పాట పాడే ఇప్పచెట్టు

కొంతకాలము కింద నేనొక
కొండదారిన కలుసుకొంటిని
పాట పాడెడి ఇప్ప చెట్టును,
చూసి పరవశమొందితిన్.

ఆకు రాలని పూత తరగని
ఇంద్రజాలము తరువిలాసము.
కట్టివైచెను చెట్టు తనకడ
ఆరు ఋతువులనొక్కెడన్.

కానలందున కోనలందున
కల్లలెరుగని పిల్లలందున
మారుమోగెడి రాగసౌరభ
మా మధూకపరాగమే!

బతుకు బరువై బాధ ఘనమై
దిక్కుతోచని చిక్కు దినముల
తలతు నేనా తీపి తావుల,
తలచి తేలిక నొందుదున్.

ఆకసమ్మున తారకలకై
చంద్రుడొక్కడె చాలినట్టుల
కలతతీరదె కవిగణమ్ముకు
గౌరునాయుడు విరియగా!

(పుట్టినరోజు శుభాకాంక్షలతో)

8-8-2024

20 Replies to “పాట పాడే ఇప్పచెట్టు”

  1. మధుక లాంగిఫోలియా అనే శాస్త్రీయ నామంతో ఉండే ఇప్ప చెట్టు గురించి ఆకు రాలని పూత తరగని ఇంద్రజాలం రుతు విలాసము….చెట్టు గురించి ఎంత మంచి అనందభరితమైన కవిత. వృక్ష శాస్త్ర అధ్యాపకుడిగా మొక్కల వర్గీకరణ అనే అంశంపై క్లాస్ చెప్పబోయే ముందు చదివిన మంచి కవిత 🙏🙏🙏

  2. కలత తీరదే కవి గణమ్ముకు… గౌరినాయుడు అన్న కళ్ళముందు నిలిచారు. ఆహా!

  3. గౌరవ గౌరు మాష్టారుకు
    చిన వీరుని చిరు కవిత
    ఇరువురి అభిమానులకు
    ఇప్ప పూల పలకరింత

  4. ఇప్పపువ్వు మధువంతటి మధురమైన పద్యాల హారం. (అవ)ధరించిన ఇప్పచెట్టు పాడిందంటే మరిక ఆశ్చర్యమేముంది?

  5. ముత్యాలసరాలలో ముచ్చటైన శుభాకాంక్షలు సర్.

  6. కృష్ణశాస్త్రిగారి కవితలని, జానకిరామ్ గారి భావుకతని గుర్తు చేశారు సర్. ధన్యవాదాలు.

  7. గమ్మత్తు ఏమిటంటే .. ఇది చదివాక అనిపించింది.. ఈ మాటలు నేను మీ గురించి ఇప్పటివరకు ఇంత అందంగా హృద్యంగా ఇలా ఎందుకు రాయలేకపోయాను అని!.

  8. “కొండదారిన కలుసుకొంటిని
    పాట పాడెడి ఇప్ప చెట్టును”

    “బతుకు బరువై బాధ ఘనమై
    దిక్కుతోచని చిక్కు దినముల
    తలతు నేనా తీపి తావుల,”

    Beautiful sir!!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading