సర్జన్ లాంటి రచయిత

Cover page of Scenes from a Childhood, PC: Asymptote journal

స్వీడిష్ కమిటీ మరోసారి ప్రపంచాన్ని సర్ ప్రైజ్ చేసింది. ప్రతి ఏటా సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ ఎవరికివ్వాలో నిర్ణయించేది బెట్టర్లు కాదనీ, తనే అనీ ప్రపంచానికి ప్రతి ఏడాదీ మళ్ళా మళ్ళా కొత్తగా చెప్పుకోవలసిన పరిస్థితి వల్ల అనుకుంటాను, నాలుగవ తేదీ సాయంకాలం దాకా వినబడే పేర్లు వేరు, అయిదో తారీకు సాయంకాలం వినిపించే పేరు వేరు. ఈ ప్రక్రియలో ఉండే అనివార్యమైన ఆందోళననుంచి బహుశా హరుకీ మురకామి లాంటి వాళ్ళు ఈ ఏడాది కూడా తప్పించుకోలేకపోయారు, పదేళ్ళ కిందటిదాకా జాన్ ఫాసే తప్పించుకోలేకపోయినట్టే. అయితే ఫాసే వివేకి. పదేళ్ళ కిందట తనకి నోబెల్ బహుమతి రాలేదని తెలిసినప్పుడు అతడు సంతోషం ప్రకటించేట్ట. ‘బహుశా నాకు ఆ బహుమతి తెచ్చుకునేంత వృద్ధాప్యం ఇంకా వచ్చినట్టు లేదు, ఆ పురస్కారం అంటూ వస్తే అదింక నా సృజనాత్మకతని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యని సమయానికి రావాలి’ అన్నాడట.

ఇంతా చేస్తే ఇప్పటికి ఫాసే వయస్సు 64 ఏళ్ళే. ఈ పురస్కారం అతడి సృజనాత్మకతని ఏ విధంగానూ ప్రభావితం చెయ్యకూడదనీ, అతడింకా అత్యున్నత సృజనశిఖరాల్ని చేరుకోవాలనే ఆశిద్దాం. నోబెల్ ప్రైజు రాకముందు కన్నా, వచ్చిన తర్వాత మరింత ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించిన రచయితలు కూడా లేకపోలేదు, యేట్సులాగా. నోబెల్ బహుమతి అనే కాదు, ఏ పురస్కారం పొందే రచయితకైనా ఈ ఆకాంక్ష వర్తిస్తుంది.

నోబెల్ కమిటీ ఈ సారి చూపించిన ఆశ్చర్యాలు మరి రెండున్నాయి. మొదటిది ఈ సారి బహుమతి గురించి నడిచిన బెట్టింగుల్లో ప్రతి ఒక్కరూ గట్టిగా నమ్మింది, ఈ సారి బహుమతి ఎవరికేనా వెళ్ళవచ్చుగాని, యూరోప్ కి మాత్రం రాదు అని. ఎందుకంటే గత పదేళ్ళల్లో ఆరు సార్లు యూరోప్ విజేతగా నిలిచింది. రెండో ఆశ్చర్యం ఈ సారి పురస్కారం ఒక స్కాండినేవియన్, నార్వేజియన్ రచయితకి రావడం మాత్రమే కాదు, నార్వేలో మాట్లాడే రెండు ప్రధానమైన భాషల్లోనూ అల్పసంఖ్యాకులు మాట్లాడే నైనస్క్ (Nyonorsk) భాషలో రాసిన రచయితకి అవార్డు ప్రకటించడం. మొత్తం హైదరాబాదు జనాభాలో సగంకన్న తక్కువ జనాభా ఉండే నార్వేలో 15 శాతం మంది మాట్లాడే భాష అది. అంటే సుమారు 8 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించే రచయిత అన్నమాట. అంటే ప్రపంచ జనాభాలో 0.01 శాతం అన్నమాట. కాబట్టి ఆ భాషావ్యవహర్తలకి ఈ రచయిత తీసుకురాగలిగిన గుర్తింపు, గౌరవం మరొకరూపంలో మరొక వీరుడెవరూ తేగలగినవి కావు. అందుకనే నార్వేలో ఫాసేని ఒక జాతీయవీరుడిగా గుర్తిస్తారనీ, అతడికి నార్వే ప్రభువు జీవితకాలపు ఉపకార వేతనాన్ని ప్రకటించాడనీ తెలిసినప్పుడు ఆశ్చర్యం కలగలేదు. తనకి పురస్కారాన్ని ప్రకటించారని తెలిసినప్పుడు ఈ గౌరవం అన్నిటికన్నా ముందు తన భాషకు దక్కుతుందని ఆ రచయిత అనడంలో కూడా ఆశ్చర్యం లేదు.

కానీ నిన్న సాయంకాలందాకా చాలామందిలాగే నాక్కూడా ఫాసే పేరు తెలియదు. కాని అందుకు మనం సిగ్గుపడనవసరం లేదనీ అతడి సాహిత్యం అమెరికన్, ఇంగ్లిషు ప్రపంచాలకు అంతగా కొరుకుడుపడేదికాదనీ, ఇంగ్లిషు ప్రభావం ఉండే దేశాల్లో అతడి పేరు అంతగా వినబడదనీ గత పదేళ్ళుగా ప్రపంచంలో చెప్పుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఇంగ్లిషు ప్రపంచానికి ప్రతి ఒక్కటీ నిశ్చయాత్మకంగా ఉండాలనీ, జీవితాన్నీ, ప్రపంచాన్నీ ఫాసే సమీపించే తీరు దానికి సరిగ్గా వ్యతిరిక్తమనీ కూడా ప్రపంచం అనుకుంటూ ఉంది. కానీ, ఈ మాటలకి అర్థం లేదు. ఎందుకంటే, నిన్న ఫాసే రచనలకోసం ఆమెజాన్ లో వెతుకుతూ ఉంటే, ఆయన నవల Aliss at the Fire కి హిందీ అనువాదం కనబడి నన్ను ఒకింత సర్ ప్రైజ్ చేయడమే కాక, మరింత సిగ్గుతో కుంచించుకుపోయేలా చేసింది.

కాని నోబెల్ పురస్కారంలో ఉన్న మహిమ అటువంటిది. అది ఎక్కడో ఒక మారుమూల రచయితని అక్టోబరు అయిదో తేదీ తర్వాత ఒక ప్రపంచ హీరోగా మార్చేయగలదు. ప్రపంచంలోని ప్రతి ఒక్క ఖండంలోనూ కనీసం ఒక్కరేనా ఆ రచయిత పుస్తకాలు కనీసం ఒక్కటేనా చదవడం మొదలుపెడతారు. నిన్న రాత్రి నేను చేసింది అదే.

ఫాసే బహుముఖ ప్రజ్ఞావంతుడైన రచయిత. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, బాలసాహిత్య కర్త, పండితుడు, ఇంకా ఎన్నో. నార్వేజియన్ లోకి బైబిలు అనువదించే ప్రాజెక్టుకి ఆయన ప్రధాన సలహాదారు కూడా. ఈ ప్రక్రియలన్నిటిలోనూ ఆయన విస్తారంగా రాసాడు. రాస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచమంతా ఆయన రచనలకోసం పరుగులు పెడుతుంది కాబట్టి, ఏ పుస్తకాలతో మొదలుపెట్టాలో, మీరు మరీ హడావిడిగా చదవాలనుకుంటే ఏ పుస్తకాలు చదవాలో ఈ రోజు గార్డియన్ పత్రికలో ఒక విమర్శకుడు రాసిపెట్టాడు కూడా.

కానీ నేను నిన్నరాత్రి నాకు దొరికిన పుస్తకాలతోటే మొదలుపెట్టాను. ఆయన నాటకాల సంపుటాలు ఏడింటిలోనూ, నాలుగు సంపుటాలు ఆర్కైవ్ లో ఉన్నాయికాని, అప్పటికే వాటిని ఎవరో పాఠకులు చదవడం మొదలుపెట్టేసారు. బహుశా ఈ ఏడాది మొత్తం ఎవరో ఒకరు వాటిని చదువుతూనే ఉంటారు కాబట్టి, ఆ ఏడు సంపుటాలూ ఆర్కైవ్ లో సంపాదించడం కష్టం. కొనుక్కోడం తప్ప మరో దారి లేదు.

కాని అదృష్టవశాత్తూ నాకు దొరికిన సాహిత్యం నాలుగు ప్రక్రియలకు సంబంధించింది. ఒక నోబెల్ పురస్కార స్వీకర్తని అంచనా వెయ్యడానికి నాలుగైదు పుస్తకాలు సరిపోకపోవచ్చుగాని, అతడి జీవలక్షణం ఏమిటి, దేన్ని అన్వేషిస్తున్నాడు, దేనికోసం మథన పడుతున్నాడు అని తెలుసుకోడానికి ఆ నాలుగైదు గ్రంథాలు సరిపోతాయనే అనిపించింది నాకు.

నేను చదివిన అయిదు పుస్తకాలు- Scenes from a Childhood (2018), Aliss at the Fire (2004), I am the Wind (2007), Death Variations (2001), Someone is Going to Come Home (1992-93). ఇవి కాక, Poetry International సైట్లో ఆయన కవితలు నాలుగున్నాయి. ఫాసే భావోద్వేగాల్ని అర్థం చేసుకోడానికి, అతడి రచనా శైలిని గ్రహించడానికీ ఈ పాటి నమూనా చాలు.

ఆ రచనలు చదవగానే అన్నిటికన్నా మొదట నాకు దగ్గరగా వచ్చినవి అతడి ఊరు, ఆ చిన్నప్పటి ఇల్లు, ఆ స్కాండినేవియన్ చీకటి, ఆ డిప్రెషన్, ఆ జ్ఞాపకాలూనూ. పందొమ్మిడో శతాబ్దిలో ఇబ్సెన్ తన నార్వేని ఇంటా, బయటా కూడా మరీ ఇంత దగ్గరగా మనకు పరిచయం చేసి ఉండేవాడు కాడు. ఇబ్సెన్ నాటకాల్లో మనకి నాలుగ్గోడల మధ్య జీవితమే ప్రధానంగా కనిపిస్తుంది. నేను ఏమంత ఎక్కువ మంది నార్వేజియన్ రచయితల్ని చదవలేదుగానీ, ఈ రచనలు చదువుతున్నంతసేపూ మరొక నార్వేజియన్ కవి Olav H Hauge గుర్తొస్తున్నాడు. కాని ఆయనలోని తేటదనం ఫాసేలో లేదు. ఈ రచయిత అంతరంగం సదా సంచలిస్తూ ఉండే సరసులాంటిది. నీళ్ళమీద నిలకడగా ఉండలేక, అటూ ఇటూ ఊగిపోతుండే పడవలాంటిది. ఆ కథల్లో, నాటకాల్లో, ఆ స్మృతుల్లో ఒక సముద్రం, ఆ సముద్రంలోకి పడవలు ప్రవేశించే రేవు, తన ఇంటి కిటికీ, ఆ కిటికీలోంచి చూస్తే కనిపించే ఆ సాగరజలాలు, తన చిన్నప్పుడు ఎప్పుడూ ఆ ఇంటికిటికీలోంచి సముద్రాన్ని చూస్తుంటే నాయనమ్మా, తమ పూర్వీకుల్లో ఎవరో ఏడేళ్ళ వయసులో ఆ నీళ్ళల్లో మునిగిపోయిన పిల్లవాడు- కనిపిస్తాయి. అదంతా అతడు పెరిగి పెద్దైన Hardangerfjord వాతావరణమే, ఆ నీళ్ళూ, ఆ గాలీ, ఆ రాళ్ళూ, ఆ వానా-అని తెలిస్తే మనకేమీ పెద్ద ఆశ్చర్యం కలగదు. ఎందుకంటే, గొప్ప రచయితలెవ్వరూ తమ బాల్యాన్ని దాటి ఒక్క అడుగు కూడా ముందుకు వేసి ఉండరు కాబట్టి.

Scenes from a Childhood లో ఆ చిన్నప్పటి జ్ఞాపకాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ వాటిలో ప్రత్యేకత ఏమిటి? ఆయన వాటిని తన చిన్నప్పటి కళ్ళతో తాను చూసింది చూసినట్టుగా చిత్రించడానికి చేసిన ప్రయత్నం. ‘వాటిని రాసేటప్పుడు నా లక్ష్యం నా బాల్యం గురించి రాయడం. అప్పుడు ఆ సంఘటనలు ఎలా జరిగేయో చిత్రించడం. కానీ తీరా నేను వాటిని రాసేక, అవి చాలా వరకూ నా చిన్నప్పటి అనుభవాల్లానే ఉన్నాయిగాని, ఒక్కటికూడా పూర్తిగా యథార్థంగా ఉన్నదున్నట్టుగా బయటికి రాలేదు. వాటిలో నేను ఎంతోకొంత కల్పనకి పూనుకోకుండా ఉండలేకపోయాను’ అని రాసుకున్నాడు ఆయన. ‘I cannot help fiction’. ఇది, ఈ ఒక్క వాక్యంతో అతడు నోబెల్ పురస్కారం పొందడానికి పూర్తి అర్హత సాధించాడనిపించింది. అంటే ఏమిటి? అతడు సత్యాన్ని సత్యంగా, తాను చూసినదాన్ని చూసినట్టుగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడనీ, కాని అలా నివేదించడంలో కల్పన ఏదో ఒక మేరకు సత్యంలోకి వచ్చి చేరుతోందనీ గ్రహిస్తున్నాడన్నమాట. కానీ మనమేమో సత్యాన్ని కల్పనగా మార్చడమే సాహిత్యమనుకుంటూ ఉన్నాం!

సాహిత్యంలో కాకుండా నోబెల్ బహుమతి మరికొన్ని రంగాల్లో కూడా ఇస్తుంటారని మనకు తెలుసు. అందులో ఫిజిక్సు, కెమిస్ట్రీ లాంటి సైన్సు రంగాలు ఉన్నాయి. ఆ రంగాల్లో సాధారణంగా పదార్థం గురించీ, పాదార్థిక ధర్మాల గురించీ, శక్తి గురించీ అత్యంత సూక్ష్మ వివేచన చేస్తూ ఉండేవారికి నొబెల్ పురస్కారం దక్కుతూ ఉంటుంది. మరి సాహిత్యంలో పురస్కారం పొందేవాళ్ళు కూడా ఆ స్థాయి సూక్ష్మ పరిశీలకులై ఉండాలి కదా. ఫాసే రచనలు చదివితే ఆయన కూడా ఒక శాస్త్రకారుడిలాగా జీవితానుభవాల్ని అత్యంత సూక్ష్మ పరిశీలనకు పెడుతూ వస్తున్నాడని మనం చప్పున గ్రహిస్తాం. అందుకనే ఒక నార్వీజియన్ పత్రిక రాసిన ఈ మాటల్తో ఏకీభవించడానికి మనకి అభ్యంతరం ఉండదు. ఆ పత్రిక ఇలా రాస్తున్నది:

రోజువారీ సంఘటనల్లో అత్యంత నిస్సారమైన అనుభవాల్ని కూడా ఒక సర్జనికుడులాగా కత్తితో చీల్చి వాటిని మైక్రోస్కోపు కింద పెట్టి అత్యంత సూక్ష్మంగా పరిశీలించే సామర్థ్యం అతడిది. ఆవిధంగా పరిశీలించాక తిరిగి వాటిని మన ముందుకు తీసుకొచ్చినప్పుడు.. ఆ సత్యాలు కొన్ని సార్లు అనంతమైన నిస్పృహతోటీ, అంధకారబంధురంగానూ, భయానంకంగానూ ఉంటాయి. ఎంత భయానకమంటే కాఫ్కానే దడుచుకునేటంతగా..

కాబట్టి ఈ సారి అక్టోబరు 5 న కూడా నోబెల్ బహుమతి మరొక సైంటిస్టునే వరించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్త పదార్థాన్ని సూక్ష్మస్థాయిలో పరిశీలినట్టుగానే అతడు కూడా జీవితానుభవాన్ని చిన్నచిన్నమాటల్లో పట్టుకోడానికి ప్రయత్నిస్తాడు. Aliss at the Fire లో ఇలా రాస్తున్నాడు:

..అతడికి నిజంగా నచ్చందంటూ ఒకటుందంటే అది పెద్ద పెద్ద పదాలు వాడటం. ఎందుకంటే పెద్ద పదాలు విషయాన్ని కప్పేసి మరుగుపరుస్తాయి. ఆ పెద్ద పదాలు, సజీవంగా ఉన్నవాటిని, తమలాగా పెద్దవిగా మార్చేసే క్రమంలో వాటికి ఊపిరాడకుండా చేస్తాయి.

అతడి సాహిత్యమంతా కూడా చలంగారు చెప్పినట్టుగా economy of words. ‘చెప్పేదేదో సూటిగా చెప్పేసి ఇంత మౌనానికీ, ధ్యానానికీ, కార్యాలకీ, విజయాలకీ వ్యవధి నివ్వడం.’ ఆ సూటిదనంలో అతడి ప్రజ్ఞ నిరుపమానం. ఉదాహరణకి బాల్యకాల దృశ్యాల్ని వర్ణిస్తో, అతడు రాసిన పుస్తకంలో ఒక అధ్యాయం మొత్తం మూడు వాక్యాలు. కాని ఆ మూడు వాక్యాల ద్వారా అతడు ఎంత చెప్పగలడో, ఈ ఉదాహరణ చూడండి.

I always agree with those who disagree

I understand that some of what matters most is missing from our lives. So there needs to be a revolution.

పదాలు మనం చెప్పదలుచుకున్నదాన్ని పూర్తిగా చెప్పలేవని మనకి కూడా తెలుసు. అయినా మనం రాస్తూనే ఉంటాం. అది తప్పు కాదు. అలా రాయకపోతే కవీ, రచయితా రానే రారు. కాని మనం చేసే తప్పు మన పదాల వైఫల్యాన్ని మన ఆలోచనల గాంభీర్యంతో మరుగుపరచాలని చూడటం. పూర్వకాలపు కవులు తమ కవిత్వ రాహిత్యాన్ని అలంకారాల మాటున కప్పిపుచ్చినట్టు. ఫాసే లాంటి రచయితలు మనల్ని ఎందుకు ఆకర్షిస్తారంటే వాళ్ళు తమ పదాల వైఫల్యాన్ని నిస్సిగ్గుగా ఒప్పుకుంటారు. చేతుల్లోంచి జారిపోతున్న సత్యాన్ని ఏదో ఒకరకంగా తిరిగి మళ్ళా మైక్రోస్కోపుకిందకి తేడానికి మళ్ళా మళ్ళా ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ వాక్యాలు చూడండి:

కాని నువ్వెందుకు అడుగుతున్నావు, అస్లే అడిగాడు
నేనడుగుతున్నాను అంతే అంది సింగ్యా
అవును అన్నాడు అస్లే
నా మనసులో ఫలానా అంటో ఏమీ లేదు, అడుగుతున్నానంతే, అంది సింగ్యా
సరే అన్నాడు అస్లే
నేనిక్కడున్నాను, అంతే అని కూడా అన్నాడు
చాలా సార్లు ఎవరేనా ఏదేనా చెప్తున్నప్పుడు బహుశా వాళ్ళేమీ చెప్పాలనుకోరనుకుంటాను అన్నాడతడు
బహుశా ఎప్పటికీ అని కూడా అన్నాడు
నిజమే, వాళ్ళేదో చెప్తుంటారు, ఏదో ఒకటి చెప్తుంటారంతే, అందామె
అవును, అలాగే అన్నాడతడు
అవును ఏదో ఒకటి చెప్పి తీరాలి అంతే అంది సింగ్యా
అవును, చెప్పి తీరాలి
అదంతే అన్నాడతడు.

తన స్కాండినేవియన్ బాల్యం, ఆ స్మృతులు, జీవితానుభవాల్ని సూక్ష్మస్థాయిలో ఒక సైంటిస్టులాగా పరిశీలించే లక్షణాలతో పాటు, ఫాసే రచనల్లోని మూడవ ప్రధాన గుణం అతడి శైలి. సాహిత్యాన్ని సంగీతంగా మార్చడానికి చేసిన ప్రయత్నం. భాష భుజాల మీంచి ఆయన ముందు సాహిత్యం బరువునీ, తత్త్వశాస్త్రాల బరువునీ దింపేసి దాన్ని తేలికపర్చడానికి ప్రయత్నించాడు. అతడి ముందు బెకెట్, పింటర్ లాంటి నాటకకర్తలు కూడా ఈ పనిచెయ్యకపోలేదు. కాని వాళ్ళు ఆ ప్రయత్నంలో భాషని పూర్తిగా శూన్యంతో నింపేసారు. Nothingness ఫాసేని కూడా వెన్నాడింది. కానీ అతడు ఆ శూన్యాన్ని సంగీతంతో నింపడానికి ప్రయత్నిస్తాడు. అందుకోసం అతడు భాషని ఒక గీతకారుడైన కవిలాగా సమీపిస్తుంటాడు. సంగీతంలో లయ సాధించే ఫలితాల్ని అతడు పదాల, వాక్యాల, భావాల పునరావృత్తిద్వారా సాధించడానికి చూస్తాడు. Repetition, emphasis, alternation, refrain లాంటి ఛందోరూప సాధనాల్ని అతడు వచనంలోకి తీసుకొచ్చాడు. దాదాపుగా మన రావిశాస్త్రిలాగా. కాని ఆ ప్రయత్నంలో అతడు తన వచనం కవిత్వంగా మారిపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతుంటాడు. అందుకోసం అతడు వాక్యాల ద్వారా చెప్పేదానికన్నా, వాక్యాల మధ్య ఖాళీల ద్వారా ఎక్కువ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే unsayable ని చెప్పడానికి ప్రయత్నించినందుకే అతడికి తాము బహుమతినిస్తున్నామని స్వీడిష్ కమిటీ చెప్పుకుంది కూడా.

అదెలా ఉంటుందో చెప్పడానికి I am the Wind నాటకంలోని ఈ సంభాషణా శకలం చూడండి:

ఒకడు: అదెక్కడ సంభవిస్తుందోనని నేనెప్పుడూ భయపడుతూనే ఉంటాను. అది జరిగి తీరుతుందనుకున్నాను. జరుగుతుందని భయపడ్డాను.
మరొకడు: అవును
ఒకడు: మొత్తానికి అది అయిపోయింది..
మరొకడు: అవును
ఒకడు. అదయిందంతే
మరొకడు: అవును. (క్షణం ఆగి)
ఒకడు: దాని గురించి ఎవరికీ ఏమీ చెప్పడానికి లేదు (అర క్షణం పాటు ఆగి) ఇంక బయల్దేరతాను
మరొకడు: (క్షణం ఆగి) ఎందుకని (అర క్షణం పాటు ఆగి) అదెందుకలా జరిగింది
ఒకడు: కారణమంటూ ఏమీ లేదు. అది అవుతుందని నాకు తెలుసు, అయ్యింది. (క్షణం ఆగి)
మరొకడు: సరే ( అర క్షణం పాటు ఆగి) నువ్వెందుకు వెనక్కితిరగడం లేదు
ఒకడు: సరే (అర క్షణం పాటు ఆగి) సరే నేను కొద్దిసేపట్లో వెనక్కి తిప్పుతాలే ( క్షణం ఆగి)
మరొకడు: ఏమయ్యింది
ఒకడు: నేను (సంభాషణ తుంచేస్తాడు)
మరొకడు: అలా కాదు (అర క్షణం పాటు ఆగి) వద్దు. ఏమీ చెప్పకు (క్షణం ఆగి) నువ్వు ( అర క్షణం పాటు ఆగి) అవును (అర క్షణం పాటు ఆగి) అవును, మనం సముద్రం లోకి వచ్చినప్పుడు, అక్కడ ఆ లైట్ హౌసు కనిపించేటంత దూరం వచ్చినప్పుడు, అక్కడ ఆ వెనక, అప్పుడు (అర క్షణం పాటు ఆగి) నీకు గుర్తుందా? నువ్వు
ఒకడు: (అతడికి మధ్యలో అడ్డుపడుతో) అవును (దీర్ఘవిరామం) గాలి బాగా ఉంది
మరొకడు: అవును మనకి గాలి అనుకూలంగా ఉంది ( క్షణం పాటు ఆగి)

ఇదంతా చదువుతోంటే, ఒక సైంటిస్టు రాసుకున్న డాటాషీటులాగా లేదూ!

ఇక నాలుగో గుణం, ఆ రచనల్లో మరీ సూక్ష్మంగా ఉండే spirituality. చాలామంది ఫాసే మీద బెకెట్ ప్రభావం ఉందని రాస్తూ ఉన్నారుగాని లోతుగా పరిశీలిస్తే నిలబడే అభిప్రాయం కాదు అది. ఉదాహరణకి Waiting for Godot (1953) కీ Someone is Going to Come Home (1992-93) కీ మధ్య పోలిక ప్రధానంగా ఆ మినిమలిస్ట్ టెక్నిక్ లో మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలంటే బెకెట్ కన్నా ఫాసే మరింత మినిమలిస్ట్. అయినా ఆ రెండు నాటకాల్లోనూ తాత్త్వికంగా కూడా ఏదైనా పోలిక వెతకదలచుకుంటే, అది symbiosis అని చెప్పవచ్చు. Waiting for Godot కి వస్తున్న అసంఖ్యాకమైన వ్యాఖ్యానాల్లో దేన్ని సరైందిగా అర్థం చేసుకోవాలో తెలియక, ఆ నాటకాన్ని నటిస్తున్న ఒక నటుడు సూటిగా బెకెట్ నే అడిగేసేడుట: ఇంతకీ నీ నాటకం దేని గురించి అని. అదంతా సింబయోసిస్ గురించి అన్నాడట బెకెట్. అంటే ఇద్దరు మనుషులు లేదా రెండుప్రాణులు జీవించవలసి రావడంలో ఒకరిమీద ఒకరు తప్పనిసరిగా ఆధారపడవలసి రావడం. ఇద్దరు కలిసి బతక్క తప్పని తర్వాత మూడో మనిషికోసమో, ప్రాణికోసమో ఎదురుచూడక తప్పదని బెకెట్ సూచిస్తున్నాడనుకోవచ్చు. కాని ఆ మూడో వ్యక్తి, అతడు మనిషినా, దేవుడా లేక దయార్ద్రహృదయమా బెకెట్ తేల్చలేదు.

కాని ఫాసే నాటకంలో మూడో మనిషి వస్తాడు, మనిషిగానే వస్తాడు. అతడు రావడంతో, అప్పటిదాకా తమ aloneness లో together గా ఉన్న ఆ స్త్రీపురుషులిద్దరూ అనేక అవస్థలకు లోనవుతారు. వాటిల్లో అసూయ కూడా ఒకటి. కాని Someone కేవలం అసూయకి సంబంధించిన నాటకం కాదు. అది డెరిడా లాంటి వాళ్ళు మాట్లాడిన presence కి లేదా absence కి సంబంధించిన నాటకం. ఒకరు రెండోమనిషిని, ఇద్దరు కలిసాక మూడో మనిషిని వెతుక్కోవడంలోని అనివార్యత గురించిన నాటకం అని చెప్పవచ్చు. ఆ విధంగా ఫాసే నాటకం కూడా ఒక క్రతువు, అందులో ఒక ఆధ్యాత్మిక, మతధార్మిక ఆందోళన ఉంది. బెకెట్ నాటకంలో అది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, ఫాసేలో అంత స్పష్టంగా కనిపించదు. కాని నేను చదివిన నాలుగైదు పుస్తకాల్లోనూ కూడా, ఒక అనివార్యమైన అపరాధభావన, అదృశ్యమైపోయిన ఒక మనిషి లేదా ప్రాణి, తన అస్తిత్వంలోకి తనకి ఇష్టంలేకపోయినా చొరబడే పొరుగువాడు- పదే పదే కనిపిస్తూనే ఉన్నారు. ప్రతి రచనలోనూ (నేను చదివినవాటిలో) ఎక్కడో ఒకచోట ఒక knocking ఉంది. Knocking ఆధ్యాత్మిక ప్రయాణంలో తొలిమెట్టు. ఎందుకంటే, ‘తట్టండి, తెరుచుకుంటుంది.’

నాక్కూడా కొత్త ప్రపంచం తలుపు తెరుచుకున్నట్టుంది. కొత్త ప్రపంచం. కానీ చదువుతున్నంతసేపూ మనలోని యథార్థ ప్రపంచం, మనం మన వాదోపవాదాల్తోనూ, సిద్ధాంతాలతోనూ మూసేసి ఉంచిన ప్రపంచం మేల్కొన్నట్టుగా ఉంది. ఇంకా చదవాలి. ఆయన నాటకాలు ఏడు సంపుటాలూ కూడా తొందరలోనే చదవాలని ఉంది. చదివేక మళ్లా రాస్తాను. ఇప్పటికి మాత్రం ఫాసే కవితలు రెండు మీతో పంచుకుంటున్నాను.

కొండ తన ఊపిరి బిగబట్టుకుంది

గట్టిగా పీలుస్తున్న ఊపిరి
అక్కడ నిలబడ్డ కొండ
అక్కడ ఆ కొండ నిలబడి ఉంది
కొండలు నిలబడి ఉండేదట్లానే

అవి నెమ్మదిగా కిందకి వంగుతాయి
కిందకి
తమలోకి వంగి
ఊపిరి బిగబడతాయి

ఆకాశమూ, సముద్రమూ
వాటిని తట్టినిమురుతుండగా
కొండ తన ఊపిరి బిగబట్టుకుంది.

మనకి తెలుసుగానీ

ఆ గీతం, సముద్ర గీతం
ఆ నిటారైన కొండల మీంచి
ఆకాశానికి అడ్డంగా కిందకి జారుతోంది

ఒక నీలి కదలికగా, ఒక మిలమిలగా
మనం కలిసి ఉన్నచోటుకి,
అదేమిటో మనకు తెలుసుగాని
మనం చెప్పలేని చోటుకి.


Featured image PC: https://newsukraine.rbc.ua/

6-10-2023

8 Replies to “సర్జన్ లాంటి రచయిత”

  1. “…కానీ మనమేమో సత్యాన్ని కల్పనగా మార్చడమే సాహిత్యమనుకుంటూ ఉన్నాం!”

    …సర్.

    ఇది మాత్రం చాలూ…..ఇది మాత్రమే!
    మాకింక చాలూ… మీరు మాత్రమే!!

    ధన్యోస్మి

  2. మీ వల్ల అనేక కొత్త విషయాలు తెలుస్తాయి.

Leave a Reply

%d