బసవన్న వచనాలు-3

బసవన్న జీవితం చుట్టూ అల్లుకున్న పురాణకథల్నీ, అతిశయోక్తుల్నీ పక్కనపెట్టి సత్యాన్ని నిగ్గుతేల్చేపని చాలా ఏళ్ళుగా చాలామంది చేస్తూనే ఉన్నారు. కాని లభిస్తున్న ఆధారాలన్నిటిలోనూ పాల్కురికి సోమన (1160-1240) రాసిన ‘బసవపురాణం’ ఎక్కువ ప్రామాణికంగా కనిపిస్తూ ఉంది. అందులో కూడా సోమన బసవన్న జీవితాన్ని ఒక పురాణకథలాగే చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ, బసవన్న వ్యక్తిత్వాన్నీ, ఆయన జీవితలక్ష్యాన్నీ, ఆయన్ని నడిపిన ప్రభావాల్నీ అర్థం చేసుకోడానికి ఆ కావ్యం మనకి చాలా ఉపకరిస్తుంది. అదీకాక బసవన్నకీ, సోమనకీ మధ్య మహా అయితే నలభయ్యేళ్ళకన్నా ఎక్కువ వ్యత్యాసం లేదుకాబట్టి, ఆ స్మృతి ఇంకా కొత్తగానూ, సత్యసన్నిహితంగానూ ఉన్నప్పుడే సోమన ఆ కావ్యం రాసాడని చెప్పవచ్చు.

ఆ రచనతో పాటు బసవన్న పైన వచ్చిన తక్కిన చాలా రచనల్ని చూసినమీదట, ఆయన జీవితకథ స్థూలంగా ఇలా చెప్పుకోవచ్చు.

పన్నెండో శతాబ్దపు కర్ణాటక రాజకీయంగా తీవ్రమైన ఆటుపోట్లకి లోనవుతూ ఉంది. అప్పటికి దాదాపుగా ఆరువందల ఏళ్ళుగా కర్ణాటక ప్రాంతంలోని దక్షిణాపథాన్ని పాలించిన చాళుక్యులు పూర్తిగా బలహీనపడుతూ ఉన్నారు. వారిలో చివరి రాజవంశం కల్యాణి చాళుక్యులపేరిట తమ పాలనలో చివరిదశకు చేరుకున్నారు. మరొకవైపు హొయసలులు, యాదవులు, కాకతీయులు, కాలచూరులు అనే నాలుగు రాజవంశాలు స్వతంత్రం ప్రకటించుకుని కొత్త సామ్రాజ్యాల్ని స్థిరపరుచుకుంటూ ఉన్నారు. వారిలో కాలచూరి వంశానికి చెందిన రెండవ బిజ్జలుడు పశ్చిమ చాళు క్య వంశానికి చెందిన మూడవ తైలపుణ్ణి వధించి కల్యాణి రాజధానిగా రాజ్యపాలన మొదలుపెట్టాడు. కావడానికి అతడు కాలచూరి అయినప్పటికీ తనను తాను చాళుక్యుడిగా ప్రకటించుకుని కాకతీయుల్ని ఓడించడం మీద దృష్టి పెడుతూ ఉన్నాడు.

సామాజికంగా అది నిమ్నోన్నతాలు పూర్తిగా ఘనీభవించిన కాలం. మతపరంగా బిజ్జలుడు జైనుడు అని కొందరు, శైవుడు అని కొందరూ రాసారు. కాని పక్కన హోయసల రాజులు ద్వారసముద్రంలో రామానుజాచార్యులకు ఆశ్రయం ఇవ్వడంతో రామానుజుడు రాజుల్నీ, ప్రజల్నీ కూడా విశిష్టాద్వైతం వైపు ఆకర్షిస్తూ ఉన్నాడు. కాని కల్యాణి చాళుక్యులు మతపరంగా అసహనం చూపించినవాళ్ళు కారు. దాంతో కల్యాణి ప్రాంతంలో నాలుగురకాల శైవశాఖలూ, జైనమూ బలంగా ఉన్నాయి. కాని ప్రజల్లో ఒక కొత్త ధార్మిక జీవితం గురించిన ఆకాంక్ష నివురుగప్పిన నిప్పులాగా ఉంది. రామానుజుడి విశిష్టాద్వైతంలాగా సామాన్యప్రజానీకాన్ని దగ్గరగా తీసుకోగల ఒక ఆధ్యాత్మిక ఉద్యమంకోసం ప్రజల్లో ఒక ఎదురుచూపు బలంగా ఉంది.

ఆ కాలంలో 1130 లేదా 1131 ప్రాంతంలో ఇప్పటి బిజాపూరు జిల్లాలోని బాగల్ కోట తాలూకాలో హింగుళేశ్వర బాగెవాడి అనే గ్రామంలో మాదిరాజు అనే గ్రామాధికారికి, అతడి భార్య మాదలాంబికకీ బసవన్న పుట్టాడు. అతడికి ఒక అక్క కూడా ఉంది. మతపరంగా ఆ కుటుంబానిది శుద్ధ శైవం. కాని ఎనిమిదో ఏట తండ్రి ఉపనయనం చేయించబోతే బసవన్న తిరస్కరించాడు. వైదిక ఆచారాల్ని, బ్రాహ్మణ సంస్కారాల్నీ ప్రశ్నించాడు. అతడికి ఉపనయనం కాకపోయినప్పటికీ, అప్పటికి బిజ్జలుడి కొలువులో మంత్రిగా ఉన్న బలదేవుడు బసవన్నకు తన కుమార్తె గంగాంబికను ఇచ్చి పెళ్ళిచేసాడు. తన పదహారో ఏట బసవన్న కూడల సంగమేశ్వరం దగ్గర ఉన్న గురుకులంలో సంగమయ్య అనే గురువుదగ్గర విద్యాభ్యాసం మొదలుపెట్టాడు. బసవన్న దృష్టిలో గురువుకీ, శివుడికీ తేడా లేదుకాబట్టి ఆయన జీవితచరిత్రకారులు బసవన్నకి శివుడే గురువని రాసారు.

ఆ గురుకులంలో బసవన్న దాదాపు పన్నెండేళ్ళు ఉన్నాడు. అక్కడే అతడు సకలశాస్త్రాలూ అధ్యయనం చేసాడు. ఈలోపు ఆయన మామ బలదేవుడు మరణించాడు. బిజ్జలుడి సన్నిహితులు ఆ స్థానంలో బసవన్నని తీసుకొమ్మని సూచించారు. తన కొలువులో వచ్చి చేరవలసిందిగా బిజ్జలుడు బసవన్నకి కబురు పంపించాడు. కాని గురుకులం వదిలి రాజు కొలువులో అడుగుపెట్టడానికి బసవన్నకి ఇష్టంలేకపోయింది. కాని గురువు అతణ్ణి కొలువులో చేరమని ప్రోత్సహించాడు. ఆ కొలువులో ఎలా నడుచుకోవలసిందో కూడా హితవు చెప్పాడు. బిజ్జలుడు బసవన్నకి మంత్రిగా, దండనాయకుడిగా, కోశాధికారిగా ఎన్నో అధికారాలతో కూడిన పదవీబాధ్యతలు అప్పగించాడు.

కల్యాణి చేరుకున్న తరువాత బసవన్న మతసంస్కరణ, సామాజిక సంస్కరణ రెండూ మొదలుపెట్టాడు. అంతదాకా వర్థిల్లిన శైవం, జైనం రెండూ కూడా సమాజంలోని అట్టడుగు వర్గాలవారికి మంత్రదీక్షనిచ్చేవిగాని, వాళ్లని తమలో కలుపుకునేవి కావు, బసవన్న ఆ అంతరాల్ని చెరిపేసాడు. జాతితోనూ, వృత్తితోనూ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ శివదీక్ష ఇవ్వడం మొదలుపెట్టడంతో, వారందరినీ ఒకే కుటుంబసభ్యులుగా చూడటంతో ప్రజలు పెద్ద ఎత్తున వీరశైవంలో చేరడం మొదలుపెట్టారు. ఆ వీరశైవానికి సంబంధించిన తాత్త్విక, సామాజిక చర్చలన్నీ అనుభవ మంటపం అనే వేదికమీద సాగేవి. అల్లమ ప్రభువు అనే ఒక వచనకవి, వీరశైవభక్తుడు ఆ చర్చలకి అధ్యక్షత వహించేవాడు. బసవన్న ఆ చర్చల్ని నిర్వహిస్తుండేవాడు. అన్ని వృత్తులకి చెందినవాళ్ళతో పాటు, స్త్రీలు కూడా ఆ చర్చల్లో పాల్గొనేవారు.

సహజంగానే ఈ నూతన మతవ్యాప్తి అప్పటికే బలంగా ఉన్న మతాలకీ, అగ్రవర్ణాలకీ ఆగ్రహం తెప్పించింది. వారు బిజ్జలుడి దగ్గర చేరి బసవన్న మీద ఫిర్యాదులు మొదలుపెట్టారు. బసవన్న వీరశైవులకోసం రాజకోశాగారం దోచిపెడుతున్నాడనీ, సామాజిక నియమనిబంధల్నీ, కులాచారాల్నీ ఉల్లంఘిస్తున్నాడనీ గొడవచెయ్యడం మొదలుపెట్టారు. బసవపురాణంలో రాసినదాన్నిబట్టీ, ఇతర ఆధారాలబట్టీ చూస్తే బసవన్న పట్ల బిజ్జలుడు రెండు రకాల ధోరణుల మధ్య ఊగిసలాడేడని తెలుస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ రాసిన ‘త్రిశూలం’ నాటకంలో ఈ ఊగిసలాటని ఎంతో ప్రతిభావంతంగా చిత్రించేడు. బసవన్న పట్ల ప్రజల్లో ఉన్న ఆరాధనని చూసి బిజ్జలుడు భయపడటమే కాదు, ఆ అభిమానం తనకి రాజకీయంగా ఉపకరిస్తుందని కూడా భావించి ఉంటాడు. కొన్ని కథల ప్రకారం, బిజ్జలుడు తన పెంపుడు కూతురు నీలాంబిక ని కూడా బసవన్నకి ఇచ్చి పెళ్ళి చేసాడు. కాబట్టి అతడు బసవన్నని మంత్రి పదవి నుంచి తప్పించలేకపోయాడు. అలాగని తన రాజ్యంలో సామాజికంగా, మతపరంగా బలంగా ఉన్న అగ్రవర్ణాల్నీ, జైనుల్నీ కూడా కాదనలేకపోయాడు. ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారీ అతడు బసవన్నమీద విచారణకి ఆదేశించడమో లేదా నిలదీసి అడుగుతుండటమో ఏదో ఒకటి చేస్తూండేవాడు. రాను రాను ఈ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి.

బిజ్జలుడి కాకతీయుల్ని జయించి కాలచూరు రాజ్యాన్ని విస్తరింప చేయాలని అనుకున్నాడు కాబట్టి అతడికి తన రాజ్యంలోని ఈ అంతర్గత అశాంతి ఇబ్బదికరంగా మారింది. చివరికి జైనుల, శైవుల ప్రోద్బలంతో అతడు వీరశైవుల్ని ప్రత్యక్షంగా హింసించడం మొదలుపెట్టాడు. ఒక బ్రాహ్మణ యువతికీ, దళిత యువకుడికీ మధ్య జరిగిన కులాంతర వివాహం అతడికి ఆగ్రహం తెప్పించింది. అతడు ఆ రెండు కుటుంబాలకు చెందిన తండ్రుల్నీ పిలిపించి వారికి కళ్లు పొడిపించడమో లేదా మరణశిక్ష విధించడమో చేసాడు. దాంతో రాజ్యంలో అంతఃకలహం చెలరేగింది. ఆ పరిస్థితిని చూసి కలతచెందిన బసవన్న కొలువు మానుకుని కూడల సంగమేశ్వరం వెళ్ళిపోయాడు. మరొకవైపు కల్యాణి చాళుక్య వంశానికి చెందిన సోమదేవుడి ప్రోద్బలంతో బిజ్జలుడి దండనాయకుడు జగదేవుడు బిజ్జలుణ్ణి హత్యచేసాడు. కల్యాణి మొత్తం మంటల్లో చిక్కుకుంది. వీరశైవులమీద దాడి మొదలయ్యింది. చివరికి వీరశైవ కుటుంబాలు నగరం వదిలి పారిపోయాయి.

కూడలసంగమేశ్వరం చేరుకున్నాక బసవన్న అక్కడ సంగమేశ్వరుడిలో లయమైపోయాడని చెప్తారు. దాని అర్థం ఎవరికి వారు ఊహించుకోవలసిందే. కాని ఏమైనప్పటికీ 1270 తర్వాత ఆయన జీవించి లేడనిమాత్రం చెప్పవచ్చు. నలభయ్యేళ్ళు నిండకుండానే బసవన్న జీవితం ముగిసింది. కాని నలభయ్యేళ్ళ జీవితంతోనే, అందులోనూ కల్యాణిలో గడిపిన ఎనిమిదేళ్ళ (1159-67) కాలంలోనే, ఆయన అసామాన్యమైన ధార్మిక విప్లవాన్ని తీసుకొచ్చాడు. బహుశా బుద్ధుడి తర్వాత అంత సామాజిక-ధార్మిక పరివర్తనను తీసుకురాగలిగిన ప్రవక్త బసవన్ననే అని చాలామంది రాసారు. 1924 లో బెల్గాంలో జరిగిన కాంగ్రెస్ మహాసభకి అధ్యక్షత వహించిన మహాత్మాగాంధి తన ప్రసంగంలో బసవన్న నడయాడిన ఆ ప్రాంతంలో బసవన్న చెప్పినదానికన్నా అదనంగా తనేమీ చెప్పలేననీ, నలుగురూ ఆ బోధల్ని పాటిస్తే చాలనీ అన్నారు!


లింగధారణ స్థలం

21

లింగముద్రల పశువును నేను
వేషధారిని నేను
ఉదరపోషకుణ్ణయ్యా నేను.

కూడలసంగమశరణుల పెరట్లో
ధర్మమనే గోవున్నేను. (85)

తామస నిరసన స్థలం

22

గుమ్మడికాయని ఇనపతీగతో చుడితే
కుళ్ళిపోతుందిగాని లావెక్కుతుందా?
చంచలమనస్కుడికి శివదీక్షనిస్తే
భక్తి ఎలాగొస్తుంది?
ముందటి మనసే తిరిగొస్తుంది.

మనసులేనివాణ్ణి ముడుపుకట్టినట్టయ్యా
కూడలసంగయ్యా! (92)

23

ఇంట్లో ఇంటియజమాని ఉన్నాడో లేడో
గుమ్మందగ్గర గడ్డిపెరిగింది.
ఇల్లంతా దుమ్ము.

ఇంట్లో ఇంటియజమాని ఉన్నాడో లేడో.
ఒంటినిండా అబద్ధాల కుప్ప
మనసునిండా కోరికల పుట్ట.

ఇంట్లో ఇంటియజమాని లేడయ్యా
కూడలసంగమయ్యా (97)

24

నీళ్ళల్లో ఎన్నాళ్ళు నానితే
బండరాయి
మెత్తబడుతుందని?
మనసు దిట్టం చేసుకోకుండా
ఎన్నాళ్ళు మిమ్మల్ని పూజిస్తే ఏం లాభం?

చూడబోతే నా పరిస్థితి
కూడలసంగమదేవా!
పెన్నిధిని పట్టుకున్న భూతంలాగా ఉంది (99)

25

పుట్టడం శివజన్మ పుట్టారు
దేవుడి చిహ్నం వంటికి తగిలించుకున్నారు
ఎంతసేపూ వేరేవాళ్ళని పొగుడుతారు
వేరేవాళ్ళ పాటలు పాడతారు.

వాళ్ల కర్మ తెగదు, కట్లు తెగవు.
కుక్క బతుకు బతుకుతారు.

మిమ్మల్ని నమ్మీ నమ్మన్నట్టుండే
ఈ డాంబికుల పద్ధతి చూస్తుంటే
ఇసుకతో గోడకట్టి
నీటితో కడుగుతున్నట్టుంది (107)

26

కొలుస్తూ కొలుస్తూ కొలిచే వాళ్ళు అలిసిపోతారుగాని
కుంచానికి అలసట లేదే
నడుస్తూ నడుస్తూ నడిచే వాళ్ళు అలిసిపోతారుగాని
నడిచే బాటకి అలసట లేదే
సాము చేస్తూ చేస్తూ చేసేవాళ్ళు అలిసిపోతారుగాని
దండానికి బడలిక లేదే
నిజం తెలుసుకోలేక భక్తుడు అలిసిపోతాడుగాని
లింగానికి అలసట లేదే

కూడల సంగమదేవా

చూడబోతే వాళ్ళు చేసేదంతా
రాజుకు తెలియకుండా
రాజుకోసం వెట్టి చేస్తున్నట్టుంది . (113)

భక్తుని జ్ఞాన స్థలం

27

ధరణి మీద పెద్ద అంగడి తెరిచి
అమ్మకానికి కూచున్నాడు మన మహదేవసెట్టి
ఒకటే మనసైతే నోరు తెరుస్తాడు
రెండు మనసులైతే ఉలకడు, పలకడు

కాసు వదులుకోడు
అరకాణి ఎక్కువడగడు

మన కూడల సంగమదేవుడు
చూడమ్మా
బహుచతురుడు. (115)

28

పుట్టమీద కొడితే
పాము చస్తుందా?

అఘోరతపస్సు చేస్తే మాత్రం?
అంతరంగ ఆత్మశుద్ధిలేకపోతే
నమ్మడమెలాగయ్యా?

కూడలసంగమయ్యా! (117)

29

ఒక్కటే మాట: సారం.
సజ్జనుల చెలిమి కావాలి నాకు.

ఒక్కటే మాట: దూరం.
దుర్జనుల దగ్గరకి పోనే పోను.

ఏ పామైతేనేం,
విషం ఒక్కటే.

స్వచ్ఛమైన మనసులేని వాళ్ళ స్నేహం-
కూడలసంగమదేవా!
కాలకూట గరళం. (119)

30

లోకం వంకర మీరెందుకు సరిదిద్దాలి?

ముందు మీ తనువుల్ని సరిదిద్దుకోండి
ముందు మీ మనసుల్ని సరిదిద్దుకోండి

పక్కింటివాళ్ళ దుఃఖానికి పడి ఏడ్చేవాళ్లని
మెచ్చడయ్యా!
కూడలసంగమదేవుడు. (124)

26-11-2023

8 Replies to “బసవన్న వచనాలు-3”

  1. నమస్కారం

    మీరు చెబుతున్న బసవడి పురాణం హృద్యం. మనసుల వంకర సరి చేసుకోవటమే జీవనం జీవితం. మీరు ఎంతో గుర్తుకు వచ్చారు. పోత్సహిస్తూ… వ్రాయమని… చదవమని…
    సదా మీకు మా వందనాలు.
    మీరు ఇలా కొత్తవిషయాలు చెబుతూ మమ్ములను నడిపిస్తున్నందుకు. 🙏🏽🙏🏽🙏🏽

  2. అబ్బ, తూటాల్లాంటి మాటలు. బాణాల్లా దూసుకెళ్లి మనసుని నేరుగా తాకుతున్నాయి. సత్యం మిథ్యల తేడాలని ఎత్తి చూపుతున్నాయ్.

  3. అద్భుతమైన కవితల్ని మా కోసం అనువదిస్తున్నారు. బసవన్న జీవితాన్ని అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్లుగా తెలియజేశారు. అనేక చారిత్రక విషయాలు తెలుసుకుంటున్నాము.

    మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading