యద్దనపూడి

374

దాదాపు పదేళ్ళ కిందట ఒకరోజు.

నా మొబైలు మోగింది.

తెలియని నంబరు.

‘హలో’ అన్నాను.

‘చినవీరభద్రుడుగారేనా మాట్లాడుతున్నది’

సుమధురమైన ఒక కంఠస్వరం. చాలా అరుదుగా మటుకే అంత తియ్యని గొంతు మన చెవిన పడుతుంది.

సమ్మోహకరమైన ఆ స్వరం ఎవరిదై ఉంటుందా అని ఆలోచిస్తూండగానే-

‘నేను సులోచనారాణిని మాట్లాడుతున్నాను. ఎమెస్కో విజయకుమార్ గారిదగ్గర మీ నంబరు తీసుకున్నాను..’

-వింటున్నాను.

‘మీ కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ పుస్తకం చదివాను. పూర్తిగా చదివాను. మళ్ళీ మళ్ళీ చదువుతున్నాను..’

-వింటూనే వున్నాను.

‘ఆ పుస్తకం చాలా ఇన్ స్పైరింగ్ గా ఉంది. అందుకని నా బ్లాగులో ఆ పుస్తకం మీద రాసుకోకుండా ఉండలేకపోయాను. మీకు వీలయితే చదవండి. మిమ్మల్ని కలుసుకోవాలని ఉంది. విద్య గురించి నాక్కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నాక్కూడా ఏదైనా చెయ్యాలని ఉంది. మనమొకసారి మాట్లాడుకోవాలి. ఇది నా నంబరు. మీకు వీలైనప్పుడు ఎప్పుడేనా మాట్లాడుతూ ఉండండి..’

సాత్త్వికతలో తడిసిపోయిన ఆ మాటలు వింటున్నప్పుడు నాకు తెలియని ఒక కొత్త సులోచనారాణి నా ముందు ప్రత్యక్షమయింది.

ఎందుకంటే సులోచనారాణికన్నా కొంత వెనగ్గా, వీరేంద్రనాథ్ కన్నా కొద్దిగా ముందుగా నా సాహిత్యపఠనం మొదలయ్యింది. అందుకని వారిద్దరి ఆకర్షణకీ లోనుకాని అతికొద్ది మంది తెలుగుపాఠకుల్లో నేనూ ఒకణ్ణి.

కాని ఎప్పుడో మా అక్క మాటలు వినో లేదా నాకై నేను తేల్చుకోవాలనుకునో ‘సెక్రటరీ’ చదివాను. నేను చదివాను అనే కన్నా ఆ నవల చదివించింది అనడమే సబబు. మరో నవలేదీ ఆమెది చదివినట్టు గుర్తులేదు. ఏమో బహుశా అగ్నిపూలు కూడా చదివానేమో. (లేదా సినిమా చూసినందువల్ల నవల చదివానని అనుకుంటున్నానో గుర్తులేదు.)

సులోచనారాణి తెలుగు ప్రజలకి చదవడం నేర్పించిందని విజయకుమార్ ఎప్పుడూ అంటూంటాడు. తెలుగులో యాభై పునర్ముద్రణలు పొందిన పుస్తకాలు రెండేననీ, ఒకటి మహాప్రస్థానం, రెండవది, సెక్రటరీ అని కూడా చెప్తూంటాడు. (ఈ మధ్య ఆ రికార్డు కూడా బద్దలయిందని, సెక్రటరీ డెబ్భై పునర్ముద్రణలకి నోచుకుందని తెలిసింది.)

కాని ఆ రోజు ఆమె మాట్లాడినతరువాత నాకు ఆమె పట్ల అపారమైన గౌరవం ఏర్పడింది. రెండు కారణాలు: ఒకటి, అంత సీనియర్ రచయిత్రి అంతగా ఎవరికీ తెలీని ఒక రచయితకి ఫోన్ చేసి అతడి పుస్తకం గురించి అంత మనఃపూర్వకంగా మాట్లాడటం తెలుగుసాహిత్య ప్రపంచంలో ఊహించలేని విషయం. రెండవది, అంతకన్నా ముఖ్యమైంది, ఆమె విద్య పట్ల కనబరిచిన ఆసక్తి. తెలుగు రచయితలు, ముఖ్యంగా, సమాజపరివర్తన కోరుకునేవాళ్ళు కూడా విద్య గురించి మాట్లాడని ఈ రోజుల్లో, అంత జనాదరణ పొందిన రచయిత్రి, ఆ వయసులో, విద్యగురించి ఆలోచించడం, సమాజంలో విద్యావ్యాప్తి గురించి తనవంతు తాను కూడా ఏదేనా చేయాలనుకోవడం.

ఆమె చెప్పిన బ్లాగు (లేదా వెబ్ సైట్) తెరిచిచూసాను. అందులో ఆమె చేస్తున్న సాంఘిక సేవాకార్యక్రమ విశేషాలు ఉన్నాయి.ఆమెలో ఆ పార్శ్వం నాకు తెలియనిది. అదంతా చదివిన తరువాత ఆమె పట్ల మరింత గౌరవం పెరిగింది.

ఆ తర్వాత ఎమెస్కో విజయకుమార్ ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ లో ఆమెని ముఖాముఖి చూసిమాట్లాడేను. ఆ రోజు మా అక్క కూడా ఉంది. ఆమెకి సులోచనారాణి చిన్ననాటి ఆరాధ్యదేవత కావడంతో ఆమెను కలుసుకోడానికి మరింత ఉత్సాహపడింది.

ఆ తరువాత మళ్ళా ఎప్పుడూ మేము మాట్లాడుకోనూ లేదు, కలుసుకునే ప్రయత్నమూ చెయ్యలేదు. కాని ఏడాది రెండేళ్ళ కిందట, ఒకరోజు విజయకుమార్ ఫోన్ చేసి, సులోచనారాణిగారు రామాయణాన్ని ఏదో ఒక ఆడియో ప్రయోగంగా చెయ్యాలనుకుంటున్నారనీ, ఆ ప్రాజెక్టులో నేను కూడా పాలుపంచుకోవాలని కోరుకుంటున్నారనీ చెప్పాడు. కానీ, ఆ తర్వాత మళ్ళా ఎప్పుడూ ఆ విషయం ప్రస్తావనకే రాలేదు.

*

నిన్న అక్క నాకో ఇంటర్వ్యూ పంపించింది. 2004 లో సులోచనారాణిగారితో ఏదో పత్రిక చేసిన ఇంటర్వ్యూ. అందులో, చివరి మూడు పేరాలూ ఇలా ఉన్నాయి:

“…పెద్దయి పేరుప్రతిష్ఠలు వచ్చిన తర్వాత, ఇన్ని సంతోషాలు, సుఖాలు సులువుగా పొందేసిన నేను, అవి లేనివారికి ఏదయినా చేశానా అని నాకు నేను ప్రశ్నించుకునేదాన్ని. నిరుపేదలకు ఏదో ఒకటి చేయాలని నిరంతరం తపన పడేదాన్ని. అందుకే ‘విన్‌’ (విమెన్‌ ఇన్‌ నీడ్‌) అనే సేవా సంస్థను స్థాపించాను. దాని ముఖ్యోద్దేశం- వృద్ధులైన స్త్రీలకి, పేద తరగతి మహిళలకి, పిల్లలకి అవసరమైన సాయం చేయటం. హెల్పేజ్‌ ఇండియా వారు వచ్చి చూసి, దీన్ని పెంచమనీ భారీగా గ్రాంట్‌ ఇస్తామనీ చెప్పారు. ఒక చిన్న పాఠశాల (మా వరండాలోనే) ఏర్పరిచి పనిపాటలు చేసుకునే వారి పిల్లలకి నేనే చదువు చెప్పసాగాను. అనతికాలంలోనే దానికి బాగా ఆదరణ, పేరుప్రతిష్ఠలు వచ్చాయి…”

“(కాని)సాంఘిక సేవ విషయంలో కూడా నేను తప్పు చేశాను. అది ప్రారంభించే ముందు, నా శక్తి ఎంత… నాలాంటి భావసారూప్యత గల వారు నాకు తోడుగా ఉన్నారా లేదా… అని ఆలోచన చేయలేదు- అది నా ఫెయిల్యూర్‌! ఒకటి మాత్రం నాలో బలీయంగా ఉంది. నేనెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో డబ్బు పోగొట్టుకుంటే, కుంగిపోతూ కూర్చోను. ‘‘అది నేను సంపాయించలేదు. అది నాది కాదు’’ అని మానసికంగా చేతులు దులిపేసుకుంటాను. ఉన్నదాంతో ఆనందంగా, సంతృప్తిగా బతకటం నాకు చిన్నప్పటి నుంచీ అలవాటు కాబట్టి ఆ ఇబ్బందులేవీ నన్ను ఎక్కువసేపు బాధ పెట్టలేవు. వాటికి ఎదురు తిరుగుతాను. జీవితంలో ఎక్కడైనా, ఏ విషయంలోనైనా, ఒక కోణం మూసుకుపోతే మీరు దిశ మార్చుకోండి! ఇంకో కొత్త కోణం జీవితంలో మీ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది. అన్నింటికంటే, మన జీవితం మనకి ముఖ్యమైనది. మన జీవితాన్ని మనం ప్రేమించాలి. అప్పుడు జీవితం కూడా తప్పక మనకి ప్రేమని పంచుతుంది. నిరాశ, నిస్పృహలతో కళ్లు మూసేసుకుని, మోకాళ్ల మధ్య తల దూర్చేసుకుని, కుంగిపోయి కూర్చుంటే చీకటి తప్ప ఇంకేం కన్పించదు. జీవితంలో మీ దగ్గరకి వచ్చే ఆనందాలు రావు. అవి నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లిపోతాయి.”

“..నాకెదురైన చేదు అనుభవాలతో, నేనిక భయపడిపోయి, చేతులు ముడుచుకుని కూర్చున్నానని అనుకున్నారా? ఊహు! అస్సలు లేదు! అట్లా అయితే నేను నేనే కాదు! నిజమైన సృజనాత్మకత గల వ్యక్తి అలా ఉండలేరు!.”

*

కాని జీవితం ఆమెకి సరైన అవకాశాలు ఇచ్చి ఉంటే, ఆమెకి పరిస్థితులు మరింత అనుకూలించి ఉండిఉంటే, బహుశా తెలుగు ప్రజలు ఆమెని అత్యధిక జనాదరణ పొందిన రచయిత్రిగా కాకుండా, గొప్ప సాంఘిక కార్యకర్తగా గుర్తుపెట్టుకుని ఉండేవారేమో అనిపిస్తుంది.

23-5-2018

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading