సర్వజ్ఞ వచనాలు

vs

వేమన గురించి రాసే ప్రతి పుస్తకంలోనూ సర్వజ్ఞుడి ప్రసక్తి వస్తుంది. ఆయన వచనాలు కూడా కొన్ని ఉదాహరిస్తూ ఉంటారు. అవి కూడా వేమనతో పోల్చదగ్గవి మాత్రమే ఎంచి చెప్తారు. అలా ఏర్పడ్డ ఆసక్తితో సాహిత్య అకాదెమీ సర్వజ్ఞుడి మీద వెలువరించిన మోనోగ్రాఫు కూడా చదివానుగాని, నా దాహం తీరలేదు. ఎందుకంటే, సర్వజ్ఞుడి వచనాలు తెలుగులో లభించేవి చాలా కొన్ని. ఇంగ్లీషులో ఆ కావ్యాత్మ అంత సులువుగా పట్టుబడేది కాదు.

అందుకనే వారం దినాల కిందట జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారు తాను ‘సర్వజ్ఞ వచనాలు’ కన్నడం నుంచి తెలుగు చేసానని చెప్పినప్పుడు, ఆ పుస్తకం నాక్కూడా పంపించండి అని నేనడిగేలోపటనే ఆయన ఆ పుస్తకావిష్కరణ సభలో ప్రధాన ప్రసంగం నేనే చెయ్యాలని చెప్పారు. దాంతో, నిన్న కుకట్ పల్లి లో జరిగిన ఆవిష్కరణసభలో ‘సర్వజ్ఞ వచనాలు’ పరిచయం చేసే భాగ్యం నాకు లభించింది.

సర్వజ్ఞుడి అసలు పేరు పుష్పదత్తుడు. ఆయన ఇప్పటి ధార్వాడ ప్రాంతానికి చెందినవాడు. కొందరు పదహారో శతాబ్దానికి చెందినవాడంటారు. ఈ పుస్తకంలో ముందుమాటలు రాసినవాళ్ళు పదిహేడో శతాబ్దానికి చెందినవాడని ప్రతిపాదించారు. ఒక బ్రాహ్మణుడికీ, కుంభారస్త్రీకి పుట్టినవాడుగా, కులవిచ్ఛిత్తి జరిగినచోట పుష్పదత్తుడి పుట్టుక సంభవించింది. ఆయన జీవితకాలమంతా ఒకచోట స్థిరంగా ఉండి కవిత్వం చెప్పినవాడు కాడు. వేమనలాగా, దేశమంతా సంచరిస్తూ తననీ, సమాజాన్నీ సమన్వయపరచుకుంటూ ఆశువుగా కవితల్లుకుంటూపోయేడు.

తెలుగులో అంతగా ప్రసిద్ధి కాని ‘త్రిపద’ అనే మూడు పంక్తుల మాత్రాఛందస్సు కన్నడంలో ప్రత్యేకమైందీ, సుప్రసిద్ధమైందీను. సర్వజ్ఞుడు త్రిపదను అత్యంత పరిణతస్థాయికి తీసుకుపోగలిగాడు. ఇప్పుడు ఆయన పేరుమీద దాదాపు 2000 పైనే త్రిపదలు ప్రచారంలో ఉన్నాయి. ఎందరో పండితులు వాటిని పరిష్కరిస్తూ, అందులో అసలు సర్వజ్ఞ కృతులేవో నిగ్గు తేల్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. చంద్రశేఖర రెడ్డిగారు వాటినుంచి 1223 త్రిపదలను ఎంపిక చేసి త్రిపద ఛందస్సులోనే తెలుగులోకి తీసుకొచ్చారు. ఏళ్ళ తరబడి ఆయన చేస్తూ వచ్చిన సృజనాత్మక సాహిత్యకృషీ, అనుసృజనాత్మక సాహిత్యవ్యాసంగమూ కూడా ఈ కృతిలో సంపూర్ణ పరిణతి చెందాయి. అందువల్ల ఈ అనువాదం సర్వజ్ఞుడే తెలుగులో రాసాడా అన్నంత శ్రవణసుభగంగానూ, పఠనలలితంగానూ అనుభవానికి వస్తున్నది.

భారతీయ సాహిత్యంలో ప్రాచీన, మధ్యయుగాల్లో సాహిత్యం చాలావరకు మతధార్మిక వికాసంలో భాగంగా వచ్చింది. లౌకిక సంస్కృత వాజ్ఞ్మయంలో కూడా పాత్రలు, సంఘటనలు పురాణాలనుంచో,ఇతిహాసాలనుంచో స్వీకరించినవే. మతాలతో సంబంధంలేని నైతికతను బోధించే పుస్తకాలు ముఖ్యంగా నాలుగు. అవి బుద్ధుడి బోధనల సారాంశమైన ‘దమ్మపదం’, తిరువళ్ళువర్ రాసిన ‘తిరుక్కురళ్’, భర్తృహరి ‘నీతి శతకం’, వేమన పద్యాలూను. అందువల్లనే సర్వజ్ఞుడి గురించి ప్రస్తావించేవారు, ఆయనకు వేమనతో, తిరువళ్ళువర్, భర్తృహరిలతో పోలిక తెస్తూంటారు.

కాని, మొదటిసారి, ఇంత సమగ్రంగా, సర్వజ్ఞుడి త్రిపదలన్నీ తెలుగులో చదివినతరువాత, ఆయన్ని ఎవరితోటీ పోల్చలేమనిపించింది. ఆయన భావాలకు దగ్గరగా ఉండే సుమతీ, వేమన శతక పద్యాలు మనకి కొన్ని స్ఫురించే మాట నిజమే కాని, అవి సర్వజ్ఞుడి జీవనదర్శనసారాంశాన్ని పట్టిచ్చేవి కావు.

ఈ పుస్తకానికి రాసిన ఒక ముందుమాటల్లో ‘సర్వజ్ఞుడికన్నా వేమన ఒక మెట్టు ఎక్కువనీ, వేమనకన్నా తిరువళ్ళువర్ మరింత పైనుంటాడనీ, వీరందరికన్నా భర్తృహరి మరింత అత్యున్నతస్థానంలో ఉంటాడనీ’ ఒకరు రాసారు. కాని అది సరైన అంచనా కాదనుకుంటున్నాను. వాళ్ళు secular సాహిత్యాన్ని సృజించారన్నంతవరకే ఆ నలుగురికీ పోలిక తేగలం. వారి కవిత్వాన్నీ, సందేశాన్నీ వారి వారి దేశకాలపరిస్థితులు ప్రభావితం చేసాయి. ఒకరి context కీ,మరొకరికీ పోలిక లేదుకాబట్టి, వారిలో ఎక్కువ తక్కువలు ఎంచలేం.

సర్వజ్ఞుడికీ, వేమనకీ పోలికకన్నా, తేడానే ఎక్కువ కనిపిస్తుంది. వేమనని మనం ఇదీ అని ఒక మూసకి కుదించలేం. నేనొకచోట రాసాను, పద్ధెనిమిదో శతాబ్ది ఫ్రెంచి మతప్రచారకుడికి వేమన ఒక ధార్మిక కవిగా కనిపించాడు. పందొమ్మిదో శతాబ్దిలో బ్రౌన్ కి వేమన నీతిబోధకుడిగా కనిపించాడు. ఇరవయ్యవ శతాబ్దిలో శ్రీశ్రీ, ఆరుద్ర మొదలైనవాళ్ళకి వేమన ఒక సాంఘికవిప్లవకారుడిగా కనిపించాడు. చలంగారిని ఇరవయ్యవశతాబ్ది వేమన యోగి అని శ్రీ శ్రీ అభివర్ణిస్తున్నప్పుడు ఆయనేం చెప్తున్నాడో సుస్పష్టమే. ఇరవయి ఒకటో శతాబ్దం మొదలయ్యాక వేమన గురించి ప్రతి ఏటా ఒక కొత్త పుస్తకం వెలువడుతోంది. అందులో వేమన ఒక విద్యావేత్తగా కనిపించడం మొదలుపెట్టాడు.

సర్వజ్ఞుడు కూడా మతాన్నీ, కులాన్నీ తూర్పారబట్టాడుగానీ, అతడిది తగవుపెట్టుకునే వైఖరి కాదు. ఇంగ్లీషులో ఆయన గురించి రాసేవాళ్ళు తరచువాడే విశేషణం pragmatic అని. సర్వజ్ఞుడు ఆచరణ వాది. కానీ సుమతిశతకకారుడిలాగా ‘తప్పించుకు తిరిగే ధన్యత’ కోరుకున్నవాడు కాడు. అనవసరమైన వాదోపవాదాలతో జీవశక్తిని, జీవితేచ్ఛనీ వృథా పరుచుకోవడం అతడికిష్టం లేదని మనకి తెలుస్తుంది. కాబట్టే ఇలా అంటున్నాడు:

ఇలను ఆకాశమును కలిపికుట్టగలవారు
గలరన, ఔను, కుట్టెదరన్ననవలె, వారితో
కలహమది యేల, సర్వజ్ఞ.

అలాగని అతడెక్కడా నీళ్ళు నమలడు. చాలా సుస్పష్టంగా, సూటిగా చెప్పే మనిషి. ఆయన కవితల్లో అప్పటి కాలానికి సంబంధించిన దురూహల్నీ, అపోహల్నీ వదిలిపెడితే, ముఖ్యంగా అయిదు అంశాల పట్ల ఆవేదన కనిపిస్తుంది.

మొదటిది, మతం. ఆయన పుట్టడం శైవుడిగా పుట్టి ఉండవచ్చుగాని, అతడి కవిత్వం శైవం కాదు, వీరశైవం కాదు, వైష్ణవ, బౌద్ధ, జైన, తంత్రారాధనల్లో వేటికీ చెందని మనిషి అతడు. అతడు కలగన్న స్వర్గంలో కులమతాలు లేవు, మతగ్రంథాలు లేవు, బ్రాహ్మణ, మాదిగ విభేదం లేదు:

ఆదిని జినుడు లేడు, వేదాల పుసి లేదు
వాదమున యొనగూడు ధనము లేదు, స్వర్గాన
మాదిగలు లేరు సర్వజ్ఞ.

రెండవది, కులం. ‘కులంగాడి’ కి ఆయన ఎప్పటికప్పుడు అంత్యక్రియలు చేస్తూనే వచ్చాడు:

కులముండదు యోగికి, ఛలముండదు శ్రోతకు
శిలాస్తంభములు లేవు గగనానికి, స్వర్గమునకు
ఛలము మైలలు లేవు సర్వజ్ఞ.

మూడవది, బుద్ధుడిలాగా, ఆయన కూడా చక్కటి నడత ఒక్కటే జీవితాన్ని వెలిగిస్తుందంటాడు.

మలయజ వృక్షాన నలిగంధమున్నట్లు
సులలితమైన శరణుల హృదయాల
వెలసి శివుడుండు సర్వజ్ఞ.

రాళ్ళకొయ్యల, బొమ్మలందుండునే శివుడు
చెల్లని మాట, విడు, వద్దు నిష్ఠాపరుల
ఉల్లమ్ముల నుండు సర్వజ్ఞ.

తన్ను తానెరుగుట, తన్ను వదలకుండుట
తన్ను నెరుగని దాని విడుచుట జ్ఞానము
విన్నాణమౌనె సర్వజ్ఞ.

నాలుగవది, ఆయన నోరారా కీర్తించింది హరిని కాదు, గురుణ్ణి.

ఏనుగద్దములోన, భానుండు శరధిలో
నేను గురువులో యొదిగి, ఇక సంసార
మానునే, చూడు, సర్వజ్ఞ.

కబీరులాగా సర్వజ్ఞుడికి కూడా దేహాన్ని కృశింపచెయ్యడం పట్లా, తీర్థయాత్రలపట్లా నమ్మకం లేదు. సత్యమూ, స్వర్గమూ చిత్తంలోనే ఉన్నాయని గ్రహించాడు.

ఆత్మవన్నియలను, ఆరోహితభాషణల
జ్యోతి నెలవులనెరిగిన సచ్చిదానందుం
డాతడే జ్ఞాని సర్వజ్ఞ.

అద్వైతుడై తాను యుద్ధమెవరితొ జేయు
బుద్ధితో తన్నెరుగువానికి లోకంపు
గుద్దులాటలేల సర్వజ్ఞ.

మేను కమలాల సెజ్జ ప్రాణరత్నపు లింగము
పూని భావసుమాల శివపూజ చేయువాడు
దేవుడందును సర్వజ్ఞ.

సత్యవాదికి జగము మస్తకము వంచేను
నిత్యనుత కన్నమ్మే సుతుపిల్చినటు, సురు
లత్యాదరమున జూతురు సర్వజ్ఞ.

వంశమును పొగడడు, పరధనము కోరడు
సంశయముక్తుడు, నిజసుఖ మాహేశ్వరుడు
హింస కొడబడడు, సర్వజ్ఞ.

ఉత్తుంగ మాణిక్య భిత్తిమంటపమందు
నిత్యనిర్మలుని నిజమెరిగిన యోగికి
ఎత్తావున చావు? సర్వజ్ఞ.

ఇక అయిదవదీ, అన్నిటికన్నా ముఖ్యమైందీ, గురజాడలాగా సర్వజ్ఞుడు కూడా పాడిపంటలు పొంగిపొర్లే దేశాన్ని కోరుకున్నాడు. ఆయన కలగన్న స్వర్గం సరళం, ఐహికం, స్వాభావికం. సకాలంలో కురిసే వాన, చక్కగా పండే పొలం, మనసు కలిసిన ఇల్లాలు, తనతో అమరిక కుదిరిన బిడ్డలు, ఆదరంతో చేరవచ్చే ఇరుగుపొరుగు-ఇంతే ఆయన కోరుకున్న లోకం. ఆకలి వేస్తే దొరికే అన్నం, నెమ్మదిగా సాగే వేసవి, నిండువెన్నెల రాత్రి, ఇవే ఆయన కోరుకున్న భోగం:

నాటరాగమె లెస్స, తోటమల్లెలు లెస్స
కూటమే లెస్స పెద్దలతొ, శివునెరుగు
నాటలే లెస్స సర్వజ్ఞ.

అంగన సుగుణియై, ముంగిలి స్వచ్ఛమై
బంగరు చిరుగాలి పున్నమి నిశియైన, వేసవి
క్రుంగక సాగవలె సర్వజ్ఞ.

అల్లము పసుపు గలవు, బెల్లము చిలగడదుంపలుండు
తెల్లని వరియన్నము, మరి ఆశ్రయముండు మలనాట
కల్లన్నదెవరు సర్వజ్ఞ.

పాతకము తొలగుటకు, సూతకము దాటుటకు
భూతేశు దయను పొందుటకు, ఆకొన్నవారి
కాతురత నన్నమిడు సర్వజ్ఞ.

మహనీయుడైన ఒక కవిని పరిచయం చేసినందుకు చంద్రశేఖరరెడ్డిగారికి ఎట్లా కృతజ్ఞతలు చెప్పాలో తోచకుండా ఉంది.

11-9-2017

One Reply to “”

  1. కులముండదు యోగికి, ఛలముండదు శ్రోతకు
    శిలాస్తంభములు లేవు గగనానికి, స్వర్గమునకు
    ఛలము మైలలు లేవు సర్వజ్ఞ.
    wonderful poems – thank u sir ;

Leave a Reply to kusumaamba1955Cancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading