
ఆకాశం నిండా కారుమబ్బులు అల్లుకున్నాయి. వర్షం వస్తుందేమో ద్రుపద్ గురుకులం వారి ప్రోగ్రాం కి వెళ్ళగలనా లేనా అనుకుంటూ ఉండగానే మబ్బులు విచ్చిపోయాయి. ఋతుపవనం అకాశంలో చెదిరిపోయినా ఆడిటోరియంలో మాత్రం మూడున్నరగంటల పాటు వర్షిస్తూనే ఉంది.
‘ధ్రువపద గురుకుల్ ఫౌండేషన్’ వారి ఏడవ వార్షికోత్సవానికి రమ్మని విజయలక్ష్మీ రామం గారు నాకు కూడా ఆహ్వానం పంపించారు. ఆ గురుకులం విద్యార్థులంతా సప్తపర్ణిలో ఈ సాయంకాలాన్ని ద్రుపద్ సాయంకాలంగా మార్చేసారు. వారే చెప్పుకున్నట్టుగా ఎనిమిదేళ్ళ వయస్సు చిన్నారి నుంచి ఎనభై ఏళ్ళ చిన్నారులదాకా ఆ విద్యార్థులంతా ఈ ఏడాది పొడుగునా తాము నేర్చుకున్న రాగాల్ని గొంతెత్తి ఆలపించారు. ఒక తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి రాగాలాపన చేశారు. ఒక తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి భజగోవిందం ఆలపించారు. భైరవి, భూపాలి, జోగ్, బిహాగ్, మేఘ్, మేఘ్ మలహర్, భీమ్ పలాస్, యమన్- ప్రతి ఒక్క రాగాన్నీ, బందిష్ నీ ఒక ద్రుపద్ గా వినడంలో ఒక కొత్తదనముంది. కొన్ని రాగాలు ఒక్క గాయిక లేదా గాయకుడు, కొన్ని ఇద్దరు, కొన్ని ముగ్గురు ఆలపించారు. చివరలో మొత్తం గురుకులం సభ్యులంతా కలిసి నాలుగు రాగాలు ఆలపించారు.
ద్రుపద్ గా వ్యవహరించే ధ్రువపదం హిందుస్తానీ సంగీతంలో ఒక గంభీరమైన గానపద్ధతి. అది గాయకుణ్ణీ, శ్రోతనీ కూడా సాధారణ ప్రాపంచిక భూమిక నుంచి అంతర్లోకాల వైపు నడిపించే రాగాలాపన. ఖయాల్ లాగా అది రాగాన్ని మనముందు అలంకారాల్తో నిలబెట్టదు. అంతకన్నా కూడా రాగంలోని ఆంతరంగిక సౌందర్యం వైపు మన దృష్టిని మళ్ళిస్తుంది. ఏవి పండినవో, ఏవి పచ్చివో ఎంచి చూసి మరీ శబరి రాముడికి పండ్లు సమర్పించినట్టు గాయకుడు స్వరాల పక్వతని పరీక్షించుకుంటూ రసజ్ఞ సమూహానికి సమర్పిస్తాడు. కాబట్టి ద్రుపద్ విన్యాసంలో రాగాలాపన ప్రధానమైన అంగం. దాని ద్వారా గాయకుడు ఒక రసభూమికని నిర్మిస్తాడు. రాగాన్నీ, శ్రోతనీ ఆ వేదికమీదకి ఆహ్వానిస్తాడు. అక్కడ మనకి ఆ రాగసౌందర్యంతో కాదు, ఆ రాగాత్మతో పరిచయమవుతుంది. అప్పుడు గాయకుడు ఒక కృతి ఆలపించేటప్పటికి మనకీ ఆ రాగానికీ మధ్య ఒక స్నేహబంధం అల్లుకుపోతుంది.
అందుకనే ఈ సాయంకాలం మూడు గంటలపైగా సాగిన ఆ సంగీతసమారోహం వింటున్నంతసేపూ నాకు ఒక మల్లెతోట పక్కన కూర్చున్నట్టుగా, గోదావరి ఒడ్డున రావిచెట్టు కింద కమ్మతెమ్మరలో తడుస్తున్నట్టుగా, వెన్నెల రాత్రి ఒక పడవమీద పయనిస్తున్నట్టుగా, ఇంకా అటువంటి అనుభూతిని స్మరణకు తెచ్చే ఎప్పటెప్పటి అనుభవాలో గుర్తొస్తూ ఉన్నాయి. నీకు ఆ రాగాలు అర్థమయ్యాయా లేదా అన్న ప్రశ్నకి తావే లేదు. ఆ సంగీతం నిన్ను తాకే చోటు బుద్ధి ఆవరణను దాటిన ప్రదేశం. అది ఒక మనోమయలోకం.
మరొక సంతోషం కూడా కలిగింది. మన చుట్టూ హోరెత్తుతున్న కొత్త తరహా సమాచార ప్రసార సాధనాలు, వినోద మాధ్యమాల మధ్య భారతీయ సంస్కృతిలోని ఉదాత్తతకి చిహ్నాలైన ఇటువంటి సంగీతాల్ని కాపాడుకోగలమా లేదా అనిపించేది అప్పుడప్పుడు. కానీ ఇవాళ అంతమంది యువతీయువకులు సంగీత సరస్వతికి తమ ‘స్వాంతమనే సరోజాన్ని సమర్పణ’ చేయడానికి అంకిత చిత్తులై కనిపిస్తుంటే నాకు చాలా చాలా సంతోషమనిపించింది. ఆ రాగాల పేరిట, ఆ బందిష్ ల పేరిట వాళ్ళకి ఈ దేశపు ఋతువులు, ఈ దేశపు కవితలు, ఈ దేశపు రంగులు పరిచయమవుతున్నాయి కదా అనిపించింది.
మనీష్ కుమార్ అనే గురువు వారికి ద్రుపద్ నేర్పుతున్నాడు. ఆయన ద్రుపద్ ని హైదరాబాద్ కి పరిచయం చేసాడని విన్నాను. అలా ఒక గురువుంటాడు. మనం డ్రాయింగురూములో కూర్చుని, మామూలుగా మాట్లాడుకునే మాటల్లో, ఈ దేశ సాంస్కృతిక వారసత్వం అదృశ్యమైపోతోంది అని చెప్పుకుంటూ ఉంటాం. కాని ఒకరుంటారు, ఇటువంటి ఉస్తాద్, అతడు తనున్నచోటనే రాగాల్ని మేల్కొల్పుతాడు, స్వరాల్తో దేవాలయం నిర్మిస్తాడు, అది గీతం కావచ్చు, పద్యం కావచ్చు, ద్రుపద్ కావచ్చు, ఖయాల్ కావచ్చు- వాటితోటే మళ్ళా ఈ శప్తభూమిమీదకి ఒక జీవనగంగని ప్రవహింప చేస్తాడు.
ఈ సంగతి కూడా చెప్పాలి. ఇలాంటి సమయాల్లో నేనిక్కడే ఉంటానుగాని, ఇక్కడుండను. మా ఊళ్ళో ఆ కొండదారిన, ఆ అడవి వారన, ఆ ఏటి గట్టున తిరుగుతుంటాను. భవభయం దారుణం, నిజమే, బతకడం కష్టమనిపించే క్షణాలెన్నో, కాని ఇలాంటి సమయాల్లో మాత్రం, జీవితమిట్లానే, ‘విరతిలేని స్వప్నం’ లాగా అనంతకాలం కొనసాగాలనిపిస్తుంది.
28-6-2026


చాలా సంతోషం కలిగింది ఈ ధ్రువపద గురుకుల ఫౌండేషన్ వారి వార్షికోత్సవ వివరాలు చదువుతుంటే.
మీరు ద్రుపద్ నేర్పిస్తున్న గురువు గురించి
“ఒకరుంటారు, ఇటువంటి ఉస్తాద్, అతడు తనున్నచోటనే రాగాల్ని మేల్కొల్పుతాడు, స్వరాల్తో దేవాలయం నిర్మిస్తాడు, అది గీతం కావచ్చు, పద్యం కావచ్చు, ద్రుపద్ కావచ్చు, ఖయాల్ కావచ్చు- వాటితోటే మళ్ళా ఈ శప్తభూమిమీదకి ఒక జీవనగంగని ప్రవహింప చేస్తాడు.” అని చెబుతుంటే సిరివెన్నెం సీతారామశాస్త్రి గారి చాలా ప్రాచుర్యం చెందిన ఈ పాట పల్లవి గుర్తొచ్చింది.
“ఎవరో ఒకరు ఎపుడో అపుడు
నడవరా ముందుగా… అటో ఇటో ఎటో వైపు..
మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి..
మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరి..
వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది.”