
రాళ్ళల్లో చెక్కిన కావ్యాలు
4
అదృశ్య క్షీరాలు
మర్నాడుపొద్దున్నే లేచినప్పటినుంచీ నా కుతుహలమంతా తోడాల్నీ, వాళ్ల గ్రామాల్నీ ఎప్పుడెప్పుడు చూస్తానన్నదే. మేం తయారయ్యేటప్పటికే కొంత ఆలస్యమైంది. నేరుగా బొటానికల్ గార్డెన్స్ కి చేరుకున్నాం. ఊటి వెళ్లిన ప్రతిఒక్క సందర్శకుడూ తప్పనిసరిగా చూసే స్థలం. ఇప్పటికి ఎన్నో ఏళ్లుగా ఎన్నో సినిమాల్లో మనం చూస్తూ వస్తున్న స్థలం. అక్కడి చెట్లూ, మొక్కలూ, పూలు నన్నేమీ అధికంగా ఆకర్షించలేదు. నేను కనబడ్డ మొదటిమనిషినే ‘ఇక్కడ తోడా గ్రామం ఎక్కడ’ అని అడిగాను. మొత్తానికి నాకు దొరికిన సూచనల్ని బట్టి కొంత అటూఇటూ దారితప్పి ఏమైతేనేం మజకల్మంద్ అనే తోడాపల్లెలో అడుగుపెట్టాను. తోడాలగురించి నేను మొదటిసారి ‘అవర్ ప్రిమిటివ్ కాంటెంపరరీస్’ (1934) అనే పుస్తకంలో చదివాను. జార్జ్ పీటర్ మర్డోక్ అనే మానవశాస్త్రవేత్త, ప్రపంచంలో ఇంకా మన మధ్య నివసిస్తున్న, 18 ఆదిమజాతుల గురించి ఆ పుస్తకంలో రాస్తూ అందులో తోడాలగురించి కూడా రాశాడు. ఆయన ఆ పుస్తకం రాసేటప్పటికి తోడాలు 800 మంది మాత్రమే ఉన్నారు. కాని గిరిజనసాంస్కృతికకేంద్రంవాళ్లు ప్రచురించిన జక్కా పార్థసారథి రచన ‘ద తోడా ఆఫ్ ద నీలగిరి డిస్ట్రిక్ట్’ (2008) అనే పుస్తకంలో తోడాలు 1648 మంది ఉన్నారు అని ఉంది. అంటే గత ఏడు దశాబ్దాల కాలంలో తోడాజనాభా కేవలం రెట్టింపు మాత్రమే కాగలిగింది. ఈ అపూర్వమానవ సముదాయం అంతరించిపోవటం లేదు అనేది సంతోషించదగ్గ విషయమే అయినా, వీరు అతికష్టంమీద కాలానికి ఎదురీదుతున్నారు అని కూడా ఆ జనసంఖ్య మనకు వివరిస్తోంది.
తోడాలు దక్షిణభారతదేశంలోనే కాదు, మొత్తం దక్షిణాసియాలోనే ఒక ప్రత్యేకమైన జాతి. వాళ్లు అక్కడికి ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు, వాళ్ల జాతి మూలమేదన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వాళ్లని శిథియన్లుగా, డ్రూయిడ్లుగా, రోమన్లుగా, సుమేరియన్లుగా, యూదులుగా పోల్చడానికి చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమైపోయాయి. ఏ ప్రాచీనకాలంలోనో ఏ సముద్రాలనో దాటుకుని వాళ్లా పర్వతాలమీద చేరి స్థిరపడ్డారని తెలుస్తోందికానీ, వారు ఏ ఖండానికి చెందినవారో, ఏ సముద్రాల్ని దాటి అక్కడికి ప్రయాణించివచ్చారో ఎవరికీ అంతుపట్టలేదు.
తోడాల గురించి మొట్టమొదటి ప్రస్తావన హొయసల చక్రవర్తి విష్ణువర్ధనుడు వేయించిన ఒక శాసనంలో కనిపిస్తోంది. ఆ తరువాత 1602లో ఒక పోర్చుగీసు యాత్రీకుడు వాళ్ల గురించి మాట్లాడాడు. అప్పటినుంచి 1812దాకా మళ్లా వాళ్ల గురించి ఎక్కడా ఎవరూ ప్రస్తావించలేదు. కాని 1812నుంచి మాత్రం వాళ్లమీద విస్తారమైన పరిశోధనలపరంపర కొనసాగిందీ, కొనసాగుతూఉంది. ఆ పరిశోధనలన్నిటిలోనూ చెప్పుకోదగ్గదిమాత్రం కేంబ్రిడ్జికి చెందిన మానవశాస్త్రవేత్త డబ్ల్యు. హెచ్.ఆర్. రివర్స్ (1846-1922) వెలువరించిన పరిశోధన ‘ది తోడాస్’ (1906).
తోడాలుమాట్లాడే భాష ద్రావిడభాష. ఆ భాషలో వాళ్లు అద్భుతమైన పాటలు కట్టుకున్నారు. ఎం.బి. ఎమెనేవు అనే భాషాశాస్త్రవేత్త వాళ్ల పాటల్ని సేకరించి ‘తోడాసాంగ్స్’ (1971) అనే పేరిట పుస్తకరూపంగా వెలువరించి గొప్ప సేవ చేశాడు. తోడాలగురించీ, వారి పశుపాలక సంస్కృతి గురించీ, వారిలో కనవచ్చే బహుభర్తృత్వం గురించీ ఇప్పటికీ ఎన్నో కథలు, ఎంతో సాహిత్యం. కాని ఇప్పుడు నా ఎదుట ఉన్న మజకల్మంద్ గ్రామం నేను చూసిన ఎన్నో గిరిజనగ్రామాల్లాగా సగం గతంలో, సగం భవిష్యత్తులో నిలబడి ఉంది. అక్కడ ఒకవైపు వారి దేవాలయం, పశువులకొట్టం, మరొకవైపు ప్రభుత్వం కట్టించి ఇచ్చిన సిమ్మెంటు ఇళ్లు.

మేం నేరుగా అడుగుపెట్టిన మొదటి ఇంట్లోనే ఒక తోడామహిళను కలుసుకున్నాం. ఆమె పేరు నీలాసిన్. ఆమె బొటానికల్ గార్డెన్స్ లో ఉద్యోగిగా పనిచేస్తూంది. ఆమె కొడుకు నటేష్ పదవతరగతి చదువుకున్నాడు. కూతురు జీతా సిన్ ఇంటర్ చదువుకుంది. పెళ్ళి కూడా అయింది. ఆమె భర్త బి.ఎస్.ఎన్.ఎల్ లో పనిచేస్తున్నాడు.
మజకల్ మంద్ లో మొత్తం 22 కుటుంబాలున్నాయనీ, 198 మంది జనాభా అనీ, అంతా దాదాపుగా రకరకాల వృత్తుల్లో కుదురుకున్నారనీ ఆమె చెప్పింది. తాను ఎంబ్రాయిడరీలో శిక్షణపొందానని చెప్పింది. తాను కుట్టిన రకరకాల వస్త్రాలు చూపించింది. ముఖ్యంగా ప్రపంచప్రసిద్ధి చెందిన తోడా శాలువలు చూపించింది. వాటిని బొటానికల్ గార్డెన్స్ లో తోడా హట్ దగ్గర అమ్ముతారని కూడా చెప్పింది.
నేను పుస్తకాల్లో తోడాలగురించి చదివినవాటి గురించి ఆమెని అడిగాను. నా ప్రశ్నల్ని విజ్జి ఆమెకు తమిళంలోకి అనువదించి అడుగుతుంటే ఆమె వచ్చీరాని తమిళంలో వాటికి జవాబులు చెప్పడానికి ప్రయత్నించింది. ఆమె చెప్పినదాని ప్రకారం తోడావ్యవస్థ చాలామారిపోయింది. కాని శౌచాశౌచాలకు సంబంధించిన ఆ పాతకాలపు ఆచారాలు మాత్రం అలానే ఉన్నాయి.
బర్రెల్ని పూజించడం, వాటి పాలు పితకడం ఇంకా మగపూజారులే చేస్తున్నారనీ, తమకు ఇప్పటికీ అక్కడ అడుగుపెట్టే అర్హత లేదనీ చెప్పింది. ఒకరిద్దరు యువకులు మామూలు నాగరిక యువకుల్లానే మీసాలూ, గడ్డాలూ కత్తిరించుకుని కనబడ్డారుగానీ, నడివయసు పురుషులూ, స్త్రీలూ పాతకాలపు తోడాల్లానే కనిపించారు. మేం ఆ తోడా గ్రామంలో ఆ దేవాలయం దగ్గరకు వెళ్లాం.
అది పాతకాలపు తోడాగుడిసె. అర్ధచంద్రాకారపు కప్పు కింద రాతిగోడల నిర్మాణం. దానిముందు చెక్కతలుపు మూసివుంది. ఆ లోపల తోడాదేవతలున్నారు. వారి పురాణాల ప్రకారం నీలగిరులంతటా తోడాపూర్వీకుల ఆత్మలు సంచరిస్తుంటాయి. వాళ్ళు అదృశ్యరూపాల్లో, అదృశ్యమహిషాలను మేపుకుంటూ, అదృశ్యక్షీరాలు పితుక్కుంటూ అక్కడే జీవిస్తున్నారు. తోడాల దేవుళ్ళందరిలోనూ రాణి అని చెప్పదగ్గ తైకిరీజి వాళ్ళ దృశ్యాదృశ్యలోకాల్ని శాసిస్తూ వాళ్ళని రక్షిస్తూ అక్కడే నిలిచిఉంది.
కాని తోడాల్నీ, బర్రెల్నీ సృష్టించింది ఆమె కాదు. ఆమె తండ్రి పిథి. పిథి కుమారుడు, తైకిరీజి సోదరుడు ఓన్. పితృదేవతలలోకాన్ని పరిపాలించే బాధ్యత అతనిది. అతడే తోడాల్నీ, బర్రెల్నీ సృష్టించాడు. పితృదేవతల పవిత్రగోప్రపంచం నుంచి అతడు 1600 బర్రెల్ని భూమ్మీదకు తోలిపెట్టాడు. ఆ గేదెలట్లా పాతాళలోకంలోంచి భూమ్మీద అడుగుపెడుతున్నప్పుడు, అందులో చివరి బర్రె తోకపట్టుకుని మొదటిమానవుడు కూడా ఈ భూమ్మీద అడుగుపెట్టేసాడు. అతడే మొదటి తోడా.
అతడు తన పక్కటెముకల్లోంచి మొదటి తోడా మహిళను సృష్టించాడు. వారం రోజులు గడవకుండానే వందమంది తోడాలు తయారయ్యారని వారి సృష్టికథ చెప్తోంది. తోడా ఇప్పటికీ తన కోసం, తన వాళ్లకోసం కన్నా తన పశువులకోసం, తన పితృదేవతలకోసం ఎక్కువ జీవిస్తున్నాడని చెప్పాలి. ఆ విధంగా అతడు వేదకాలపు మానవుడికి చాలా దగ్గర. అతడి పాటల్లో అత్యధికం పితృదేవతలసంకీర్తనలే. తన తండ్రిని తలుచుకుంటూ ఒక తోడా పాడిన పాట (ద తోడా సాంగ్స్, పే. 129-130) చూడండి:
నాన్నా, నువ్వు చాలా గొప్పమనిషివి
నీకు రెండిళ్ళుండేవి,
నీ ఇళ్లెప్పుడూ బంధుమిత్రులతో కలకల్లాడేవి
నువ్వు పుట్టినప్పుడు
నీలాంటి వాడింతకుముందు పుట్టలేదని చెప్పుకున్నారు
నీకు అన్నదమ్ముల్లేరు, నువ్వొక్కడివే,
అయినా, మూడుగోత్రాలబంధుజనం బాధ్యత
భుజాలకెత్తుకున్నావు
నువ్వేదన్నాపనిచేస్తే ఒక విల్లు ఎక్కుపెట్టినట్టుండేది
నువ్వు మాట్లాడితే కత్తిదూస్తున్నట్టుండేది. ..
నువ్వొక మనిషిని హామీగా నిలబెట్టావు
మరొకరికి నువ్వు హామీగా నిలబడ్డావు. ..
ముళ్ళపొదలు మొలుస్తున్న గోశాలల్ని బాగుచేసావు
కూలిపోతున్న కొట్టాల్ని చేతుల్తో నిలబెట్టావు
ఎవరు మరణించినా వాళ్లందరి
అంత్యక్రియలకూ హాజరయ్యావు
నువ్వు కట్టెలు కొడుతుంటే అందంగా ఉండేది
బర్రెల్ని పడుతుంటే చూడముచ్చటగా ఉండేది
నువ్వు కర్మకలాపం నిర్వహించడం అందంగా ఉండేది
నువ్వు పనిచేయడం కన్నులపండువగా ఉండేది
నీలగిరుల్లో మూడు దిక్కులకీ ప్రభువులాగా ఉండేవాడివి
మూడు దిక్కులకీ నువ్వొక్కడివే పన్నుకట్టేవాడివి. ..
నువ్వొకవైపు ఒక గోష్ఠికి చెందినవాడిగా ఉండేవాడివి
మరొకవైపు మరోగోష్ఠికీ నువ్వే నాయకుడివి..
పాతనిబంధనలో సామ్ లాగా, అధర్వవేదమంత్రంలాగా వినిపిస్తున్న ఈ పాట నాకు నా తండ్రిని గుర్తుచేయడంలో ఆశ్చర్యమేముంది? ఇటువంటి పాటలు ఎన్నో వినాలనీ, వాటి అర్థం వాళ్లలో చెప్పించుకోవాలనీ నాకెంతగానో అనిపించింది. నీలా సిన్ ని అడిగితే తనకు పాటలు రావనీ, వృద్ధురాలైన తన తల్లిని అడగమనీ చెప్పింది.
ఆ ముసలామెను అడగడమే తడవు, ఆమె ముఖం వెలిగిపోయింది. నేను ఎన్నో గిరిజనగ్రామాల్లో ఎన్నోసార్లు చూసినట్టే, ఇక్కడా పాటలింకా ముసలివాళ్లనే అంటిపెట్టుకున్నాయి. అక్కడ చూసినట్టే ఇక్కడ కూడా పాటపాడమనగానే ఆ ముసిలామె ముఖంలో పడుచుదనం ప్రత్యక్షమైంది. ఆమె ఒక్కసారిగా రాగమందుకుంది. నోరారా ఎలుగెత్తిపాడింది.
ఆ పాట ఏమిటో, ఆ మాటలేమిటో నాకెంతమాత్రం తెలియకపోయినా, ఆ భావమేదో నాకు చాలాసన్నిహితంగా తెలిసిందేననీ, నా చిన్నప్పుడు మా ఊళ్లో వసంతకాలపు రాత్రుల్లో గిరిజనస్త్రీలు పాడుకున్నపాటలాంటిదేననీ అనిపించింది. బహుశా, అదేదైనాఉషోదయగీతంకూడా అయిఉండవచ్చు. బహుశా, ఆ పాట ఈ పాటే (ద తోడా సాంగ్స్, పే. 587-588) అయి ఉండవచ్చు:
పవిత్ర స్థలాలకోసం వెలుగు పరుచుకుంటున్నది
దేవతలకుదారినిస్తూ చీకటి తరలిపోతున్నది.
దొడ్డబెట్టమీద వెలుగు పరుచుకుంటున్నది
కొండదారులమీంచిచీకటి తరలిపోతున్నది.
పులికొండమీద వెలుగుపరుచుకుంటున్నది
తోడాపల్లెలనుంచి చీకటి తరలిపోతున్నది
మంచుకొండలమీద వెలుగుపరుచుకుంటున్నది
తోడామందలనుంచి చీకటి తరలిపోతున్నది
పవిత్రస్థలాలమీద వెలుగుపరుచుకుంటున్నది
దేవతలకుదారినిస్తూ చీకటి తరలిపోతున్నది..
ఊయెలలో బిడ్డమేల్కొంటూ ఏడుస్తున్నది
కొట్టంలోలేగ కళ్ళుతెరుస్తూ అంబా అంటున్నది
ఏడుగోత్రాలతోడాలు కళ్ళునులుముకుంటున్నారు
తోడాలబిడ్డలు తల్లుల ఒడిలో మేల్కొంటున్నారు
పూజారి పాలుపితకడానికి కొట్టంలో అడుగిడుతున్నాడు
పాలకడవలో కవ్వం తిప్పుతున్నాడు.
మూసివున్న కొట్టం తలుపు తెరుస్తున్నాడు
ఆరిపోయిన దివ్వెను మళ్లీవెలిగిస్తున్నాడు
తోడాలందరూ కొట్టాలు తెరుస్తున్నారు
తోడాలందరూ దీపాలు వెలిగిస్తున్నారు..
మేం బొటానికల్ గార్డెన్స్ లో తోడా హట్ దగ్గర కొద్ది సేపు గడిపాం. అక్కడొక తోడాశాలువ కొనుక్కున్నాను. అక్కణ్ణుంచి మళ్లీపట్టణంలోకి వచ్చాం. ఊటి పట్టణమంతా అసంఖ్యాక జననివాసాలతోనూ, సందర్శకులతోనూ ఇరుగ్గా, మురిగ్గా ఉంది. ఇంక ఊటిలో చూడవలసిందేమీ లేదనిపించింది. తిరిగి బెంగుళూరుకి. దారిపొడుగునా ప్రయాణిస్తున్నంతసేపూ నేనింకా ఆ తోడాగ్రామంలోనే ఉన్నాననిపిస్తూ వుంది. నాకెందుకో తలతిరుగుతూవుంది. నేనింకా తోడా పితృదేవతల మధ్యన, వారి అదృశ్యపశుకోష్టాల మధ్యనే సంచరిస్తున్నానేమో ఏదో వెగటుగాకూడా అనిపిస్తూవుంది. తిరిగి ఇంటికి వచ్చేసాక చాలా రోజుల తరువాత ఆ వెగటునుంచి తేరుకుని ఇలా ఒక కవిత రాశాను:
నేనొక్కప్పుడు నీలగిరుల్లో ఒక రోజు గడిపాను
ఆకుపచ్చని దిగంతంమీద పొగమంచు పూత
చుట్టూ యూకలిప్టస్ ఔషధసుగంధం, బెల్లం
చుట్టూ చీమల్లాగా ఊటీనిండా మనుషులు
అక్కడ, గిరిసానువులమీద పురాతనమానవ
సముదాయం, తోడాలు, ప్రపంచ
సాగర కెరటాలతాకిడికి కొట్టుకుపోతున్న
కొయ్యదుంగలాగా ఒక జనావాసం
తక్కినమనుషులంతా సౌందర్యాన్వేషణలో
చేరారక్కడికి, ఎక్కడ చూడు: ఏదో తింటో,
తాగుతో, బిగ్గరగా నవ్వుతో, మాటాడుతో-
దిగంతసంగీతాన్ని మర్చిపోయారంతా
కాని, తోడాలున్నారింకా, చీకటిచూరు కింద,
అయితేనేం, కాపాడుకుంటున్నారింకా, తమ
బతుకుల్ని, పిల్లల్ని, దేవతల్ని; అక్కడొక్కచోటే
నింగి ఇంకా నేలకు చేరువగా ఉంది
ఒక తోడా స్త్రీలాగా అల్లుతున్నానొక
రంగురంగుల వస్త్రాన్ని, జీవితసౌందర్య
సారాంశమంతా ఇమిడ్చి, ఒకనాటికి
మీకు కానుకచేయడానికి-
యాత్రాకాలం 2009, రచన 2011
Poems Carved in Stone
4
Invisible Streams of Milk
From the moment I woke the next morning, my thoughts were seized by a single preoccupation: when and how soon would I behold the Todas and enter their hamlets? By the time we were ready, the morning had already slipped away. We went directly to the Botanical Gardens—a standard destination that every traveler to Ooty unfailingly visits, a locale immortalized over decades in popular cinema. Its manicured trees, exotic plants, and flowerbeds held little allure for me.
To the very first person I met, I posed the question: “Where is the Toda village here?” Following the scattered directions given to me, missing the path and recovering it after some wandering, I finally crossed the threshold into Muthorai Mand (Majakalmand), a traditional Toda settlement.
I had first read of the Todas in George Peter Murdock’s anthropological study Our Primitive Contemporaries (1934). Chronicling eighteen indigenous peoples across the globe who still dwelt alongside the modern world, Murdock devoted a chapter to the Todas. At the time he composed that work, their entire population numbered merely eight hundred. Yet in The Toda of the Nilgiri District (2008), a monograph published by the Tribal Cultural Centre and authored by Dr. Jakka Parthasarathy, their recorded count stood at 1,648. In the span of seven decades, the community had barely managed to double its numbers. While it is a relief that this peerless enclave of humankind is not facing outright extinction, that figure lays bare the precarious, embattled margin by which they stem the tide of time.
The Todas are a singular community not merely in South India, but within the whole of South Asia. When they arrived on these heights, how they came, and the primordial origins of their stock remain an enigma to this day. Every attempt to link them with Scythians, Druids, Romans, Sumerians, or the Lost Tribes of Israel has proved futile. That they crossed ancient seas in some forgotten epoch to reach and settle upon these mountain crests is evident; yet from which continent they embarked and what waters they traversed remains entirely unresolved.
The earliest historical epigraph mentioning the Todas occurs in an inscription commissioned by the Hoysala monarch Vishnuvardhana. Later, in 1602, a Portuguese traveler recorded impressions of them. From that date until 1812, no mention of their existence appeared in written records. From 1812 onward, however, an uninterrupted stream of ethnographic inquiry began, continuing to this day. Foremost among these studies stands The Todas (1906), the monumental research published by the Cambridge anthropologist W. H. R. Rivers (1846–1922).
The language spoken by the Todas is an archaic Dravidian tongue. In that idiom, they have fashioned songs of extraordinary lyrical power. The linguist M. B. Emeneau rendered a magnificent service to world literature by gathering their compositions in his landmark volume Toda Songs (1971). Enduring legends and extensive scholarship surround their pastoral universe and their traditional fraternal polyandry.
Yet the settlement of Muthorai Mand before me stood, like so many tribal hamlets I have known, with one foot anchored in the past and the other suspended in the future. On one side stood their barrel-vaulted shrine and sacred buffalo pen; on the other, standardized concrete dwellings raised by the state.
Stepping into the very first home, we met a Toda woman named Neelasin. She was employed at the Botanical Gardens. Her son, Natesh, had completed the tenth standard; her daughter, Geetasin, had studied up to intermediate and was already married. Her husband worked in BSNL. Neelasin told us that the mand comprised twenty-two households with a population of 198, almost all of whom had settled into varied contemporary livelihoods.
She mentioned that she was trained in their traditional embroidery and brought out diverse textiles she had worked—above all, the famed Toda poothkuli shawls, explaining that they were sold near the Toda Hut in the Botanical Gardens.
I questioned her about the customs I had encountered in books. As Vijji translated my inquiries into Tamil, Neelasin endeavored to answer in halting Tamil. By her account, the structural fabric of Toda life had altered profoundly. Yet the ancestral ritual taboos governing purity and pollution endured intact. The veneration of the sacred buffaloes and the ritual milking of the herd remained strictly reserved for male priests (poojaris); Toda women, she affirmed, were still forbidden from crossing into the dairy-temple precincts.
A few young men walked about with trimmed beards and moustaches, indistinguishable from modern youth, but middle-aged men and women retained the classic Toda bearing and attire. We walked up to the shrine in the village—an authentic Toda hut constructed of stone walls beneath a sweeping, barrel-vaulted roof. Its small wooden doorway remained shuttered. Within rested the Toda divinities.
According to their mythic lore, the spirits of Toda ancestors roam invisibly across the whole of the Nilgiris. In disembodied forms, they dwell on these heights, herding invisible buffaloes and drawing invisible streams of milk. Foremost among their pantheon is the goddess Teikirzi, revered as the queen of divinities, ruling their seen and unseen realms and keeping vigil over her people.
Yet it was not Teikirzi who created the Todas and their buffalo herds. That origin belongs to her father, Pithi, and her brother Ön, the sovereign lord of the realm of the ancestors (Amnor). It was Ön who fashioned the buffaloes and humanity. From the sacred bovine realm of the spirit world, he drove 1,600 buffaloes forth onto this earth. As the herd emerged from the netherworld, the first man caught hold of the tail of the very last buffalo and stepped into the light of the mortal realm. He was the first Toda. From his own rib, he fashioned the first Toda woman. Within a single week, their genesis narrative recounts, a community of a hundred Todas had populated the earth.
To this day, one might say, a Toda lives less for himself or his kin than for his sacred herds and the spirits of his ancestors. In this regard, he stands remarkably close to the humans of the Vedic dawn. The overwhelming majority of their compositions are litanies to their ancestors.
Consider this song, sung by a Toda remembering his father, as recorded in Toda Songs (Song 33, pp. 129–130):
Father, you were a great man!
You had two houses,
and your homes always bustled with kin and friends.
When you were born,
men said none like you had ever been born before.
You had no brothers, you stood all alone;
yet upon your own shoulders
you bore the burdens of three clans.
When you set your hand to a task, it was like a drawn bow;
when you spoke, it was like a sword unsheathed.
You stood as surety for another;
for you, another stood as surety.
You cleared the thorn thickets choking the buffalo pens;
with your own hands, you propped up the collapsing sheds.
Whenever death fell upon anyone,
you were present at their funeral rites.
When you cleaved firewood, it was beautiful to see;
when you caught the buffaloes, it was a joy to behold.
How noble was your conduct of sacred rites;
how wondrous to the eyes was the labor of your hands!
You were like a sovereign lord over the three quarters of the Nilgiris;
you alone paid the tribute to all three sides.
On one side, you sat as a member of the council;
on the other, you stood as leader of the assembly.
Sounding like a Psalm from the Old Testament or a sacred verse from the Atharva Veda, is it any wonder that this lament stirred the memory of my own father? I was seized by an overwhelming longing to hear many such songs and to receive their meanings from their own lips.
When I turned to Neelasin, she demurred, saying she did not know the songs, and directed me to her aged mother. The moment we approached the elder, her face lit up with a sudden inner radiance. Just as I had witnessed countless times in remote tribal settlements, the ancient songs here, too, clung faithfully to the very old.
As I had observed in other agency tracts, the simple request to sing summoned an instant flush of youth to the matriarch’s withered features. She caught the melody at once, lifting her voice from the depths of her being. Though the words and their exact syntax remained completely foreign to me, their emotional core felt deeply intimate—like the songs tribal women would sing on fragrant spring nights during my childhood in our native village.
Perhaps it was a dawn song. Perhaps it was this very hymn, preserved in Toda Songs (Song 186, pp. 587–588):
Light spreads for the sacred places;
darkness departs, yielding the path to the gods.
Light spreads over Doddabetta;
darkness departs from the mountain tracks.
Light spreads over the Tiger Mountain;
darkness departs from the Toda settlements.
Light spreads over the misty peaks;
darkness departs from the Toda herds.
Light spreads over the holy sanctuaries;
darkness departs, yielding the path to the gods.
In the cradle, the infant stirs and cries;
in the pen, the calf opens its eyes and calls to its mother.
The Todas of the seven clans rub sleep from their eyes;
the children of the Todas awaken in their mothers’ laps.
The priest steps into the pen to milk the herd;
in the earthen vessel, he turns the churning rod.
He unbars the closed door of the dairy;
he rekindles the flame that had died in the lamp.
All the Todas unbar the pens;
all the Todas kindle their lights.
We lingered a while near the Toda Hut in the Botanical Gardens, where I bought a traditional Toda shawl. From there, we made our way back into town. The streets of Ooty were crammed with tourists and choked with dense settlements—congested, noisy, and grimy. It felt as though Ooty had nothing more left to offer.
We turned back toward Bangalore. Yet throughout the journey, a strange sensation possessed me: I felt I was still lingering in that Toda settlement. A quiet vertigo seized my senses. An uneasy, surreal fullness weighed upon me, as though I were still wandering among the Toda ancestors and their invisible dairy pens.
Long after returning home, having finally recovered from that haunting enchantment, I set down these lines:
Once I spent a day upon the Nilgiris—
mist brushed across a green horizon,
scent of healing eucalyptus, jaggery,
and humans swarming Ooty like ants.
High on the slopes, an ancient fold:
the Todas, like a solitary log
adrift upon the surging world-ocean.
Others flocked there seeking pleasure,
eating, drinking, laughing, babbling—
deaf to the songs from the horizon.
Yet beneath dark thatch, the Todas stay,
guarding their young, their lives, their gods;
there alone, sky still touches earth.
Like a Toda woman, I weave this cloth,
gathering the distilled grace of life
to lay one day as an offering before you.
(Traveled: 2009 | Written: 2011)


“నింగి ఇంకా నేలకు చేరువగా ఉంది”
ఆదిమ గిరిజన జాతి అయిన తోడాలున్న ప్రదేశాన్ని, వారి చరిత్ర, ఆచారాల గురించి తెలుసుకోవడం బావుంది.
ధన్యవాదాలు సోమ శేఖర్!
Congratulations on the Sahitya Akademi Award, Sir!
I’m only a little over a decade late in sending my wishes!! 😊 Would love to read this translation.
And what a beautiful travelogue series this has been!
గోమఠేశ్వరుని మూర్తి గురించిన philosophical reflection, హళేబీడులోని అందమైన “రాళ్లల్లో చెక్కిన కావ్యాలు” గురించి ఎంత గొప్పగా వివరించారు!
My daughter visited these places last time and said she was spellbound by the sculptures and the beauty. I sent her the English translations of the Gomateswara and Halebidu posts so she could get more context and a better understanding of the places.
మైసూరు ప్యాలెస్ కాదు కానీ, Jagmohan Palace లోని రవివర్మ చిత్రాలు మాత్రం కట్టిపడేసి నిలబెట్టేస్తాయి! At least, this has been my experience. 😊
నీలగిరుల గురించి, తోడాల గురించి తెలుసుకోవడం కూడా చాలా బాగుంది.
తోడాల మీద మీ closing poem is so beautiful.
“కాని, తోడాలున్నారింకా, చీకటిచూరు కింద,
అయితేనేం, కాపాడుకుంటున్నారింకా, తమ
బతుకుల్ని, పిల్లల్ని, దేవతల్ని; అక్కడొక్కచోటే
నింగి ఇంకా నేలకు చేరువగా ఉంది”
A wonderful journey through art, history, literature, culture and people. Thank you for sharing this, Sir! 🙏
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ! ఇలా మీ పర్యావలోకన చదువుతుంటే నిజంగానే బాగా రాశానేమో అని అనుమానం కలుగుతోంది!