జీవనశిల్పి-18

దాదాపుగా సాయంకాలమైంది. మేము మ్యూజియం నుంచి బయటికొచ్చి మళ్ళీ వేపచెట్టుకిందకి చేరుకున్నాం. గురూజీ పూర్వకాలపు గ్రామాల్లో ఇండ్ల డిజైన్ గురించి చెప్తున్నప్పుడు, ఇప్పటి ఇండ్ల గురించి కూడా చెప్పమని అడుగుదామనుకున్నాను. కానీ ఈలోపు అక్కడున్న మిత్రుల్లో ఒకరు అడవి గురించి చెప్పమన్నారు. వనాల గురించీ, వనవాసుల గురించీ గురూజీ దగ్గరనుంచి వినవలసింది చాలానే ఉందని నా నమ్మకం. అప్పటికే సాయంకాలమైపోతూ ఉంది కాబట్టి ఆ విషయం మరోరోజుకి వాయిదా వెయ్యమందామనుకున్నాను. అలాగని ఇండ్ల గురించి మాట్లాడించడానికి కూడా సమయం సరిపోదు. ఏం చేద్దామా అనుకుంటూ ఉండగానే గురూజీ సంభాషణ మొదలుపెట్టారు. చిత్రంగా, ఆయన ఇండ్లు కట్టడంలో ఉపయోగించే కలప గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.

‘గ్రామం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. శిల్పం అంటే ఇంజనీరింగ్ అని అర్థం. అవును. ఒక రకంగా. ఇంజనీరింగ్ ని సంస్కృతంలో శిల్పం అంటారు. శిల్పంలో మూడు భాగాలున్నాయి: వాస్తు, సాధనం, కృషి. వీటిల్లో వాస్తు చాలా పెద్ద విషయం. విశాలమైన కోటలు మొదలుకుని చిన్న గుడిసెదాకా ఎలా నిర్మించాలన్నదానికి పూర్తి ఇంజనీరింగ్ ఉంది. బిచ్చగాళ్ళు కూడా గుడిసెలు వేసుకుంటారు కదా, గోళాకారంగా వేసుకుంటారు. ఒక్కోసారి కూలీలు కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారు కదా. ఎంత పెద్ద తుపాను వచ్చినా ఎగిరిపోవు అవి. అలాగని అవేమీ బలమైన మెటీరియల్ తో తయారు చేసినవి కావు. కానీ ఎగిరిపోవు. దానిలోకి నీరు కూడా రాదు. వాస్తులో దాని గురించి కూడా ఉంది. అలాంటి నిర్మాణాలకి చాలా అందమైన పేరు ఉంది- శివకుల్లా. దాని డిజైన్ ఎలా ఉంటుంది, దాని నిర్మాణ పద్ధతి ఏమిటనేది వాస్తులో వస్తుంది. వాళ్ళు ఆ వాస్తు తెలుసుకుని నిర్మిస్తారా? కాదు. అది వాళ్ళకి సహజంగానే అబ్బిన విద్య. అది శతాబ్దాలుగా వస్తూ ఉంది. దానికి కూడా ఒక సూత్రం ఉంది, సిద్ధాంతం ఉంది. వాళ్ళు గాలివాటు చూస్తారు. అన్నింటినీ చూసే నిర్మిస్తారు.’

‘విశాలమైన కోటలు కూడా వాస్తులో ఒక భాగమే. కోట తర్వాత ఇండ్లూ,  భవనాలూనూ. భవనాల్లో మనదగ్గర ఏకశాల, ద్విశాల, త్రిశాల, చతుశ్శాలల గురించి నేనింతకుముందే చెప్పాను. వాటిల్లో దేవాలయం కూడా ఉంది. దేవాలయాలు ఎలా ఉండాలనేదానిమీద కూడా అందులో చాలా ఉంది. మన దగ్గర దేవాలయాలు మూడు రకాలు: ద్రావిడ, వేసర, నాగర, పల్లవ. పల్లవ ఒక శైలి కానీ మూలమైనవి మూడే- ద్రావిడ, నాగర, వేసర. దేని బేస్ గుండ్రంగా ఉంటుందో అది వేసర.  నాగర శైలిలో పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ. ద్రావిడ శైలి చతురస్రాకారంగా ఉంటుంది.’

‘అలాగే దేవాలయాల్లో వాడే శిల లేదా ఇంటి మెటీరియల్ ఎలా తయారు చేయాలి, ఏమి తయారు చేయాలనేది కూడా  మనదగ్గర ఉంది. మహాభారతంలో అనేక రకాల భవనాల నిర్మాణం కనిపిస్తుంది. మహాభారతంలో లాక్షాగృహం కూడా నిర్మించారు కదా. అలానే మయసభ కూడా ఒక వాస్తునమూనానే. భవనాలు ఏ మెటీరియల్తో తయారు చేయాలి అనేది అందులో ఉంది. వాటిల్లో ఇప్పుడు సున్నం చాలా అద్భుతమైన మెటీరియల్.’

‘రాయి కూడా ఎలాంటి రాయి ఉపయోగించాలన్నది ముఖ్యం. మన దగ్గర ఎప్పుడూ కూడా భవననిర్మాణంలో, లేదా ఇల్లు కట్టడంలో బేస్ మెంటు లో ఒకే సైజు రాళ్ళు ఉపయోగించలేదు. గోల్కొండలో కుతుబ్ షాహీ సమాధుల్లో, మహళ్ళలో చూడండి. అక్కడ ఒకే సైజు రాళ్ళు ఉండవు. ఏ రాయి దొరికితే ఆ రాయిని ఒకదానితో ఒకటి కలిపి అమర్చారు. పాత ఇండ్ల పునాదులు చూస్తే, రెండున్నర అడుగుల తాడు కట్టి రాళ్ళను అమర్చేవారు. రాయి ఎంత పెద్దదైనా దానికి తగ్గట్టుగా అమర్చేవాళ్ళు. పాత ఇండ్లన్నీ అలానే ఉండేవి. రాళ్ళను ఒకే సైజులో కట్ చేసి నిర్మించడం సిమెంట్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మొదలయ్యింది. చార్మీనార్ ని కూడా ఒకే సైజు రాళ్ళతో నిర్మించలేదు. చిన్న చిన్న రాళ్ళముక్కల్తో, సున్నంతో నిర్మించారు దాన్ని.’

‘సున్నానికి ఒక ప్రత్యేకత ఉంది. సున్నం పాతబడేకొద్దీ దాని వయస్సు, బలం పెరుగుతాయి. సిమెంటు వయసు కేవలం 22 సంవత్సరాలు అని చెబుతారు. ఇరవై రెండేళ్ళ తరువాత అది బలహీనపడటం మొదలవుతుంది. కానీ సున్నం అలా కాదు. వందేళ్ళ తరువాత దాని బలం ఇంకా పెరుగుతుంది. అది రాయిలాగా మారుతుంది. అది బలహీనపడకపోగా మరింత గట్టిపడుతుంది. సిమెంట్ అయితే యాభై ఏళ్ళలోపే అంతమైపోతుంది. ఇసుకలా రాలిపోతుంది. అందుకే యాభై, అరవై, ఎనభై ఏళ్ళనాటి సిమెంటు ఇళ్ళు ఇప్పుడు వాటంతట అవే కూలిపోతున్నాయి. కాని వయసు పెరిగేకొద్దీ సున్నం గట్టిపడుతూనే ఉంటుంది.’

‘సున్నాన్ని చాలా పద్ధతుల్లో తయారుచేసేవాళ్ళు. మన ప్రాంతంలో సున్నపురాళ్ళు చాలా ఎక్కువ. పూర్వం సున్నం చాలా సులభంగా తయారుచేసుకునేవాళ్ళు. పెద్ద పెద్ద బట్టీలు పెట్టి సున్నం కాల్చేవారు. చాకలివాళ్ళు బట్టలు ఉతకడం కోసం మొదలుకుని ఇళ్ళకు వేసుకోడం దాకా ప్రజలు సొంతంగానే సున్నం తయారు చేసుకునేవారు. రాళ్ళు తెచ్చి పిడకలు పెట్టి కాల్చేవారు. పూర్వం సబ్బులూ, సర్ఫూ లేనప్పుడు చాకళ్ళు నది ఒడ్డునే రాళ్ళు, కట్టెలు, గొబ్బెమ్మలు పేర్చి, సున్నపురాళ్ళు కాల్చి రాత్రంతా వదిలేసి ఉదయానికి సున్నం తయారు చేసుకునేవాళ్ళు.’

‘నిర్మాణాల కోసం పెద్ద పెద్ద బట్టీలు అవసరమయ్యేవి. ఆ సున్నాన్ని తెచ్చి డంగు, అంటే సున్నం రుబ్బే గానుగ, ఆడించేవాళ్ళు. పెద్ద రాయితో సున్నాన్ని బాగా నూరేవాళ్ళు. ఏ నిర్మాణానికి ఎలాంటి సున్నం కావాలనే దానికి ఒక  కొలత ఉండేది. ఇటుకల నిర్మాణానికి ఎలాంటి సున్నం, పైభాగం ప్లాస్టరింగుకి ఎలాంటి సున్నం కావాలనే దానికి ఒక లెక్క ఉండేది. చార్మీనార్ నిర్మించేటప్పుడు దానికి ఉపయోగించిన సున్నం కనీసం ముప్ఫై సంవత్సరాల పాటు నిల్వ ఉంచారని చెబుతారు. ఇండ్ల నిర్మాణానికి  కనీసం రెండు సంవత్సరాల పాత సున్నం ఉపయోగించాలి. సున్నాన్ని గానుగపట్టాక, అందులో నీరుపోసి నిల్వ ఉంచుతారు. ఉపయోగించేటప్పుడు దాన్ని తీసి మళ్ళీ కొద్దిగా నూరి ఉపయోగిస్తారు. కొత్త సున్నాన్ని నిర్మాణపనులకు ఉపయోగించరు.’

‘ఇండ్లు ప్లాస్టరింగ్ చేసేటప్పుడు ఆ సున్నంలో బెల్లం, మారేడుపండ్ల గుజ్జు, బంక, జనపనార కలిపేవారు. చాలా నునుపైన, నైపుణ్యంతో కూడిన పని చేయవలసి వచ్చినప్పుడు సున్నం, జనపనార కలిపి మహిళలు రోట్లో వేసి బాగా దంచేవాళ్ళు. అలా దంచి దంచి దాన్ని సిద్ధం చేసేవారు. దానివల్ల అందులో పీచు ఏర్పడి ప్లాస్టరింగు గట్టిగా పట్టుకునేది. డంగు పట్టిన తరువాత జనపనార, బెల్లం మొదలైనవన్నీ కలిపి దంచేవాళ్ళు. ఆపైన రంగులు వేయవలసి వస్తే, ఆ రంగులు కూడా సున్నంలో కలిపే వేసేవాళ్ళు.’

‘చాలా ఇళ్ళు కలపతో నిర్మించడం కూడా ఉండేది. కొన్ని ఇళ్ళకు కలపతో ఒక స్ట్రక్చరు లాగా చేసి దానిమీద మట్టిగోడలు కట్టేవాళ్ళు. దానికి కూడా ఒక కొలత ఉండేది. పూర్వం జాల్నా, పూణే వంటి ప్రాంతాల్లో ఇండ్లన్నీ కలపతోనే నిర్మించారు.నాలుగు అంతస్థుల ఇండ్లు కూడా పూర్తిగా కలపతోనే కట్టేవారు. పేష్వాల కాలంలో శనివార్ వాడా లో ఉన్న ఏడంతస్తుల భవనం కూడా పూర్తిగా కలపతో కట్టిందే. కలప ఇండ్లు ఇప్పటికీ మహారాష్ట్రలో కనిపిస్తాయి. పైనుండి కింది దాకా పూర్తిగా కలపతోనే ఉంటాయి.’

‘పూర్వం ఇండ్ల పునాదుల కోసం భూమిని ఎక్కువగా తవ్వేవాళ్ళు కాదు. గట్టిభూమిని ఎందుకు తవ్వి పాడుచేయాలనే ఉద్దేశ్యంతో పునాదులు లోతుగా తీసేవాళ్ళు కాదు. పాతదేవాలయాల్లో కూడా లోతైన పునాదులు కనిపించవు. ఇక్కడి పాత ఇండ్లలోనూ అంతే. అయితే కొన్ని ప్రాంతాల్లో, ఉదాహరణకి చెన్నూరులో ఒకరు పాత ఇల్లు కొని, దాన్ని కూల్చి కొత్త ఇల్లు కట్టేటప్పుడు ఒక విషయం గమనించారు. ఆ పాత ఇంటిపునాదిలో పూర్తిగా కుమ్మరి పెంకులు అమర్చి, అందులో ఇసుక నింపి, దాని మీద రెండు అంతస్తుల ఇల్లు కట్టారని గమనించారు.’

‘పునాదిలో ఇసుకను చాలా ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. ఇక్కడి పాతబస్తీల్లో చెరువుల పక్కనే రెండు అంతస్తుల ఇండ్లున్నాయి. వాటి పునాదులు చాలా లోతుగా ఏమీ లేవు. వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు ప్రతి ఇంటి పునాదినుండీ వేలిమందాన నీటి ధారలు ప్రవహిస్తూ ఉంటాయి. అయినా ఆ రెండంతస్తుల ఇండ్లు అలాగే నిలబడి ఉన్నాయి. వాటి పునాదులనుండి నీరు ఊరుతూనే ఉంటుంది. కాని ఆ నీటిని ఎక్కడా ఆపరు. వాళ్ళ నమ్మకం ప్రకారం ‘పునాదినుండి నీరు ప్రవహిస్తోందంటే, ఆ ఇల్లు శ్వాస తీసుకుంటోంది అని అర్థం. ఆ నీరు ఆగిపోయిన రోజే ఇల్లు కూలిపోతుంది’ అని. నీరు ప్రవహిస్తున్నంతకాలం ఇల్లు కూలదు. నీరు ఆగిపోతేనే ఇల్లు పడి పోతుంది.’

‘ఇక్కడి ఇండ్ల నిర్మాణంలో ముఖ్యంగా అయిదు రకాల కలప ఉపయోగించేవారు. నిలువు స్తంభాలను మొగరాలు అనీ,  అడ్డంగా వేసే దూలాలను దూలాల్ అని పిలిచేవాళ్ళు. ఇక్కడి ఇండ్లను 9-13 అనే కొలతలతో నిరించేవాళ్ళు. ఒక ఇంటికి ఎన్ని దూలాలు ఉండాలి, నాలుగా, ఐదా అనేదానికి ఒక లెక్క ఉండేది. ఇంటి వెడల్పు కొన్నింటికి 13 అడుగులు, కొన్నింటికి 9 అడుగులు ఉండేది.’

‘ఇండ్లు నిర్మించేటప్పుడు ఏ కలపని ఎక్కడ ఉపయోగించాలనే విషయంలో చాలా జాగ్రత్తలు  తీసుకునేవాళ్ళు. నిలువు స్తంభాల కోసం సండ్ర లేదా సోమి  కలప వాడేవారు. ప్రజలు ఈ రెండు కలపల్నీ ఇష్టపడేవారు. అవి చాలా బలమైనవి. వాటిని నిలబెట్టి దూలాలు వేసి ఆ పైన వాసాల కోసం కొడిశ కర్ర వాడేవారు. కొడిశ ఇక్కడ దొరికే ఒక విషపూరితమైన చెట్టు. వాసాల కోసం, గోడలకోసం కొడిశె చెట్టు సన్నని కొమ్మలు తెచ్చి, చాపల్లాగా అల్లి, వాటికి మట్టి మెత్తి గోడలు కట్టేవాళ్ళు. ఆ కలపకు చెదలు పట్టవు. కనీసం ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువకాలం ఆ గోడలు అలాగే ఉంటాయి. వాటికి ఏమీ కాదు. ఇక్కడి చిన్న చిన్న ఇళ్ళన్నీ కొడిశ కలపతో కట్టినవే.’

‘వాసాలన్నీ కొడిశ కలపతోనే వేసేవాళ్ళు. ఇంటి మధ్యలో వెన్నెముక లాగా ఉండే ప్రధాన దూలాన్ని ఎంగార్ల పట్టి అనేవాళ్ళు. దానికోసం తెల్ల మద్ది కలప వాడేవాళ్ళు. అది చాలా బలమైంది. అలాగే సిరిమాను, లేదా నల్లమద్ది కూడ వాడేవారు. ఆ పైన సుమారు 32 వాసాలు వెదురు బొంగులు పేర్చేవారు. వాటిని ఒకదానికొకటి కట్టి దానిమీద పెంకులు పరిచేవాళ్ళు. అందుకోసం కొడిశ, పారిజాతం కలపను వాడేవాళ్ళు. అవి చాలా గట్టివి. పారిజాతం కొమ్మల్ని కత్తిరించి నేరుగా దానిమీద మట్టిపూసేవాళ్ళు. ఆ మట్టిని తయారుచేయడానికి ఎర్రమట్టి, నల్లమట్టి కలిపి ఆ పైన పేడ, బూడిద కలిపి పూత పూస్తారు. ఆ తర్వాత సుద్దమట్టితో అలికి సున్నం వేసేవాళ్ళు. ఇక్కడి చిన్న చిన్న ఇండ్లన్నీ అలానే నిర్మించారు. అవి చాలా ఏళ్ళుంటాయి. వాటికి ఏమీ కాదు. కలప కుళ్ళిపోదు. ఇలా రకరకాల ఇండ్లున్నాయి ఇక్కడ. మట్టిని, సున్నాన్ని తయారు చేసే పద్ధతులు వేర్వేరుగా వుండేవి.’

‘ఇక్కడ ఇండ్ల తలుపుల కోసం పూర్తిగా వెదురునే ఉపయోగించేవారు. ఇక్కడ వెదురుతో కట్టిన ఇండ్లు పెద్దగా లేకపోయినా తలుపులకు మాత్రం వెదురునే వాడేవాళ్ళు. గిరిజనుల ఇండ్ల తలుపులు ఎలానూ వెదురుతోనే ఉంటాయి. కానీ ఇక్కడి సాహుకార్లు కూడా వెదురుతలుపులే వాడేవాళ్ళు. కలప వాడేవారు కాదు.’

‘ఇంట్లో వాడే వస్తువుల్ని తయారు చేసే కలప గురించి చెప్పవలసి వస్తే- రోకళ్ళు రేల, నరవ, సండ్ర, నల్లసండ్ర, వేప కర్రతో తయారు చేస్తారు. మిగిలిన కర్రల్తో రోకళ్ళు చెయ్యరు. రొట్టెలు చేసే కర్రని పాలకొడిసె కర్రతో చేస్తారు. కాని పీటల్ని పాలకోడెతో కర్రతో చెయ్యరు. పీటలు టేకుకర్రతో కూడా చేస్తారు లేదా అడవిమునగ కర్రతో చేస్తారు.  పిండి కలుపుకోడానికి పూర్వం ఒక తట్ట ఉండేది. దాన్ని అడవిమునగ కర్రతో తయారుచేసేవారు. మజ్జిగ చిలికే కర్ర పాలకొడిసె కర్రతో చేస్తారు. గొడ్డలి పిడిని  తానికర్రతోగాని లేదా సిరిమాను కర్రతోగాని చేస్తారు. మంచం కోళ్ళు సండ్ర కర్రతో చేస్తారు. కానీ నిలువుపట్టీలు అంటే మంచం బద్దీలు  మాత్రం తాని కర్రతో చేస్తారు. చేత్తో పట్టుకునే కర్రను భూతాంకుశం అంటారు. ఆ కర్రవల్ల  భూతప్రేతాలన్నీ పారిపోతాయని నమ్ముతారు. విసుర్రాయికి ఉండే పిడిని సిరిమానుతో చేస్తారు. ఇలా ప్రతి ఒక్క వస్తువుకి వాడే కలప వేరుగా ఉంటుంది.’

‘మనం ఎడ్లబండి తయారుచేసినప్పుడు దాదాపు ఐదు రకాల కలపను ఉపయోగిస్తారు. నొగ తెల్లమద్దితో, కాడి టేకుతో, చక్రంలోపలి భాగాలు సండ్రతో, ఇరుసు సిరుమానుతో ఇలా. ఇరుసు అనేది వంగాలి గాని విరక్కూడదు. మంచానికి వాడే తానికర్ర కూడా వంగుతుందిగానీ విరగదు. వాటిలో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.’

‘ఇక్కడ తయారయ్యే విగ్రహాలన్నీ పొనికి కట్టెతో చేస్తారు. ఇవి చాలా తేలిగ్గా ఉంటాయి. నిర్మల్ బొమ్మలు కూడా పొనికి కర్రతోనే చేస్తారు. పాలకొడిసె కర్రను టర్నింగ్ పనులకు అంటే యంత్రంపనికి వాడతారు. సంగీత వాద్యాల విషయం వస్తే అవన్నీ వేర్వేరు కలపతో చేసేవారు. కానీ తప్పెట, డప్పు లాంటివి మోదుగకర్రతో చేసేవారు. నూనెతీసేగానుగను చింతకర్రతో చేస్తారు. మగ్గాల తయారీకి కూడా కలప ముందే నిర్ణయించి ఉంటుంది. గ్రామదేవతల విగ్రహాలకి వేపకర్ర, మేడికర్ర, అందుక్ చెట్టు కర్ర వాడతారు. ఎక్కువగా వేపకర్రనే వాడతారు.’

‘అప్పట్లో టేకుని మంచి కలపగా భావించేవాళ్ళు కాదు. పాత ఇండ్లల్లో ఎక్కడా టేకు కనిపించదు. ప్రస్తుతం అందరూ టేకుని వాడుతున్నారుగానీ, బ్రిటిష్ వాళ్ళు వచ్చాక వచ్చిన మార్పు ఇది. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక భారతదేశంలోని అడవుల స్వరూపమే మారిపోయింది. ఉత్తరాంచల్ లో దేవదారు చెట్లను కొట్టేసి పైన్ చెట్లు నాటారు. మధ్యభారతదేశంలో టేకుచెట్లనీ, రబ్బరునీ నాటారు. నిజానికి మనకు కలప అవసరం ఉన్నంతగా వాళ్ళకు లేదు. మన అడవుల్లో టేకుకి పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఎందుకంటే టేకు పండ్ల చెట్టు కాదు. ఆయుర్వేదంలో దానికి ప్రాముఖ్యత లేదు. అది కనీసం నీడని కూడా ఇవ్వదు. అందుకే పూర్వం టేకుని మంచిగా చూసేవాళ్ళు కాదు. బ్రిటిష్ వాళ్ళు అడవుల్ని ఆక్రమించి, ఫారెస్టు డిపార్ట్ మెంటు ఏర్పాటు చేసాక, ఈ టేకు చెట్లకు కమర్షియల్ విలువ పెంచి ప్రాధాన్యతనిచ్చారు. అంతకు ముందు మన అడవుల్లో దేవవనాలుండేవి. అవి దేవతల పేరుతో వదిలేసిన అడవులు. మహారాష్ట్రలో ఇప్పటికీ దేవవనాలున్నాయి. ఆ అడవుల్లోంచి ఒక్క ఆకు కూడా ఎవరూ తుంచరు. అంతగా వాటిని సంరక్షించుకుంటారు. మిగతా అడవులన్నీ నశించినా దేవాలయాల పేరుతో ఉన్న అడవులు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి.’

‘కొన్ని అడవుల్ని ఆయుర్వేదం ప్రకారం పెంచేవాళ్ళు. ఇక్కడ ఎలిగందల, రామ్ గఢ్, శ్రీశైలం, మాహుర్ గఢ్ అడవులన్నీ ఆయుర్వేద ప్రాధాన్యత కలిగినవి. అక్కడ అన్ని రకాల మూలికలు దొరుకుతాయి. మాహూర్ లో ఎంతటి రోగి అయినా అక్కడి గాలి తగిలితే చాలు నయమవుతుందని ప్రజలు నమ్ముతారు.’

‘మనవాళ్ళు అడవికి వెళ్తున్నప్పుడు ‘కట్టెలు కొట్టడానికి వెళ్తున్నాం ‘అని ఎప్పుడూ అనరు. ‘కట్టెలు ఏరడానికి వెళ్తున్నాం’ అని మాత్రమే అంటారు. వంటచెరకు కోసం ఎండిపోయిన కొమ్మల్ని, రాలిన కట్టెల్ని మాత్రమే ఏరుకునేవాళ్ళు. లేదా కొద్దిగా ఊపితే రాలినవాటిని తెచ్చుకునేవాళ్ళు. అంతే తప్ప పచ్చిచెట్లని నరికి వంటచెరకుగా వాడటం మన సంస్కృతిలో లేదు. చెట్లు నరకడం మహాపాపంగా భావించేవాళ్ళు. ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపినప్పుడు అతనికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఆ పాపాన్ని ఇంద్రుడు ఒంటరిగా మోయలేక పంచుకుందామనుకున్నప్పుడు, అగ్ని, భూమి, జలం, అప్సరసలు ఆ పాపాన్ని పంచుకున్నారు. అందుకే ప్రవహించే నదిలో మలమూత్ర విసర్జన చేస్తే ఆ పాపం వాళ్ళకి చుట్టుకుంటుంది. రాత్రి సమయంలో పూలూ, పండ్లూ కోస్తే ఆ పాపం తగులుతుంది. అలాగే పండ్లు ఇచ్చే చెట్లను నరికినా, అకారణంగా చెట్లను నాశనం చేసినా ఆ పాపం చుట్టుకుంటుందని నమ్మేవారు.’

‘మన అడవిలోని ప్రతి ఒక్క చెట్టు ఏదో ఒక దేవత పేరుతో ముడిపడి ఉంటుంది. ఒక్కో వృక్షంలో ఒక్కో దేవత ఉంటారని నమ్ముతారు. అందుకే వాటిని నరకరు. వేపచెట్టులో లక్ష్మీదేవి ఉంటుందని, ఇప్ప చెట్టులోనూ, తాటిచెట్టులోనూ కూడా లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు. వేపచెట్టులో సూర్యుడుంటాడని కూడా నమ్ముతారు. మనకి 27 నక్షత్రాలున్నాయి కదా. ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక చెట్టు ఉంటుంది. ఏ వ్యక్తి ఏ నక్షత్రంలో పుడితే ఆ నక్షత్రానికి సంబంధించిన చెట్టుని వాళ్ళు సంరక్షించాలి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నరకకూడదు. నా నక్షత్రం ఉత్తరాభాద్ర. దానికి సంబంధించిన చెట్టు వేపచెట్టు. ఒక్కొక్కరికి ఒక్కో చెట్టు ఉంటుంది. కానీ ప్రస్తుతం జనాలు ఇవన్నీ మర్చిపోయారు. అలాగే నవగ్రహాలకు కూడా ప్రత్యేక వృక్షాలున్నాయి. నవగ్రహ యజ్ఞం చేసేటప్పుడు ఆయా గ్రహాలకు సంబంధించిన సమిధలను మాత్రమే ఉపయోగిస్తారు. అలా అడవి మొత్తం ఏదో ఒక రూపంలో దైవత్వంతో ముడిపడి ఉండేది. ఇక్కడ సాల వృక్షం, అంటే గుగ్గిలం చెట్టుమీద, అస్సలు గొడ్డలి వేయకూడదు. ఆ చెట్టుని తల్లిగా భావిస్తారు. ఎవరూ ఆ కలప కాల్చరు. పొరపాటున అది వంటచెరకులో వస్తే దాన్ని తీసి పక్కన పెడతారు. ఈ చెట్లనుంచి సుగంధ ద్రవ్యం వస్తుంది. దీన్ని దేవతల పూజలో ఉపయోగిస్తారు.’

‘మనకి ప్రకృతితో, అడవుల్తో ఎంతటి సుందరమైన సంబంధం ఉందంటే తొలివర్షం పడగానే  ఇక్కడ ఒక పూజ  చేస్తారు. దాన్ని పస్కిరాజుల పూజ అంటారు. పస్కిరాజుల పూజ అంటే, వర్షం పడ్డాక మైదానంలో కొద్దిగా పచ్చదనం మొలకెత్తిన రోజున ఊరి జనాలు అంతా ఊరి వెలుపలకి వచ్చి ఆ పచ్చదనాన్ని పూజిస్తారు. అక్కడ చేరి అందరూ కలిసి వంట చేసుకుని భోజనం చేస్తారు. అక్కడినుండి అడవి పూజలు మొదలవుతాయి. అడవులకి సంబంధించి మనకు చాలా పూజలున్నాయి. కానీ ఇప్పుడు జనాలు మర్చిపోయారు. పచ్చదనం రాగానే చేసే అడవి పూజ అది.’


గురూజీ ఈ మాటలు చెప్తున్నప్పుడు నాకో సంగతి గుర్తొచ్చింది. అదిలాబాదు జిల్లాలో కొలాములు ఒక ప్రాచీన తెగ అని చెప్పాను కదా. వారిని భారతప్రభుత్వం కొన్నాళ్ళు PTG  అంటే Primitive Tribal Group  అని పిలిచేది. తర్వాత ఆ ప్రిమిటివ్ అనే పదం మీద అభ్యంతరాలు రావడంతో ఆ ‘P’ ని Particularly Vulnerable అని మార్చింది. గురూజీ అదిలాబాద్ లో కొలాం ఆశ్రం స్కూల్లో పనిచేసేవారని చెప్పేను కదా. అందుకని ఆయన ఆ తెగతో చాలా ఆత్మీయత పెంచుకున్నారు. ఒకసారి నేను మామూలు ప్రభుత్వాధికారిలానే PTG అనే పదం వాడగానే ఆయన చాలా నొచ్చుకున్నారు.

‘మీకొక సంగతి చెప్తాను సార్! వినండి ‘ అని ఒక విషయం చెప్పారు. ‘ఎప్పుడేనా చైత్రమాసంలో ఏ గోండుగూడేల్లోనైనా ఏవైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు కొలాముల్ని కూడా పిలిస్తే వెళ్తారు. కాని పచ్చని కొమ్మ నరికి ఆ ఇంటిముందు పందిరిమీద పరిచి ఉంటే ఏ కొలామూ కూడా ఆ పందిరి కింద నిలబడడు. ఆ పెళ్ళి విందు ముట్టడు. చెప్పండి సార్! ఎవరు పిటిజి? వాళ్ళా మనమా? ‘ అనడిగారు ఆయన శోకాగ్రహంతో.


గురూజీ ఇంకా చెప్తున్నారు: ‘ఆ తర్వాత జూలై నెలలో భీమన్న పూజ చేస్తారు. ఆషాఢపూర్ణిమ తర్వాత వచ్చే మొదటి సోమవారం ఈ పూజ జరుగుతుంది. భీమన్న పూజ అయ్యేంత వరకూ అడవిలో ఏ చెట్టు ఆకుని కూడా తుంచకూడదు. టేకు ఆకులుగానీ, మోదుగాకులుగానీ కోయకూడదు. భీమన్న పూజరోజున ఆ ఆకులను కోసి వాటిలో ప్రసాదం పెట్టుకుని తింటారు. వర్షాలు జూన్ లోనే మొదలైనా జూలై వరకూ ఆకులు ఇంకా ముదరవు కాబట్టి, ఆకులు ముదిరేటంతవరకూ వాటిని కోయకూడదనే నిబంధన పెట్టారు. అందుకే భీమన్న పూజ తర్వాతనే ఇళ్ళపై కప్పు కోసం ఆకులు కోస్తారు. దీనే వనదుర్గ పూజ లేదా ‘బన్ కీ పూజా’ అంటారు. అడవిలో వనభోజనాలు చెయ్యడం మనకి పూర్వం నుండీ ఉన్న ఆచారం.’

‘అడవిమీదా, అడవిలో పూలూ, పండ్ల మీదా కోలీ సమాజానికి పూర్తి హక్కులుండేవని చెప్పాను. వాళ్ళు అడవిని తమ సొంతంగా భావించేవారు. కోలి సమాజం వారు ఎప్పుడూ చెట్లకొమ్మలు నరకరు. పండ్లు కోయవలసి వస్తే, చెట్టు ఎక్కికోయాలిగానీ, చెట్టును కొట్టడం, చెట్టు కొమ్మలు విరగ్గొట్టడం కానిపనిగా భావిస్తారు. పండ్లు ఎలా పండించాలి, ఎలా దాచుకోవాలి వాళ్ళకి బాగా తెలుసు.’

‘మానసోల్లాసంలో వనక్రీడ గురించి ఉంది. తోటలు, అడవులు ఎలా పెంచాలి, ఒక చెట్టుకు మరో చెట్టుకు మధ్య ఎంత దూరం ఉండాలి, నీరు ఎలా పెట్టాలి మొదలైవన్నీ అందులో ఉన్నాయి. చెట్ల వయస్సుని బట్టి నీటికొలతలు పెంచేవాళ్ళు. ఒక రోజు మొక్కకి ఎంత నీరు, ఒక నెల మొక్కకి ఎంత నీరు, పదినెలల మొక్కకి ఎంత నీరు పొయ్యాలనే లెక్కలు ఉండేవి. చెట్లు పండ్లిచ్చే సమయానికి వాటికింద కొన్ని రకాల మూలికలతో ధూపం వేసేవాళ్ళు. దానివల్ల పండ్లు చాలా రుచిగా, అందంగా తయారవుతాయి. అలాంటి మూలికలు చాలా ఉన్నాయి. మనవాళ్ళు అడవిని రక్షించారుగానీ నాశనం చేయలేదు. ఇండ్లకోసం కలపను కూడా చాలా నియమబద్ధంగా తెచ్చుకునేవారు. అందువల్ల అడవి ఎప్పుడూ తరిగిపోయేది కాదు.’

‘పూజ చెయ్యకుండా ఏ వస్తువునూ ముట్టుకునేవాళ్ళు కాదు. మూలికల సేకరణకి కూడా కొన్ని పద్ధతులుండేవి. మన అడవుల్లో అద్భుతమైన మూలికలున్నాయి.కాని ఫారెస్టు డిపార్ట్ మెంటు వచ్చాక వారు అంతా టేకుమయం చేసేసారు. టేకు గింజలు కాలిన తర్వాతనే మొలకెత్తుతాయి. లేదా వాటిని ఉడకబెట్టి నాటాలి. అడవిలో టేకుగింజలు పడ్డాక వాళ్ళు అడవికి నిప్పు పెడతారు. ఆ నిప్పువల్ల మిగతా చెట్ల గింజలన్నీ కాలి నశించిపోతాయి. కేవలం టేకు చెట్లు మాత్రమే మొలుస్తాయి. అలా అడవిమొత్తం టేకుమయం అయిపోయింది. దీనివల్ల అడవిలోని పశుపక్ష్యాదులు, వన్యప్రాణులు నశించిపోయాయి. ఎందుకంటే టేకు వల్ల నీడ ఉండదు, పండ్లు ఉండవు. టేకు అడవుల్లో కోతులు ఏం తింటాయి? అందుకే కోతులన్నీ రోడ్లమీదకి, ఊళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి. టేకు చెట్లమీద కనీసం తేనెటీగలు కూడా గూడు కట్టవు. ఎందుకంటే అప్పుడవి పూలతేనెకోసం చాలా దూరం వెళ్ళవలసి ఉంటుంది. ఇలా టేకు వల్ల మన పశుసంపద, అడవి సంపద అంతా నాశనమైపోయింది. ఆ అడవుల్లో ఉండటానికి ఏ జంతువు కూడా ఇష్టపడదు.’

‘పూర్వం అడవిలో ఇనుము తయారు చేయడానికి, కత్తా వండటానికి చాలా కట్టె బొగ్గు అవసరమయ్యేది. జనాలు ఇళ్ళల్లో కూడా బొగ్గు తయారుచేసుకునేవారు. మన అర్థశాస్త్రంలో బొగ్గుకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రభుత్వం పొగలేని పొయ్యిలు ప్రవేశపెట్టి, గ్రామాల్లో మీటింగులు పెట్టినప్పుడు, నేను చెప్పాను ‘గ్రామాల్లో బొగ్గు చాలా అవసరం. కమ్మరి దగ్గరకి వెళ్ళాలన్నా, చాకలి బట్టలు ఇస్త్రీ చెయ్యాలన్నా బొగ్గు కావాలి. బొగ్గు లేకుండా గ్రామీణ వ్యవస్థ నడవదు. మీరు తెచ్చిన పొయ్యిల్లో బొగ్గు తయారుకాదు. కాబట్టి జనాలు వీటిని అంగీకరించరు’ అని చెప్పాను. నా మాట నిజమై ఆ పొయ్యిలు ఫెయిల్ అయ్యాయి. ఇప్పటికీ కమ్మరి దగ్గరికి వెళ్తే బొగ్గు తీసుకెళ్ళాలి. అప్పట్లో బొగ్గు తయారుచేయడానికి ఒక ప్రత్యేక సమాజం, ఏకంగా ఒక కులమే ఉండేది. వాళ్ళు ప్రకృతికి ఎలాంటి నష్టం జరక్కుండా బొగ్గు తయారుచేసేవాళ్ళు.’

‘మన సంస్కృతిలో వసుధైక కుటుంబకం అనే గొప్ప సిద్ధాంతం ఉంది. వసుధైక కుటుంబకం అంటే నలుగురు కూర్చుని అన్నం తినడం మాత్రమే కాదు. ఈ భూమిపై ఉన్న కొండలు, చెట్లు, నదులు, వాగులు, ప్రకృతి అంతా మన కుటుంబమే అని అర్థం. వాటన్నిటితో ఒక పారివారిక బంధాన్ని ఏర్పరచుకుని జీవించడమే వసుధైకకుటుంబకం.’

‘అందుకే మనకు రావి చెట్టు కేవలం ఒక చెట్టు కాదు. తులసి కేవలం ఒక మొక్క కాదు. ఆవు కేవలం ఒక జంతువు కాదు, ప్రవహించే నది కేవలం నీరు కాదు. వాటన్నిటితో మనకు ఒక పవిత్రమైన బంధం ఉంది. కొన్నింటిని అమ్మలా చూస్తాం, కొన్నింటిని అన్నదమ్ముల్లా చూస్తాం. మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినట్టే మామిడిచెట్టుకు పెళ్ళి చేస్తాం. బావికి పెళ్ళి చేస్తాం. రావిచెట్టుకి ఉపనయనం చేస్తాం. ఇందులో ఎలాంటి మూఢనమ్మకమూ లేదు. ఇది ప్రకృతితో మనకున్న అనుబంధం. వాటిని మన కుటుంబసభ్యుల్లా భావించి గౌరవిస్తాం. మన ఇంట్లో బావి తవ్వితే దానికి వివాహం జరిపిస్తాం. మామిడిచెట్టు పండ్లు ఇచ్చే సమయానికి దానికి పెళ్ళి చేస్తాం. ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక సంప్రదాయం ఉంది.’

‘అడవిలో అన్నింటికంటే మొదటగా కాసే పండును ఆదొండ అంటారు. దీన్ని అడవి పుత్రిగా భావిస్తారు. గిరిజనులు దాన్నే ‘అడ్వికి తొల్ సూర్ బిడ్డా ఆదొండ ‘ అంటారు. అడవిలో వచ్చే మొదటి పండు ఇది. దీనితో కూర వండుకుని తినడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఆ తర్వాతే మిగతా పండ్లు వస్తాయి. గిరిజనుల ఇండ్లలో ఇప్పపూలు, మోదుగ పూలు, రకరకాల కందమూలాలు అహారంగా నిల్వ ఉంటాయి. ఒకరకమైన దుంప దొరుకుతుంది. కరువు వచ్చినప్పుడు దాన్ని తెచ్చి ఏడుసార్లు ఉడకబెట్టి కోస్తే అందులోంచి బియ్యంలాంటి పదార్థం వస్తుంది. ఇలాంటి కందమూలాలు అడవిలో చాలా ఉన్నాయి. సంవత్సరంలో సతి అనే పండగ వస్తుంది. ఆ రోజు ఇప్ప చెట్టుకి సంబంధించిన పదార్థాలే తినాలి. మధ్యప్రదేశ్ లో ఇది చాలా పెద్ద పండగ. ఆ రోజు ఇప్పనూనెతోనే స్నానం చెయ్యాలి, ఇప్పపిండితోనే వంటలు చేసుకోవాలి. ప్రస్తుతం ఇవన్నీ నామమాత్రంగానే సాగుతున్నా, జనాలు ఇంకా ఆచరిస్తున్నారు. ఈ విధంగా మన సంప్రదాయంలో ప్రకృతిని, అడవిని సంరక్షించే అద్భుతమైన పద్ధతులున్నాయి. మనవాళ్ళు ప్రకృతినుండి కేవలం అవసరమైనంతమాత్రమే తీసుకున్నారుకానీ దాన్ని ఎప్పుడూ నాశనం చేయలేదు.’

‘ఇవన్నీ మేం పెద్దల దగ్గర విన్న విషయాలు. ఆ రోజుల్లో వడ్డెరలు, కమ్మరులు వీళ్ళంతా బతికే ఉన్నారు కదా. నేను బరోడానుంచి పారిపోయి రావడానికి కారణం కూడా ఇదే. వాళ్ళు నన్ను పారిస్ పంపించాలనుకున్నారు. కానీ నాకు ఎక్కడికీ వెళ్ళడం ఇష్టంలేక పారిపోయి వచ్చాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చాలా డబ్బు ఉంటుంది, చాలా సంపాదించవచ్చు. కానీ తిరిగి వచ్చేసరికి కోట్ల రూపాయలు ఉన్నా, ఈ పెద్దలంతా చనిపోయి ఉంటే, ఆ డబ్బుతో ఏం చేయాలి? ఆ డబ్బును ఏం చేసుకుంటాం? ఈ ముసలివాళ్ళు, చివరి తరం ప్రజలు ఎవరైతే బతికి ఉన్నారో, వాళ్ళనుండి కనీసం ఈ సమాచారం, ఈ విజ్ఞానం సేకరించాలి కదా. ఏ వస్తువు ఎలా ఉంటుంది, ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలి. లేదంటే తర్వాత చెప్పేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు.’


Featured image: Exhibition at Kalashramam, pc: Apurva Sharma

20-6-2026

6 Replies to “జీవనశిల్పి-18”

  1. రావి చెట్టు చెట్టు కాదు.. తులసి మొక్క మొక్క కాదు.. మీ రచనలు రచనలు కాదు.. మమ్మల్ని చిరంజీవులను చేసే సంజీవిని ఔషధాలు.. మా కోరికలు తీర్చే కల్పతరువులు 🙏🏻

  2. ఎంత information ఎన్ని విషయాలు ఒక ప్రవాహంలా చెప్తున్నారు గురూజీ!

    సున్నపు ఇండ్ల గురించి చదువుతుంటే మా ఊళ్ళో మా తాత కట్టించిన ఇల్లు గురించి పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. అప్పట్లో సున్నపు గానుగ ఆడించి, అందులో బెల్లం ఇంకా ఏవో పదార్థాలు కలిపి నూరిన సున్నంతో ఆ ఇల్లు కట్టారట. ఆ ఇంటికి ఇప్పుడు 85 ఏళ్లకు పైగా వయసు. అయినా ఇప్పటికీ బాగానే ఉంది. ఆ సున్నపు గానుగ ఆడించడానికి రాతిలో చెక్కించిన circular కాలువలాంటి structure కూడా మొన్నటివరకు వుండేది.

    గురూజీ ఇంతకుముందు చెప్పిన గొలుసుకట్టు చెరువులు, కుంటలు కూడా మా ఊళ్ళో ఉన్నాయి. కానీ వాటిని ఎందుకు అలా ఏర్పాటు చేశారు, వాటి వెనక ఉన్న విజ్ఞానం ఏమిటి, వాటిని ఎలా సంరక్షించుకోవాలి అన్న విషయాలు ఇప్పుడు తెలిసినవాళ్లు లేరేమో.

    “కోట్ల రూపాయలు ఉన్నా, ఈ పెద్దలంతా చనిపోయి ఉంటే, ఆ డబ్బుతో ఏం చేయాలి? … ఈ ముసలివాళ్ళనుండి కనీసం ఈ సమాచారం, ఈ విజ్ఞానం సేకరించాలి కదా. లేదంటే తర్వాత చెప్పేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు.”

    This is the heart of this whole conversation.
    ఇంత selfless గా, తన కోసం సంపాదన కంటే నలుగురికి ఉపయోగపడే జ్ఞాన పరిరక్షణనే lifetime commitment పెట్టుకున్న వ్యక్తులు ఉంటారని, మీరు గురూజీ గురించి ఇంత వివరంగా రాయకపోతే నమ్మడం కష్టమే.

    🙏🏽🙏🏽🙏🏽

    1. చాలా చాలా సంతోషం మాధవీ! మీ ప్రతిస్పందనలు చదివిన తర్వాత నాకు ఈ పని పట్ల మరింత ధైర్యం కలుగుతుంది.

  3. “ఇవన్నీ మేం పెద్దల దగ్గర విన్న విషయాలు. ఆ రోజుల్లో వడ్డెరలు, కమ్మరులు వీళ్ళంతా బతికే ఉన్నారు కదా. నేను బరోడానుంచి పారిపోయి రావడానికి కారణం కూడా ఇదే. వాళ్ళు నన్ను పారిస్ పంపించాలనుకున్నారు. కానీనాకు ఎక్కడికీ వెళ్ళడం ఇష్టంలేక పారిపోయి వచ్చాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చాలా డబ్బు ఉంటుంది, చాలా సంపాదించవచ్చు. కానీ తిరిగి వచ్చేసరికి కోట్ల రూపాయలు ఉన్నా, ఈ పెద్దలంతా చనిపోయి ఉంటే, ఆ డబ్బుతో ఏం చేయాలి? ఆ డబ్బును ఏం చేసుకుంటాం? ఈ ముసలివాళ్ళు, చివరి తరం ప్రజలు ఎవరైతే బతికి ఉన్నారో, వాళ్ళనుండి కనీసం ఈ సమాచారం, ఈ విజ్ఞానం సేకరించాలి కదా. ఏ వస్తువు ఎలా ఉంటుంది, ఎలా తయారుచేస్తారో తెలుసుకోవాలి. లేదంటే తర్వాత చెప్పేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు.”
    — గురూజీ ది ఎంత మహోన్నతమైన ఆలోచన, ఆచరణ! ఆయన అలా అనుకుని తిరిగి ఆదిలాబాదుకి వచ్చి అప్పటి చివరి తరం ప్రజలు, వృద్ధుల ద్వారా ఎంత విషయ సేకరణ చేశారో, ఎంత పరిశీలించారో , ఎంత పరిశోధించారో ఇన్ని విషయాలు, సంగతులు.. ఎవరికైనా సరే ఇట్టే అర్థమయ్యే విధంగా చెప్పగలిగారంటే He Is Just Unique.. I just Can’t think of anybody else whom we can compare with. His World of Knowledge, interpretation, analysis explaining etc., what can we say.. Just Amazing .

    వసుధైక కుటుంబం అంటే ఎంతో మంది ఏదేదో చెబుతారు.. కానీ గురూజీ ఇచ్చిన సరికొత్త నిర్వచనం: “వసుధైక కుటుంబకం అంటే నలుగురు కూర్చుని అన్నం తినడం మాత్రమే కాదు. ఈ భూమిపై ఉన్న కొండలు, చెట్లు, నదులు, వాగులు, ప్రకృతి అంతా మన కుటుంబమే అని అర్థం. వాటన్నిటితో ఒక పారివారిక బంధాన్ని ఏర్పరచుకుని జీవించడమే వసుధైక కుటుంబకం.” ఎంత సింపుల్ గా ఉందో. ఆధునిక ప్రపంచం గ్లోబలైజేషన్‌ను ఒక worldwide market laa చూస్తే, మన సంస్కృతి దాన్నే ఒక ‘జగమంత కుటుంబం’ గా చూసిందని గురూజీ ఎంతో సరళంగా తేల్చేశారు.

    ఇల్లు కట్టడం కోసం ఉపయోగించే ఏ వస్తువుని వదలకుండా , వాస్తు శాస్త్రం, రకరకాల చెట్ల గురించి, రాళ్ళ గురించి ఎడ్ల బండికి వాడే కలపల గురించి.. ఎప్పుడూ కనీ వినీ ఎరుగని విషయాలను ఈ సంభాషణ ద్వారా ఎంతో అబ్బురపడుతూ తెలుసుకున్నా… అంతా టేకుమయం అయిన అడవుల గురించి తద్వారా నాశనం అయిన పర్యావరణ సమతుల్యత గురించి తెలుసుకుంటుంటే వాల్మీకి రామాయణంలో కదంబ వృక్షాన్ని చూసినప్పుడు రాముడు పలికే మాటలు “కదంబ పశ్య జానకీం ప్రహృష్టాం యది పశ్యసి..
    వికసత్పుష్పశాఖాఢ్యో హ్యసి త్వం ప్రియకదంబక” శ్లోకం గుర్తొచ్చి మనుషుల భావాలను, సంతోషాలను, దుఃఖాలను వృక్షాలు కూడా పంచుకుంటాయనే వాల్మీకి భావన —గురూజీ చెప్పిన “చెట్లు మన పారివారిక బంధువులు” భావన కి ఎంతో దగ్గరగా ఉందనిపించింది.

    ‘అందుకే మనకు రావి చెట్టు కేవలం ఒక చెట్టు కాదు. తులసి కేవలం ఒక మొక్క కాదు. ఆవు కేవలం ఒక జంతువు కాదు, ప్రవహించే నది కేవలం నీరు కాదు. వాటన్నిటితో మనకు ఒక పవిత్రమైన బంధం ఉంది. కొన్నింటిని అమ్మలా చూస్తాం, కొన్నింటిని అన్నదమ్ముల్లా చూస్తాం. మన పిల్లలకు పెళ్ళిళ్ళు చేసినట్టే మామిడిచెట్టుకు పెళ్ళి చేస్తాం. బావికి పెళ్ళి చేస్తాం. రావిచెట్టుకి ఉపనయనం చేస్తాం. ఇందులో ఎలాంటి మూఢనమ్మకమూ లేదు. ఇది ప్రకృతితో మనకున్న అనుబంధం. వాటిని మన కుటుంబసభ్యుల్లా భావించి గౌరవిస్తాం. మన ఇంట్లో బావి తవ్వితే దానికి వివాహం జరిపిస్తాం. మామిడిచెట్టు పండ్లు ఇచ్చే సమయానికి దానికి పెళ్ళి చేస్తాం. ఇలా ప్రతి ఒక్కదానికీ ఒక సంప్రదాయం ఉంది.’

    నిజమే మీరు ఈ సంభాషానికి పెట్టిన శీర్షిక రావి చెట్టు కాదు… తులసి మొక్క కాదు.. ఇది కేవలం సంభాషణల పరంపర కాదు.. A Guided Tour of ప్రాచీన గ్రామీణ వ్యవస్థల జ్ఞాన భాండాగారం.
    We are greatly indebted to you for this భద్రుడు గారు…

    1. అవును ఇందులో ఆయన మాట్లాడిన చాలా మాటలు ఒక్కొక్కటి మల్లా వివరంగా పరిశోధించవలసిన విషయాలు ముఖ్యంగా ఆ బోటనీ. అది ఎత్నో-బోటనీ. మీ రసస్పందనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading