
పార్వతీపురం లో పనిచేస్తున్న రోజుల్లో, అంటే నా ఉద్యోగ జీవితం మొదటి సంవత్సరంలోనే, నాకు మలేరియా పట్టుకుంది. పాచిపెంట మండలం మిలియాకంచూరు కొండల మీద ఒక రాత్రి గడిపినందుకో, అక్కడ నీళ్ళు తాగినందుకో నా వంట్లో పారసైటు ప్రవేశించింది. నిజానికి అది మలేరియా కాదు. పూర్వకాలం కలోనియల్ సివిల్ సర్వెంట్లు ఏ పేరు చెబితే వణికి పోయేవారో ఆ ‘కాలాజార్’ అది. అది నన్ను పట్టుకున్న వారం రోజులకే నా లివర్ ని బాగా తినేసింది. తీవ్రమైన తాగుబోతులకి మాత్రమే లివర్ అంతగా దెబ్బతింటుందని విన్నాను. కాలాజార్ మహిమ అది. అది కాలాజార్ అని కనుక్కోవడానికే చాలా టైము పట్టింది. మొదట్లో ఫైలేరియా అని అనుకున్నారు. కింగ్ జార్జ్ హాస్పిటల్ వైద్య బృందం ఒక రోజంతా చర్చించుకున్నా ఏమీ తేల్చుకోలేకపోయారు. దాంతో మా అక్క నన్ను కాకినాడ తీసుకువెళ్లిపోయింది. అప్పుడు కాకినాడలో మా అక్కా వాళ్ళ కుటుంబానికి సన్నిహితులైన ఒక హోమియో డాక్టర్ గారు వారం రోజులు దగ్గరగా పరీక్షించి కాలాజార్ అని తేల్చారు. ఆ తర్వాత దాదాపు రెండు మూడు నెలల పాటు ఆయనే ట్రీట్మెంట్ ఇచ్చారు.
కాలాజార్ ప్రవర్తన చిత్రంగా ఉండేది. ఒక రోజంతా ఆటవిడుపుగా ఉండేది. ఆ మర్నాడు పొద్దున్నే వణుకు మొదలై ఒక్కొక్క గంట గడిచే కొద్దీ ఒక్కొక్క డిగ్రీ టెంపరేచర్ పెరిగేది. మధ్యాహ్నానికి 104, 105 చేరేది. అంత టెంపరేచర్ కి బుర్ర అంతా అయోమయంగా, అస్తిమితంగా ఉండేది. ఇక నెమ్మదిగా ఒక్కొక్క గంట గడిచే కొద్దీ ఒక్కొక్క డిగ్రీ టెంపరేచర్ తగ్గుతూ సాయం కాలానికి నార్మల్ అయిపోయేది. మర్నాడు అంతా ఆటవిడుపు. ఆ మర్నాడు మళ్లా ఇదే తంతు. అంటే ఆ పారసైటు ఒంట్లో పుట్టి పెరగడానికి 48 గంటలు కావలసి వచ్చేదన్నమాట. ఆ పారసైటుతో హోమియో మందు నెమ్మదిగా యుద్ధం చేసేది. మధ్యలో తట్టుకోలేక నేను ఆ డాక్టర్ గారిని అడిగితే హోమియో సత్యాగ్రహం చేస్తోంది కానీ యుద్ధం అయ్యేటప్పటికి ఇక శత్రువు మిగలడు అని చెప్పేరు. ఆయన అన్నట్టే ఎట్టకేలకు నేను కాలాజార్ నుంచి బయటపడ్డాను. మరి మళ్లా ఎప్పుడూ కాలాజార్ గానీ, మలేరియా గాని జ్వరం రాలేదు. బహుశా ఆ ప్రభావం వల్లనే ఏమో కరోనా కూడా రాలేదు.
నేను కాకినాడలో ఉన్న ఆ రెండు మూడు నెలలూ మా పెద్ద చెల్లెలు పాపాజీ నన్ను ఒక తల్లి లాగా కనిపెట్టుకొని చూసుకుంది. ఒక మనిషి ఒక మనిషికి అటువంటి సపర్య చేయగలగడం నేను చాలా అరుదుగా చూశాను. ఆ సపర్యవల్ల నేను ఆరోగ్యవంతుడిని మాత్రమే కాదు, మనిషిని కూడా కాగలిగాను.
మనం ఇంగ్లీషులో health అని చెప్పేది అత్యంత ప్రాచీనమైన ఇండో యూరోపియన్ భాషా కుటుంబ పదం *kailo నుంచి వచ్చింది అని చెప్తారు. ఆ మూలపదానికి సమగ్రత, సంపూర్ణత, శుభప్రదం అని అర్థం అట. సంస్కృతంలో దానికి సమానార్థకం స్వస్థత. స్వస్థత (స్వ+స్థ) అంటే నీలో నువ్వు ఉండడం. నీకు నువ్వుగా ఉండడం. నీలోంచి నువ్వుతప్పిపోవటమే అనారోగ్యం. తిరిగి ఎవరైనా నిన్ను నీకు అప్పగిస్తే, నీలో శకలాలుగా విడిపోతున్న భావోద్వేగాలను ఒకచోటకు చేర్చి నిన్ను మళ్లా సమగ్రంగా నిలబెట్టగలిగితే అంతకు మించిన చికిత్స మరొకటి లేదు.
జీవిత జ్వరగ్రస్తుణ్ణయినప్పుడు లభించిందొక సపర్య
నన్ను కనిపెట్టుకుని చూసిందది ప్రతిక్షణమొక పరీక్షగా
థర్మామీటర్‌తో కొల్చుకున్నాను దినదినాన్ని
వేడెక్కిన రక్తనాళాల్లో ప్రవహించిందొక సంక్షోభం.
తిరిగి ఇవ్వలేని ఊరట, తలచినంతనే కమ్మేస్తాయి అశ్రువులు
ఇరుకు గదుల్లో పరచుకుంది ఆకాశమప్పుడు విశాలంగా
పసి నేత్రాలతో, పసి హస్తాలతో పోసింది అదొక ప్రాణం
పుట్టడం ఒక జన్మ, జ్వరవిమోచనం మరొక జన్మ.
ప్రపంచానికి ఏమీ ఇవ్వలేకపోవడం జ్వరహేతువు కాదు
ప్రపంచం నీకేమీ ఇవ్వకపోయినా జ్వరం రాదు
నిన్ను నువ్వు కోల్పోవడమే అన్నిటికన్నా అతి పెద్ద అస్వస్ధత.
తిరిగి నిన్ను నీకు ఎవరు తెచ్చి ఇచ్చినా అదే గొప్ప సపర్య.
(పునర్యానం, 5.2.3)
She took care of me when I was sick.
Every minute of every hour, she was there for me.
With a thermometer, I measured my days.
There was an agitation flowing through me.
When I think of her care, my eyes well up.
Little sister, but she was a mother to me.
She spread the sky across that tiny room.
It’s like being born, but then reborn after a fever.
You don’t get a fever from not serving the world
Nor will you feel sick if the world leaves you alone.
The greatest sickness is losing oneself, and
The only true healing is returning to yourself.
20-9-2023


వివరణతో కవితలోని మర్మం అవగాహనకు వచ్చి అమాంతం కవిత శిఖరస్థాయి చేరుకుంది.
ముప్పై ఐదేళ్లకే నాకు సంక్రమించిన ఆస్టియో ఆర్థరైటిస్ ను తగ్గించిన మా హోమియో డాక్టరును గుర్తుకు తెచ్చారు. అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి నుండి అరవై ఐదేళ్ల వయస్సులో వరుసగా ఐదు రోజులు ఐదు ఖిల్లాలు వీడియో షూటింగ్ కై ఎక్కిదిగ గలిగానంటే అది ఆ హోమియో మందు చలవే. అయినా కొందరిని నమ్మించలేం. అది స్వానుభవైకవేద్యం.
అవును సార్. మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు.
చెల్లెలు శ్రీమతి పాపాజి గారికి తెలుగు పాఠక లోకం ఋణపడి ఉన్నది.
అమ్మా!అభినందనలు తల్లీ.
💯👍
📚✍️ మీ Homeo Satyagraham ..Kailo & స్వస్థత 👌👌👌👌👌👌👌👌