
చరాచరాలన్నింటిలోనూ ఉన్నవాడు శివుడే అనే అద్వైత భావన, ఆ జ్ఞానం పారమార్థిక తలానికి మాత్రమే పరిమితం కాకుండా, అంతరంగంలోనూ, బయటా కూడా శివుడే అనే కఠోర ఆచరణవాదం, దాన్ని కాయికంగా మార్చుకోవడం, ఆ కాయికంలో తిరిగి మళ్ళా, సమాజం వేటిని ‘హీన’ వృత్తులూ, ‘మలిన’ వృత్తులూ అని ఈసడిస్తోందో వాటికి తక్కిన వృత్తులకన్నా ఆధిక్యాన్ని ఇవ్వడం బసవన్న దృక్పథంలో ముఖ్యలక్షణాలని ఇప్పటిదాకా వివరించాను. దానికి అనుగుణంగా మరొక రెండు భావనల్ని కూడా మనం పరిచయం చేసుకోవలసి ఉంది.
లింగం, జంగమం అనే రెండు భావనలూ బసవన్న తాత్త్విక దృక్పథంలో రెండుగా కలిసే కనబడే పదాలు. ఆయన లింగం అంటున్నప్పుడు అది గుడిలో లింగానికి మాత్రమే పరిమితమైన భావన కాదు. తర్వాత రోజుల్లో కబీరు రాముడనే భావన గురించి ఇలానే మాట్లాడేడు. తాను మాట్లాడుతున్న రాముడు దశరథ రాముడు కాడని ఆయన పదే పదే చెప్తూ వచ్చాడు. బసవన్న దృష్టిలో లింగానికీ-జంగానికీ మధ్య ఉన్న సంబంధాన్ని కల్బుర్గి సార్వత్రికానికీ (universal)-నిర్దిష్టానికీ (particular) మధ్య ఉన్న సంబంధంగా వివరించాడు. శివుడు-జీవుడు అనే ద్వైతంలో ఉన్న లింగ-అంగ సంబంధాన్ని బసవన్న లింగం-జంగం అనే ద్వయంతో ప్రతిపాదిస్తున్నాడని మనం గమనించవచ్చు.
పన్నెండో శతాబ్దంలోని రాజకీయ-సామాజిక పరిస్థితులు భారతీయ దర్శనాల్లో అద్వైతం స్థానంలో విశిష్టాద్వైతాన్ని తీసుకొచ్చాయి. ఆ రోజునుంచి టాగోర్ దాకా భక్తికవులు దర్శనరీత్యా, రకరకాల స్థాయీ భేదాలతో విశిష్టాద్వైతులుగానే కొనసాగుతూ వచ్చారు. విశిష్టాద్వైతం ప్రకారం ఈశ్వరుడూ-జీవుడూ ఒకరేగాని, ఒకనాటికి జీవుడికి బ్రహ్మన్ తో ఐక్యం సాధ్యం కాగలదు. బసవన్న దృష్టిలో అటువంటి ఐక్యం ఏ రోజుకైనా సాధ్యమే అనే నమ్మకానికి నిరూపణ జంగముడు. జంగముడంటే తనదైన జీవప్రవృత్తినుంచీ, తనలోని మూడు మాలిన్యాలనుంచీ బయటపడ్డవాడు. ఆ మూడుమలినాల్లో మొదటిది తనువును అంటిపెట్టుకునే మలినం. రెండోది ఆ మలినానికి కారణమైన మలినం. ప్రయత్నం మీద ఈ రెండింటినీ శుద్ధి పరుచుకోవచ్చు. కాని మూడవదైన ఆణవ మలినం అంత తేలిగ్గా వదిలేది కాదు. ఇది చాలా సూక్ష్మ స్థాయిలో సాధకుణ్ణి వేధిస్తుంది. ‘నేను కాబట్టి..’, ‘నేను చేసాను..’ ‘నేను పొందాను..’, ‘నేను వదులుకున్నాను..’ లాంటి సూక్ష్మ అహంకార భావనలు ఆణవ మలినం. నిజమైన జంగం ఈ మూడు మాలిన్యాలనుంచీ బయటపడి జీవ-శివైక్యానికి ఒక సజీవ ఉదాహరణగా ఈ సమాజంలోనే ఈ మనుషుల మధ్యనే సంచరిస్తుంటాడు. అంతే కాదు, అతడు తాను కూడా స్వయంగా మాదార చెన్నయ్యలాగా ఏదో ఒక కాయిక వృత్తి అవలంబించి ఉంటాడు. తాను చేసిన పనికన్నా అధికమైన వేతనం అతడు ఎన్నటికీ ఆశించడు.
భారతీయ దర్శనాల్లో సా.శ అయిదారు శతాబ్దాలు మొదలుకుని పది పదకొండు శతాబ్దాల దాకా ప్రబలంగా ఉన్న వజ్రయాన బౌద్ధం ఇచ్చిన గొప్ప కానుక ఈ దేహాన్ని వదిలిపెట్టవద్దని చెప్పడం. ఆ ప్రభావం చర్యాగీతకారులనుంచి కబీరు మీదుగా తక్కిన సూఫీకవులదాకా భక్తికవులందరిలోనూ కనిపిస్తుంది. సహజీయా వైష్ణవం నుండి బావుల్ కవుల మీదుగా ఆ సంస్కారాన్ని టాగోర్ నేర్చుకున్నాడు. ఆశ్చర్యమేమిటంటే బసవన్నలో కూడా అదే దృష్టి కనిపిస్తుంది. ఈ కాయం ‘ప్రసాది కాయం’ అంటే భగవంతుడి ప్రసాదంగా లభించింది, దీన్ని నిరసించడంగాని, శుష్కింపచెయ్యడంగాని బసవన్నకి సమ్మతం కాదు. కాని ఈ కాయాన్ని దాసోహంకోసం, శివసంఘం కోసం వినియోగించాలన్నది ఆయన పెట్టిన షరతు.
కాబట్టి లింగం ఒక లక్షణ భావన. జంగముడు ఒక లక్ష్య భావన. కల్బుర్గి ఇలా రాస్తున్నారు (వచనము, బసవ సమితి, బెంగుళూరు, పే.XVIII):
‘ఒక అర్థంలో లింగైక్యమవడం అసంపూర్ణవ్యక్తిత్వం, అలాగే కొనసాగి జంగమైక్యమవడం పూర్ణవ్యక్తిత్వం. ఇటువంటి పూర్ణవ్యక్తిత్వంగలవాడే లింగాయతుడు. అందువల్ల నిజమైన లింగాయతుడవడమంటే జంగమమవడమే నని అర్థం. మరో రీతిలో లింగ కావడమంటే వ్యక్తి కేవలం శబ్దం (word) కావడం. జంగమం కావడమంటే వాక్యానికి యోగ్యమైన శబ్దం (morpheme) కావడం. ఇక్కడ వాక్యయోగ్యమైన శబ్దం అంటే సమసమాజ యోగ్యుడైన వ్యక్తి (సదస్యుడు) అనే అర్థం. బసవన్న రంగం మీదికి వచ్చేదాక వ్యక్తిత్వ నిర్మాణానికి సంబంధించినంతవరకు భారతీయులది ఒక విధంగా కేవలం ‘శబ్ద’సిద్ధాంతం. బసవన్న ఆ కేవల శబ్దానికి ‘వాక్యయోగ్య శబ్ద స్థితి’ స్వరూపం ఏర్పరచాడు.’
లింగ-జంగమ ద్వయంలోని సారాంశాన్ని ఇంత బాగా మరెవ్వరూ వివరించగా నేను చదవలేదు.
అయితే ఈ విధమైన పరిష్కారం బసవన్ననే మొదటచేసాడని మటుకు నేను అనలేను. ఋగ్వేదమూ, బుద్ధుడూ, రామానుజాచార్యులు కూడా తమ తమ దర్శనాలకు అనుగుణంగా ఇటువంటి సమన్వయాన్ని చేసుకున్నారు. ఒక వ్యక్తి తన సామాజిక ధర్మాన్ని నెరవేర్చాలా వద్దా అనే ప్రశ్న వస్తే, అతడికి తన స్వధర్మాన్ని నెరవేర్చడం తప్ప మరొక గత్యంతరం లేదని భగవద్గీత నిర్ద్వంద్వంగా చెప్తున్నది. కాని వారందరికీ, బసవన్నకీ ప్రధానమైన తేడా ఎక్కడంటే, ఆధునిక సామ్యవాదిలాగా, బసవన్న ఎక్కువ pro-poor, ఎక్కువ secular. అందువల్ల ఆయన దర్శనాన్ని secular spiritualism అని కల్బుర్గి అన్నమాటతో మనం ఏకీభవించవచ్చు.
అయితే, ఈ విధినిషేధాలన్నిటిలోనూ బసవన్న దృష్టిలో అత్యధిక ప్రాధాన్యత, అత్యధిక గౌరవం దేనిపట్లనో ఒక్కమాటలో చెప్పమంటే, కాయికం పట్లనే అని నిస్సంకోచంగా చెప్పవచ్చు. నువ్వు నీ ఇంట్లో శివుణ్ణి అర్చిస్తూ ఉండగా, బయట జంగముడు కాదు, కనీసం జంగమవేషధారి వచ్చి నిలబడ్డా కూడా నీ పూజపక్కన పెట్టు అన్నాడు బసవన్న. అంటే లింగానికీ, జంగమానికీ మధ్య జంగమానికే ప్రాధాన్యత. ఎందుకో అర్థమవుతూనే ఉంది కదా. లింగం ఒక సిద్ధాంతం. కాని జంగం ఒక ఆచరణ. ఇంతవరకూ బాగానే ఉంది. కాని నువ్వు నీ విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి, అంటే నీ కాయికానికి బయల్దేరావనుకో, జంగముడు ఎదురైతే ఏం చేయాలి? జంగముణ్ణి కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే, అంతిమంగా కాయకమే కైలాసం.
51
నేనొక్కణ్ణి, దహిస్తున్నది అయిదుగురు
పైగా పెద్ద మంట,
చల్లార్చలేకుండా ఉంది.
అడవి బసవాన్ని పులి కరుచుకుపోతుంటే
చూసుకోవద్దా
కూడలసంగమదేవా! (45)
(ఈ వచనంలోని అర్ధాన్ని నాకు సుబోధకంగా వివరించిన మిత్రుడు డా.కొర్రపాటి ఆదిత్య కు నా ధన్యవాదాలు)
52
బండెడు పత్రి తెచ్చి పూజిస్తారు
పూజలయ్యాక పోయి నిమజ్జనం చేస్తారు
ఈ తాపత్రయాలు వదిలిపెట్టండి
లింగడు మెచ్చేది తాపత్రయాలకు కాదు.
వట్టి నీళ్ళకి మెత్తబడతాడా
కూడల సంగముడు? (184)
53
అద్దం చూసుకునే అన్నలారా
జంగముణ్ణి చూసారా?
జంగమయ్యలోనే
లింగమయ్య సన్నిహితంగా ఉంటాడప్పా!
స్థావర జంగమాలొకటే
అన్నదే కూడలసంగముడి మాట.
54
పాటలు పాడితేనేమి
శాస్త్రాలూ, పురాణాలు వింటేనేమి?
వేదవేదాంతాల లోతులు చూస్తే ఏమిటి?
మనసులో లింగజంగమాల్ని
పూజించడం ఎరగని వాళ్ళందరూ
ఎంత తెలిసినవాళ్లయితే ఏమిటి?
భక్తిలేని వాళ్ళని మెచ్చడు
కూడలసంగమదేవుడు. (188)
55
లింగాన్ని పూజించాక
జంగానికి భయపడి తీరాలి.
అలాగని ఏదో గదనో, గడకర్రనో మింగినట్టు
బిర్రబిగుసుకు కూచోకు.
మిగలముగ్గిన అరటిగెలలాగా
వంగిఉంటే
నువ్వు కోరుకున్న స్థితికి చేరుస్తాడు
మా కూడల సంగమదేవుడు. (189)
56
ముఖానికి కట్టిన అద్దం లాగా
బయట శివలింగధారి వచ్చి నిలబడితే
ఇంకా ఇంట్లో పూజలేమిటి?
ఇంకా సమయాచారమేమిటయ్యా?
చూసుకో, ముక్కు మీద కత్తి.
ముక్కుకొయ్యకుండా వదిలిపెడతాడా
కూడలసంగముడు
చెప్పయ్యా (192)
57
నాగశిలల్ని చూస్తే పాలుపొయ్యమంటారు
నిజం పాములు కనబడితే చంపెయ్యమంటారు
ఆరగించగల జంగముడొస్తే పొమ్మంటారు
నోరుతెరవని లింగానికి
బతిమాలి మరీ భోజనం పెడతారు
మా కూడలసంగముడి మనుషుల్ని
పట్టించుకోకపోతే
రాతిని తాకిన పెల్లలాగా
పగిలిపోతారు, జాగ్రత్త. (194)
58
ప్రాణాలిచ్చి గురువును మెప్పించాలి
మనసిచ్చి లింగాన్ని మెప్పించాలి.
ధనమిచ్చి జంగాన్ని మెప్పించాలి.
ఈ మూడింటినీ పక్కనపెట్టి
డోలు కొట్టి బొమ్మకి పూజచేసేవా?
మెచ్చడు కూడలసంగమదేవుడు. (206)
59
వట్టిమాటల్తో అబ్బుతుందా భక్తి?
శరీరం నశించిపోయేదాకా
మనసు నశించిపోయేదాకా
ధనం నశించిపోయేదాకా
అబ్బుతుందా భక్తి?
ఎముకలు బయటకొచ్చేదాకా
కూడలసంగముడు సరసమాడుతుండాడు
అప్పటికిగాని
అబ్బుతుందా భక్తి? (210)
60
ఎంతో శ్రమపడి కుప్పపోసిన గడ్డివాము
ఒక్క నిప్పుతునకకి తగలబడ్డట్టు
ఎంతో సన్నిహితంగా ఒదిగి ఉన్నా కూడా
ఒక శరణుడి భక్తి ఒక తప్పుకి చెడుతుంది.
తండ్రి ఎంతో ధర్మంగా సంపాదించిన సొమ్ము
కొడుకు అధర్మానికి పాడుచేసినట్టు
శివుడి సొమ్ము శివుడికి కాకుండా
మరొకరి పాలు చేస్తే
కూడలసంగమదేవా
తన భక్తి తననే పాడుచేస్తుంది. (213)
29-11-2023


డా. కొర్రపాటి ఆదిత్య గారు వివరించిన బసవన్న వచన అర్థాన్ని మాకు కూడా తెలుపగలరు.
ఆయన అర్థాన్ని వివరించిన తర్వాతనే నేను పై అనువాదం చేయగలిగాను.
“అనుభవ మంటపం” వేదిక పైకి ప్రతిరోజూ మమల్ని ఆహ్వానించి..నేరుగా మమ్మల్ని 12 వ శతాబ్దిలోకి తీసుకెళ్ళి, బసవ వచనాలను మీ శక్తివంతమైన మాటలచే అనువదించి, మాకు ఒక రమణీయ మార్గాన్ని చూపిస్తున్నందుకు మీకు హృదయపూర్వక అభినందనలు.
ధన్యవాదాలు స్వాతీ!
నోరు తెరచి అడుగకాముందే
కుాడుబెట్టిన జ్ఞానము📚
బతిమాలి పంచిపెట్టె దైవం
చిన్నవీరభద్రడు కాక మరి ఏమిటి 🙏
ధన్యవాదాలు సార్
చాలా బాగా వివరిస్తున్నారు సర్
ధన్యవాదాలు సార్
word-to-word translation of the 45th (51) vachana:
నేను ఒంటిని; దహించువారైదుగురు
పైన చిచ్చు ఘనము; నిలువ లేను (తాళలేను)
కాడు బసవుని పులి తీసుకెళ్ళిన వేళ
అరయలేవా నన్ను కూడల సంగమ దేవా?
కన్నడ మూలం తెలుగు లిపిలో:
ఆను ఒబ్బను ; సుడువరు ఐవరు
మేలె కిచ్చు ఘన, నిలలు బారదు
కాడుబసవన హులి కొండొయ్దరె
ఆరైయలాగదె కూడల సంగమ దేవా ?
ధన్యవాదాలు. ఈ పదక్రమం ప్రకారమే చూసుకున్నతరువాత, ‘పైన’, ‘నిలువలేను”, ‘కాడు’, ‘అరయలేవా’ అనే నాలుగు పదాల్ని ఆ poetic tone లోంచి మరింత స్పష్టంగా అనువదించుకోవలసిన అవసరం కనిపించింది. దానికి ఆదిత్య ఇచ్చిన సూచనలు నాకు ఉపకరించాయి. నేను చేసిన అనువాదం ఆ నాలుగు పదాలకి మూల విధేయం కాదు. కానీ కవి హృదయానికి దగ్గరగా చేరడానికి ఉపకరిస్తుంది అనిపించింది.
మీరు చేస్తున్న అనువాదాల ద్వారా కన్నడ సాహిత్యాన్ని తెలుగు వారికి పరిచయం చేయడమే కాకుండా, బసవని కాలానికి చెందిన తాత్విక పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. తెలుగు వారందరం మీకు ఋణపడి ఉంటాం. 🙏
భాషాపరంగా చూస్తే ఈ ప్రయత్నానికి నా కన్నా అనర్హుడు మరి ఎవరూ లేరు. కానీ ఆ కవిత్వం నా హృదయంలో కలిగిస్తున్న సంచలనం వల్ల నేను ఈ సాహసానికి ఒడిగట్టకుండా ఉండలేకపోయాను.
మీ వంటి భాషానుశీలకుడు, జిజ్ఞాసి ఈ అనువాదాలు చదవటమే నాకెంతో ప్రోత్సాహానిస్తున్నది
అయ్యో. బసవని లాగే మీది కవిహృదయం. అంతే లోతైన తాత్విక దృష్టి. నాదంతా డుకృణ్-కరణే అన్న వ్యాకరణ సూత్రాల మీదే దృష్టి. బసవని కవిహృదయాన్ని, తాత్విక దృష్టిని గహనగంభీరమైన లోతును ప్రపంచ సాహిత్య వీథుల్లో చంక్రమణం చేసిన మీవంటి తాత్త్విక కవులే ఆవిష్కరించగలరు! శుభం భూయాత్! 🙏
వినయపూర్వక నమస్సులు.
బహవన్న వచనాలు జ్ఞానప్రేరితాలు.
ధన్యవాదాలు సార్