
ప్రజాస్వామ్య రచయితల వేదిక, సంస్కృతి గ్లోబల్ స్కూల్ వారు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సాహిత్యోత్సవం నిన్న చాలా ఉత్సాహంగా గడిచింది. రెండు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రచయితలు, కథకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంస్కృతి గ్లోబల్ స్కూల్ పిల్లలే కాక, చుట్టుపక్కల ఉండే ప్రభుత్వ పాఠశాలల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పొద్దున్న ప్రారంభ సమావేశం లో సంస్థ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారు ఈ సాహిత్య ఉత్సవాన్ని తన పాఠశాలలో ఏర్పాటు చేయటం వెనుక ఉన్న ఉద్దేశాల్ని వివరించారు. కార్యశాల ఉద్దేశాల్ని వేదిక తరపున మానస ఎండ్లూరి వివరించారు. అనిశెట్టి రజిత అధ్యక్షత వహించిన ప్రారంభ సమావేశంలో నేను ప్రారంభోపన్యాసం చేశాను. లక్ష్మీ నరసయ్య గారు వ్యాస రచయితగా తన ప్రయాణాన్ని వివరిస్తే, మానస చామర్తి కవిత్వంతో తన ప్రయాణాన్ని, రెడ్డి రామకృష్ణ పాటతో తన ప్రయాణాన్ని వివరించారు. ఖదీర్ బాబు కథతో తన ప్రయాణాన్ని వివరించారు. డాక్టర్ కృష్ణమూర్తి గారు అతిథి వాక్యం వినిపిస్తూ ఈ ఏడాది నుంచి ఎవరైనా విద్యార్థులు పుస్తకాలు రచిస్తే వాటిలో చాలా బాగుందనుకున్న పుస్తకాన్ని తమ సంస్థ తరఫున ప్రచురిస్తామని ప్రకటించారు.
ప్రారంభ సమావేశం తర్వాత పిల్లలు, ఉపాధ్యాయులు రచయితలు అందరూ 25 బృందాలుగా విడిపోయారు. ఒక్కొక్క బృందంలోనూ ఇద్దరేసి రచయితలు నలుగురైదుగురు విద్యార్థులు ఉన్నారు. ఆ విద్యార్థుల్లో కూడా ఇద్దరు లేదా ముగ్గురు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. నిన్న రోజంతా ఆ రచయితలు ఆ విద్యార్థులతో రాయటం గురించి, చదవడం గురించి, వాళ్ల ఆసక్తి గురించి మాట్లాడించారు, చర్చించారు, రాయించారు.

నేను అన్ని బృందాల్ని కలుసుకున్నాను. వారి చర్చలు కొంతైనా విన్నాను. ఆ పిల్లలు చాలా చురుగ్గా ఉన్నారు. కొందరు విద్యార్థులు ఇంగ్లీష్ చదివి ఇంగ్లీషులో రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఆలోచనలు, అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఆత్మవిశ్వాసం నన్ను ఆశ్చర్యపరిచింది.
ఒక బృందం చర్చలో ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ బృందానికి మార్గదర్శకత్వం వహిస్తున్న అరసవల్లి కృష్ణ ఆ పిల్లల్ని ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చినాయన ప్రారంభ ఉపన్యాసం చేశారు కదా అందులో ఆయన చెప్పిన మాట ఏదైనా గుర్తుందా అని అడిగాడు. నేను ఆ పిల్లల వైపు చూస్తున్నాను. ఇంతలో ఒక అమ్మాయి తాను రాసుకున్న నోట్ బుక్ తెరిచి నా ప్రసంగంలో నేను మాట్లాడిన మాటల్లోంచి సృజనాత్మకత గురించి చెప్పిన ఒక వాక్యం నాకు వినిపించింది. చాలా ఆశ్చర్యపోయాను నేను. ఉద్యోగంలో కానీ సాహిత్యంలో కానీ లేదా ఎటువంటి క్రియాశీలకమైన పనిలో గాని అన్నిటికన్నా ముఖ్యం క్రమశిక్షణ. ఆ చిన్న పిల్ల ప్రారంభ ఉపన్యాసంలో మాట్లాడిన వాళ్ల మాటల్ని ఒక నోట్ బుక్ లో రాసుకుంటే నాకు మనందరికీ తెలిసిన ఒక కథ గుర్తొచ్చింది. ఈరోజు వాన పడడం కోసం ప్రార్థన చేద్దాం రండి అని పిలిస్తే అందరూ మామూలుగా వెళ్లారు కానీ ఒక చిన్న పిల్లవాడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడు. ఎందుకని అడిగితే మనం ప్రార్ధించాక వాన పడితే తడిసిపోతాం కదా అందుకని గొడుగు తెచ్చుకున్నాను అని చెప్పిన కథ మనకు తెలుసు. రచయితలు, సంస్కర్తలు, విప్లవకారులు అట్లా మాటల్ని ఒట్టి మాటలుగా కాక ప్రార్థనలుగా భావిస్తారు. వాక్కుని వాగ్దానంగా భావిస్తారు. నినాదాన్ని ప్రాణం కన్నా మిన్నగా నమ్ముతారు. ఆ చిన్నపిల్ల రేపు భవిష్యత్తులో ఏ గొప్ప మార్పుకో శ్రీకారం చుట్టబోతున్నదని నాకు ఇప్పుడే అర్థమైంది.

నిన్న బృందాలన్నీ కలిసి చేసిన చర్చల సారాంశాన్ని ఈరోజు బృందాలన్నీ అందరికీ నివేదించాయి. ఆ నివేదికలన్నీ శ్రద్ధగా విన్నాను. అలాగా నూటయాభై మంది విద్యార్థులకు ప్రతినిధులుగా పన్నెండు మంది విద్యార్థుల స్పందన కూడా విన్నాను. పిల్లల ఆలోచనా ప్రపంచం ఎలా ఉంది, వాళ్ళ ఆసక్తులు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి, చదవడం గురించి రాయడం గురించి వాళ్లకున్న ఉత్సాహం, ఆకాంక్షలు, భయాలు ఎలా ఉన్నాయి అన్నది విన్నాక ఈ పిల్లల ప్రపంచం మీద మనం చాలా ఆశ పెట్టుకోవచ్చు అనిపించింది. ఒక బృందానికి మెంటార్ గా ఉన్న అమరజ్యోతి తన నివేదికలో చెప్పినట్టుగా వీళ్లంతా ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డలుగా’ కనబడ్డారు. వాళ్ళ రచనా కౌశల్యం ఎలా ఉందో చెప్పటానికి ఏడో తరగతి విద్యార్థి శ్రేయాస్ రాసిన ఒక ఇంగ్లీష్ కవిత చూడండి. చైతన్య పింగళి మెంటార్ గా ఉన్న బృందంనుంచి:
Mystery
People may forget a legend,
They can never forget the myth
Embedded deep in the human mind
The truth sleeps within
Truth lies in the jail of lies
A kind heart awakens ;
It judges none
Neither good, nor bad
It pulls the truth,
Crushes the lies,
Lies lie in the jail of truth.
ఇలాంటి కార్య శిబిరాలు ప్రభుత్వం చేపట్టవలసిన పని. నేను పాఠశాల విద్యాశాఖలో ఉండగా బాల సాహిత్యం మీద కొంత కృషి మొదలుపెట్టాము. రచయితలతో ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించాము. కానీ ఇలా రచయితల్నీ, విద్యార్థుల్నీ కలిపి ఒక కార్యశిబిరం నిర్వహించవచ్చు అన్న ఊహ నాకెందుకు తట్టలేదు? అది కూడా నలుగురు ఐదుగురు విద్యార్థులకు ఇద్దరు రచయితలు మెంటర్లుగా. ఇది చిన్న పని కాదు. నా చిన్నతనంలో నాకిటువంటి వర్క్ షాప్ కి వెళ్లే అవకాశం లభించి ఉంటే ఎంతో బాగుండేది. అసలు ఇటువంటి ఊహ వచ్చినందుకే ఈ నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

పిల్లలు రచయితలు ఎందుకు కావాలి? ఎందుకు కావాలో నిన్న నా ప్రారంభ ఉపన్యాసంలో చెప్పాను. నిజానికి ప్రతి బాలుడు, బాలిక ఒక రచయిత కావాలి. రచన కేవలం వృత్తి రచయితలకి, పాత్రికేయులకి మాత్రమే పరిమితం కాకూడదు. సమాజంలోని సకల రంగాల్లో ఉన్నవారు తమ అనుభవాల్ని నిజాయితీగా రాయడం మొదలుపెడితే మనకి మన సమాజం గురించి, మన ప్రపంచం గురించి మరింత లోతైన అవగాహన కలుగుతుంది.
పిల్లలు చిన్నప్పటి నుంచి చదవడం రాయడం అభ్యాసం చేస్తే అది వాళ్ల జీవితాల్ని వాళ్లు మరింత లోతుగా ఇంటర్నలైజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. ఒకరి భావాలు మరొకరికి చెప్పుకోవడం వల్ల సంఘీభావం బలపడుతుంది. ఒకరి భావాలు మరొకరు వినడంవల్ల సహన సంస్కృతి వర్ధిల్లుతుంది. మంచికంటి తన ప్రెజెంటేషన్ లో చెప్పినట్టుగా, పిల్లలు రచయితలైనా కాకపోయినా ముందు కనీసం మంచి పాఠకులవుతారు.
పిల్లలు సాహిత్య ప్రపంచంలో విహరించడానికి అందరికన్నా పెద్ద అడ్డంకి వాళ్ల తల్లిదండ్రులే. పిల్లలు టెక్స్ట్ పుస్తకాలు కాకుండా కథలు కవిత్వం చదివితే వాళ్ల చదువు వెనుకబడిపోతుందని తల్లిదండ్రుల నమ్మకం. అది మూఢనమ్మకమే అని ఈ రెండు రోజుల కార్య శిబిరం నిరూపించింది.
5-2-2023
చదువుతుంటేనే గొప్ప అనుభూతి కలిగింది.కొత్త దారి కన్పిస్తున్నది.
మువ్వ
దూకుతున్నది
పాయ కొండ పైనుండి
నదినౌతానన్న నమ్మికతో….
మీ స్పందనకు ధన్యవాదాలు
సాహితీ మూర్తికి వందనం.
శ్రవణ నైపుణ్యం ఉన్నవారికే భాషణ నైపుణ్యం అబ్బుతుంది.
మంచి పాఠకునికి మాత్రమే ఉత్తమ రచయిత కాగల అవకాశం ఎక్కువగా ఉంటుంది.
విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి.
పిల్లల్లో నిద్రాణమై ఉన్న శక్తుల్ని ప్రేరేపించడానికి
గొప్ప గొప్ప వ్యక్తుల సాన్నిహిత్యం,మార్గ నిర్దేశకత్వం ఎంతో అవసరం.
ధన్యవాదాలు sir.
మీరన్న మాటలు అక్షర సత్యాలు.
ఆ చిన్న పిల్లవాడి కవిత్వం అద్భుతం.
మంచి అవకాశం పోగొట్టుకున్నాను. పుస్తకం చదివి దాని గురించి రాయడం ,మాట్లాడడం లాంటి activities బడి సిలబస్ లో భాగం కావాలి .కానీ చదువులో ప్రాధాన్యాలు మారాయి కదా!
నిజమే కదా!
చాలా చక్కగా చెప్పారండి… మంచి పాఠకులు అవుతే… మనసు తడి ఆరని వారిలా ఉంటారు అనిపిస్తుంది…
చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.
వీళ్లంతా ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే బిడ్డలుగా’ కనబడ్డారు.మీవంటి వారి కృషి ఊరికే పోదు.ఇదిగో ఇలానే అవుతారు పిల్లలు
మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు