గురుస్థానం

The stylus of Eduttacchan in worship

తుంచెన్ పండగకి వెళ్ళినప్పుడు తొంభై ఏళ్ళ వాసుదేవన్ నాయర్ ను కలుసుకోవడం ఎంత సంతోషం కలిగించిందో, ఇరవై, ఇరవై రెండేళ్ళ సామజని కలుసుకోవడం కూడా అంతే సంతోషంగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ సంతోషంగా అనిపించింది.

ఎందుకంటే భారతీయ సాహిత్యంలో ఎనభయ్యేళ్ళ, తొంభై ఏళ్ళ వృద్ధులు చేసిన సాహిత్య కృషి అమోఘం, నిరుపమానం. ఉదాహరణకి కేరళలో ఎం.టి వాసుదేవన్ నాయర్, తగళి శివశంకర పిళ్లై వంటి పేర్లు వినని వారుండరు. నేను మేల్పత్తూరు వెళ్లడానికి రోడ్లు కూడా సరిగా లేని కేరళ గ్రామాల్లో దారి వెతుక్కుంటూ ఉండగా కలిసిన ప్రతి ఒక్కరికీ తుంచెన్ పండగ అంటే ఏమిటో తెలుసు, ఎం.టి.వాసుదేవన్ నాయర్ అంటే ఎవరో తెలుసు. కాని ఆ తర్వాతి తరం వారు అంటే నా తరానికి చెంది అరవై ల్లో అడుగుపెడుతున్నవాళ్ళం మా ముందు తరం చేసినంత కృషి చెయ్యలేదనే చెప్పాలి. వాళ్ళలాగా బహుముఖీన ప్రజ్ఞతో ప్రజాజీవితాన్ని ప్రభావితం చెయ్యగల సాహిత్యసృజన మేము చెయ్యలేకపోయాం. ఇప్పుడు నా ఆశ నా తర్వాతి తరాల మీద ఉంది. ఇప్పుడు తమ నలభయ్యోల్లో ఉన్నవాళ్ళూ ( అంటే 1981 నుంచి 1996 మధ్యలో పుట్టినవాళ్ళు, వీళ్ళని మిలీనియల్స్ అంటున్నారు), వాళ్ళ తర్వాతి తరం, అంటే ఇప్పుడు ఇరవయ్యల్లో అడుగుపెట్టినవాళ్ళూను (1997 తర్వాత పుట్టినవాళ్ళు, వీళ్ళని జనరేషన్ జడ్ అంటున్నారు).

ఈ కొత్త తరం యువతీయువకులు, అంటే మిలీనియల్సూ, జెన్-Z ఈ రెండు తరాలూ అద్భుతమైన శక్తియుక్తులున్నవాళ్ళు. సాహిత్యం ఒక్కటే కాదు, ఏ సృజనాత్మక రంగంలోనైనా వీరు తమ ప్రతిభను చాలా సునాయాసంగా తీర్చిదిద్దుకోగల నైపుణ్యం ఉన్నవాళ్ళు. నేను ఎంతో ఆశగా చూస్తున్నది వీళ్ల వైపే. అందుకనే ఈ తరాలకు చెందిన యువతీ యువకులు పాల్గొనే ఏ సాహిత్యసమావేశానికిగాని, లేదా ఏ వర్క్ షాప్ కి గాని వెళ్ళాలంటే నాకెంతో ఉత్సాహంగా ఉంటుంది. వీళ్ళల్లో చాలామంది ప్రతిభావంతుల్ని సినిమా ఇప్పటికే తన కబంధహస్తాల్తో దగ్గరకు లాక్కుంటోంది. ఆ పట్టుకి చిక్కకుండా ఎవరు మిగిలినా వారిని సాహిత్యం పేరుచెప్పి కాపాడుకోవాలనిపిస్తుంది.

సామజ అటువంటి జెన్-Z అమ్మాయి. ఆమె ఇప్పుడు ట్రివేండ్రంలో లా చదువుతోంది. ఇప్పటికే ఒక కవితాసంపుటి వెలువరించింది. ప్రభావర్మ ఆ పుస్తకానికి ముందుమాట రాసారు. ఆమె తుంచెన్ పండగలో పాల్గోడానికి వచ్చింది. నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంది. ఆమెని మళయాళం గురించీ, ఆమెకి ఇష్టమైన కవుల గురించీ అడుగుతుంటే అన్ని ప్రశ్నలకీ ఎంతో వివరంగా జవాబులు చెప్పింది. నీకు ఇష్టమైన కవి ఎవరు అని అడిగితే, ఆమె వాయలార్ రామవర్మ పేరు చెప్పింది. ఆయన కవిత ఏదైనా వినిపిస్తావా అని అడిగితే వెంటనే ఒక పద్యం వినిపించింది. రామవర్మ సినిమా కవి అయినా కూడా అతడి సినిమా పాట వినిపించలేదు ఆమె. ఒక నవయువతి తన భాషలో ఒక కవి పద్యం వినిపించడం- ఇలా తెలుగులో ఎవరు వినిపించినా నేను జీవితకాలం వారికి అభిమానిగా మారిపోగలను. ఆమె వినిపించిన పద్యం వినండి.

కాని ఆమె దృష్టి మళయాళం గురించి నాకు చెప్పడం మీద లేదు. తెలుగు సాహిత్యం గురించి నా ద్వారా తెలుసుకోవడం మీద ఉంది. ఆమెకి కొంత చెప్పగలిగాను. నా చేతుల్లో కాటూరి వెంకటేశ్వరరావుగారి ‘కావ్యమాల’ ఉంది. ఈ పుస్తకం నీకు అర్థం కాకపోవచ్చు. కాని తెలుగు కవిత్వం మొత్తం నీ చేతుల్లో పెడుతున్నాను అనుకో అని ఆ పుస్తకం ఆమెకి కానుక చేసాను.

నేను తిరిగి వచ్చాక, ఆమె ఆ తుంచెన్ పరంబు సందర్శించినప్పటి తన అనుభూతిని మళయాళంలో ఒక కవితగా రాసి పంపించింది. దాని అర్థం ఇంగ్లిషులో వివరిస్తూ. ఆ అర్థాన్ని పట్టుకుని ఆ కవితను ఇంగ్లిషులోకి అనువదించమని అడిగాను. అక్కడక్కడ నేను చిన్నపాటి సాయం చేసాను. ఆ కవిత మళయాళంలోనూ, ఆమె చేసిన ఇంగ్లిషు అనువాదంలోనూ ఇక్కడ పంచుకుంటున్నాను.

തുഞ്ചൻ പറമ്പ്


വിടപറയലല്ല ഇത് വരവറിയിക്കലാ-
ണിനിയും വരും വരുമെന്ന പ്രതീക്ഷയാ-
ണടരാൻ മടിക്കുന്ന ഗന്ധമാണോരോ
വസന്തവും വീണ്ടും വരും വരെ

ഇത് ഗുരുസ്ഥാനമാണിതുവരെയുള്ളതും
ഇനിയുള്ളതുമായ യാത്രകളൊക്കെയും
ഇക്കാഞ്ഞിരച്ചോട്ടിലേക്കാണിനിപ്പാവണ-
മിലകൾ കൊഴിയുന്ന വഴികളിൽ

ആചാര്യനെത്ര നടന്ന മണലാ-
ണക്ഷരം ചൊല്ലിക്കൊടുത്ത തണലാ-
ണൊരു കിളിക്കൊഞ്ചൽ കാതോർത്തിരുന്നു ഞാൻ
പാൽക്കടലലതല്ലുന്ന രാത്രികൾ

ഭീഷ്മരുണ്ട് നിശബ്ദത ഭേദിച്ച
ഭീമനെ തൊട്ടറിഞ്ഞൊരാൾ കാവലായ്
“ഭീഷണമായ കാലത്ത് മൗനം ഭൂഷണമല്ല”
ഭീതിയില്ലാതുറക്കെപ്പറഞ്ഞൊരാൾ

നാടുകടത്തിയ രാജ്യനീതിയെ കാലംകടത്തിയ കാവ്യസംസ്കാരമേ
നിന്റെ ചക്കിലാട്ടിത്തെളിച്ചയെണ്ണയൊരു-
തുള്ളിയെന്റെ ചെരാതിൽ പകർന്നു ഞാൻ

തിരിതെളിക്കട്ടെ; തങ്ങുകയാണു ഞാ-
നിവിടെയൊരു വസന്തഗന്ധവും പേറി-
യായെഴുത്തച്ഛൻ കരം ചേർത്ത തൂലിക
തൊടാനുള്ളിൽ കൊതിയുമായ്.

The Place of My Guru


This is not a goodbye. I’m letting the world know I’m here.
I hope I will come back again and again.
The scent of each spring lasts until the next one arrives.

My Guru’s yard.
My journey until now, and all my future journeys
Get to the root of this tree
Let the leaves shed in my journey turn sweet

I wonder how long my guru walked on this sand!
It was under this shade that he met his disciples,
I sit here tossed by the waves of milky nights
Longing for the song of a bird

The Bheeshma of our times is here
“Silence is not an ornament in difficult times” he said
True, he touched the soul of Bheema, the rebel

Oh! Great poetic culture!
You have expatriated the rajneethi down the ages that once expatriated the poets
Let me draw a drop of oil
From your ‘chakk’

Let me light it up.
I stay here bearing the scent of the spring yearning to touch
The quill pen that was used by our first poet

ఈ కవితకు నా తెలుగు అనువాదం

గురుస్థానం

ఇది వీడ్కోలు కాదు, నేనిక్కడ ఉన్నానని లోకానికి చెప్పడం
మళ్ళా మళ్లా ఇక్కడకి రావాలని కోరుకుంటున్నాను
వసంతం ఒకసారి వచ్చాక ఆ సుగంధం మరువసంతందాకా
నిలిచే ఉంటుంది.

నా గురుస్థానం.
ఇప్పటి నా ప్రయాణం, రానున్న మరెన్నో ప్రయాణాలు
ఈ వృక్షమూలానికి చేరుకోటానికే.
నా ప్రయాణ ఛిన్నపత్రాలు తీపెక్కాలని కోరుకుంటున్నాను

ఎంతకాలం పాటు నా గురువు ఈ ఇసుకమీద నడిచాడో కదా
ఈ చెట్టునీడనే ఆయన తన శిష్యుల్ని కలుసుకున్నాడు
పాలపుంత కెరటాల్లో తడుస్తూ కూచున్నాను నేనిక్కడ
ఒక చిలుకపాట కోసం ఎదురుచూస్తూ.

మా కాలం నాటి భీష్ముడున్నాడిక్కడ
ఎంత ధైర్యంగా చెప్పాడాయన
కఠిన సమయాల్లో మౌనం ఒక ఆభరణం కాదని.
నిజం, ఆయన భీముడిలో విప్లవకారుణ్ణి పట్టుకోగలిగాడు.

ఓ నా మహనీయ కవితా సంస్కృతీ!
ఒకప్పుడు కవుల్ని బహిష్కరించిన రాజనీతిని నువ్వు
కాలం అంచులదాకా బయటికి నెట్టేసావు.
నీ నూనె గానుగ నుంచి
ఒకింత తైలం తీసుకోనివ్వు నన్ను.

నా దీపం వెలిగించుకోనీ.
నా ఆదికవి చేత్తో పట్టుకున్న గంటాన్ని
ఈ వాసంత సుగంధాన్నిట్లా తలదాల్చి
నన్ను కూడా పట్టుకోనివ్వు.

23-2-2023

27 Replies to “గురుస్థానం”

 1. నమస్కారం సార్

  జెన్ z పిల్ల మా అక్క కూతురు. మెడిసన్ చదువుతోంది హైద్రాబాదులో… కవిత్వం వ్రాస్తుంది ఆంగ్లంలో. చక్కటి చిత్రలేఖనం కూడా చేస్తుంది. రామాయణ భారతాలు సంస్కృతంలో చదవాలని మోజుపడుతోంది. మిమ్ములను కలపనా? మీరు తనకు మీ చక్కటి మాటలు చెప్పి దారి చూపగలరని ఆశ. మీ సమాధానం కొరకు ఎదురుచూస్తూ
  భవదీయ
  సంధ్య

 2. ఇలాంటి విషయాలు వింటుంటే చూస్తుంటే, చాలా హాయిగా… మనసు నిండుగానూ ఉంటుంది. రాబోయే తరాలు మంచి సాంస్కృతిక ఒరవడితో సమాజాన్ని నడిపిస్తాయనిపిస్తుంది

 3. ఈ విషయాలు అన్నీ చదువుతుంటే కొత్త ఉత్సాహం నింపుకున్నట్లుంది సర్

 4. స్ఫూర్తిదాయకమైన పోస్టు సర్. సామజ గొంతులో మలయాళీ పద్యం మధురంగా పలికింది. ఆమె కవితలో గురు ప్రపత్తి తొణకిసలాడుతున్నది. చివరి వాక్యాల్లో సాహిత్య సంస్కారం ఎలా కొనసాగాలో చెప్పినట్టుగా ఉంది .నీ గానుగ నుండి కొంచెంగా తైలం తీసుకోనివ్వు. నా దీపం వెలిగించుకోవాలి.
  అది కదా మనం మన పూర్వకవులనుండి సంగ్రహించవలసిన సారం. వింశతిలోనే ఇలా ఉంటే పరిణత స్థాయిలో ఎలా ఉంటుందో. మీది యాత్ర మాది జాత్ర నమస్సులు.

 5. ఎంత గొప్పగా రాసింది… సామజ కు అభినందనలు తన కవితని పరిచయం చేసిన మీకు అభివాదాలు sir

 6. సామజఇక్కడ చినవీరభద్రుడి వరం చేత గమనా ముందుకు వెడుతోంది సామజ వరగమనా శుభాకాంక్షలు

 7. పద్యపఠనాన్ని,కవితా పరిమళాలను ఆస్వాదించే విధంగా,ఆసక్తి పెంపొందించేలాగున పాఠ్యపుస్తకాలు రూపొందించబడాలి.మాతృభాష ఔన్నత్యాన్ని రూపొందించే కార్యశాలలు నిర్వహించబడాలి.

  ఏదిఏమైనా మళయాల మారుతాలను మాకందిస్తున్న తమరికి శత సహస్ర నమోవాకములు…

  నెనరులు.

 8. మళయాళ కవులలో సంప్రదాయ కవిత్వం రాసిన వాళ్ళ గురించి వినడం.. ఆ కవిత్వం Gen-Z వాళ్ళు ఇంత హృద్యంగా పాడుకోవడం చాలా సంతోషంగా ఉందండి. నా పరిమిత జ్ఞానం మళయాళ కవయిత్రి కమలా దాస్/ సురయ్యా మాత్రమే.
  సామజ రాసిన కవిత ..మీ అనువాదం బాగున్నాయి. ఆమెకు నా. హృదయపూర్వక అభినందనలు. ఇంత మంచి స్ఫూర్తి దాయకమైన పోస్ట్ కి మీకు ధన్యవాదాలు.🙏

 9. అద్భుతమైన అమృతపానం , మీరనుభవించి, మాకు పంచారు.  సామజ  కవితా గానం, తను ,మీ నుండి  తెలుగు గురించి తెలుసుకోవాలనే తపన, తన స్ఫూర్తి దాయకమైన కవిత, ఎంతో బాగున్నాయి. 

 10. ….సమయాల్లో మౌనం ఒక ఆభరణం! ఈ మాట చాలును.

Leave a Reply

%d bloggers like this: