ఒక తల్లి ఆత్మకథ

నేను రాజమండ్రిలో ఉన్న రోజుల్లో, నా యవ్వనకాలంలో, ఒకసారి మా మాష్టారు శరభయ్యగారితో ‘నా మనసెందుకో బావుండటం లేదు, ఏదో చెప్పలేని దిగులు ఆవరిస్తూ ఉంటుంది. ఏం చెయ్యాలో తెలియడం లేదు’ అని చెప్తే, ‘రామాయణం చదువు’ అని చెప్పారు. పూర్వకాలంలో మన దేశంలో ఎవరికైనా మనసు చింతాక్రాంతమైనప్పుడు ఇదే ఔషధంగా ఉండేది, భగవంతుడి కథలో, భగవద్భక్తుల కథలో చదవడం. తర్వాత రోజుల్లో నన్నయ భగవద్భక్తులనే మాట వాడకుండా ‘ఎరుకగల వారి చరితలు’ అన్నాడు. ఆధునిక యుగం మొదలయ్యాక, ‘నా హృదయం గడ్డకట్టి ఎండిపోయినప్పుడు నీ కరుణావర్షంతో నన్ను తడిపెయ్యి’ అన్నాడు టాగోర్‌.

మహారాష్ట్రకు చెందిన సంఘసేవకుడు, గాంధేయవాది, పద్మవిభూషణ్‌ మురళీధర్‌ దేవీదాస్‌ ఆమ్టే (1914-2008) సహచరి సాధనా తాయి ఆమ్టే (1926-2011) రాసిన ఈ ‘సమిధ’ ఏకకాలంలో ఒక భగవద్భక్తురాలి చరిత్ర, ఎరుకగలవారి చరిత్ర, కరుణావర్షం కూడా. ఎందుకంటే, పుస్తకం చివరి పేజీలకు వచ్చేటప్పటికి నా కళ్ళు ధారాపాతంగా కన్నీళ్ళు కారుస్తూనే ఉన్నాయి. పుస్తకం ముగించేటప్పటికి గంగాస్నానం చేసినట్టుగానూ, గంగాపానం చేసినట్టుగానూ నన్నెవరో బయటా, లోపలా కూడా పూర్తిగా శుభ్రం చేసేసినట్టుగా ఉంది. చుట్టూ ప్రపంచం ఒక ద్వేషకర్మాగారంగా మారిపోయిన వేళ, ఇటువంటి పుస్తకం చదవడం నిజంగానే ఒక ఔషధం సేవించడం. ఇందుకు అన్నిటికన్నా ముందు, ఈ అమూల్య గ్రంథాన్ని తెలుగులోకి మనకి అందించినందుకు భారతికి మనసారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.

నేను చాలా స్వీయచరిత్రలు చదివాను, తెలుగులోనూ, ఇంగ్లిషులోనూ కూడా. తమ తమ జీవితాల్లో ఏదో ఒక అద్వితీయమైన వెలుగు చూసి ఉంటేనో లేదా ఎవరూ నిర్వహించని కర్తవ్యం ఒకటి నెరవేర్చి ఉంటేనో తప్ప ఎవరూ తమ కథ తాము చెప్పుకోడానికి సాహసించరు. కాబట్టి ప్రతి ఆత్మకథా విలువైనదే, ఈ ప్రపంచానికి ఎంతో కొంత మంచి చేకూర్చేదే. కాని ఈ రచనలో ప్రత్యేకం ఏమిటంటే, ఇది ఏక కాలంలో ఒక స్వీయ చరిత్రా, ఒక జీవిత చరిత్రా కూడా. ఆ ఇద్దరి కథలతోనూ పెనవేసుకున్న ఒక దేశచరిత్ర కూడా.

ఒక జమీందారీ కుటుంబంలో పుట్టి అత్యంత నిరాడంబరమైన జీవితాన్ని వరించడంలో బాబా ఆమ్టేకీ, టాల్‌ స్టాయికీ మధ్య పోలికలు కనిపిస్తాయి. కాని టాల్‌స్టాయి కన్నా బాబా అదృష్టవంతుడు. ఎందుకంటే గాంధీకి మల్లే ఆమ్టే కి కూడా తనని పూర్తిగా అర్థం చేసుకుని చివరిదాకా తనతో కలిసి నడిచిన సహచరి దొరికింది. కానీ గాంధీ కన్నా కూడా బాబా ఆమ్టే మరింత ధన్యుడు. ఎందుకంటే, గాంధీ ఆశయాలకు తగ్గట్టుగా ఆయన పెద్దకొడుకు జీవించలేకపోయాడు. అది జీవితాంతం ఆయనకు రంపపుకోతగానే ఉంటూ వచ్చింది. కాని బాబా ఆమ్టే, సాధనాతాయిలు ఎంత అదృష్టవంతులు! వారి పిల్లలు మాత్రమే కాదు, మనవలు కూడా వారి దారిన నడిచారు. తమ కొడుకు వికాస్‌ తమ దారిన నడవడమే ఎంతో ఎక్కువ, అటువంటిది అతడి కొడుకు దిగంత్‌ కూడా మెడిసిన్‌ చదువుకుని తండ్రి తాతల దారినే నడుస్తానని చెప్పినప్పుడు సాధనా తాయి రాసిన ఉత్తరం చూడండి. ఆ భాగ్యం అందరికీ దక్కేదీ కాదు.

ఈ పుస్తకం ఆమూలాగ్రం పఠించండి. నేనయితే అన్ని పనులూ పక్కనపెట్టి, తదేకంగా చదివాను. చదువుతున్నంతసేపూ నన్ను నేను ఆత్మపరిశీలన చేసుకుంటూనే ఉన్నాను. పాటించవలసిన నియమాల్లోనూ, అనుష్ఠించవలసిన నైతికతలోనూ నేనింకా కఠోరసాధన చెయ్యవలసిందే అని నాకు నేను పదే పదే చెప్పుకున్నాను.

ఈ రచన మొత్తం చదివాక, బాబా ఆమ్టే అపూర్వ జీవనప్రయాణం గురించి ఇంత దగ్గరగా తెలుసుకున్నాక, ఆయన జీవిత సారాంశం ఏమిటి అని ప్రశ్నించుకుంటే, ‘భయాన్ని జయించడమే’ అనే జవాబు వస్తుంది. ఆయనే చెప్పుకున్నారట: కుష్టు రోగుల కోసం తాను చేసిన సేవ ఆ రోగం పట్ల ముందు తన భయాన్ని పోగొట్టుకోడానికి చేసిందేననీ, తక్కినవన్నీ ఆ ప్రయాణంలో ఒనగూడినవేననీ. మహాత్ముడు ఆయన్ని అభయసాధకుడని పిలవడంలో ఈ భవిష్యసూచన అంతా ఉందనిపిస్తుంది.
ఆ వైనమంతా పే.76-78 లో చూడవచ్చు.

మరి సాధనా తాయి జీవితసారాంశం ఏమిటి? షిరిడీలో సాయినాథుడి దర్శనానికి వెళ్ళి బయటకి వచ్చినప్పుడు, ఒక సాధువు ఎవరో ఆమెని చూసి ‘నువ్వు అందరికీ అమ్మవి’ అని ఒక పలక మీద రాసి చూపించాడట. ఆమె అమ్మ, తల్లి, తాయి. ఇది నిజానికి ఒక తల్లి ఆత్మకథ.

వాళ్ళిద్దరూ కలిసి నడవడం మొదలుపెట్టాక ఆ ఇద్దరి కథలూ కలిసి ఒక కథగా మారేక, ఈ కథాసారాంశాన్ని ఏమని వివరించవచ్చు? ఆమె మాటల్లోనే చెప్పాలంటే-

‘ఆయన జీవితాన్ని కొన్ని మాటలలో వర్ణించాల్సి వస్తే నిరంతరం కొత్త ప్రారంభాలే అనాలేమో. లేదా ప్రతి ముగింపూ మరొక ప్రారంభానికి నాంది అనాలేమో. ఆయన దీపాలు వెలిగిస్తూ వెళ్ళారు. నేను స్వచ్ఛందంగానే వాటిలో చమురు నింపే బాధ్యతను తీసుకున్నాను. లక్ష్యం పట్ల ఆయనకు ఉన్న నిజాయితీ, ఆయన సృజనాత్మకత నన్ను ఆ విధంగా ఆయన పనిలో భాగమయ్యేలా చేసాయి. ఆయన లక్ష్యాలే మా లక్ష్యాలుగా మారాయి. నేనెప్పుడూ నా వ్యక్తిత్వాన్ని, ఉనికిని కోల్పోతున్నట్లు భావించలేదు. అందుకు భిన్నంగా నన్ను నేను పునరావిష్కరించుకున్నట్టు, కొత్త ఉనికిని, అస్తిత్వాన్ని సంతరించుకున్నట్లు భావించాను.’

మరొకచోట ఆమె ఇలా రాసుకున్నారు:

‘బాబా వంటి వివేచన కలిగిన వ్యక్తితో కలిసి జీవించడమంటే ఇరవై నాలుగు గంటలు ఒక బడిలో ఉన్నట్టే.’

‘మాకున్న ఒకే ఒక ఆస్తి షరతులు లేని, అవధులు లేని ప్రేమ. జీవితం శిథిలమవ్వకుండా కాపాడే సంరక్షకురాలు అది. జీవితం మరింత రుచిగా ఉండేందుకు తోడ్పడేదీ అదే. వారి వారి వ్యక్తిగత జీవితాలను దాటి మనుషులందరూ ప్రేమించగలిగితే ఎంత బాగుంటుంది!

ఇటువంటి పుస్తకాలు చదివినప్పుడు నాలాంటి వాళ్ళకి ముందుగా అయ్యో, నేను యవ్వనంలో అడుగుపెట్టిన కాలంలో ఇటువంటి పుస్తకాలు ఎందుకు దొరకలేదు? ఎందుకు చదవలేకపోయాం? అనే అనిపిస్తుంది. కానీ చదివింది నెమ్మదిగా మనలోకి ఇంకడం మొదలయ్యాక, కొత్త జీవితం మొదలుపెట్టడానికి జీవితంలో ప్రతి రోజూ మంచిముహూర్తమే అనిపిస్తుంది. నువ్వింకా ఏవో బరువులు మోసుకుంటూ తిరుగుతున్నావనీ, నీలో చీకటిమూలల్లో ఇంకా ఏవో భయాలూ, ప్రలోభాలూ నీడల్లాగా తారాడుతూనే ఉన్నాయనీ తెలుస్తుంది. నీలోపల నిద్రాణంగా ఉన్న అగ్ని రాజుకోవడం మొదలుపెడుతుంది.

ఇక ఈ పుస్తకం తమ చేతులదాకా చేరిన యువతీయువకులు మాత్రం నిజంగా భాగ్యవంతులు. ఎందుకంటే, అంధకారం దట్టంగా కమ్ముకుని ఉన్న ఈ లోకంలో మీ జీవితానికి అర్థం చెప్పుకోగల అరుదైన అవకాశం మీ చేతుల్లోనే ఉందని మీకు స్ఫురిస్తుంది. సింహం జూలు విదుల్చుకుని లేచినిలబడ్డట్టుగా మీలోని సాహసి మేల్కోంటాడు. ఆ తర్వాత మీరు నడవబోయే దారిపొడుగునా వెలుతురు పరుచుకుంటుంది.

రామాయణప్రస్తావనతో మొదలుపెట్టాను కదా. రెండు జీవితాలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఒక జీవితంగా మారిపోయిన ఈ కథ కూడా రామాయణకథనే. అయితే వనవాసానికి వెళ్ళిన సీతారాములు నగరానికి తిరిగి రాకుండా ఆ అడవిలోనే వనవాసులకు సేవచేసుకుంటూ ఉండిపోయిన రామాయణ కథ. రాముడు రాజ్యానికి తిరిగిరాకపోయుంటే, ఆ అడవిలోనే వనవాసుల్తో ఉండిపోయి ఉంటే, సీతాపరిత్యాగం సంభవించేది కాదు కదా అనిపించింది ఈ కథ చదివాక.

ఈ పుస్తకాన్ని భారతి అనువదించలేదు, తిరిగి తెలుగులో రాసారన్నంత నిర్మలంగానూ, గంగాప్రవాహంలానూ ఉందీ రచన. ఆమె రాసిన ‘ఒక ఫీల్డ్‌ వర్కర్‌ డైరీ’ చదివినప్పుడే ఆమె అంతరంగం ఎంత పరిశుభ్రమైందో అర్థమయింది. ఇటువంటి రచనని అనువదించడానికి ఇప్పటి యువతరంలో ఆమెకన్నా అర్హులు మరెవరుంటారు?


పుస్తకం కావలసిన వారు సిక్కోలు బుక్ ట్రస్ట్ వారిని 9989265444 కు ఫోన్ మీద గాని లేదా http://www.sikkolubooktrust.com వారిని మెయిలు మీద గాని సంప్రదించవచ్చు. వెల రు.200/-

6-11-2023

15 Replies to “ఒక తల్లి ఆత్మకథ”

  1. నిజముగా మా పాలిట కలపవృక్షమే గురువుగారు 🛐

  2. అర్ధనారీశ్వర తత్వం ఒంటబట్టించుకున్న జంట బాబా ఆంప్టే దంపతులు.
    “ఆయన దీపాలు వెలిగిస్తూ వెళ్లారు.నేను స్వచ్చందంగా నే వాటిల్లో చమురు నింపే బాధ్యతను తీసుకున్నాను.”

    ఒకరి లక్ష్యానికి మరొకరి చేయూత.కాదు కాదు
    ఇరువురిదీ ఒకలక్ష్యం,ఒకే బాట,ఒకే గమ్యం.

    నేను నా చిన్ననాడు కొమ్మూరి సాంబశివరావు గారి “భారతి”నవల చదివాను. బాబా ఆంప్టే గారి వ్యక్తిత్వం భారతి నవలలో నిస్వార్థంగా రోగులకు సేవలందించిన డాక్టర్ గారి పాత్రలో కనిపించింది.
    బాబా ఆంప్టే గారి పేరు వినగానే వారి “ఆనంద వనం” అందులో వారందించే సేవలు :
    నిజానికి దైవం ఎక్కడో లేదు. ప్రత్యంక్షంగా కనిపించే దేవతలు వీరు అని అనిపించక మానదు.

  3. కొమ్మూరి సాంబశివరావు గారు కాదు, కొమ్మూరి వేణగోపాలరావు గారి నవల భారతి.

  4. Much to be etched yet more and more to be felt , I am weeping now in my journey to KATPADI 🙏🙏🙏🙏🙏

  5. మంచి పుస్తకాన్ని పరిచయం చేశారు.
    ధన్యవాదాలు సర్
    🙏🙏🙏

  6. వ్యాసం చదవటం పూర్తి కాగానే, మీరిచ్చిన నంబరుకు ఫోన్ చేసి, పుస్తకం పంపమని కోరాను. ముందు మా పిల్లలతో చదివిస్తాను.
    ఇలాంటి అమూల్యమైన సమాచారం అందించినందుకు ధన్యవాదాలు సర్.
    – ఎమ్వీ రామిరెడ్డి

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading