
దేశచరిత్రల గురించి గేయం రాస్తూ చివరలో మహాకవి ‘ఏ వెలుగులకీ ప్రస్థానం?’ అని ప్రశ్నించాడు. ఏ చరిత్ర అయినా ఒక తరం తన తర్వాతి తరానికి అందించే జ్ఞానంలో, విద్యాదానంలో పరిపూర్ణమవుతుంది. ఒక జాతి ఎటువంటి విద్యావిధానాన్ని నిర్మించగలిగింది అన్నదాన్నిబట్టే ఆ జాతి ఘనత నిలబడుతుంది. మనం కూడా చరిత్రనిర్మాణంలో భాగం పంచుకుంటున్నామంటే దానికి నిరూపణ మనం కూడా ఆ కాలంలో ఆ knowledge transfer లో చిన్నదో, పెద్దదో ఎంతో కొంత పాత్ర నిర్వహించి ఉండాలి.
ఇరవయ్యేళ్ళ కిందట నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు, నా జీవితానుభవాల్లో సమాజానికి పనికొచ్చేదేమైనా ఉందా అని చూసుకున్నప్పుడు విద్యకోసం, ముఖ్యంగా గిరిజన విద్య కోసం నేను పాల్గొన్న ప్రయత్నాలు నాకు విలువైనవి అనిపించాయి. వాటిని తక్కిన ప్రపంచం ముందు పెడుతూ ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు’ (2005) రాసాను. ఆ తర్వాత జీవితంలో నా పరిథి మరింత విస్తరించింది. నా అనుభవాలు కూడా మరింత పదునెక్కాయి. వాటిని కూడా మరొక పుస్తకంగా వెలువరించవలసి ఉంది.
ఈలోగా గత పుష్కరకాలంగా నేను అప్పుడూ అప్పుడూ మిత్రుల్తో పంచుకుంటూ వస్తున్న నా విద్యానుభవాల్ని ఒక సంపుటంగా వెలువరించాలనుకున్నాను. ముఖ్యంగా మా దేవమ్మ డా.నన్నపనేని మంగాదేవిగారికి ఆ పుస్తకం కానుక చెయ్యాలన్న ఉత్సాహం కూడా ఒక కారణం. నిన్న శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ వారి లలితకళా ఉత్సవంలో ఈ పుస్తకాన్ని మా అక్క ఆవిష్కరించి నా తరఫున ఆమెకు సమర్పించింది.

ఇది నా 51 వ పుస్తకం.
దీన్నిక్కడ ఇ-బుక్ గా మీతో పంచుకుంటున్నాను. 45 వ్యాసాలు. 216 పేజీలు. దీన్ని మీ మిత్రుల్తో, మీ సంస్థల్లో, మీ ఉద్యమాల్లో మీతో కలిసి పనిచేస్తున్న కార్యకర్తల్తో, ఉపాధ్యాయుల్తో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
11-12-2024


మీ నూతన పుస్తకానికి స్వాగతం నీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అవసరం. ప్రతి ఉపాధ్యాయుడికి ఈ పుస్తకం కరదీపికలాగా ఉపయోగపడుతుంది. 32 సంవత్సరాలు పాటు నేను జవహర్ నవోదయ విద్యాలయ రెసిడెన్షియన్లో పనిచేసాను. ఇందులోని కొన్ని వ్యాసాలు ఆ జ్ఞాపకాలను బాగా కదిలించాయి. మీకు మరోసారి అమూల్యమైన పుస్తకాన్ని అందించినందుకు ధన్యవాదాలు
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
మీ నుండి మరో మంచి పుస్తకం వెలువడటం సంతోషకరం.హృదయపూర్వక అభినందనలు.
ధన్యవాదాలు సార్!
కొన్ని కలలు..కొన్ని మెలకువలు చదివిన తర్వాత ఈ పుస్తకం మీద ఆసక్తి రెట్టింపయింది. మీరు నిరంతరం మాకు ఏదో విధంగా జ్ఞాన ప్రసారం చేస్తూనే వున్నారు. మిమ్మల్ని Knowledge Hub అనడం అతిశయోక్తి కాదు. విద్యారంగంలో అంతటా మీ ఆలోచనలు, ప్రయోగాలు ఆచరించే వ్యవస్థ ఏర్పడాలి.
ధన్యవాదాలు శ్రీనివాస్!
ధన్యవాదాలు sir. మీ ఈ అనుభవాల కోసమే ఎదురు చూస్తున్నాం.
ధన్యవాదాలు మేడం!
ఎప్పటికప్పుడు మీ సాహిత్యాన్ని ఈ బుక్ గా పంచడం మీ సాహిత్యాభిలాష ను తెలియచేస్తుంది అన్న. అభినందనలు💐💐💐
ధన్యవాదాలు సోదరీ!
మీ అనుభవాలు ఆలోచనాత్మకంగా, కొన్ని అందరూ ఆచరించేలా, ఆమోదయోగ్యంగా ఉన్నాయి.
మీ అనుభవాలు విద్యా రంగంలో పనిచేస్తున్న ఎంతోమందికి స్ఫూర్తినందిస్తాయి.
ఇంత మంచి పుస్తకాన్ని కానుకగా అందించినందుకు మీకు సదా ఋణపడి ఉంటాను.
ధన్యవాదాలు స్వాతీ!
Welcome to a great book…
ధన్యవాదాలు సార్!