పునర్యానం-51

చాలా ఏళ్ళ కిందట, బహుశా ముప్ఫై ఏళ్ళకిందట. ఒక సాయంకాలం, శ్రీకాళహస్తి దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు సంధ్యవేళ, దేవుడికోసం సంధ్యాహారతిలో భాగంగా నాదస్వరం వినిపించడం మొదలుపెట్టారు. ఆ నాదం వింటూనే నాకు నా శరీరాన్ని వదిలిపెట్టి ఏ దివ్యగగనంలోకో తేలిపోయినట్టు అనిపించింది. ఆ నాదస్వరం వింటున్నంతసేపూ అదొక అపార్థివ లోకాన్ని నాకు సన్నిహితంగా తీసుకువస్తూనే ఉంది. ఆ అనుభవాన్ని నేను తక్కిన రోజువారీ ప్రాపంచిక అనుభవాలతో పోల్చలేను. అసలు అది ఇంద్రియాలద్వారా మనం గ్రహించే సాధారణ అనుభవాల స్థాయికి సంబంధించి కాదు. కాని అది నీకు నీ శ్రవణేంద్రియంద్వారానే చేరువ అవుతున్నది, నిజమే, కాదనలేను. కాని ఆ క్షణమే, నువ్వు తొడుక్కున్న చొక్కా విప్పి పక్కన పడేసినట్టుగా, నీ పార్థివ జీవితాన్ని పక్కకు నెట్టేసి మరేదో దివ్యలోకంలోకి అడుగుపెట్టేసావు.

ఏళ్ల తరువాత ఆ అనుభవాన్ని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నించినప్పుడు నాకు ఆ సంగీతం గాని, ఆ అలౌకికానుభూతిగాని గుర్తురాలేదు. అందుకు బదులుగా అక్కడ ముక్కలుముక్కలుగా కొరికిపారేసిన వలలు కనిపించాయి. పోగులు పోగులుగా చీల్చి పోగుపెట్టిన ఉచ్చు కనిపించింది. అంతదాకా ఏదో పాశం నా మెడచుట్టూ బిగిసి ఉందనీ, ఎవరో దాన్ని పక్కకు లాగేసారనీ, లాగెయ్యడమే కాదు, దాని ముళ్ళన్నీ ఎంతో దయతో కొరికిపారేసారనీ అనిపించింది. ఆ దంష్ట్రలు ఎవరివో గాని, అత్యంత కరుణామయ దంష్ట్రలు అవి. ప్రసూతి మందిరంలో ప్రసవాన్ని సులభతరం చెయ్యడానికి సర్జనికుడు శస్త్రం ఉపయోగించినట్టుగా ఆ దంష్ట్రలు నా అపార్థివ జన్మను సులభతరం చేసేసాయి.

పుట్టడం నిజంగానే ఒక సంతోషం. కానీ మనకి అప్పుడు తెలీదు, ఈ లోకంలోకి పుడుతున్నామనీ, ఈ పుట్టుకద్వారా ఏవో కొత్త సంతోషాలకు అర్హులం కాబోతున్నామనీ. కాని ఏదో ఒక పాశం నుంచి బయటపడతాం చూడు, జన్మ అంటే అది. విడివడటమే నిజమైన పుట్టుక అని నిశ్చయంగా తెలిసే క్షణాలు అవి.


శ్రీకాళహస్తీశ్వరాలయంలో వినిపిస్తున్నదొక సంధ్యానాదస్వరం
పురాతన దేవమందిర ప్రాంగణమంతా తేలిపోతున్నదెక్కడికో.
వివృత ద్వారాల ముందు మోకరిల్లి ప్రార్ధించాను, అంతదాకా
నా మెడకి ఉచ్చు బిగించి లాగుతున్నదొక పాశమని గుర్తించాను.

సాంధ్యహారతి వెలుగుని నాదస్వరం తీసుకుపోతున్నది
ఆకాశంలోకి, మేఘాల్లోకి, రోదసిలోకి, ఒక దివ్యవ్యోమంలోకి.
ఎక్కడున్నదింకా త్రాసపాశం? కొరికేయేవో కరుణదంష్ట్రలు
ప్రతి ఉచ్చునీ, ప్రతి పోగునీ, ప్రతి చిక్కునీ, ప్రతి గ్రంథినీ.

పుట్టడం ఒక ఆనందం, కానీ తెలియదప్పుడు నువ్వు జన్మించావని
తలెత్తావని ఒక కొత్త ఆకాశం కింద, ఒక కొత్త సంతోషానికని.
విడిపడ్డం నిజంగా నీ జన్మ, తెలుస్తుందప్పుడు నీకు స్పష్టంగా
ఆకాశం నీకోసమొక దయామేఘశస్త్రం ధరించిందని.

(పునర్యానం, 5.2.5)


As Nadaswaram plays in the Srikalahasti temple
Sacred music fills the ancient hallway.
Before the temple doors, I kneeled in prayer
As I realized I had a noose around my neck.

The Nadaswaram carries the evening twilight
Into the clouds, into space, and into the cosmos.
Is that feared noose still there? Those benign teeth
Have already cut through every string, and every knot.

Being born is happiness. You don’t realize then,
A new world awaits you, and a new life awaits you.
The release is your real birth. It’s when you see
How the sky wields kindness like a scalpel.

22-9-2023

7 Replies to “పునర్యానం-51”

  1. నువ్వు ఎక్కడెక్కడ జీవితాన్ని నిండుగా జీవించావో, నిజంగా జీవించావో, ఆ వేళల్ని తలచుకొమ్మని మాకు కూడా చెప్పినట్టుగా వుంది.హృదయపూర్వక అభినందనలు మీకు.

  2. మూలం అనువాదం సమఉజ్జీలు .
    అలౌకిక రమ్యానుభూతి ఒక విభూతి

  3. “విడివడటమే నిజమైన పుట్టుక ”
    ఈ మాట చెప్పిన మీకు…
    ఆజన్మాంతం నేను దాసోహం!
    సర్!
    మూడు పదాలలో ఎంత గొప్ప అనుభూతి !

  4. పుట్టుక ఒక ఆనందం
    పుట్టుక ఒక అనునాదం
    పుట్టుక ఒక అనువాదం !
    ప్రతి పదానికి అభివాదం!🙏🏼🙏🏼🙏🏼

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading