పునర్యానం-50

ఇరవై ఏళ్ళ కింద ఒక సాయంకాలం. శ్రీశైలంలో పాతాళీశ్వర సదనంలో ఉన్నాను. ఆషాడమాసపు సంధ్య. చూస్తూండగానే నల్లమల కొండలమీద మబ్బులు కమ్ముకున్నాయి. దిక్కులన్నీ నల్లబడ్డాయి. ఒక మహావృష్టి భూదిగంతాల్ని ఏకం చేసేసింది. ఆ సాయంకాలం రాత్రిగా మారిపోతూ ఉండగా ఆ వర్షాన్ని అలానే చూస్తో గడిపేసాను. ఆ రోజుల్లో తెలుగు ఇండియా టుడే లో సాలోచన పేరిట ఒక కాలం రాస్తూ ఉండేవాణ్ణి. శ్రీశైలం నుంచి తిరిగి రాగానే ఆ అనుభవాన్నే ఆ సారి కాలం గా రాసి పంపించాను. (ఆ వ్యాసం చూడాలనుకున్నవారు సోమయ్యకు నచ్చిన వ్యాసాలు పే.18-20 చూడవచ్చు.)

ఒక వర్షం. జీవితపు ప్రతి మలుపులోనూ ప్రతి వర్షాకాలంలోనూ అటువంటి వర్షం ఒకటేనా సాక్షాత్కరిస్తుంది. వర్షం మామూలుగా ఏదో ఎడబాటుని, లోటుని, ఏదో ప్రతీక్షని గుర్తుచేసే అనుభవం. కాని ఆ ఒక వర్షం ఉంటుందే, ఒక మహావర్షం, అది నిన్ను నిలువెల్లా ప్రక్షాళితం చేసి వెళ్ళిపోతుంది. నిన్ను పూర్తిగా కడిగేస్తుంది, నీ మాలిన్యాల్ని, నీ ప్రలోభాల్ని ఊడ్చేస్తుంది.

తైత్తిరీయ ఉపనిషత్తు వర్షంలో తృప్తిని సంభావించమంది (తృప్తిరితి వృష్టౌ, 3.10.2). వర్షాన్ని మూర్తీభవించిన తృప్తిగా చూడమనిచెప్పింది. మంత్రమంటే ఇటువంటి మాటనే. రహస్యమంటే ఇదే. ఆ ఒక్క మాటలో ఒక జీవితాన్ని పునరుజ్జీవింపచెయ్యగల అనంత శక్తి ఉంది.

నువ్వు ఎక్కడెక్కడ జీవితాన్ని నిండుగా జీవించావో, నిజంగా జీవించావో, ఆ వేళల్ని తలచుకొమ్మని కవి తనకి తాను చెప్పుకున్నప్పుడు ఇటువంటి వేళలు గుర్తు రాకుండా ఎలా ఉంటాయి?


కొండలమీద సాయంసంధ్యామేఘం ఆవరించింది
పర్వతసానువుల్ని తొలి ఆషాఢమేఘం అల్లుకుంది
కురిసిందప్పుడు వాన, కొంత కాంతిని, కొంత చీకటిని
మేఘాల మధ్య, మెరుపుల మధ్య కొంత గతం, కొంత భవిష్యత్‌.

ఏ సుదూరగ్రామంనుంచో వినవచ్చిందొక పిలుపు, ఎవరో పిలిచారు
ప్రేమతో, స్నేహంతో, ఏమీ కోరుకోని మమకారంతో
ధారాపాతంగా వర్షించాయి అశ్రువులు, మిగిలినదేమిటి
చివరకి? కట్టెదుట ఉన్నదొక్కటే ప్రత్యక్షం కాదు.

ఎవరో చెప్తున్నారు ముందు నెమ్మదిగా, అప్పుడప్పుడు
బిగ్గరగా, మహనీయ సాధుసత్పురుషుల్లా.
వినబడుతున్నాయేవో మాటలు పసివాడి పలుకుల్లా
ఉన్మత్త గానంలా, కించిత్‌ సార్లు నిన్ను మింగేసే ప్రేలాపనలా.

ఎవరో నిన్నప్పుడు నిజంగానే భక్షించేసారు, ఆ అత్యంత
దయామయులకొక వినమ్రనమస్కారం.
నిన్ను ముంచెత్తిన నదీస్నానంలా
ప్రక్షాళనం చేసేసింది ఆషాఢసంధ్య నిలువెల్లా.

(పునర్యానం, 5.2.4)


In the evening twilight, hills glowed
Over the mountain range, a rain cloud rolled in.
Then it rained sometimes light, sometimes dark
Clouds and lightning, the past and the future.

I heard a voice from a distant village
It was lovely, caring, and unconditional.
The tears swelled. In the end, what remains?
There’s more than meets the eye.

Someone spoke quietly and aloud.
It was like a child babbling or a saint speaking.
Some words could reach you, like a lunatic’s song, or
Like a wild cry about to eat you up.

At that moment, someone has truly devoured you.
To those who crunched me, my salutations.
Like a complete dip in a river,
The July evening washed you out.

21-9-2023

14 Replies to “పునర్యానం-50”

  1. అలా చాలా బాగుందండి.. నాకు పొద్దున్నే మీ పోస్ట్ చూడటం ఇంకా బాగుంటుంది

  2. ప్రేమతో, స్నేహంతో, ఏమీ కోరుకోని మమకారంతో
    ధారాపాతంగా వర్షించాయి అశ్రువులు,
    మింటి వానతో కంటి వాన

  3. నిండుగా, నిజంగా జీవించటానికి మించింది ఏముంటుంది.. యింత మంచి మాటలకు నమస్సులు.

  4. నువ్వు ఎక్కడెక్కడ జీవితాన్ని నిండుగా జీవించావో, నిజంగా జీవించావో, ఆ వేళల్ని తలచుకొమ్మని మాకు కూడా చెప్పినట్టుగా వుంది.హృదయపూర్వక అభినందనలు మీకు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading