జీవన శిల్పి-19

పొద్దున్నే ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి గురూజీ ఆ ప్రాంగణంలో పచార్లు చేస్తూ కనిపించగానే, ఖలీల్ జిబ్రాన్  చిత్రించిన ‘ప్రవక్త ‘ లాగా ఉన్నారే అని అనుకున్నాను. కొందరు శ్రోతలు అప్పటికే అక్కడ చేరి ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో ముగ్గురు నలుగురు ఉపాధ్యాయులు కూడా కనిపిస్తున్నారు. గురూజీ వెనక ఆ ప్రార్థనామందిరం చిన్న ఓడలాగా కనిపిస్తున్నది.  సముద్రపు ఒడ్డున తనని స్వదేశానికి తీసుకువెళ్ళే ఓడలాగా ఆశ్రమమూ, ఆర్ఫలీజు నగర పౌరుల్లాగా ఆ శ్రోతలూ కనిపిస్తున్నారు.

నన్ను చూడగానే గురూజీ చిరునవ్వుతో ‘ఆయియే, ఆయియే’ అంటున్నారు.  ‘ ఇప్పుడు ఇళ్ళ గురించి చెప్పండి’ అని ఒక తాపీమేస్త్రి ఆల్ ముస్తఫాని అడిగింది గుర్తొచ్చింది. ‘నిన్న ఇళ్ళ గురించి చెప్తున్నది మరికొంత వివరించండి గురూజీ ‘ అని అడిగాను ఆయన వెనకనే ప్రార్థనామందిరంలో అడుగుపెడుతూ.

‘అట్లనా!’ అని నవ్వి గురూజీ చెప్పడం మొదలుపెట్టారు:

‘ఇంటికి ముఖ్యమైన లక్షణాలు ఐదు. ఒకటి, ఇల్లు ఆరోగ్యాన్నివ్వాలి. రెండవది, ఆర్థికరూపంలో తోడ్పాటునివ్వాలి. మూడవది,  గృహస్థుని ఆధ్యాత్మిక దిశలో ముందుకు తీసుకెళ్ళాలి. నాలుగవది ప్రకృతిని ప్రేమించడం నేర్పాలి. అయిదవది, మనిషిని సామాజికంగా ఉంచాలి. ఈ అయిదు లక్షణాలు లేని ఇల్లు ఇల్లే కాదు.’

‘వాస్తు అంటే కేవలం దిశలు మాత్రమే అనుకుంటున్నారు. దిశ ఒక గదికి కూడా ఉంటుంది. అందుకే కేవలం ఒకే ఒక్క గదిలో జీవించేవాళ్ళు కూడా అవన్నీ పాటిస్తున్నారు. ఆగ్నేయంలో దీపం పెడతారు. ఈశాన్యంలో నీళ్ళలోటా నింపి పెట్టుకుంటున్నారు.  కానీ, ఇవన్నీ  చాలా మూర్ఖత్వాలు. ప్రస్తుతం విపరీతంగా సాగుతున్నాయి.’

‘తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, ఈశాన్యం, వాయవ్యం, నైరుతి- ఎనిమిది దిశలున్నాయి. పూర్వం ఇల్లు నిర్మించేవాళ్ళు ఏవైనా ఎందుకలా నిర్ణయించారో మనం పరిశీలించాలి. సింహ ద్వారం తూర్పున ఉంటుంది. ఈశాన్యంలో నీళ్ళుండాలి. నీళ్ళు ఎలాంటి ప్రదేశంలో ఉండాలంటే ఎవరైనా బయటినుంచి వచ్చి అక్కడినుండే నీళ్ళు తీసుకుని వెళ్ళిపోయేలా ఉండాలి. అప్పట్లో నీళ్ళకోసం బావి ఉండేది. నీటి అవసరం అందరికీ ఉంటుంది కదా. ఇంట్లో నీళ్ళకి ఇబ్బంది అని ఎవరూ అనకూడదు. ఒకవేళ ఈశాన్యాన్ని వదిలేసి బావిని నైరుతి దిశలోగనుక తవ్వితే అది గొడవలకి కారణమవుతుందని భావించేవాళ్ళు. ఎందుకంటే ఇల్లంతా చుట్టి నీళ్ళకోసం వెళ్ళాల్సి ఉంటుంది. అంతలా రోజంతా ఎవరు తిరుగుతారు? గ్లాసుకావాలన్నా, గిన్నె కావాలన్నా గొడవలవుతాయి. అందుకే నీటిని ఎలాంటి ప్రదేశంలో ఉంచాలంటే, ఎవరికీ- ఇంటివాళ్ళకిగానీ, బయటివాళ్ళకి కానీ ఇబ్బంది కలగకూడదు. బయటినుండి వచ్చి అక్కడినుండే నీళ్ళు తీసుకుని వెళ్ళిపోవచ్చు. బయటినుండి ఎవరైనా లోపలకి వస్తుంటే అక్కడ కాళ్ళూ చేతులూ కడుక్కుని ఆ తర్వాతే ఇంట్లోకి రావచ్చు. కాబట్టి నీటిని అలాంటి ప్రదేశంలో ఉంచాలి.’

‘ఆగ్నేయంలో వంటగది ఉంటుంది. ఆగ్నేయంలో వంట వండేవాళ్ళు మహిళలు ఉండేవాళ్ళు, వారికి ఇంట్లోకి ఎవరొస్తున్నారనేది స్పష్టంగా కనిపించేది. ఎవరైనా వచ్చారనుకోండి: ‘ఓహో, వీరు భోజనం చేసి వెళ్తారు’ అని లేదా ఎవరైనా వస్తే ‘వీరు పాలు తాగేవాళ్ళు’ అనీ ‘వీరు చాయ్ తాగేవాళ్ళు’ అనీ వాళ్ళకి తెలిసిపోయేది.  వాళ్ళు వెంటనే దానికి తగ్గట్టుగా ఆ సమయానికి ఆ వస్తువు పంపించేవాళ్ళు. ‘సరే,వీరు భోజనం చేసి వెళ్తారు. వీళ్ళకోసం వంట వండండి’ అని ముందే సిద్ధం చేసేవాళ్ళు. అది మహిళలకి చాలా సౌకర్యంగా ఉండేది.’

‘ఇక చదువుకునేవాళ్ళ కోసం వాయవ్య దిశ, వృద్ధుల కోసం నైరుతి దిశ ఉండేవి. ఒకవేళ చదువుకునేవాళ్ళు నైరుతిలో ఉండి, వృద్ధులు కనుక వాయవ్యంలో ఉండే అది గొడవలకి కారణం అవుతుంది. పోట్లాటలకి కారణం అవుతుంది. ఎందుకంటే ఈ పిల్లలదగ్గరికి, లేదా ఈ యువకుల దగ్గరికి చాలా మంది వస్తుంటారు. అక్కడ వృద్ధుడు కూర్చుని ఉంటే, ‘ఎవరు వాళ్ళు? ఎందుకు వచ్చారు? పనేం లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తారా ఏంటి?’ అని ప్రశ్నలు వేస్తుంటాడు. దాంతో గొడవలవుతాయి. అందుకే వృద్ధుల్ని ఎలాంటి ప్రదేశంలో ఉంచాలంటే, అక్కడ వాళ్ళని ఎవరూ ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు కూడా ఎవర్నీ ఇబ్బందిపెట్టకూడదు.’

‘ఆవులోపలకి వస్తోంది అంటే, ఆవు ఏ వైపుకు తిరుగుతుంది అనేదాన్నిబట్టి ఆ వైపున గోశాల నిర్మించాలి. గుర్రం ఉంటే, అది ఏ వైపుకు సులభంగా తిరుగుతుందో ఆ ప్రదేశంలో అశ్వశాల ఉంటుంది. మిగతావి, ఉదాహరణకి పాము ఉందనుకోండి, పాము అన్ని వైపులకీ సులభంగా తిరగలేదు, అది తిరగడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. పాము ఏ వైపుకు తిరుగుతుంది, ఒకవేళ ఈ మార్గం గుండా లోపలకి వస్తే ఏ వైపుకు త్వరగా తిరుగుతుంది అనేదాన్ని బట్టి ఆ వైపున తలుపు ఉంచాలి. తద్వారా అది బయటకు వెళ్ళిపోతుంది.’

‘ఇలాంటి అన్ని సౌకర్యాలూ మనవాళ్ళు గమనించారు. దక్షిణం వైపున ఎటువంటి మార్గమూ ఉంచేవారు కాదు. ఎటువంటి కిటికీగానీ, ద్వారంగానీ ఉండేది కాదు. దక్షిణం నుండి వచ్చే గాలులు విషపూరితమైన గాలులు అని భావించేవారు. అవి  ఇంట్లోకి రాకూడదు. తూర్పుగాలి సంవత్సరంలో పది పదిహేను రోజులు వీస్తుంది. ఈశాన్యం, తూర్పు దిశల నుంచి వీచే గాలులు ఇంట్లోకి రావాలి. అందుకని ఆ వైపున ఖాళీగా ఉంచేవాళ్ళు. మిగతా గాలులన్నీ వాయవ్యం, పడమర వైపునుంచి వీస్తాయి. అందువల్ల వంటగదిని ఎలాంటి ప్రదేశంలో ఉంచేవారంటే, పూర్వం పొయ్యి వెలిగించినప్పుడు ఆ గాలివల్ల పొగ నేరుగా బయటకు వెళ్ళిపోయేది. ఒకవేళ వంటగది నైరుతిలో పెడితే పక్కనున్నవాళ్ళ ఇంట్లోకి పొగవెళ్తుంది. గొడవలవుతాయి. ఎందుకంటే తూర్పు-పడమరల లెక్కన నిర్మించిన ఇండ్లలో, ఆగ్నేయంలో ఉన్న ఇంటికంటే, దాని దక్షిణాన ఉన్న ఇల్లు రెండు చేతులు వెనక్కి ఉంటుంది. ఉత్తరాన ఉన్న ఇల్లు రెండు చేతులు ముందుకు ఉంటుంది. అందువల్ల వంటగది పొగ నేరుగా బయటకు వెళ్ళిపోవాలి. ఈ సౌకర్యాలన్నీ చూసేవాళ్ళు- మన వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు అని. దిశలపరంగా కూడా ఆ లెక్కన చూసేవాళ్ళు.’

‘నేను చెప్పిన ఐదు లక్షణాల్లో ఇవి మనిషికి సామాజికత అలవర్చడం కోసం చేసినవి. మిగతావాటిలో ఆరోగ్యం గురించి చూద్దాం. ఆయుర్వేదం ప్రకారం కాళ్ళు వేడిగా, కడుపు మెత్తగా, తల చల్లగా ఉంటే ఆ మనిషి ఆరోగ్యశాలి. కాబట్టి ఇల్లు పూర్తి టెంపరేచర్ ఆ పద్ధతిలో ఉండాలి. పూర్వకాలం దీన్నెలా చూసుకునేవారంటే- కింద ఆవుపేడతో అలికేవారు. ఆవుపేడ ప్రత్యేకత ఏమిటంటే దాని టెంపరేచర్ ఎప్పుడూ పెరగదు లేదా తగ్గదు. పోయిన ఉగాది రోజు ఇక్కడికి వచ్చినవారంతా ఈ విషయం స్వయంగా చూశారు కూడా.  మన దగ్గర ఆవుంది కదా. అవుపేడతో అక్కడ పూర్తిగా అలికారు. చాలారోజులుగా అలుకుతున్నారు కదా. అందరూ అన్నాలు తినడానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకి చెప్పుల్లేకుండా వెళ్ళేవాళ్ళు. కాని ఎవరి పాదాలకి వేడి అనిపించేది కాదు. అటునుంచి కొద్దిగా ఇటు రాగానే పాదాలు సురసురలాడేవి.  చెప్పులు గుర్తొచ్చేవి అందరికీ. అక్కడేమో, పేడతో అలికిన చోట, చెప్పుల్లేకుండానే వచ్చేవాళ్ళు.  కాబట్టి ఆవుపేడతో కళ్ళాపు చల్లినచోట, అలికిన చోట, భూమి వేడెక్కదు. ఎక్కడైతే పొలాల్లో కనీసం ఒక అర అంగుళం మందాన ఆవు పేడ పడి ఉండేదో, అక్కడ వేడెక్కేది కాదు. అందుకే అక్కడ భూమి పగిలేది కాదు. తేమను కలిగి ఉండేది.’

‘అలాగే, ఇండ్లల్లో ఎంతసేపటి వరకు వెలుతురు ఉండాలి అనేది కూడా చూసుకున్నారు. ఈ కప్పు ఇంతసేపు ఉంది. కొద్దిగా సూర్యుడు ముందుకు రాగానే దానిమీద నీడ పడేలా చేసేసారు కప్పుని. దీనివల్ల ఇల్లంతా వేడవ్వదు. చివర్లో నైరుతి దిశ ఒక మూల ఎత్తుగా ఉంచుతారు అన్నింటికంటే. ఎందుకంటే పూర్తి ఎండ ఆ మూలలో వచ్చి ఆగిపోతుంది. మూడు గంటల తర్వాత పూర్తి కప్పులు, ఇటు ముందరి కప్పులు పూర్తి నీడలోకి వచ్చేస్తాయి. ఆ ఒక్క మూల మాత్రమే ఎండలో ఉండిపొతుంది. కానీ ఇప్పుడు ఈ సిమెంటు ఇండ్లు వచ్చాక మన తల వేడెక్కిపోతోంది. కింద మార్బుల్ ఫ్లోరు వేసుకుంటున్నారు. దానివల్ల పాదాలు చల్లబడిపోతున్నాయి.  ఇదంతా పెద్ద గందరగోళానికి దారితీస్తోంది.’

‘ఇళ్ళల్లో ఒక అంగణం మొదలుకుని పదహారు అంగణాల దాకా నిర్మించే విధానం ఉంది మనకి. ఒక అంగణం అయితే ఉండాల్సిందే. గరిష్ఠంగా పదహారు అంగణాల కూడా నిర్మించుకోవచ్చు. ప్రతి ఇంటిలో కనీసం నాలుగైదు అంగణాలైతే ఉంటాయి. వెనక భాగం ఒకరకమైన అంగణం ఉండేది. ముందరి అంగణం ఒకటి ఉంది, అటు ఇటు అంగణం ఒకటి ఉండేది. అందులో చెట్టుచామలు నాటి ఉండేవారు. వసారా కూడా ఒక అంగణం లాగే ఉపయోగపడేది.’

‘అలా ఒకటినుండి పదహారు అంగణాల దాకా ఆ పూర్తి భూమి ఏదైతే ఉందో దాన్ని సమతలంగా ఉంచేవారు కాదు. ఎక్కడో మూడు నాలుగు మెట్లు పైకి ఎక్కాలి. ఎక్కడో మూడు నాలుగు మెట్లు కిందకి దిగాలి. మళ్ళీ వెళ్ళాలి. ఎక్కడో ఎక్కాలి- ఇలా పైకి కిందకీ ఉండేదీ. సమతలంగా ఉండేది కాదు. కాబట్టి ఇళ్ళల్లో వృద్ధులు ఉన్నాసరే, వాళ్ళు సులువుగా తిరిగి వచ్చేవారు. ఒక వృద్ధుడికి ఇరవై ముప్ఫై మెట్లు ఒకేసారి కనిపిస్తే అతనికి ప్రాణం పోయినట్టు అవుతుంది. ‘అరే, బాబోయ్’ అనుకుంటాడు. కానీ ఒకటి రెండు మెట్లే కనిపిస్తున్నప్పుడు, అతను మీరు చేయందించబోతే ‘లేదు, లేదు నేను ఎక్కుతాను’ అనేవాడు. అలా రోజంతా వ్యాయామం జరుగుతూనే ఉంటుంది.’

‘అలాగే, పూర్వకాలం ఇంట్లో ఎక్కడైనా కూర్చో, ఆకాశం కనిపించేది.  ఇంత తెరిచి ఉండేది. ఎక్కడనుండి అయినా కనిపిస్తుంది. ఇది కూడా దాని ఒక నియమం. ఇంత తెరిచి, తెరిచి ఉండాలి అనేది.’

ఇక, రెండవలక్షణం ఏమంటే, డబ్బు విషయంలో వాస్తు ఇబ్బంది పెట్టకూడదు. పురాణాల్లో వాస్తుపురుషుడు ఒక రాక్షసుడు. అతను అడ్డదిడ్డంగా పడి దొరికిందల్లా భక్షిస్తుండేవాడు. తినేసేవాడు. కాబట్టి దేవతలందరూ వీణ్ణిలా  వదిలేస్తే ప్రపంచాన్ని అంతం చేసేస్తాడని భయపడి వాణ్ణి కొట్టి తిట్టి కిందపడేశారు. దాంతో వాడు బోర్లా పడ్డాడు. వాడు మళ్ళీ లేవకుండా దేవతలంతా వాడిమీద అన్ని దిక్కులా నిలబడిపోయారు. వాడికేం చెప్పారంటే ‘ నీమీద ఎప్పుడు భవన నిర్మాణం జరుగుతుందో, ఇల్లు నిర్మిస్తారో, ఆ సమయంలో వాస్తుశాంతి జరుగుతుంది. అప్పుడు  నీకు ఏ ఆహుతులిస్తారో అదే నీ ఆహారం. ఆ తర్వాత నీకు మరే ఆహారమూ ఉండదు’ అని. కాబట్టి మునుపటి  ఇండ్లకి తమదైన డిమాండ్ ఏమీ ఉండేది కాదు. అక్కడైతే ఒక చాప కూడా అందంగా అనిపించేది. ఒక మంచం కూడా మంచిగా అనిపించేది. ఏమీ లేదంటే ఒక ముగ్గువేసి చాలా అందంగా తయారుచేసి భోజనాలు గీజనాలు కానిచ్చేవారు. ఆ ఇంటికి ఎలాంటి డిమాండ్ ఉండేది కాదు- ఈ వస్తువు ఉండాల్సిందే అనిగాని, అది లేకుండా నడవదనిగాని ఉండేది కాదు.’

‘కానీ  పూర్వం బోర్లా పడుకున్న వాస్తుపురుషుడు ఇప్పుడు నిటారుగా అయిపోయాడు. మళ్ళా భక్షణం మొదలుపెట్టాడు. మనకి శాస్త్రాలు ఒకమాట చెప్పాయి. ఇంటినుండి నిశ్చింతగా ఉండు అని. గృహస్థునుంచి నిశ్చింతగా ఉండు అని ఏ శాస్త్రమూ మనకు చెప్పదు. నిశ్చింతగా ఉండాలి ఇల్లు నుండి. గార్హస్థమయితే మన ధర్మం. మనకు ఇంతమంది ఋషులున్నారు కదా, వీళ్ళల్లో ఏ ఋషీ సన్న్యాసి కాడు. ప్రతి ఒక్కరికీ భార్య ఉండేది. కొందరికి నలుగురు, కొందరికి పదిమంది కూడా భార్యలుండేవారు. ప్రమాదకరమైన కొడుకులుండేవారు. అయినా కూడా వాళ్ళ మాట ఏమిటంటే, ఇల్లునుండి నిశ్చింతగా ఉండు.’

‘కాబట్టి ఇంట్లో స్థలాన్ని ఆక్రమించే వస్తువులేవీ ఉండకూడదు. ఇల్లు మనిషిని ఆర్థికంగా ఇబ్బందిపెట్టకూడదు. డబ్బు విషయంలో కొంచెం కూడా ఇబ్బంది పెద్దకూడదు. మనకున్న పూర్వకాలపు ఇండ్లలో, పెద్ద పెద్ద ఇండ్లు నిర్మించిన తర్వాత కూడా అందులో స్థలాన్ని ఆక్రమించే వస్తువు ఏదీ ఉండేది కాదు. భోజనాలు వాళ్ళూ చేసారు, వాళ్ళూ పడుకునేవారు, అతిథి సత్కారాలూ అన్నీ చేసారు. కానీ ఇంట్లో స్థలాన్ని ఆక్రమించే వస్తువు ఏదీ ఉండేది కాదు. పీటలు వేసేవాళ్ళు. భోజనం చేసేవాళ్ళు. అయిపోగానే వాటిని తీసి మూలనపెట్టేసేవాళ్ళు.  మంచాలు పరిచేవాళ్ళు. పడుకునేవాళ్ళు, లేవగానే వాటిని తీసి ఒక గదిలో పెట్టేసేవాళ్ళు. ఒక పెద్ద ఊయెల ఉండేది, అందులో కూర్చుని ఊగేవారు. అవసరం లేదనుకున్నప్పుడు దాన్ని తీసి పక్కనపెట్టేసేవాళ్ళు. అంతే, ఇంట్లో ఒక పెద్ద చెక్క మంచం ఉండేది, ఇంటి పెద్దాయన ఎవరైనా దానిపై పడుకునేవాడు. లేదా ఎవరైనా మహాత్ములు వస్తే దానిపై కూర్చునే వాళ్ళు. లేదా బస్తీలో నాటకాలూ, డ్రామాలూ ఉంటే దాన్ని స్టేజిలాగా వాడుకోడానికి పిల్లలు ఎత్తుకెళ్ళేవాళ్ళు. అంతకంటే దానికి ఎక్కువ పని ఉండేది కాదు. ఈ విధంగా ఇల్లంతా పూర్తిగా ప్రశాంతంగా, ఖాళీగా ఉండేది.’

‘దుస్తుల విషయానికొస్తే ఎవరికీ మూడు నాలుగు జతల కంటే ఎక్కువ ఉండేవి కావు. నేను చాలా సార్లు ప్రజలకి చెప్తుంటాను. మన దగ్గర ఒక ముసలాయన ఉండేవాడు. అతని దగ్గర చాలా తక్కువ దుస్తులుండేవి. రెండు ధోవతులు, బనియను, ఒక దుప్పటి, తలపాగా ఉండేవి. అతను ఎంత పెద్ద ధనవంతుడంటే, ప్రతి రోజూ ఉతికిన బట్టలు వేసుకునేవాడు. మరిక్కడ ఇంత పెద్ద పెద్ద ధనవంతులు వచ్చి కూర్చుంటారు కదా, వాళ్ళు ఎంత దరిద్రులంటే- రోజూ ఉతికిన బట్ట వేసుకోవడం వాళ్ళ నసీబులో లేదు. ఇప్పుడు పాంటు వేసుకుంటే దాన్ని ఎన్నిసార్లు ఉతుకుతారు? నెలకొక్కసారి ఉతుకుతారు. రోజూ ఉతికిన గుడ్డలు వేసుకోవడం వీళ్ళ అదృష్టంలో లేదు. రోజూ ఎంగిలి బట్టలే వేసుకుంటారు. కానీ ఆ ముసలాయన ఎంత మంచివాడంటే రోజూ ఉతికిన వస్త్రాలే ధరించేవాడు. ఏ మనిషైనా రోజూ ఉతికిన బట్టలే వేసుకోవాలి. ఉతకనివి వేసుకోకూడదు. అందుకే వాటి పరిమితి అంతవరకే ఉంచారు- రోజూ ఉతుక్కుని వేసుకోవచ్చు అని. ఇప్పుడు ఎంతమంది రోజూ ఉతికిన బట్టలు వేసుకుంటున్నారు? చాలా రోజులకుగానీ ఉతుక్కోరు.’

‘అందుకనే పూర్వకాలం ఇండ్లలో పెద్ద పెద్ద అలమారాలు అవసరం ఉండేది కాదు. ఏ ఇంట్లో అయితే మనిషి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటాడో, వాడు సాహిత్యం, సంగీతం, కళలు, పరమాత్మ గురించి ఎప్పుడూ ఆలోచించలేడు. వానికి అసలు తీరికే ఉండదు. వాడు రోజూ రాంత్రింబగళ్ళు తన ఇంటిని ఒక మ్యూజియంలాగా మార్చడానికి కష్టపడుతూనే ఉంటాడు. ఇప్పుడు అదే వాస్తుని చూసి ఆధునిక ఇండ్ల డిజైన్లు వస్తున్నాయి. కానీ అక్కడ ప్రపోర్షనూ, డిజైన్లలో గందరగోళం జరిగింది. దాంతో ఇల్లు మనిషిని ఆర్థికంగా ఇబ్బంది పెడుతోంది. నేటి ఇంటికి వాస్తుశాంతి చేసి అందులో అడుగుపెట్టగానే అక్కడ మన మంచం సరిగ్గా సరిపోదు. అక్కడ మన బొంత చాలా అపరిశుభ్రమైన గుడ్డలా కనిపిస్తుంది. అక్కడ మన చాపలు జారిపోతుంటాయి. పీటలు అందంగా కనిపించవు. దాంతో ఇంటి అవసరాలు మొదలవుతాయి- డైనింగ్ టేబుల్ తీసుకురావాలి, డెకొలం మంచాలు తేవాలి, సోఫా తేవాలి, అది తేవాలి, ఇది తేవాలి, చివరకి వంటగది పాత్రల వరకూ అన్నీ మార్చేయాలి. పాత పచ్చడి జాడీ కూడా అక్కడ అందంగా కనిపించదు. ఆ వస్తువులన్నీ మార్చాల్సి వస్తుంది. ఆ వస్తువులకోసం, తన ఇంటిని ఒక మ్యూజియంలాగా మార్చడం కోసం మనిషి రోజూ రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాడు, చాలా దారుణంగా. ఎందుకంటే మళ్ళీ పది పన్నెండేళ్ళ తరువాత అన్నీ మారుస్తారు కదా.’

‘ఈ పీట చూడండి. ఇది ఎంత పాతదైతే అంత ధర పలుకుతుంది. ఇది ఇంకా అందంగా తయారవుతుంది. ఇందులో ఒక గంభీరత ఉంటుంది. దీన్ని దాచుకోవాలనిపిస్తుంది. కానీ ఆధునిక ఫర్నిచరు అలా కాదు. ప్రతి పదేళ్ళకీ దాన్ని మార్చేయాలి. దాని డిజైన్ దాచుకోవడానికి వీలుగా ఉండదు. దాన్ని దాచుకుంటే దానికి పెద్ద ధర వస్తుందని ఏమీ లేదు. చంద్రాపూర్ మహారాజు గోండ రాజు. ఆయన పీటలు చూసాం. ఆ పీటల్లో ఒక పీట కుమ్మరులు కొన్నారు. అది 18 కిలోల వెండితో చేసిన పీట. చాలా అందమైన పీట. బిడ్డ పుట్టిన తరువాత స్నానం చేయించేవారు దానిమీద. కుమ్మరులు దాన్ని కొనుక్కుని ముక్కలు ముక్కలుగా చేసి వెండి పంచుకున్నారు. ఆ పీట అంత అందంగా ఉండేది.’

‘కానీ మూర్ఖత్వం మొదలైంది మనదగ్గర. మన దగ్గరున్న పాతవస్తువులూ, పాతపద్ధతులూ ఏవైతే ఉన్నాయో కాలంతో పాటు వాటి విలువ పెరుగుతూ పోతుంది. ఆధునిక వస్తువులు అలాకాదు. కాలంతో పాటు వాటి విలువ తగ్గిపోతుంది. ఇదొక పెద్ద గందరగోళం.’

‘కేవలం ఒక ఇంటి డిజైన్ మారిపోవడం వల్ల ఇంత పెద్ద అనర్థం జరుగుతోంది. నేను చాలాసార్లు చూస్తుంటాను. మన దగ్గర ఈ రెండు అరుగులున్నాయి. నేను ప్రజలకి ఇదే చెప్తుంటాను- ‘చూడండి, మనం ఇక్కడ కూర్చుని ఎంత పనిచేస్తున్నామో. కూర్చుని మాట్లాడే పనే కదా. ఇంత పని చేయడంకోసమే ఈ రోజు ప్రతి ఇంట్లో ఇరవై వేలనుండి రెండు లక్షల రూపాయల దాకా ఖర్చుపెడుతున్నారు’ అని. పనేమిటి? కూర్చుని మాట్లాడుకోవడం. దానికి ఫర్నిచరు ఇరవై వేలనుండి మొదలవుతుంది. రెండు లక్షలదాకా ఉంటుంది. తీరా ఎవరైనా వచ్చినప్పుడు వాడు ఆలోచిస్తాడు-దీనిమీద నేను కూర్చోవాలా వద్దా అని. దానిమీద కూర్చోడానికి కూడా ఒక పెద్ద పద్ధతి ఉంటుంది- అక్కడ అలాగే కూర్చోవాలి అని. కాళ్ళు పైకీ  కిందకీ పెట్టి కూర్చోలేరు కదా, ఒక పద్ధతి ఉంటుంది. ఎక్కడైతే ఒక పద్ధతి ప్రకారం కూర్చుని మాట్లాడాలో అక్కడ ఎంతవరకు మాట్లాడగలరు?’

‘అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను. ఇంత చిన్నపనికోసం మన దగ్గర రెండు అరుగులున్నాయి. కూర్చుని పని అవుతుంది. ముచ్చట్లు అవుతాయి. కలెక్టరు వచ్చినా అక్కడే కూర్చుంటాడు. ఎవరైనా అడుక్కునేవాడు వచ్చినా అక్కడే కూర్చుంటాడు. ఎవరికీ ‘నన్ను చాలా పెద్దగా గౌరవించారు’ అని అనిపించదు, లేదా ‘నన్ను అవమానించారు’ అనీ అనిపించదు. హాయిగా అక్కడ కూర్చుంటారు. రాత్రిపూట పడుకుంటారు కూడా. అది ఎన్నో రకాలుగా పనికొస్తుంది. దానికి ఖర్చు ఏముంది? మన పూర్వకాలం ఇండ్లల్లో ఇలాంటివి చాలా ఉండేవి. ఖర్చు లేకుండా అన్నీ అయిపోయేవి.’

‘కాబట్టి ఇల్లు ఎలా ఉండాలంటే అది ఆర్థిక రూపంలో మనల్ని ఇబ్బంది పెట్టకూడదు. మరి మనం ప్రజలకు ఏం చెప్తున్నాం? ‘లో కాస్ట్ హౌసింగ్’ అంటాం. కాస్టు గురించి చెప్పి ఏ ఇంటినీ అవహేళన చెయ్యకూడదు. అది అవమానం. ఏ ఇల్లైనా ఇల్లే అవుతుంది. అందులో లో కాస్ట్, హై కాస్ట్ ఉండదు. లో కాస్ట్ కి అర్థం  చౌక మెటీరియల్ తో చిన్న ఇల్లు నిర్మించడం కాదు. లో కాస్ట్ కి అర్థం, ఏ ఇంట్లో అయితే మనిషి తక్కువ ఖర్చులో జీవించగలిగేలా ఉండగలడో  అది. ఆలాంటి ఇళ్ళను డిజైను చెయ్యవచ్చుకదా.’

‘ఈ ఆధునిక గృహంలో ఇంత పెద్ద ఫర్నిచరు నింపడం ఒకటైతే, ఈ ఇండ్ల వల్ల పిల్లలమీద చాలా పెద్ద అన్యాయం జరుగుతోంది. వృద్ధుల మీద అన్యాయం జరుగుతోంది. రెండు కళ్ళు ఎప్పుడూ వారిని నియంత్రిస్తూనే ఉంటాయి. ‘లేదు, లేదు, ఆ సోఫామీద కూర్చోనివ్వకండి, వాడు మూత్రం పోసేస్తాడనో  లేదా ‘ఆ కరెంటు సాకెట్టు ఉంది కదా, అందులో వేలుపెడతాడు’ అనో లేదా ‘ఆ బట్టలు పట్టుకుని లాగుతాడు, ఆ ఫ్లవర్ వాజ్ కింద పడేస్తాడు’ అనో రెండు కళ్ళు-తల్లివో, తండ్రివో- ఎప్పుడూ వాళ్ళని గమనిస్తూనే ఉంటాయి. వాళ్ళు ఎప్పుడూ పిల్లల్ని కనిపెట్టి చూస్తూనే ఉంటారు. దాంతో పిల్లల్లో మెలమెల్లగా దాసత్వ ప్రవృత్తి ఏర్పడుతుంది. పిల్లవాడు ఒక దాసుడిగా, గులాంలాగా, చెప్తేనే చేసేవాడిగా తయారవుతాడు. దాసత్వ ప్రవృత్తి వచ్చేసి, వాడు ప్రశాంతంగా కూర్చుండిపోతాడు. ఏమీ చేయడు. ఏదైనా  చేస్తే దెబ్బలు పడతాయి, లేదా తిట్లు పడతాయి అని భయపడతాడు. రోజురోజుకూ వాడు కుంచించుకుపోవడం మొదలవుతుంది. ఏమీ చేయడు. ఆ తర్వాత వీళ్ళు ‘వాడు క్రియేటివ్ మైండ్ అవాలి, అదవ్వాలి, ఇదవ్వాలి’ అని ఆశలుపెట్టుకుంటారు. ‘దాసత్వప్రవృత్తిని మీరే అలవాటు చేసారు, ఆ తర్వాత ఆశలు పెట్టుకుంటున్నారు, ఎలా అవుతాడు వాడు?’ వాడెప్పటికీ కాలేడు. ఎందుకంటే ఆ బిడ్డ పెద్దవాడవుతున్న కొద్దీ వానికి తన తల్లిదండ్రుల మీద అసహ్యం మొదలవుతుంది. వాని ప్రవృత్తిలో ఆ భావన వస్తుంది- మొదటినుండీ మమ్మల్ని అణచిపెట్టారు, తొక్కేసారు, మమ్మల్ని ఏమీ చెయ్యనివ్వలేదు, మా ఇష్టప్రకారం చెయ్యనివ్వలేదు అని. ఈ భావన ఇప్పటి యువతరంలో చాలా ఎక్కువగా ఉంది. అది నిజం కూడా. ఎందుకంటే వాళ్ళని మొదటినుండీ ఏమీ చెయ్యనివ్వలేదు కదా, మరి వాడెలా చేస్తాడు?’

‘అలాగే మన ఇండ్లల్లో ముసలివాళ్ళ పరిస్థితి. పూర్వం మన ఇండ్లు పెద్దపెద్దగా ఉండేవి. ఎలాంటివారైనా సరే అందులో మహిళలు బయటకు కనిపించేవారు కాదు. ముసలివాళ్ళు కనిపించేవారు కాదు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ స్థలంలో వాళ్ళు ఉండేవారు. ఆధునిక డిజైన్ల ఇండ్లల్లో వాళ్ళకు స్థలమే లేదు. వాళ్ళు నేరుగా రోడ్డుపైకి వచ్చేశారు. అవును, నేరుగా రోడ్డుపైనే కనిపిస్తారు. కానీ పాత ఇండ్లల్లో వాళ్ళు అన్నీ చేసుకుంటున్నా బయటకు కనిపించేవారు కాదు. అది చాలా అందమైన డిజైన్. ఎప్పుడైతే అంత వెసులుబాటు ఉంటుందో, ఆర్థికంగా నిశ్చింతగా ఉంటారో, అప్పుడు మనిషి ఆధ్యాత్మిక దిశగా వెళ్తాడు. వీటన్నింటితో అనుబంధం ఏర్పడుతుంది. ఆర్థికంగా నిశ్చింతగా ఉండాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యం అవుతాయి. ఎక్కడైతే మనిషి ఆర్థికంగా ఇబ్బంది పడతాడో, అక్కడ మన ఆధ్యాత్మిక ముచ్చట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. అంతా శూన్యం అవుతుంది. దానికి అర్థమే ఉండదు.’

‘ప్రకృతిని ప్రేమించే గుణమూ, ఆధ్యాత్మికతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మన ఇండ్ల డిజైన్లలో ఎక్కడా సరళరేఖల్ని మంచివిగా భావించలేదు. ఎందుకంటే బాణం నేరుగా వెళ్తుంది. దాని ధర్మం ఖండించడం, అది నరుకుతుంది. ప్రతి సరళరేఖా ఖండిస్తుంది. అందుకే మన ఇండ్లల్లో ఎక్కడా సరళరేఖల్ని ఉంచలేదు- అటు వీథుల్లోగానూ, ఇటు ఇంటినిర్మాణంలోగానీ. వెనక ఉన్న చెట్లూ, కొండలూ ఎలా ఉంటాయో అదే ఆకారంలో ఇంటి బయటి డిజైన్ ఉండేది. అది సాయంత్రం పూట ప్రకృతిలో ఒక భాగంలా కనిపించేది. ఇప్పుడు కూడా చాలా పల్లెటూళ్ళు సాయంత్రం పూట ప్రకృతిలో ఒక భాగంలాగే కనిపిస్తాయి. ప్రకృతికి వేరుగా కనిపించవు.’

‘ఎప్పుడైతే ఈ స్ట్రెయిట్ లైను ఇండ్లు రావడం మొదలయ్యాయో అప్పటినుండి వెనక ఉన్న చెట్టు కూడా మనకి కట్ అయినట్లు కనిపిస్తుంది, కొండ కూడా కట్ అయినట్లు కనిపిస్తుంది. ఏ వస్తువైతే మనకి కట్ అయినట్టు కనిపిస్తుందో దాంతో మనం మమేకం కాలేం. దానికి శత్రువులమవుతాం. అందుకే ఈ రోజుల్లో మనిషి ప్రకృతికి పెద్ద శత్రువు అయిపోయాడు. ఇప్పుడున్న ఇండ్లలో వెనక ఉన్న చెట్లు, కొండలు అన్నీ కట్ అయినట్టు కనిపిస్తాయి. దాంతో ఎలా మమేకం కాగలుగుతాం? దాంతో మనం కలవలేం, శత్రువులుగా మారిపోతాం.’

‘అందుకే మన సంప్రదాయంలో స్ట్రెయిట్ లైనును మంచిదిగా భావించలేదు. ఇంతకుముందు, ఇక్కడి పల్లెటూళ్ళలో, గోండుల కొలాముల ఇండ్లు కూడా స్ట్రెయిట్ లైనులో ఉండేవి కావు. అవి గుండ్రంగా ఉండేవి. అందరికీ ఒకటే వాకిలి ఉండేది. చాలా సాపుగా ఉండేది. నాది-నీది అనే భావన అక్కడ లేదు. చాలా శుభ్రంగా ఉండేది. ఈ ఐటిడీఏ వాళ్ళు వచ్చాక వీళ్ళందరికీ ప్లాట్లు చేసి ఇచ్చారు. ప్రతి ఒక్కరి స్థలాన్ని ఖరారు చేసారు.  దాంతో ప్రతి ఒక్కడూ తను ఊడ్చేది తన హద్దు వరకే ఊడుస్తాడు. దాని పక్కకు వెళ్తే గొడవ అవుతుంది. ఎప్పుడైతే ఈ సరళరేఖల్ని ఖరారు చేసారో, ప్రజల్లో కొట్టుకునే ప్రవృత్తి పెరిగిపోయింది. ఒకరితో ఒకరు గొడవపడటం మొదలుపెట్టారు. ఎందుకంటే నీదీ-నాదీ అనే భావన అక్కడ వచ్చేసింది.’

‘పూర్వం గోండు గ్రామాల్లో అలా ఉండేది కాదు. గుండ్రంగా గ్రామాలు సాగేవి, చాలా అందంగా ఉండేవి. ఇప్పుడు ఈ స్ట్రెయిట్ లైను ఇండ్లు వచ్చిన తర్వాత మనిషికి ఎవరూ కనిపించడం లేదు. వాడు బయటకు వస్తే తప్ప ఎవరూ కనిపించరు. దీనివల్ల మనిషి మెల్లమెల్లగా ఏకాకి జీవితం వైపు వెళ్తున్నాడు-ఒంటరిగా బతకడం అలవాడు చేసుకుంటున్నాడు. ఈ ఇండ్లు మనిషిని సామాజికజీవిగా కాక ఏకాకిగా మారుస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరం.’

‘ఒకసారి- చాలా ఏళ్ళకిందటి మాట, మా సుబ్బారావుగారు హైదరాబాదులో ప్రోగ్రాం పెట్టారు. అప్పుడు హైదరాబాదులో చాలా గొడవలు జరుగుతున్నాయి. పాతబస్తీలో పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. రోజూ టీవీలో చూస్తున్నాం, రేడియో వింటున్నాం. ఈయనేమో పదే పదే పిలుస్తున్నారు: ‘గురువుగారు, వచ్చేయండి, వచ్చేయండి. ఇక్కడ ఏమీ లేదు, వచ్చేయండి ‘ అని. నేనూ, డాక్టర్ చందూ  ఇద్దరం ఇక్కడినుండి వెళ్ళాము. ఆబిడ్సులో దిగాము పొద్దుపొద్దున్నే. నేను డాక్టరుగారితో అన్నాను: ‘వాతావరణం అంతా చూసాను. అక్కడ జనాలు కుక్కల్ని తీసుకుని హాయిగా మార్నింగ్ వాక్ కి వెళ్తున్నారు. పేపరు వాడు పేపరు వేస్తున్నాడు. పాలవాడు పాలు ఇస్తున్నాడు. అసలు ఏమీ జరగనట్లే ఉంది ‘ అని.’

‘మేమిద్దరం కలిసి ఆటోలో కాకుండా రిక్షాలో కూర్చున్నాం. చాలా ఏళ్ళయ్యింది, రిక్షాలో కూర్చుని, రిక్షాలో వెళ్దాం అనుకున్నాం. ఆ రిక్షావాడు మమ్మల్ని అడుగుతున్నాడు-‘ఎక్కడికి వెళ్ళాలి సార్?’ అని. మేము సప్తగిరి హోటల్ కి వెళ్ళాలి. అది పెద్ద హోటల్. వాడు మాకు చెప్తున్నాడు: ‘మీరు పల్లెటూరినుంచి వచ్చినట్లున్నారు. మీకు తెలియదు. నేను ఒక మంచి హోటల్ కి, తక్కువ ధరలో ఉండే హోటల్ కి తీసుకెళ్తాను’- అని దారంతా చెప్తూనే ఉన్నాడు. ‘లేదు భయ్యా, మేము అక్కడ ఎవరినో కలవడానికి వెళ్తున్నాం, స్టే చేయడానికి కాదు. మేమెందుకుంటాం ఆ హోటల్లో?’ అని. ‘సరే మీరు వెళ్ళి రండి. నేను ఇక్కడే బయట ఉంటాను. ఒకవేళ అక్కడ రూం దొరకకపోతే వేరే లాడ్జికి తీసుకువెళ్తాను’ అని అంటున్నాడు.

‘నేను తిరిగి రూం కి వచ్చేసాక, ఆలోచించాను-ఏంటి విషయమని. పాతబస్తీలో అంతలా కొట్టుకుంటున్నారు. మరి ఈ కొత్తబస్తీ అంతా అసలేమీ జరగనట్లే ఉంది. అంతా ప్రశాంతంగా సాగుతోంది. మరి వీరేమైనా సంస్కారవంతులైపోయారా? వీళ్ళు గొడవలు కోరుకోవడం లేదా? చాలా సుసభ్య సమాజమా ఇది? ఆలోచించగా ఆలోచించగా అనిపించింది, ఆ పాతబస్తీ, ఆ గ్రామాల మొహల్లాల డిజైన్ అలాంటిదని- అక్కడ మంచిపనులకైనా, చెడ్డపనులకైనా ప్రతి ఒక్కడూ బయటకు వచ్చేస్తాడు. కొట్టుకోవాలన్నా బయటికి వచ్చేస్తారు. ఏదైనా చాలా మంచి పని చేయాలన్నా కూడా బయటకు వచ్చేస్తారు. అక్కడ పెద్ద పెద్ద యజ్ఞాలు కూడా జరుగుతాయి. అందరూ దానికోసం బయటకు వస్తారు. ఆ ఇండ్ల డిజైన్ అటువంటిది, అది మనిషిని చైతన్యవంతంగా ఉంచుతుంది.’

‘కానీ ఈ ఆధునిక గృహాల బస్తీల డిజైన్  మనిషిని చైతన్యహీనుడిగా మారుస్తుంది. బస్తీలో, మొహల్లాలో, ఊళ్ళో ఏం జరిగినా వీడికి అనవసరం. వీడికి సంబంధం లేదు. వాడు మంచిపనికీ బయటకు రాడు, చెడు పనికీ బయటకి రాడు. అలాగే చైతన్యరహితుడు అయిపోతాడు. అందుకే ఈ సమాజమంతా చైతన్యరహితమవుతోంది.’

‘పూర్వం మన బట్టల దుకాణాలు ఉండేవి కదా. ఆ బట్టల దుకాణం ఎలా ఉండేది- సేఠ్ కూర్చునేవాడు, మునిమ్ కూర్చునేవాడు, నౌకరు కూర్చునేవాడు, కొనుగోలుదారుడు కూర్చునేవాడు. అందరూ ఒక కుటుంబంలాగా కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. ఇవ్వడం, తీసుకోవడం చేసేవాళ్ళు. ఎప్పుడైతే మధ్యలో ఒక సరళరేఖ వచ్చిందో, ఒక కౌంటరు వచ్చిందో, సేఠ్ మాయమైపోయాడు. మునిమ్, మేనేజరు పేరుతో, గ్లాస్ కాబిన్ లోపలకి వెళ్ళి కూర్చున్నాడు. నౌకర్లకోసం విడివిడిగా స్టూళ్ళు వచ్చాయి. కస్టమర్ కోసం విడిగా ఒక వ్యవస్థ వచ్చింది. ఇలా అందరినీ విడదీసేసింది-ఒక్క లైన్. ఒక  కౌంటరు వాళ్ళ మధ్యలోకి రావడం వల్లనే ఇదంతా జరిగింది. అంతా గందరగోళమైపోయింది. ఒకవేళ అది లేకపోతే, అదంతా మళ్ళీ ఒక కుటుంబంలాగా ఉంటుంది. కానీ ఆ ఒక్క గీత అందరినీ విడదీస్తోంది. అందుకే మన దగ్గర సరళరేఖలకి అస్సలు ప్రాధాన్యతనివ్వలేదు. మన వృత్తిపనివాళ్ళు సరళరేఖల వస్తువుల్ని వేటినీ తయారుచేయలేదు. సరళరేఖ ఎంత ప్రమాదకరమైనదో వాళ్ళకి తెలుసు.’

‘చాలా ఐఐటీల్లో ప్రోగ్రాములు పెడుతుంటారు. నన్ను కూడా పిలుస్తుంటారు. నేను వాళ్ళతో చెప్తుంటాను, ఆ పోడియం డబ్బా ముందు, దాని వెనక నిలబడి నేనైతే మాట్లాడలేను అని. ఎందుకంటే ఆ పోడియం వెనుక నిలబడి మాట్లాడితే- మాట్లాడేవాడు సగమే కనిపిస్తాడు, వినేవాడూ సగమే కనిపిస్తాడు. మరి పూర్తి సంభాషణ ఎలా అవుతుంది? ఎప్పటికీ అవ్వదు. పూర్తి సంభాషణ అవ్వాలి అంటే మొత్తం కనిపించాలి. అందరూ కనిపించాలి.’

‘అదే  ఇక్కడ జరిగే సంభాషణ ఉంది కదా. ఇక్కడ ఎలా కూర్చుని ఉన్నారు-మొత్తం కనిపిస్తున్నారు కదా, కూర్చోవడంలో కనుక మార్పు వస్తే సంభాషణ బంద్ అయిపోతుంది. ఇక్కడైతే అందరూ కనిపిస్తున్నారు. నా మాట్లాడటంలో ఏమైనా తేడా వస్తే మాట్లాడే పద్ధతిలో కూర్చునే పద్ధతిలో తేడా వస్తే సంభాషణ ముగిసిపోతుంది. ఎక్కడైతే మనిషి కూర్చునే పద్ధతిలో మార్పు రాలేదో, అవతలివాడు ఎంతవరకూ మాట్లాడతాడు అనేది ఇవతలివాడు కూర్చునే పద్ధతిని బట్టి ఉంటుంది. వాని కూర్చునే పద్ధతి ఎలా ఉంది, వాడు ఎంత జిజ్ఞాసతో వింటున్నాడు, లేదా నిర్లక్ష్యంగా వింటున్నాడా- ఇదంతా కనిపిస్తుంది కదా. అక్కడ ఈ విషయాలు కనిపించవు. అందుకే వాడు తనదంటూ ఒక పద్ధతి ఖరారు చేసుకుంటాడు- వినండి, వినకపోండి, మీ ఇష్టం, నేనైతే ఇంత చదవాలి, చదివేసి వెళ్ళిపోతాను అని. సెమినార్లలో జరిగేది అదే కదా.’

‘కాబట్టి ఈ సరళరేఖ అనేది చాలా ప్రమాదకరమైన రేఖ. అందుకే మనదగ్గర ఎప్పుడూ సరళరేఖకి ప్రాధాన్యతనివ్వలేదు. సరళరేఖల లెక్కన ఏ వస్తువునూ నిర్మించలేదు. ఎందుకంటే ప్రకృతిలో ఎక్కడా సరళరేఖ లేదు. మన శరీరంలో ఎక్కడా సరళరేఖ లేదు. మరి మనం సరళరేఖల వస్తువుల్ని ఎందుకు ఉపయోగించాలి? మనమెందుకు సరళరేఖలుగా మారాలి? మొత్తం ప్రపంచానికి ఈ సిద్ధాంతం వర్తిస్తుంది అని నేననడం లేదు. మన ప్రకృతి వాతావరణం, పర్యావరణం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను.సరే, కొన్ని దేశాల్లో ప్రకృతితో పోరాడుతూ బతకాల్సి వస్తుందేమో, అది వేరే విషయం. వాళ్ళ సిద్ధాంతాలూ, నియమాలూ కొన్ని వేరుగా ఉండవచ్చు. కానీ మన దగ్గర మాత్రం అలా లేదు. మనం కూడా అలాగే ఇక్కడ చేస్తున్నామంటే అది మూర్ఖత్వమే అవుతుంది-’

గురూజీ మాటలు వింటుంటే ‘మీ ఇంటిని లంగరుగా మార్చకండి, తెరచాపగా పైకెత్తండి’ అని అల్ ముస్తఫా చెప్తున్నట్టే ఉంది.

21-6-2026

5 Replies to “జీవన శిల్పి-19”

  1. Loved the way you opened this part of the conversation with Khalil Gibran’s ‘The Prophet’ reference, Sir.

    వాస్తు గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము.

    ముఖ్యంగా ఇంటికి ఉండవలసిన లక్షణాలు ఆరోగ్యం, ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజికత, ప్రకృతి ప్రేమ, ఆధ్యాత్మిక దిశలో నడిపించడం గురించి చెప్పిన వివరాలు మన పూర్వీకుల holistic perspective towards life ను తెలియచెప్తున్నాయి.

    అలాగే సరళరేఖలు మనుషులను ఎలా విడదీస్తాయో, ప్రకృతిలో భాగం కావడానికి సరళరేఖల డిజైన్లు ఎలా అడ్డు పడతాయో చదివి గురూజీ ఎంత లోతుగా అధ్యయనం చేశారో కదా అని ఆశ్చర్యం కలుగుతుంది.

    And you concluded with another beautiful reference from The Prophet: “గురూజీ మాటలు వింటుంటే ‘మీ ఇంటిని లంగరుగా మార్చకండి, తెరచాపగా పైకెత్తండి’ అని అల్ ముస్తఫా చెప్తున్నట్టే ఉంది.”

    ఈ సంభాషణలో గురూజీ చెప్పిన విషయాల్ని మీరు ఈ reference తో ముగించడం చాలా బాగుంది.

    ‘The Prophet’ మీద కూడా మీరొక series చేస్తే బాగుంటుంది. 🙏🏽

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ! నేను ఇంతకు ముందు The Prophet పైన మాట్లాడాను. ఆ ప్రసంగం నా బ్లాగులో ఉంది.

  2. ప్రొద్దున్నే ఆశ్రమానికి వెళ్ళేటప్పటికి గురూజీ ఆ ప్రాంగణంలో పచార్లు చేస్తూ కనిపించగానే, ఖలీల్ జిబ్రాన్ చిత్రించిన ‘ప్రవక్త ‘ లాగా ఉన్నారనీ, గురూజీ వెనక ఆ ప్రార్థనామందిరం చిన్న ఓడలాగా కనిపిస్తున్నది. సముద్రపు ఒడ్డున తనని స్వదేశానికి తీసుకువెళ్ళే ఓడలాగా ఆశ్రమమూ, ఆర్ఫలీజు నగర పౌరుల్లాగా ఆ శ్రోతలూ కనిపిస్తున్నారనే పోలిక తో ఎంతో సందర్భానుచితంగా ఈ సంభాషణకు పరిచయ వాక్యాలు మొదలు పెట్టడం మీ వల్లే సాధ్యమయింది భద్రుడు గారు. జిబ్రాన్ కావ్యంలో ఆల్ ముస్తఫా ఆర్ఫలీజ్ నగర పౌరుల మధ్య నిలబడి జీవిత సత్యాలను బోధించినట్లు, ఇక్కడ గురూజీ చుట్టూ చేరిన మీ అందరికీ ఆయన ప్రసంగం ఒక బోధన లాగ ఉందనే ఊహ మీలో ఉన్న అనంత సాహిత్య పిపాసకు నిదర్శనం. జిబ్రాన్ కావ్యంలో ఒక తాపీమేస్త్రి (Mason) ‘ఇళ్ళ గురించి చెప్పండి’ అని ఆల్ ముస్తఫాని అడిగిన సందర్భాన్ని ఇక్కడి గురూజీ సంభాషణకు అనుసంధానించడం భలే అనిపించింది.

    ప్రస్తుత సమాజంలో వాస్తు అంటే మూఢనమ్మకాలు, గోడలు బద్దలు కొట్టడాలు, దిశల చుట్టూ భయాందోళనలతో తిరగడం అనే భ్రమకు ఫుల్ స్టాప్ పెడుతూ గురూజీ, ఈశాన్యంలో నీరు ఎందుకుండాలి, ఆగ్నేయం లో వంటగది, ఇంకా ఇంటికి సంబంధించిన ఎన్నో వాస్తు సూత్రాలను, దిశల విభజన ఎలా ఉండాలి అనే అంశాల వెనుక ఉన్న సామాజిక స్పృహను ఎంత శాస్త్రీయంగా ఆవిష్కరించారో.

    జిబ్రాన్ ‘ది ప్రాఫెట్’ లో ఇళ్ళ గురించి చెప్తూ— “మీ ఇల్లు మీ శరీరానికి ఒక పెద్ద వస్త్రం లాంటిది, అది ఎండలో పెరుగుతుంది, రాత్రి వేళల్లో నిశ్శబ్దంగా నిద్రిస్తుంది” అంటాడు. గురూజీ కూడా ఇళ్ల గురించి, ఇళ్ల వాస్తు గురించి వివరించిన చాలా చోట్ల ‘మన ఇళ్లల్లో ఎవరి వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదు.. ప్రకృతితో కలిసి మమేకం అవుతూ సాగాలనే చెప్పడం.. మీ ఉపోద్ఘాతానికి, ముగింపు వాక్యానికి పూర్తి న్యాయం చేసిందనిపించింది.

    1. మీరు ఈ సంభాషణ పొడుగునా ఎంతో ఆర్ద్ర హృదయంతో ప్రయాణించినట్లుగా మీ స్పందన తెలియజేస్తున్నది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading