నాడు. అతడికి ఈ యుద్ధాల్లో మొదట్లో తోడుగా నిలబడ్డ రాచకొండ నాయకులే చివరికి కొండవీడు మీద దండెత్తి పెదకోమటి వేమారెడ్డిని సంహరించడంతో కొండవీడు పతనం మొదలయ్యింది.

తెలుగు సాహిత్య-రాజకీయ చరిత్రలో ఇదొక విషాదకరమైన అధ్యాయం. పెదకోమటి వేమారెడ్డి, కాటయవేమారెడ్డి ఇద్దరూ కూడా సంస్కృతంలో గొప్ప పండితులు, భావుకులు. పెదకోమటి వేమారెడ్డి కొండవీడు ప్రభువు కాకముందే శ్రీనాథుడితో స్నేహం చేసినవాడు. అతడు కొండవీడు పాలకుడయ్యాక శ్రీనాథుణ్ణి తన ఆస్థానంలో విద్యాధికారిగా నియమించుకున్నాడు. కాని ఇంత సాహిత్యసుసంపన్నులైన ఇద్దరు రెడ్డి రాజులూ కూడా చివరిదాకా అంతఃకలహంలో కూరుకుపోవడమే కాక, ఆ కలహాగ్నిలో మొత్తం కొండవీటి వైభవాన్ని ఆహుతి చేసేసారు.

అయితే, ఆ రాజులిద్దరూ కూడా ప్రోలయ వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి రాజుల రసజ్ఞతాదృష్టికి సమానంగా వారసులు కావడానికి ప్రయత్నించారు. ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలోనే ఎర్రాప్రగడ ఉండేవాడు. అది పధ్నాలుగో శతాబ్ది నాటి మాట. ఎర్రాప్రగడతోనే స్థానిక జనజీవన చిత్రణ తెలుగు కవితంలోకి సూటిగా ప్రత్యక్షం కావడం మొదలుపెట్టింది. నన్నయ వదిలిపెట్టిన అరణ్యపర్వ శేషాన్న ఎర్రన తెలుగు చేసాడని మనకు తెలుసు. కాని ఆయన హరివంశం, నృసింహపురాణాల్తో, ఒకవైపు పౌరాణిక ప్రపంచాన్ని తెలుగులోకి తెస్తూనే, మరోవైపు గుండ్లకమ్మ పరీవాహక ప్రాంతాల తెలుగు సీమ సౌందర్యాన్ని కూడా పద్యంలోకి పట్టుకొచ్చాడు. 

ఒక రాజూ, ఒక కవీ కలిసి తెలుగు భాషని సుసంపన్నం చెయ్యడం రాజరాజు, మనుమసిద్ధిలతో మొదలై, ప్రోలయవేముడిదాకా కొనసాగినప్పటికీ, ఆ రాజులు మాత్రం స్వయంగా కవులు కారు.  కాని పెదకోమటి వేమారెడ్డి రాజుగా ఉంటూనే తాను కూడా సాహిత్యసంగీతాలమీద అధినివేశం సంపాదించి ‘సాహిత్య చింతామణి’, ‘సంగీత చింతామణి’ అనే రెండు గ్రంథాలు రాసాడని చెప్తారు. అలానే సంస్కృతంలోని అమరుకావ్యానికి ‘శృంగార దీపిక ‘ పేరుతో ఒక వ్యాఖ్యానం రాసాడు. ప్రాకృతంలో హాలశాతవాహనుడు సంకలనం చేసిన గాథాసప్తశతినుండి తనకి నచ్చిన 104 గాథల్ని ఎంపిక చేసుకుని వాటికి ‘భావదీపిక ‘ పేరిట ఒక వ్యాఖ్య రాసాడు. ఇలా ఒక రాజు సాహిత్యంలోనూ, సమరంలోనూ కూడా కృషి చేసిన  తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వంటి సాహితీసమరాంగణ సార్వభౌముడు తెలుగులో తలెత్తడం సహజమే అనిపిస్తుంది.

పెదకోమటి వేమారెడ్డికి మిత్రుడిగా, తర్వాత రోజుల్లో ఆయన ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసిన శ్రీనాథుడు కూడా ‘నూనూగు మీసాల నూత్న యవ్వనం’ లో శాలివాహన సప్తశతిని తెలుగు చేసాడని మనకి తెలిసిందిగానీ ఆ పుస్తకమైతే లభ్యం కాలేదు. కానీ అందులోంచి మూడు పద్యాలు మాత్రం తెలుగు సాహిత్య భాండాగారంలో రాలిపడ్డాయి. వాటిని బట్టి ఆ మొత్తం పుస్తకం ఎంత మనోజ్ఞంగా ఉండి ఉండేదా అని భావించడమొక్కటే మనకు మిగిలింది.

అయితే పెదకోమటి వేమారెడ్డి రాసిన ‘భావదీపిక’ ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభందాకా అచ్చులోకి రాలేదు. దాన్ని మొదటిసారిగా అచ్చువేసినదెవరో మనకు తెలియడం లేదుగాని, భీమవరానికి చెందిన తెలుగు పండితులు, కవి దిగుమర్తి సీతారామస్వామిగారు 1948 లో ఆ గ్రంథాన్ని సంస్కృతమూలంతో, దానికి తన తెలుగు అనువాదంతో వెలువరించారు. దానికి ఆయన ఒక అపురూపమైన, విపుల పరిచయ వ్యాసం కూడా రాసారు. ఆ పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ముద్రించింది. ఈరోజుల్లో ఇటువంటి పరిశోధక కృషికీ, ఇటువంటి పుస్తకాల్ని వెలుగులోకి తేవడానికీ పేరుపడ్డ మోదుగుల రవికృష్ణ చొరవ వల్ల కొండవీడు హెరిటేజ్ సొసైటీ వారు దీన్ని 2022 లో పునర్ముద్రించారు.

అయితే విశేషమేటంటే, 1961 ప్రాంతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పి.శ్రీరామమూర్తి భావదీపికకి ఒక క్రిటికల్ ఎడిషన్ అవసరముందని ప్రసిద్ధ ప్రాకృత పండితుడు డా.ఆదినాథ నేమినాథ ఉపాధ్యే గారికి చెప్పగా, ఆయన 1970 లో భావదీపికకి ఒక సమగ్ర సంశోధిత ప్రచురణని వెలువరించారు. కాని అప్పటికే తెలుగులో భావదీపిక పైన సమగ్ర పరిచయ వ్యాసంతో పాటు తెలుగు అనువాదం కూడా వెలువడి ఉండటం ఆసక్తి కలిగించే విషయం.

ఈ పుస్తకంలో వేమారెడ్డి సంస్కృత వ్యాఖ్య భావదీపికతో పాటు, దానిమీద దిగుమర్తి సీతారామస్వామి గారు రాసిన వ్యాఖ్యా, అలానే వేమారెడ్డి ఎంచిన ప్రాకృత గాథలకి స్వామిగారు చేసిన తెలుగు అనువాదం కూడా ఉన్నాయి. ఈ తెలుగు విభాగానికి రవికృష్ణ ‘కుందమంజరి’ (మల్లెపూల గుత్తి) అని పేరుపెట్టాడు. ప్రాకృత గాథలకి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారి పద్యానువాదం శ్రీ శాలివాహన గాథాసప్తశతి సారము (1931) వెనువెంటనే తెలుగులో వచ్చిన మరొక పద్యానువాదంగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు.

అయితే ఈ పుస్తకంలో నన్ను విభ్రాంతుణ్ణి చేసింది దిగుమర్తి సీతారామస్వామిగారు రాసిన ముందుమాట. పాతిక పేజీల పైగా ఉన్న ఆ ముందుమాట నన్ను వివశుణ్ణి చేసింది, సిగ్గుపడేలా చేసింది, గర్వపడేలా  చేసింది, చివరకి ఒకటి రెండు చోట్ల కన్నీళ్ళు కూడా తెప్పించింది.

ఎటువంటి పాండిత్యం! ఎటువంటి రసజ్ఞత! కీర్తిప్రతిష్ఠలకోసం పాకులాడకుండా తమ వంతు సాహిత్యకృషిని తాము చేసుకుంటూ వెళ్ళిపోయిన మహనీయులైన ఎందరో కవిపండితుల్ని ఆ వ్యాసం నాకు గుర్తుకు తెచ్చింది. నిజమైన సాహిత్య పరిశీలకుడు చేసే సాహిత్య వ్యాసంగం ఎలా ఉండాలో నాకు ఆ ముందుమాటలో ప్రతి ఒక్క వాక్యం బోధపరుస్తూ ఉంది.

మరీ ముఖ్యంగా, ఒక వాక్యం చదవగానే నాకు కలిగిన భావావేశాన్ని నేను మాటల్లో పెట్టలేను. దాని గురించి మీకు చెప్పాలంటే కొంత నేపథ్యం వివరించాలి.

గాథాసప్త శతికి శ్రీనాథుడు చేసిన తెలుగు పద్యాల్లో మూడు మాత్రమే మనకి లభ్యమవుతున్నాయని చెప్పాను కదా. వాటిల్లో ఇన్నాళ్ళూ రెండు పద్యాలకి మాత్రమే మూల గాథలు దొరికాయి. మూడవ పద్యానికి మూలమేమిటో ప్రస్తుతం అందుబాటులో ఉన్న గాథాసప్త శతి ప్రతుల్ని బట్టి తెలియడం లేదు. అయితే, సీతారామస్వామిగారు భావదీపిక చదవడం మొదలుపెట్టినప్పుడు, దానికి మూలం పెదకోమటి వేమారెడ్డి ఎంపిక చేసిన గాథల్లో కనిపించింది.

ముందు శ్రీనాథుని పద్యం చూద్దాం:

దానికి మూలమని చెప్పదగ్గ గాథని సంస్కృత ఛాయలో చూద్దాం.

(కందిపోయిన ప్రియురాలి పెదవి చూసి కోపం రానిదెవరికి? తేనెటీగ దాగిన తామరపువ్వుని వద్దన్నా ముద్దుపెట్టుకున్నావు, ఆ తేనెటీగ నీ పెదవిని కుట్టిపోయిందా! ఇప్పుడు నీ భర్త కోపగించుకుంటే సహించు.)

ఈ గాథలోని ధ్వనిని నేనిక్కడ వివరిస్తే దాని అందం పలచబడిపోతుంది. కాని గమనించవలసిందేమంటే, ఈ గాథ వేమారెడ్డి ఎంపికచేసిన పుస్తకంలో మాత్రమే కనిపించడం. అందుకని సీతారామస్వామి గారు తన ముందుమాటలో ఇలా రాస్తున్నారు:

వేలాది పద్యాల్తో కూడుకున్న ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో ఒక పద్యానికి మూలం తెలిస్తే ఎంత? తెలియకపోతే ఎంత? కాని నిజమైన భావుకుడు అలా అనుకోడు. అతడికి దాని మూలం కంటపడిన రోజే అతడి జీవితంలోకెల్లా అత్యంత సంతోష ప్రదమైన రోజు. అది కదా ఇక్కడ దిగుమర్తి వారి వాక్యాలు నాకు తెలియచెప్తున్నది!

భమిడిపాటి జగన్నాథరావుగారు మాకు ఆప్తులు. ఆత్మీయులు. ఆయన సీతారామస్వామిగారి శిష్యులు. ఆయన గురించి ప్రస్తావిస్తూ ఉండటం నాకు గుర్తుంది కానీ ఈ ఒక్క వాక్యం నాకు ఆ మహనీయ భావుకుడి గురించి ఎవరూ పరిచయం చేయలేనంత సుస్పష్టంగా పరిచయం చేసింది.

ఇంకా ఆ ముందుమాటలో చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి. సీతారామస్వామిగారు గాథాసప్త శతి గురించి రాస్తూ ప్రాచీన చీనా సాహిత్యంలోని ‘షీ-జింగ్’ ని గుర్తుచేసుకున్నారు. కన్ ఫ్యూసియస్ సంకలనం చేసిన షీ-జింగ్ మొత్తం నేను చదివాను. దానిలోంచి కొన్ని కవితలు తెలుగుచేసాను కూడా. కాబట్టి దిగుమర్తి వారు ఏం చెప్తున్నారో నేను గ్రహించగలిగాను. కానీ 1948 లోనే ఒక తెలుగు పండితుడు ఒక ప్రాకృత కావ్యం గురించి రాస్తూ ఒక ప్రాచీన చీనా కవిత్వ సంకలనాన్ని తలుచుకోవడంలోని మహత్వం ఎంత గొప్పదో ఎలా చెప్పగలను? అంతేకాదు, ఆయన సప్తశతి గురించి రాస్తూ పారశీక కవిత్వాన్ని తలుచుకున్నాడు. కువలయమాలని తలుచుకున్నాడు. ఇటువంటి రసజ్ఞులు కదా కవిత్వాన్ని బతికించేది!  తెల్లవారిలేస్తే మనం తలుచుకోవలసిందీ, పోయి దర్శించుకోవలసిందీ ఇటువంటి భావుకుల్ని కదా!

ఇక పదిహేనో శతాబ్ది ప్రారంభంలో (1402-1420) పెదకోమటి వేమారెడ్డీ, శ్రీనాథుడూ గాథాసప్తశతి గురించి ఇంతగా మోహపడటం వల్ల తెలుగు కవిత్వ రూపురేఖలు ఎలా మారిపోయేయో, అదంతా మరొక పెద్ద గ్రంథం. మరొకసారి మాట్లాడుకుందాం.

ఇప్పటికైతే, తెలుగు సాహిత్య చరిత్రలో ఒక కీలక దశకు చెందిన ఇటువంటి ఒక రసజ్ఞ గ్రంథం ఇన్నాళ్ళకు మనందరికీ అందుబాటులోకి రావడానికి కారణమైన రవికృష్ణను మనసారా అభినందిస్తున్నాను.


సప్తశతీ సారము, వెల రు. 250/-, సాహితీ ప్రచురణలు, 33-22-2, చంద్రం బిల్డింగ్, సి.ఆర్.రోడ్, చుట్టుగుంట, విజయవాడ-4, ఫోన్: 0866-2436642/43

28-9-2026

4 Replies to “రెల్లు పూసే కాలం”

  1. ఆ పద్యం నిజంగానే అత్యద్భుతంగా ఉంది. What a lovely way to start a day.

    మీ వ్యాసం ఆసాంతం కళ్ళు పరుగులెత్తాయి… నా పుస్తకం కోసం ఆర్డర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సర్. ఎట్లాగండీ మీ వేగాన్ని అందుకునేది!

    1. మీలాంటి ఒక్క సహృదయులు చాలు. ఆ పూర్వకవులందరికీ మళ్ళా ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకొస్తుంది!

  2. ఈ వ్యాసం గాథాసప్తశతి, పెదకోమటి వేమారెడ్డి, శ్రీనాథుడు, దిగుమర్తి సీతారామస్వామి వంటి సాహిత్య మహనీయుల కృషిని రసజ్ఞతతో పరిచయం చేస్తుంది.
    రెల్లు పూసే కాలాన్ని గాథాసప్తశతితో అనుసంధానించడం వ్యాసానికి కవితాత్మకమైన ఆరంభాన్ని ఇచ్చింది.
    పెదకోమటి వేమారెడ్డి సాహిత్యాభిమానం, పాండిత్యం, రాజనీతి జీవితాన్ని రచయిత సమగ్రంగా వివరించారు.
    తెలుగు సాహిత్య వికాసంలో రాజులు, కవులు కలిసి పోషించిన పాత్రను చారిత్రక దృష్టితో ఆవిష్కరించారు.
    శ్రీనాథుని గాథాసప్తశతి అనువాదానికి మూలగాథను గుర్తించిన సందర్భం సాహిత్య పరిశోధన విలువను చక్కగా తెలియజేస్తుంది.
    దిగుమర్తి సీతారామస్వామి గారి ముందుమాటపై రచయిత వ్యక్తం చేసిన స్పందనలో నిజమైన సాహిత్య రసజ్ఞత ప్రతిఫలిస్తుంది.
    ప్రాచీన భారతీయ, చైనీస్, పారశీక సాహిత్యాలను పరస్పరం అనుసంధానించడం వ్యాసం యొక్క విశాల దృక్పథాన్ని చూపిస్తుంది.
    పాత గ్రంథాలను వెలికితీసి, పునర్ముద్రించి, కొత్త తరానికి అందించడం ఎంత ముఖ్యమో ఈ రచన స్పష్టం చేస్తుంది.
    సాహిత్యాన్ని కేవలం చదవడం కాకుండా దాని వెనుక ఉన్న చరిత్ర, పరిశోధన, రసానుభూతిని గ్రహించాలనే ప్రేరణ ఈ వ్యాసం కలిగిస్తుంది.
    మొత్తంగా ఇది గాథాసప్తశతి వైభవాన్ని మాత్రమే కాకుండా, సాహిత్యాన్ని ప్రేమించి పరిరక్షించిన మహనీయుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే హృద్యమైన సాహిత్య వ్యాసం.

    1. మొత్తం వ్యాస సారాంశాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులభంగా సమ్మరైజ్ చేశారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading