దివ్యప్రేమ గీతం-6

దివ్య ప్రేమగీతంలో నాలుగవ గీతం నుంచి ఏడవ గీతందాకా స్తుతి గీతాలని చెప్పాను కదా. అయిదవ గీతాన్ని కూడా మనం నాలుగవ గీతంతో కలిపి చదవాలి. అయిదవ గీతంలోని మొదటి చరణం నాలుగవ గీతంతో అనుసంధానించి చదువుకోవాలి. ‘నా ప్రియుడు ఈ తోటలో అడుగుపెట్టాలి, ఇక్కడి మధురఫలాల్ని రుచిచూడాలి’ అని ఆమె (4:16) అనుకున్నతరువాత, అతడు ‘ఈ తోటలో నేను అడుగుపెట్టాను, పరిమళ ద్రవ్యాలు సమకూర్చుకున్నాను, ఇక్కడి తేనెపెరలు ఆరగించాను’ (5:1) అని జవాబివ్వడంతో అయిదవ గీతం మొదలవుతున్నది. అది ఆమె ప్రియుడు తృప్తి పొందిన క్షణం. ప్రేమ తృప్తి పొందిన క్షణం.

ఆ తర్వాత 5:2 నుంచి 5:8 దాకా కథ ఆసక్తికరమైన మలుపు తిరిగింది.

ఆమె తనగదిలో ఉంది. నిద్రకి ఉపక్రమిస్తూ ఉంది. తన దుస్తులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కుని శయ్యమీద నిద్రించడానికి సిద్ధపడుతూ ఉండగా అతడు బయటనుంచి పిలిచాడు. లోపలకి వస్తాను, తలుపు తియ్యి అని అడిగాడు. ఆమె తాను అప్పటికే వివస్త్రగా ఉన్నాననీ, ఇప్పుడు తలుపు తియ్యడానికి మళ్ళా దుస్తులు ధరించాలనీ, అలాగే శయ్యనించి కిందకి దిగి పాదాలు మళ్ళా మురికి చేసుకోవడం అవసరమా అని ఆలోచించింది. ఇది మామూలు కథగా చూసినా కూడా ఆసక్తికరమైన మలుపు. ఎందుకంటే ప్రేమ పరితృప్తి సంభోగంలో ఉందని వాళ్ళు అనుకుంటారని మనం అనుకుంటాం అప్పటిదాకా. కాని ఆమె దృష్టిలో ప్రేమ అతను తన తోటలోకి అడుగుపెట్టి ఆ మధుర ఫలాలు ఆరగించడంతో సఫలమయ్యిందని ఆమె అనుకుంటోందని మనకి ఇక్కడ అర్థమవుతోంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్యా ఈ అమలిన క్షణాన్ని మనం ఊహించం. అతను తలుపు తట్టినప్పుడు తిరిగి తాను దుస్తులు వేసుకోవడం, పాదాలు నేలమీద పెట్టడం అవసరమా అని ఆమె అనుకుంటోందంటే, వాటిని ఆమె ఈ ప్రాపంచిక విషయాలుగా భావిస్తూ ఉందని.

ఈ సన్నివేశం నాకు చలంగారి ‘పురూరవ’ నాటకాన్ని గుర్తుకు తెచ్చింది. అందులో ఈ సన్నివేశం చూడండి:

(మళ్ళీ నగారా. పురూరవుడు ఆ శబ్దాన్నించి మనసుని పక్కకు మళ్ళించి ఆమెలో నిలవాలనే వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాడు.)

ఊర్వశి: (నవ్వుతో) వెళ్ళు, ఏమిటో సంగతి కనుక్కో.

పురూ: నువ్వూ!

ఊర్వశి: నా సంగతి నాకు వొదులు.

(పురూరవుడు వెడుతున్నాడు. వూర్వశి నవ్వుతోంది.పురూరవుడు తిరిగి వచ్చాడు)

పురూ: బట్టలు!

ఊర్వశి: అట్లా కనబడరాదూ వాళ్ళకి. సమస్యే ఉండదు.

పురూ. అమ్మో!!(నవ్వుతున్నారు ఇద్దరూ)

ఊర్వశి: ఈ వస్త్రధారణతోటే పూర్తి అయిందనుకుంటాను, మానవుడి పతనం సత్యలోకం నుంచి, శరీరమానసికారోగ్యం నుంచి. మానవుడి కపటానికి, బానిసత్వానికి చిహ్నం వస్త్రం. పోనీ నువ్విక్కడ వుండు. నేను విచారించి వస్తాను. (నవ్వుతోంది)

ఇక్కడ ఈ గీతంలో కూడా వస్త్రాలూ, పాదాలకు అంటబోయే మురికినీ మనం రూపకాలంకారాలుగానే భావించవచ్చు. వాటిని ప్రాపంచిక ప్రమాణాలుకు ప్రతీకలుగానే ఆమె భావిస్తున్నది. కాని ఆ క్షణాన ఆమె ఊహలో ఒక పొరపాటు జరిగింది. అదేమంటే ఆమె అంతవరకూ తన పట్ల అతడు చూపిస్తున్న ప్రేమనీ, అతడి పట్ల తన ప్రేమనీ సాధారణ లౌకిక ప్రమాణాల్ని దాటి చూడలేదు, కాబట్టే అతడు తలుపు తట్టినప్పుడు ఆమె ఆ పిలుపులోని అలౌకికాంశని గుర్తుపట్టలేకపోయింది.

ఆ తర్వాత ఆమె లేచి తలుపు తియ్యడానికి వెళ్ళినప్పుడు కూడా అది ఆ ప్రేమలోని అపార్థివత్వస్ఫురణ వల్లకాదు, అతడి కంఠస్వరంలో తనలో మేల్కొల్పిన తీవ్రభావోద్వేగం (5:4) మాత్రమే అనడం గమనించాలి.

కాని అప్పటికే ఆ ప్రియుడు అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. ఈ గీతం సాధారణ ప్రేమగీతం స్థాయిదాటి దివ్యప్రేమగీతంగా మారే సందర్భాల్లో ఇదొకటి. ఈ వాక్యాలు గీతాంజలిలోని ఎన్నో కవితల్ని గుర్తు తేవడంలో ఆశ్చర్యం లేదు.

పద్మం వికసించిన రోజున, నాకు తెలీనే లేదు, ఖర్మం, నా మనసు ఎక్కడో మెలుగుతోంది. (గీతాంజలి.20)

నిర్జనమైన వీథిలో నువ్వొక్కడివే పాంథుడివి. నా ఏకైక సఖా, ప్రియతమా! నా ఇంటితలుపు తెరిచి వుంచాను. కలవలె మాయమై జారిపోకు. (గీ.22)

అతను వొచ్చి నా పక్కన కూచున్నాడు. కాని నా దురదృష్టం, మెళకువ వచ్చింది కాదు. పాపిష్టినిద్ర ఎక్కడ నన్నావరించిందో! ఎంత నిర్భాగ్యురాల్ని! (గీ. 26)

ఎన్నటికో నా నిద్రనించి మేల్కొని కళ్ళు తెరవగానే నా నిద్రని ముంచెత్తుతో, నా పక్కనే నుంచుని వున్న నిన్ను చూశాను. నేనెంత భయపడ్డాను! (గీ.48)

ఇలా ఎన్నో వాక్యాలు గుర్తుచేసుకోవచ్చు. వీటన్నిటి సారాంశం ఒక్కటే. నువ్వు నీ ప్రియతముడి కోసం ఎదురుచూస్తూ ఉన్నావు. కాని తీరా అతను నీ గడప దగ్గర అడుగుపెట్టినప్పుడు నిద్రవల్లనో, అజ్ఞానం వల్లనో లేదా ప్రాపంచికమైన విలువల వల్లనో అతడికి తలుపులు మూసేసావు, లేదా అతడికి ఎదురేగలేకపోయావు. తీరా అతడు అదృశ్యం కాగానే నువ్వెంత పొరపాటు చేసావో తెలుసుకుంటావు. ఈ గీతంలో జరిగింది కూడా అదే.ఆమె ఏ ప్రాపంచికమైన విలువల్ని దృష్టిలో పెట్టుకుని, అతడు తలుపు తట్టినప్పుడు, ముందు తలుపు తియ్యడానికి సంకోచించిందో, చివరికి ఆ విలువల్నే పక్కకు నెట్టి ఆ అర్థరాత్రి అతణ్ణి వెతుక్కుంటూ నగరవీథుల్లో తిరగడం మొదలుపెట్టింది. ఆ వీథుల్లో పహరా కాసేవాళ్ళు తనని కొట్టారనీ, గాయపరిచారనీ కూడా చెప్తోంది మనకి. అక్కడితో ఆగలేదు. ఆమె పైన కప్పుకున్న వస్త్రాన్ని వాళ్లు లాగేసి చింపి పారేసారు అని కూడా చెప్తోంది. చిన్న చిన్నమాటల్లో చెప్పిన ఈ చరణాల్లో (5:4 నుంచి 5:7) ఇంత నాటకీయమైన కథ నడిచింది. ఏ దుస్తులు తిరిగి ధరించవలసి ఉంటుందని ఆమె తన ప్రియుడు పిలవగానే లేవడానికి సంకోచించిందో చివరికి కాపలావాళ్ళు ఆ దుస్తుల్నే ఆమెనుంచి లాగేసాదాకా కథ నడిచింది.


ఇక ఆ తరువాత చరణాలు (5:10 నుంచి 5:16) దాకా ఆమె ప్రియతముడి వర్ణన. అందులో మొదటి చరణం (5:10) అతని గురించిన ఒక సమగ్ర వర్ణన. అతడి విశిష్టత ఎటువంటిదో ఒక్కమాటలో చెప్పిన వర్ణన. అతడు పదివేలమంది మధ్య ఉన్నా కూడా ప్రత్యేకంగా కనిపిస్తాడని చెప్పిన చిత్రణ. ఆ తర్వాత మూడు చరణాలూ (5:11-13) తన ప్రియుడి ముఖవర్ణన. ఆ వదనాన్ని పోల్చడానికి ఆమె పూలనీ, పక్షుల్నీ, పాలనీ, పరిమళాల్నీ గుర్తుచేసుకుంది. ఆ తర్వాత మూడు చరణాలూ ( 5:14-17) దేహం గురించిన వర్ణన. ఇక్కడ ఆమె లోహాల్నీ, వనాల్నీ, వృక్షాల్నీ పోలికలుగా తెచ్చుకుంది. చివరి చరణం (5:16) మళ్ళా సమగ్ర వర్ణన. ఒక్క మాటలో ‘అతడు నిలువెల్లా సంతోషం’ అని చెప్పడంతో ఆ వర్ణన పూర్తయింది. మూర్త, భౌతిక, ప్రాకృతిక, లోహసంబంధ పదజాలంతో చిత్రించిన చిత్రం ‘అతడు నిలువెల్లా సంతోషం’ అనే ఒక అరూప, అభౌతిక, అపార్థివ అభివ్యక్తితో పరాకాష్టకు చేరుకుంది. ఈ గీతంలో ఇప్పటిదాకా ప్రియుడు ఆమెని వర్ణిస్తూ వచ్చినదానికి ఇది ప్రతివర్ణన.

ఇదంతా నిజంగా జరిందా లేక ఆమె కలగన్నదా అన్నది గీతకర్త కొంత అస్పష్టంగా వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆ నగరంలో ఆ కావలివాళ్ళు ఆమెని కొట్టి గాయపరచడం, ఆ వలువలు లాగెయ్యడం బహుశా ఆమె కల కావచ్చు. కాని అది కల అయినా, మెలకువ అయినా ఆమెలో తెచ్చిన పరివర్తన మాత్రం స్పష్టం. అదేమంటే తన ప్రేమికుడు తన దగ్గరకి తనంతతానుగా వచ్చి తలుపు తట్టినప్పుడు ప్రాపంచిక విలువల్ని గుర్తుపెట్టుకుని అతనికి ప్రతిస్పందించకపోవడం తప్పని ఆమెకి అర్థమయింది. ఏదోను ఉద్యానంలో ఆదిస్త్రీపురుషుల మధ్య విషాదం జ్ఞానఫలాన్ని ఆరగించడం వల్ల సంభవించింది. ఇక్కడ ఈ ఎడబాటు అజ్ఞాన ఫలం. ప్రేమా, ప్రపంచమూ ఈ రెండూ ఒకచోట ఇమిడేవి కావు. ఆ రెండు కత్తులూ ఒక ఒరలో ఇమిడేవి కావని కబీరు చెప్పనే చెప్పాడు.


5.1

అతను

నా సోదరీ, నా వధూ
నా తోటకి వచ్చాన్నేను
నా సాంబ్రాణీ, సుగంధద్రవ్యాలూ తీసుకున్నాను
తేనెపెరలు తిన్నాను
పాలూ, ద్రాక్షారసం కడుపారా తాగాను

ఆరగించండి మిత్రులారా, అస్వాదించండి
మత్తెక్కేలాగా తాగండి

2

ఆమె

నేను నిద్రపోతున్నానే గాని నా హృదయం మేలుకునే ఉంది
విను
నా ప్రేమికుడు తలుపు తడుతున్నాడు

నా సోదరీ, నా సఖీ, తలుపు తియ్యి
నా పావురమా, శీలవతీ
రాత్రి మంచుకి
నా తలంతా తడిసిపోయింది

3

కాని నేను వివస్త్రనై ఉన్నానే
మళ్ళా లేచి దుస్తులెక్కడ ధరించను ?
కాళ్ళు కడుకున్నానే
మళ్ళా వాటినెట్లా మురికి చేసుకోను?

4

నా ప్రియుడు తలుపు గడియ తియ్యబోతుంటే
నా ఉద్వేగానికి అదుపు లేదు

5

తలుపు తెరుద్దామని లేచాను
నా వేళ్ళని అగరు పరిమళం అంటుకుంది
తలుపు గడియమీద
అగరు తైలం తడిగా తగిలింది.

6

నా ప్రియుడికోసం తలుపు తెరిచాను
అప్పటికే ఆయన వెళ్ళిపోయాడు
అతని స్వరంవినీవినగానే నాకు స్పృహతప్పింది

అతడికోసం ప్రతి ఒక్కచోటా వెతికాను
కాని కనరాకున్నాను
అతణ్ణి పేరుపెట్టి పిలిచాను
కాని జవాబు లేదు

7

నగరంలో రాత్రి పహరాకి బయలుదేరిన
కావలివాళ్ళ కంట్లో పడ్డాను
వాళ్ళు నన్ను కొట్టారు, గాయపరిచారు
ఆ కావలివాళ్ళు
నా మేలిముసుగు లాగి చింపేసారు

8

యెరుషలేం కుమారినులారా, ఒట్టుపెట్టండి
నా ప్రియుడు మీకు కనిపిస్తే
నేను ప్రేమజ్వరంలో కూరుకుపోయానని
అతనికి చెప్తామని ప్రమాణం చెయ్యండి.

9

చెలికత్తెలు

నీ ప్రేమికుడెలా ఉంటాడు
తక్కినవాళ్ళనుంచి అతణ్ణెట్లా గుర్తుపట్టేది?
ఓ సుందరీ, మేము ఒట్టుపెట్టి చెప్పాల్సిన
ఆ నీ అందగాడెలా ఉంటాడు?

10

నా ప్రేమికుడు పాలు, పానీయం.
పదివేల మధ్య అతడు
ఒకే ఒక్కడు.

11

అతని శిరస్సు నిక్కమైన అపరంజి.
అతని శిరోజాలు
నల్లని కాకి రెక్కలు.

12

క్షీర, సమృద్ధి ప్రవాహాల
ఒడ్డున వాలిన పావురాలు
అతని కన్నులు

13

అతని చెంపలు సుగంధాల శయ్యలు
శ్రేష్ట పరిమళాల ప్రోవులు
అగరు తైలంతో తడిసిన
ఎర్ర కలువలు అతని పెదాలు

14

అతని హస్తం గోమేధికాలు పొదిగిన బంగారు దండం
పచ్చలు పొదిగిన దంతపు సింహాసనం
అతని కటిసీమ.
అతని ఊరువులు బంగారు మట్టు మీద నిలబెట్టిన
పాలరాతి స్తంభాలు

లెబనాను పర్వతంలాగా సమున్నతుడు
దేవదారు తరువులాంటి పురుషశ్రేష్టుడు

16

అతన్ని నోరు తియ్యని ద్రాక్షారసం
అతడు నిలువెల్లా సంతోషం

యెరుషలేం కన్యలారా
అతనే నా ప్రియుడు
నా స్నేహితుడు.

8-3-2023

4 Replies to “దివ్యప్రేమ గీతం-6”

  1. In the light of your commentary, this reading experience is becoming more beautiful. Thankyou.

  2. ఆ చిన్న అస్పష్టత మనల్ని ఎన్నెన్ని ఊహలలోకి తీసుకువెళ్తున్నది కదా !కలా మెలకువ కాని స్థితి .

Leave a Reply

%d bloggers like this: