ట్రెవర్ ఛాంబర్లేను

t

బ్రిటిష్ చిత్రకారుడు ట్రెవర్ ఛాంబర్లేను నా రోల్ మోడల్స్ లో ఒకరని చెప్పాక, ఆయన గురించి మరొక నాలుగు వాక్యాలు కూడా రాయాలనిపించింది.

ఛాంబర్లేను 1934 లో పుట్టాడు. చిన్నప్పణ్ణుంచీ చిత్రకళ మీద ఆసక్తి ఉన్నప్పటికీ, ఎవరిదగ్గరా చిత్రకళ నేర్చుకోలేదు. స్వయంకృషితోటీ, పూర్వ బ్రిటిష్ చిత్రకారుల్ని అధ్యయనం చెయ్యడంతోటీ తనంటన తను చిత్రకారుడిగా మారేడు. కొన్నాళ్ళు ఒక అర్కిటెక్చర్ సంస్థలో సహాయకుడిగా పనిచేసాక, 1972 లో రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పెయింటెర్స్ లో చేరాడు. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెరైన్ పెయింటర్స్ లో కూడా సభ్యుడిగా ఉన్నాడు.

అతడు చిత్రించిన తైలవర్ణాల కన్నా నా దృష్టిలో అతడు చిత్రించిన నీటిరంగుల చిత్రాలు చాలా గొప్పవి. దాదాపుగా ఆ చిత్రాలన్నీ, ఆరుబయట చిత్రించినవే. ఆరుబయట (plein-air) చిత్రించడం ఇంప్రెషనిస్టులు ప్రపంచానికి పరిచయం చేసిన ఒక సాహసోపేత ప్రక్రియ.

ముఖ్యంగా నీటిరంగుల్ని ఆరుబయట చిత్రించడమంటే, కుంచె మనోవేగంతో కదలవలసిఉంటుంది. మనం కాగితం సిద్ధం చేసుకుని రంగులు కలుపుకునేలోపే వెలుగు పక్కకు తప్పుకుంటుంది, నీడలు మారిపోతాయి. ఒక క్షణం చూసిన దృశ్యం మరొకక్షణంలో అదృశ్యమైపోతుంది. అందుకనే ఛాంబర్లేను ‘నేనో క్షణాన్ని పట్టుకున్నాకనే దాన్ని దృశ్యంగా చిత్రిస్తాను’ అంటాడు.

కాలవేగానికి తగ్గట్టుగా తన కళాశ్వాన్ని పరుగుపెట్టించే క్రమంలో అతడు అద్భుతమైన మాస్టరీ సముపార్జించాడు. అతడట్లా తన కుంచెమీదా, రంగులమీదా, చిత్రీకరణ మీదా సాధించిన సామర్థ్యాన్ని చూస్తూంటే నాకు మతిపోతుంది.

ఆ రహస్యాల్ని మనం ఒక జీవితకాలం పాటు అధ్యయనం చేస్తూండవచ్చు. ఎందుకంటే అతడొక జీవితకాలం పాటు పూర్వమహాచిత్రకారులైన థామస్ గిర్టిన్ (1775-1802), టర్నర్ (1775-1851), జాక్ మెరియోట్ (1901-1968) వంటివారిని అధ్యయనం చేస్తూ తన కళని మెరుగుపెట్టుకుంటూ వచ్చాడు.

కనుమూసి కనుతెరిచేలోపు మారిపోయే వెలుగునీడల్ని పట్టుకోవడం కోసం అతడు అనుసరిస్తూ వచ్చిన వ్యూహాల్లో ప్రధానమైనవి మూడు:

మొదటిది, అతడు చిత్రించే బొమ్మలు సాధారణంగా 7″x10″సైజు మించకుండా చూసుకుంటాడు. ఆ సైజువల్ల ఎక్కువసేపు రంగులు చిత్రిస్తూ ఉండవలసిన అవసరం ఉండదు. ఒకటి లేదా రెండు సార్లు బ్రష్ నిండా రంగునింపుకుని ఒకటి రెండు పూతల్లో కాగితం మొత్తం చిత్రించవచ్చు.

66

రెండవది, limited palette. ఎక్కువరంగులు వాడకపోవడం. అతడు మొదటిపూత, ఆ బొమ్మలో ప్రధానంగా ఏ మిడ్ టోన్ ఉంటుందో దాంతో త్వరత్వరగా ఆ కాగితమంతా నింపేస్తాడు. ఇందులో మొదటి బొమ్మ చూడండి. షిరాజ్ దగ్గర ఒక ప్రాచీన శిథిలాన్ని చూస్తున్న ముగ్గురుస్త్రీల బొమ్మ, 1994 లో చిత్రించింది. అరవై ఏళ్ళ పండువయసులో చిత్రించిన ఈ బొమ్మ నన్నెప్పుడూ విభ్రాంత పరుస్తూఉంటుంది.

t1

13.6″x21.6″ సైజులో చిత్రించిన ఈ బొమ్మలో మిడ్ టోన్ మధ్యరకం పసుపురంగు. Raw Sienna తో పలచటి పూత పూసాక, అప్పుడు ఆ కుడ్యశిల్పం మీదనుండే నీడల్ని ultramarine blue, burnt sienna ల మిశ్రమంతో చిత్రించాడు. అది రెండవ పూత. అది కూడా ఆరిన తరువాత, గాఢమైన నలుపు కోసం మళ్ళా ultramarine blue, burnt sienna లను చిక్కగా కలిపి, కుడివైపున ముగ్గురు స్తీలనీ చిత్రించేడు. అది మూడవ పూత. ఈ మూడు పూతల్లోనూ అతడు చాలా పరిమితమైన రంగులు , మూడు రంగులు మాత్రమే వాడేడు. కాని ఆ మూడు రంగుల్తోటే ఎన్నో వర్ణ ఛాయలు ఆ చిత్రంలో మేల్కొల్పాడు. ఉదాహరణకి ఆ రాతిగుర్రాన్ని చూడండి, అది ధూమ్రవర్ణం నుంచి నారింజరంగు తిరిగి, ప్రకాశవంతమైన పసుపు రంగులీనుతూంది.

మూడవది, ఎక్కువ వివరాలు చిత్రించకుండా, ఏ వివరాల్ని అందిస్తే,ఎంతో చెప్పినట్టుంటుందో,ఆ కీలకవివరాల్ని మాత్రమే చిత్రించడం. ఛాంబర్లేను ఒక్క క్షణాన్ని దృశ్యంగా పట్టుకునేటప్పుడు తన నేత్రాల్లో బంధించుకునేది ఆ కీలకవివరాల్నే. ఈ బొమ్మలో చూడండి: ఆ స్త్రీల దుస్తులు, వాళ్ళు నడుస్తుంటే ఆ దుస్తుల రెపరెపలు- ఎక్కువ వివరాలు చిత్రించకుండానే ఎంతో చిత్రించిన భ్రమ మనకు కలగచేస్తున్నాడు.

కాని అన్నిటికన్నా గొప్ప విషయం,ఆ చిత్రమంతటా తీక్షణమైన మధ్యాహ్నపుటెండలో తడిసిముద్దవుతున్నది. ఆ ఎండ సెగ చూపరుల చూపుకి కూడా తగిలి కళ్ళు మసకకమ్మేటంతగా ఉంది.

ఈ దృశ్యంలో అతడు సాధించిన economy of means కవిత్వంలో ఒక ఇస్మాయిల్ వంటి వాడు సాధించిన కౌశల్యంతో పోల్చదగ్గది.

చాంబర్లేను చిత్రించిన తక్కిన బొమ్మలు కూడా చూడండి. ఛాంబర్లేనును 21 వ శతాబ్దపు ఇంప్రెషనిస్టు చిత్రకారుడిగా ఎందుకు ప్రస్తుతిస్తున్నారో అర్థమవుతుంది.

17-2-2016

arrow

Paintings: Trevor Chamberlain

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading