సంత్ జ్ఞానేశ్వర్ రాసిన అమృతానుభవాన్ని తెలుగులోకి అనువదించమని గంగారెడ్డి చాలాకాలంగా అడుగుతున్నాడు. ఆ పుస్తకాన్ని ఎవరైనా మరాఠీ పండితుడి ద్వారా ఒక్కసారైనా విని ఆ పనికి పూనుకుంటానని చెప్తూ వచ్చాను. నిన్నటికి ఆ అవకాశం దొరికింది. మాకోసం పల్దెప్రసాద్ అదిలాబాదులో ఒక మరాఠీ పండితుణ్ణి వెతికి పెట్టాడు. నిన్న పొద్దున్న రవీంద్రకుమారశర్మగారి కళాశ్రమంలో చావర్ డోల్ గిరీష్ అనే పండితుడు తానే స్వయంగా మా దగ్గరకొచ్చి అమృతానుభవం లోంచి కొన్ని ఓవీలు వినిపించి వాటి ప్రతిపదార్థ తాత్పర్యం వివరించాడు. అతడికి మరాఠీ మాతృభాష. తెలుగుపండితుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. కాబట్టి రెండుభాషల్లోనూ సమాన ప్రావీణ్యంతో అతడు వివరిస్తుంటే వినడం తృప్తిగా అనిపించింది.
కాని అంతకన్నా అతడి అదనపు అర్హత, అతడు స్వాధ్యాయ పరివారానికి చెందిన కార్యకర్త కావడం. దాదాజీ పాండురంగశాస్త్రి అటావలె (1920-2003) స్థాపించిన స్వాధ్యాయ ఉద్యమం ఇప్పుడు అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఒక నిశ్శబ్దవిప్లవం సృష్టిస్తోందని అతడి మాటల ద్వారా మాకు అర్థమైంది. అతడు చెప్పినదాన్ని బట్టి స్వాధ్యాయ ఒక ఐచ్ఛిక సేవాకార్యక్రమం. భగవద్గీతకేంద్రంగా గ్రామాల్లో జరుగుతున్న ఒక విశిష్ఠ సంస్కరణోద్యమం. ఆ ఉద్యమంలో భాగంగా ఇష్టపూర్వకంగా కార్యకర్తలు భగవంతుడికి కృతజ్ఞతాసమర్పణగా సామాజికసేవ చేస్తారు. స్వాధ్యాయ పరివార్ మాటల్లో చెప్పాలంటే ‘గుండెనుంచి గుండెకు, గుడిసెనుంచి గుడిసెకు’ నెలకి రెండురోజులు ఏదో ఒక కార్యక్రమంలో తమ వంతు కాలాన్ని దేవుడికి అర్పిస్తారు. ఆ కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళినా తమ సరుకులు, ఆహారపదార్థాలు,చివరికి మంచినీళ్ళుకూడా తామే తీసుకుపోతారు. అపరిగ్రహం వారికి అత్యంతకఠినవ్రతంగానే గానే కాక స్వభావంగా కూడా మారిపోయింది.వాళ్ళు చేస్తున్న పనులగురించి ఎక్కడా ఒక వార్తగానీ, ఫొటోగానీ ప్రచురణకావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఆ కార్యక్రమం అమలు జరుగుతున్న గ్రామాల్లో వేలాది కుటుంబాలు మద్యాన్నీ, పొగాకునీ పక్కనపెట్టేసారు. గ్రామాలకు గ్రామాలు శాకాహారులుగా మారిపోయాయి. ఆ గ్రామాల్లో ఎంపికలు ఉంటాయి తప్ప ఎన్నికలు ఉండవు.
అతడా మాటలు చెప్తున్నంతసేపూ ఆశ్రమంలో కోయిలసంతోషంగా నినదిస్తూనే ఉంది. లోపల పిచికలు గీతపారాయణం చేస్తున్నట్టు కిచకిచలాడుతూనే ఉన్నాయి. చెట్లమీంచి తొలివసంతపు తీపిదనం గాల్లో తేలుతూంది.
అతడి నోటివెంట వింటున్న ఆ కార్యక్రమం గ్రామాల్లో ఎలా జరుగుతోందో చూడాలనిపించింది. అందుకు గంగారెడ్డి తమ జిల్లాలో తమ గ్రామం దగ్గర కొన్నేళ్ళుగా జరుగుతున్న ‘శ్రీ దర్శనం’ అనే విశిష్ట ప్రయోగం గురించి చెప్పాడు. తమ అత్తవారి కుటుంబమంతా కొన్నేళ్ళుగా స్వాధ్యాయ పరివారంలో భాగంగా ఉన్నారనీ, వారు చేపట్టిన శ్రీదర్శనం లాంటిది మన రాష్ట్రంలో ఒక్కచోటనే అమలు జరుగుతోందనీ చెప్పాడు. అంతేకాదు, తిరిగి హైదరాబాదుకి వస్తూండగా, ఆర్మూరుదగ్గర గోవింద్ పేట్ గ్రామానికి నన్ను తీసుకువెళ్ళి ఆ ప్రయోగాన్ని దగ్గరుండి చూపించాడు.
అఠావలె కొన్నేళ్ళ కిందట గోవింద్ పేట్ గ్రామాన్ని సందర్శించినప్పుడు రూపుదిద్దుకున్న సంకల్పం ఇప్పుడక్కడ 14 ఎకరాల సమష్టివ్యవసాయ క్షేత్రంగా వికసించింది. 21 గ్రామాలకు చెందిన స్వాధ్యాయ కార్యకర్తలు స్వయంగా నిర్వహించుకుంటున్న క్షేత్రమది. ఆ గ్రామాలకు చెందిన దంపతులు నెలకు ఒక్కరోజు అక్కడకు వచ్చి గడుపుతారు. అలా ప్రతిరోజూ 30 మందిదాకా కార్యకర్తలు ఏడాదిపొడుగునా అక్కడ కూడుకుని వ్యవసాయం చేస్తారు. పొద్దున్న 8 గంటలనుంచి మర్నాడు పొద్దున 8 గంటలదాకా వారంతా ఒకే కుంటుంబంగా అక్కడ మెలుగుతారు. ఎవరి అన్నాలు వాళ్ళే తెచ్చుకుంటారు. అక్కడకు వచ్చాక అంతా తాముతెచ్చుకున్నదంతా కలిసి పంచుకుంటారు. పొద్దున్న ఎనిమిదినుంచి ఒంటిగంటదాకా పొలం పని, వాళ్ళ మాటల్లో ‘పూజ’. మధ్యాహ్నం ఒంటిగంటనుంచి మూడుగంటలదాకా భోజనం, విశ్రాంతి. తిరిగి మళ్ళా మూడునుంచి ఆరుదాకా పొలం పూజ. ఏడున్నరకల్లా రాత్రి భోజనం పూర్తి. ఆతర్వాత ప్రార్థనలు, భగవద్గీత స్వాధ్యాయం, ముందుముందు చేపట్టవలసిన కార్యక్రమాల ప్రణాళికలమీద చర్చ. 1997 లో మొదలైన ఈ ప్రయోగంలో ఇప్పటిదాకా ఆ సుక్షేత్రంలో ఒక్కరోజు కూడా సోమరిగా గడిచింది లేదు.
అక్కడ పొలంలో జొన్నపంట అప్పుడే కోసివుంది. కొంతమేరకు నువ్వుచేను బలంగా ఎదిగి కనిపిస్తోంది. వంగతోటలో కొందరు స్త్రీలు కూరగాయలు కోస్తున్నారు. నాకున్న కొద్దిపాటి వ్యవసాయపరిజ్ఞానంతో వాళ్ళ పొలంపని అంచనావెయ్యడానికి ప్రయత్నించాను. ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ఆవుపేడతో మాత్రమే నడుపుతున్న అ క్షేత్రంలో దిగుబడి ఆ ప్రాంతంలోనే అత్యధికమైందన్నారు వాళ్ళు. వర్మికంపొష్టు ప్లాటుతో పాటు అక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా ఉంది. ఏడాదికి రెండుమూడుసార్లు కురిసిన వర్షపు నీటిని భద్రపరిస్తే ఆ నీళ్ళు మొత్తం ఏడాది అంతా సరిపోతున్నాయన్నారు. అంతేకాదు, ఎవరో ఆ నీళ్ళనీ, కిన్లే వాటర్ నీ పోల్చి చూస్తే, మినరల్ వాటర్ లో ఫంగస్ కనిపించిందిగాని, వాళ్ళు నిలవచేసుకున్న వాననీళ్ళలో మాత్రం ఎటువంటి మలినాలు కనిపించలేదన్నారు. వాళ్ళ ప్రయత్నాలకు గౌరవసూచకంగా గంగాజలంలాంటి ఆ నీళ్ళొక చెంబెడు తాగాను.
ఆ తర్వాత వాళ్ళ మందిరంలో కొంతసేపు వాళ్ళతో ముచ్చటించాను. 21 గ్రామాలనుంచి వచ్చిన ఆ కార్యకర్తల్లో నాతో మాట్లాడినవాళ్ళలో ఒకాయన ఇంటర్మీడియెట్ దాకా చదువుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఒకాయన కార్పెంటరు. మరొకాయన హైస్కూలు ప్రధానోపాధ్యాయుడు. ఒక యువకుడు హైదరాబాదులో బాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి. తాము చేస్తున్న పని- నెలలో ఒకరోజు కాలాన్నిభగవంతుడికి నైవేద్యంగా సమర్పించి తక్కిన 29 రోజుల్నీ ప్రసాదంగా స్వీకరించడమే అన్నారు వాళ్ళు. తాము చేస్తున్న పనివల్ల తమకి సంతోషం, శాంతి లభిస్తున్నయనీ, నిరాశ అన్నది తామెరగమనీ అన్నారువాళ్ళు. తమ గ్రామాల్లో తమ కుటుంబాలూ, తమపిల్లలూ ఆదర్శంగానూ, ఆరోగ్యంగానూ ఉన్నారనీ, 21 గ్రామాలకు చెందిన తామంతా ఒక కుటుంబంగా మారిపోయామనీ చెప్పుకొచ్చారు వాళ్ళు. తాము పొందుతున్న ఆనందాన్ని నాతో పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహపడ్డారు. ఉవ్విళ్ళూరేరు.
ఆ క్షేత్రాన్నిగాని, ఆ స్వాధ్యాయపరివారాన్ని కాని పోటో తియ్యడానికి నాకు అనుమతి దొరకలేదు. కాని నేనక్కడ చూసిన దృశ్యాల్నీ, వాళ్ళ వదనాల్నీ అకాశమంతా ఆవరించిన వెన్నెల్లో దారిపొడుగునా నా మనోఫలకం మీద చిత్రించుకుంటూనే ఉన్నాను. వారం రోజులకిందటనే భగవద్గీత గురించి చాలా ఆలోచనతో గడిపాను. మంత్రాలనరసింహశర్మగారు అన్నట్టు నేను బహుశా గీతలో ఎంచెప్పారు, ఎందుకు చెప్పారు అన్న అంశంకన్నా ఎవరు చెప్పారు ఎలా చెప్పారు అన్నదాని మీదనే ఎక్కువ దృష్టిపెట్టానేమో. కాని ఈ దేశంలో, మన కాలంలో కనీసం ఒక్క మానవుడు గీతను స్వాధ్యాయం చేసిన దానిఫలితం ఇంత సామాజిక, కౌటుంబిక, వ్యక్తిగత వికాసంగా పరిణమిస్తుందని ఊహించలేకపోయాను.
సంత్ జ్ఞానేశ్వర్ గీతను ప్రజల భాషలోకి తీసుకువెళ్ళాడు. దాదాజీ పాండురంగశాస్త్రి అథావలె గీతనొక ప్రజాకార్యక్రమంగా మార్చేసాడు. అమృతానుభవం చదవాలన్న మా యాత్ర మమ్మల్ని నిజంగానేఒక అమృతానుభవం చెంతకు తీసుకువెళ్ళిందని అర్థమయ్యింది.
14-4-2014