
బసవన్న గురించి చిన్నప్పుడే విన్నప్పటికీ, ఎక్కడో ఒకచోట ఆయన వచనాలు ఒకటో రెండో చదివినప్పటికీ ఆయన పట్ల ఆసక్తి కలిగింది మాత్రం 1993-94 ప్రాంతంలో. అప్పట్లో మా హీరాలాల్ మాష్టారు కర్నూలు జిల్లాలో ఉన్న ఉరుకుంద వీరన్న మీద ఒక పుస్తకం రాసారు. ఆయన నాకు ఆ పుస్తకం పంపితే నేనది శరభయ్యగారికి పంపించాను. ఆ పుస్తకం చదివి ఆయన రాసిన ఉత్తరం నేను మరవ లేనిది. అందులో ఆయన బసవన్న ఒక చేత్తో క్షీర భాండమూ , మరొకచేత బెత్తమూ పట్టుకుని తనని చేరవస్తున్నాడని రాసారు.
ఆ తర్వాత 2002-03 ప్రాంతంలో రాజమండ్రిలో మాష్టారిని కలిసినప్పటికి ఆయన బసవేశ్వర వచనాలు సంస్కృతంలోకి అనువదించడం పూర్తిచేసారు. ఆ రోజు నేను ఆయనతో సంస్కృత కవుల గురించీ, కవిత్వం గురించీ మాట్లాడించబోతే ఆయన ‘ఇప్పుడు నన్ను పూర్తిగా బసవేశ్వరుడు ఆవహించి ఉన్నాడు. అధ్యైవ శివస్య భజనమ్, అధ్యైవ శివస్య స్మరణమ్’ అంటున్నాడు అని అన్నారు. ఆయన్ని ఒక్కోకాలంలో ఒక్కో సంస్కృతాంధ్ర కవి ఆవహించడం నాకు తెలుసుగాని, బసవన్న మరీ ఒక జ్వరంలాగా పట్టుకున్నాడు ఆయన్ని అనిపించింది అప్పుడు.
ఆ తర్వాత ఎ.కె. రామానుజన్ Speaking of Shiva చదివాను. అలాగే బసవన్న గురించి ఎక్కడ ఏ సమాచారం లభ్యమైనా ఆసక్తిగా చదివాను. కాని పూర్తి వచనాలు చదివే అవకాశం మాత్రం వెంటనే చిక్కలేదు. అలాగే అప్పట్లో ఆయన నన్ను మరీ సమ్మోహితుణ్ణి చేసాడని కూడా చెప్పలేను.
ఈ లోగా 2009-10 లో జోళదరాశి చంద్రశేఖర రెడ్డిగారి పరిచయమయింది. ఆయన్నూ నన్నూ కలిపింది ఆముక్తమాల్యదనే గాని, ఆయన సాంగత్యంలో చేరాక వచనకారుల గురించి మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం? జోళదరాశి దొడ్డనగౌడగారి పైన ఆయన రాసిన పుస్తకం ‘శరణుడు-బసవడు'(2011) కి నన్ను ముందు మాట రాయమని అడిగారు. దొడ్డనగౌడ గారి ‘శూన్యసంపాదనం’ పుస్తకం ఇచ్చారు, ఆ ముందుమాట రాయడానికి నాకు ఉపకరిస్తుందని. అలా బసవన్న మళ్ళా నా జీవితంలో ప్రవేశించాడు. 2014 లో చంద్రశేఖర రెడ్డిగారు నన్ను జోళదరాశి తీసుకువెళ్ళారు. దొడ్డనగౌడ గారి ఇంటికి కూడా తీసుకువెళ్ళారు. మన కాలం నాటి ఒక శివశరణుడు నడయాడిన చోటు అది.
2015 నాటి మాట. అప్పుడు మా కుటుంబమంతా బాదామి, ఐహోలు, పట్టడకల్ చూడ్డానికి వెళ్ళాం. నాకు తెలిసినవారు బాగల్ కోట లో ఒక హోటల్లో మాకు వసతి ఏర్పాటు చేసారు. ఆ పొద్దున్నే బాగల్ కోట లో ఆ హోటల్లో అడుగుపెడుతూ ఉండగా అప్పుడే సూర్యోదయమవుతూ ఉంది. లేత ప్రభాతకాంతి నాలుగుదిక్కులా పరుచుకుంటూ ఉంది. ఆ క్షణాల్లో నా మనసులో ఎందుకో చెప్పలేని అనిర్వచనీయమైన అనుభూతి కలిగింది. వేసవికాల మధ్యాహ్నాల్లో ఒక నది ఒడ్డున రావిచెట్టుమీంచి ఒక తెమ్మెర వీస్తే ఎలా ఉంటుందో అలాగ సేదతీర్చే అనుభూతి. అప్పుడు నాకు తెలియలేదు, నేను బసవన్న నడయాడిన ప్రాంతానికి చేరువయ్యానని. మేము బాదామి నుంచి అటూ ఇటూ వస్తూ పోతూ ఉండగా, ఒక మధ్యాహ్నం హైవే మీద కూడల సంగమం అనే బోర్డు కనిపించింది. నేను ఆశ్చర్యపోయాను. ఆ ఊరికి మేమంత దగ్గరలో ఉన్నామని అనుకోలేదు. వెంటనే కారు కూడలసంగమం వైపు తిప్పాం. కృష్ణ, మలప్రభ నదుల సంగమం అక్కడ ఒక సముద్రంలాగా ఉంది. అక్కడ చాలాసేపే కూచున్నాం. అక్కడొక పుస్తకాల దుకాణంలో 108 బసవన్న వచనాల సంకలనం ఒకటి కనిపించింది. కన్నడ మూలం తెలుగు అనువాదంతో. ఆ పుస్తకం తెరవగానే ఒక వచనం కనిపించింది.
కాలలి కట్టిద గుండు
కొరళలి కట్టిద బెండు
తేలలీయదు గుండు
ముళుగలీయదు బెండు
ఇంతప్ప సంసార శరధియ దాం టిసి
కాలాంతకనె కాయో, కూడలసంగయ్యా
అది అప్పటి నా మనఃస్థితి అచ్చం అద్దం పట్టినట్టుంది. అప్పట్లో నేను మెడకొక బెండు, కాలికొక గుండు తగిలించుకుని ఉన్నాను. గుండు తేలనివ్వడంలేదు, బెండు మునగనివ్వడం లేదు. మా మాష్టారు నాతో ఏ క్షణాన బసవన్న గురించి మాట్లాడారో గాని, నేను మర్చిపోయినా బసవన్న నన్ను మర్చిపోలేదని అర్థమయింది.
కాని ఇన్నాళ్ళూ అరకొరగానే ఆ వచనాలు చదివాను. ఎందుకంటే రామానుజన్ అనువదించిన బసవన్న వచనాలు 44 మాత్రమే. కర్ణాటక ప్రభుత్వం సంకలనం చేసి ప్రచురించి, తెలుగులోకి కూడా అనువదింపచేసిన వచనాల్లో బసవన్న వచనాలు మొత్తం 432 మాత్రమే.
కానీ ఎప్పుడో మిత్రుడు గంగారెడ్డి నాకోసం మఠం లింగయ్యస్వామి గారు అనువదించిన ‘బసవేశ్వరగీతామృతం’ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇన్నాళ్ళూ ఆ పుస్తకం తెరిచింది లేదు. ఇప్పుడు ఆ పుస్తకం సాకల్యంగా చదివాను. అందులో కూడా కొన్ని వచనాలు లేవు. బసవన్న పేరిట ఇప్పటిదాకా లభ్యమైనవి మొత్తం 1414 వచనాలు. కాబట్టి మొత్తం వచనాల్లో ఇంకా చదవవలసినవి మరి కొన్ని మిగిలి ఉన్నాయి.
కాని చదివినమేరకు, బసవన్న హృదయం నాకు మొదటిసారిగా దగ్గరగా బోధపడింది అనిపించింది. ఆయనది జ్ఞానభక్తి, శాంతభక్తి అని వ్యాఖ్యాతలు అన్నారుగాని, నాకు ఆయనలో పసిపిల్లవాడి ముగ్ధభక్తి కనిపించింది. తన గురువు చెప్పినమాటకే జీవితమంతా కట్టుబడి ఉండిపోగలిగిన ఒక రుద్రపశుపతి, ఒక గొడగూచి కనిపించారు ఆయనలో.
ఆ వచనాలు చదువుతూ ఉండగానే నేను నా మనసులో నా మాటల్లో తెలుగు చేసుకుంటూ ఉన్నాను. కబీరు పదాల్లాగా , గీతాంజలి లాగా , జిబ్రాన్ ప్రొఫెట్ లాగా బసవన్న వచనాలు కూడా ఎవరికి వారు తమకోసం మళ్ళా అనువదించుకోవలసినవి. మళ్ళా తమ మాటల్లో ఆ అమృతాన్ని నలుగురితో పంచుకోదగ్గవి.
అందుకని ఇదుగో, నేను ఎంచుకున్న కొన్ని వచనాల్ని ఇలా నా మాటల్లో మీతో పంచుకుంటున్నాను.
పిండస్థలం
1
నీటిలో రగులుతున్న నిప్పులాగా
సస్యంలో ఒదిగి ఉన్న సారంలాగా
మొగ్గలో ఒదిగి ఉన్న పరిమళంలాగా
కూడల సంగమ దేవుని ఉనికి
కన్యస్నేహం లాంటిది. (1)
2
కాళి కంకాళ లీల కన్నా ముందు
త్రిపురసంహారం కన్నా ముందు
బ్రహ్మవిష్ణువుల కన్నా ముందు
ఉమాకల్యాణం కన్నా ముందు
చాలాముందు, ముందు, ముందు-
మహానుభావా
కూడలసంగమ దేవా!
నువ్వప్పటికి లేతవాడివి
నేను పాతమనిషిని. (2)
3
అయ్యా! నువ్వు నిరాకారుడిగా ఉన్నప్పుడు
జ్ఞానమనే వాహనంగా ఉన్నాన్నేను
అయ్యా! నువ్వు నాట్యానికి నిలబడప్పుడు
చైతన్యమనే వాహనంగా ఉన్నాన్నేను
అయ్యా! నువ్వు సాకారుడివి కాగానే
వృషభవాహనంగా మారాన్నేను.
అయ్యా! నా బంధాలు తెంచడానికి
జంగమలాంఛనంతో నువ్వు రాగానే
భక్తుడననే వాహనమై నిలబడ్డాను చూడయ్యా
కూడలసంగమదేవా! (3)
4
అయ్యా, మీరు మీ శరణుణ్ణి కూడా
మనిషిగా పుట్టించారు కాబట్టి
నేను సుఖంగా ఉన్నాను.
ఎందుకలా చేసారని ఆలోచిస్తే
నాకోసమే చేసారని అర్థమైంది.
మీ శరణుడెలా నడుచుకుంటాడో
చూడగా చూడగా
నా కళ్ళు తెరుచుకున్నాయి
కూడలసంగమయ్యా! (5)
5
అవును, ఏనుగు పెద్దదే
అలాగని అంకుశం చిన్నదనగలమా?
నిజమే, చీకటి చిక్కన,
అంతమాత్రాన దీపం చిన్నదనగలమా?
కాదనను, మరపు గట్టిది
అంతమాత్రాన నీ స్మరణ చిన్నదగలమా?
కూడలసంగమా? (6)
సంసార హేయస్థలం
6
సముద్రంలాంటి ఈ సంసారం అలలు రేగి
నా ముఖమ్మీద పడుతున్నది,
అయ్యా, పలకవయ్యా!
సముద్రంలాంటి ఈ సంసారం అలలు చెలరేగి
నా గుండెలోతుదాకా ముంచెత్తింది.
అయ్యా, పలకవయ్యా!
సముద్రం లాంటి ఈ సంసారం చెలరేగి
నా పీకలదాకా చుట్టేసింది.
అయ్యా, పలకవయ్యా!
ఈ సంసారసాగరం నన్ను నిలువునా ముంచేసాక
అప్పుడింక ఏమని అరవగలను
అయ్యా! నా మొరాలకించవయ్యా!
కూడలసంగమయ్యా
నేనెవరినయ్యా? (8)
7
నిలువునా కొరతవేసినవాడికి
సుఖాలు అనుభవించమన్నట్టుంది
రంగురంగుల సంసారమనే పాముతో
పాములవాడు స్నేహం చేసినట్టుంది
తనకి తనే పగవాడయ్యాక
కూడలసంగమదేవా
ఇంకెక్కడి శాంతి? (12)
8
నేనొకటి తలిస్తే తానొకటి తలుస్తుంది
నేనిటు తిరిగి ఏడిస్తే తానటు తిరిగి ఏడుస్తుంది
తాను వేరై నన్ను భయపెట్టి
నా బతుకు బీడు చేసింది
తాను వేరై నన్నలసట పెట్టి
నా బతుకు కాడు చేసింది.
కూడలసంగముడిదగ్గరకి పోతానంటే
మాయ
నా కన్నా ముందే బయల్దేరింది (14)
9
కత్తికంటుకున్న నేతిని నాకే కుక్కలాగా
ఉంది నా బతుకు.
అయినా వదులుకోదు
ఈ సంసారాన్ని నా మనసు.
బాబ్బాబు నీకు పుణ్యముంటుంది
కూడల సంగదేవా
నా కుక్కబతుకు మాన్పించయ్యా (35)
10
నా నడత ఒకలాగా
మాట మరొకలాగా-
చూడయ్యా! నాలోపల స్వచ్ఛత లేదు.
నుడికి తగ్గట్టుగా నడుచుకుంటేనే కదా
నువ్వు నాలో కుదురుకునేది. (30)
24-11-2023


కాళి కంకాళ లీల కన్నా ముందు
త్రిపురసంహారం కన్నా ముందు
బ్రహ్మవిష్ణువుల కన్నా ముందు
ఉమాకల్యాణం కన్నా ముందు
చాలాముందు, ముందు, ముందు-
మహానుభావా
కూడలసంగమ దేవా!
నువ్వప్పటికి లేతవాడివి
నేను పాతమనిషిని. (2)
ఆన్ఇనీ వచనాలు అనువాదంలో అద్భుతంగా ఒదిగాయి . ఇది మాత్రం మళ్లీ మళ్లీ చదువుతూ ఉన్నాను…ఎట్లా రాశాడో ఈ మాటలని అని. ఆ చివరి రెండు వాక్యాల గురించి మీరేమైనా చెబితే వినాలని ఉంది.
ఆ కవీశ్వరుడి వచనాలు నా తెలుగులో కూడా మిమ్మల్ని స్పందింప చేయగలిగాయంటే అది ఆ మాటలనియెడు మంత్ర మహిమ తప్ప మరేమీ కాదు. మీ స్పందనకు ధన్యవాదాలు. ఇక ఈ రెండు వాక్యాల గురించి చాలా చాలా మాట్లాడాలి. కానీ మాట్లాడటం మొదలుపెడితే అనువాదం ఆగిపోతుందని భయం.
జ్ఞానము 📚 అనే సముద్రము (ఉప్పు నీటి) నుండి గురువు అనే సూర్యడు గ్రహించి శుద్ధి చేసి ప్రాణికోటికి మంచి నీళ్లు అందించిన విధంగా ఈ జ్ఞానసముద్రని మదించి అమృతని మాకు అందిస్తున్న
సూర్యభగవను సార్ మీరు.. మీ message రాని రోజు మేము ఉషోదయని కోల్పోయిన రోజు☀️
____🛐
ధన్యవాదాలు
శివరాత్రి నిత్యంబు చెల్లించు బాస!
మీరు శివసంకల్పం మొదలు పెట్టిన రోజున
నేను కాశీ వాసం లో ఉన్నాను.(పదిరోజులే లెండి.)
వింటుంటే ఎంతో సంతృప్తి గా అనిపించింది.
ఇక రోజూ శివనామస్మరణే. 🙏
బసవపురాణం నుండి రోజుకొక ముగ్గ భక్తుని గురించి పరిచయం వినడం, ఎంతో బాగుంది.
పాల్కురికి సోమనాథుని సాహిత్యం సమగ్రంగా వివరించి, అర్థం చేయించినందుకు మీకు కృతజ్ఞతలు.
బసవవ పురాణం నుంచి, పండితారాధ్య చరిత్ర నుండి ద్విపదలు చవులూరే విధంగా మీరు చదువుతుంటే, ఆ యా కావ్యాలను ఎలాగైనా చదవాలని అనిపించింది.
మీ కుటీరం నిజంగా ఆశ్రమవాటికే..
రోజూ ఉదయాన్నే నాలుగు మంచి కబుర్లు వినడం / చదవడం మహద్భాగ్యం గా భావిస్తాను. నమస్సులు🙏
మీకు ధన్యవాదాలు. హృదయపూర్వక నమస్సులు.
అన్ని వచనాలు కవితాత్మకంగా,సందేశాత్మకంగా బావున్నాయ్
సర్🙏
ధన్యవాదాలు మేడం
సర్, బసవన్న వచనమునందలి “అల్పాక్షరములందు అనల్పార్థము” ను మీ తేట తెలుగు మాటల్లో మూటగట్టి పంచుతున్నందుకు ధన్యవాదములు!! 🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
ఇప్నుపుడనిపిస్తుంది మా నారాయణగౌడు ఎందుకంత సామాన్యంగా ఎంత చదివినా ఏ మాత్రం కూడా తనలో ఆ పొడ కన్పించనీయకుండా మెదిలే వారో ఆలోచిస్తే. ఆయన రాసిందంతో పుస్తకం. అది శివమల్లన్న శతకమాల. ఈజుగామ శివార్పణ గ్రంథం. ఆయన అంతరిక శివభక్తిని నేను కొంత అనుభవించగలిగాను. – నుడికి తగ్గట్టుగా నడుచుకుంటేనే కదా
నువ్వు నాలో కుదురుకునేది.అనే మాట చదువగానే ఆయన గుర్తుకు వచ్చారు. ఆయనే నన్ను బసవపురాణం కొనిపించింది. ఓం నమశ్శివాయ.
ప్రాతఃస్మరణీయులు వారు. వారికి నా నమస్సులు.
రాసిందొకటే 300 పద్యాల శివశతకమాల
ఎందుకో పాల్కురికి సోమనాథుని బసవపురాణం తిరగవేస్తుంటే ఆశ్యర్యకరంగా మీరు ఉటంకించిన బసవని వచనాలకు తెలుగు అనువాదం వంటిది కనిపించింది. ఇది ద్విపద ఛందంలో ఉంది:
కాలకూటము గుత్తుకకు రాకమున్న
క్రాలుపురంబులు గాలకమున్న
గౌరివివాహంబు గా కటమున్న
యార నజాండంబు లలరకమున్న
తిరిగి మూర్తులు నెన్మిదియు లేకమున్న
భువి హరిబ్రహ్మలు పుట్టకమున్న
https://te.m.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Dvipada-basavapuraanamu.pdf/127
అవును. ధన్యవాదాలు.