మెడిటేషన్స్-5

పొద్దున్నే బాల్కనీలోకి వెళ్ళగానే ఎక్కణ్ణుంచో ఎప్పటి ఆత్మీయులో ఏ చిన్నప్పటి పాటనో పాడుతున్నట్టు మధురసుగంధం.

అర్థమయింది.

మేడ మీద సంపెంగ మొగ్గ రేకులు విప్పుకుని ఉంటుంది. వెంటనే మేడమీదకు వెళ్ళాను. శరత్కాల ప్రభాత కాంతిలో బంగారు ప్రత్యూష ధూళి లో చెట్టుకి బంగారం పూసినట్టుగా సంపెంగమొగ్గ.

పూల బాసలు తెలుసు ఎంకికి అనుకున్నాడు నాయుడు బావ. పూల పిలుపులు వినగలగడం దానికదే గొప్ప అనుగ్రహం. నీ మనస్సనే ఆకాశం తేటపడుతోంది అనడానికి అదొక గొప్ప గుర్తు. ఈ పిలుపు దేవుడి పిలుపు. ఆ పిలుపు వినగానే తక్షణం లేచి నిలబడటానికి నువ్వెప్పుడూ సంసిద్ధుడిగా ఉండాలంటున్నాడు మార్కస్ అరీలియస్. ఆయన ఇలా (3:13) అంటున్నాడు :

తమ వైద్యపరిజ్ఞానం, నైపుణ్యాలతో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో అని వైద్యులు తమ శస్త్రపరికరాలు సిద్ధంగా పెట్టుకున్నట్టే నువ్వు కూడా నీ మానవత్వాన్నీ, నీలో దైవత్వాన్నీ గుర్తుపట్టడానికి అవసరమైన సూత్రాల్ని సదా సంసిద్ధంగా ఉంచుకోవాలి. మనిషికీ, దేవుడికీ మధ్య ఉండే అనుబంధాన్ని గుర్తుకు తేగల చిన్నపాటి అవకాశం కూడా వదులుకోకూడదు. ఎందుకంటే దైవత్వాన్ని మేల్కొల్పకుండా నువ్వు మనుషులకి సంబంధించిన ఏ పనీ కూడా సక్రమంగా నెరవేర్చలేవు, అలాగే మనుషుల ప్రస్తావన లేకుండా దైవకార్యం కూడా.

ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ మాటలు! ఎప్పుడు ఏ అత్యవసర చికిత్స చెయ్యవలసి వస్తుందో అని సర్జను తన పరికరాల్ని సిద్ధంగా పెట్టుకున్నట్టు మనం దైవత్వాన్ని గుర్తుపట్టడానికి సదా సంసిద్ధంగా ఉండాలట. ఆ అనుబంధాన్ని గుర్తుతెచ్చే చిన్నపాటి అవకాశాన్ని కూడా వదులుకోకూడట. మనుషులకోసం దైవత్వాన్ని ఆవాహన చెయ్యడం సరే, మనుషుల ప్రసక్తిలేని దైవకార్యం కూడా ఉండదట! ఆ పువ్వు సంపెంగ మొగ్గ దేవుడు నాకు పంపిన సందేశం, నిజమే, కాని నేను ఆ పిలుపుకు ప్రతిస్పందించడం కూడా దేవుడికి అంతే అవసరమన్నమాట!

ఈ వాక్యాలు  చదువుతోంటే రెండువేల ఏళ్ళ కిందటి ఆ సజ్జనుడి తలపులు నన్ను తాకుతుంటే నాకు కూడా దేవతల సన్నిధిన కూచున్నట్టుగా అనిపిస్తున్నది. మెడిటేషన్స్ మూడవ అధ్యాయంలో ఆయన ఇలా (3:3) రాస్తున్నాడు:

శ్రేష్టులూ, ఉత్తములూ అయినవాళ్ళ సరసన కూచోడానికి ఏ మనిషి ఇంకెంతమాత్రం ఆలస్యం చెయ్యడో అతడు దేవతల వార్తాహరుడు, వాళ్ళకి సన్నిహితుడు అని చెప్పవలసి ఉంటుంది. తనలో ఆసీనుడై ఉన్న దైవత్వం వల్ల అతణ్ణి సుఖాలు మలినపరచలేవు. దుఃఖాలు హానిచెయ్యలేవు. ఎటువంటి అవమానాలూ అతణ్ణి తాకను కూడా తాకలేవు. అతణ్ణి ఏ క్లేశమూ బాధపెట్టలేదు. గొప్ప బహుమానంకోసం ద్వంద్వయుద్ధానికి తలపడేవాడిలాగా ఉంటాడు. అతణ్ణి ఏ వ్యామోహమూ లొంగదీసుకోలేదు. న్యాయసమ్మతమైన ప్రవర్తన అనే రంగులో ముంచి తేల్చిన వస్త్రంలాగా ఉంటాడు. తనకు ఏది సంప్రాప్తించినా అది తన వంతు వాటా తనకి దక్కిందన్న పూర్తి ఎరుకతో స్వీకరిస్తాడు. మరొకళ్ళు ఏమనుకుంటున్నారు, ఏమంటున్నారు, ఏమి చేస్తున్నారు అన్నది, తన కోసం గాని, నలుగురి కోసం గాని, క్షణం పాటేనా తలపుల్లోకి రానివ్వడు.

ఇంకా ఇలా చెప్పుకుంటున్నాడు:

తనకి ఏది సంబంధించిందో దాని మీదనే దృష్టిపెడతాడు. దాని చుట్టూతానే తన కార్యకలాపం నడుపుకుంటాడు. మొత్తం విషయాల్లో తన వంతు వాటాగా ఏది లభించిందో దాని గురించే నిత్యం ఆలోచిస్తూ ఉంటాడు. తనకు సంబంధించినంతవరకూ సక్రమంగా ఉండేట్టు చూసుకుంటాడు. తనకి దక్కిన భాగం శుభప్రదమని నమ్ముతాడు. తక్కినవాళ్ళని సహప్రయాణీకులుగా భావిస్తాడు. వాళ్ళని కూడా తనతో పాటు నడవనిస్తాడు.

మనం చిన్నప్పుడు ఈ ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు ప్రతి ఒక్కటీ ఆశ్చర్యంతో చూస్తాం. మనుషులు, ప్రదేశాలు, అనుభవాలు ప్రతి ఒక్కటీ మనకి కొత్తగా ఉంటాయి. ఆసక్తికరంగా ఉంటాయి. కొన్నాళ్ళకి జీవితచక్రం అలవాటయిపోతుంది. దేన్నీ ఇంకెంతమాత్రం మనం కొత్తగా చూడలేం. మనుషులు, ప్రదేశాలు, చివరికి సుఖదుఃఖాలు కూడా అలవాటుగా మారిపోతాయి. దీనికి కారణం మనం మనకి దూరంగా జరిగిపోతూండటమే. కాని ఏళ్ళు గడిచి, వయసు వాటారుతున్నవేళ కూడా జీవితసౌందర్యాన్ని చూడగలిగినవాడే నిజమైన భాగ్యవంతుడు. మెడిటేషన్స్ లో ఈ వాక్యాలు ఎంత కవితాత్మకంగా ఉన్నాయో చూడండి:

ప్రకృతి స్వభావాన్ని అనుసరించి విషయాలు మార్పుకి లోనవుతున్నప్పుడు అవి కూడా ఎంతో అహ్లాదకరంగానూ, ఆకర్షణీయంగానూ కనిపిస్తుంటాయి. ఉదాహరణకి, రొట్టెలు కాలుస్తున్నప్పుడు అవి ఆ వేడికి పైన అక్కడక్కడ పగిలిపోతుంటాయి. అలా విచ్చిపోవడం రొట్టెలు కాల్చేవాడి నేర్పరితనానికి విరుద్ధం అయినా కూడా, ఆ పగుళ్ళు ఎంత అందంగా ఉంటాయో కదా, వాటిని చూస్తుంటే, ఎంత తొందరగా తిందామా అని నోట్లో నీళ్ళూరుతుంటాయి. అత్తిపండ్లు బాగా పండి విచ్చిపోయి కనిపిస్తున్నప్పుడూ, ఆలివ్ పండ్లు మిగలముగ్గిపోయినప్పుడు దాదాపుగా కుళ్ళిపోతాయేమో అనేట్టుగా వడిలిపోయినప్పుడూ కొత్త అందం సంతరించుకుంటాయి. గోధుమకంకులు పాలుపోసుకుని పండి వెన్నులు కిందకి వాలినప్పుడు, ఒత్తయిన వెంట్రుకలమధ్య సింహం నేత్రాలు తెరిచినప్పుడు, అడవి పందులనోటినుంచి నురగ కారుతున్నప్పుడు- ఇలాంటివే ఎన్నో దృశ్యాలు మనం విడివిడిగా చూసినప్పుడు మనకి ఎంత మాత్రం అందంగా కనిపించని ఆ దృశ్యాలే, ప్రకృతి స్వభావానికి అనుగుణంగా వాటిని అలంకరిస్తున్నప్పుడు చూడటానికి ఎంతో రమణీయంగా కనిపిస్తాయి. లోతైన అంతర్దృష్టితోనూ, గాఢమైన అనుభూతితోనూ చూడగలిగినప్పుడు, ప్రకృతి పరిణామ క్రమంలో సంభవించే ప్రతి ఒక్కటీ చూడముచ్చటగానే కనిపిస్తుంది. వన్యమృగాల విప్పుకున్న పంజాల్ని శిల్పులూ, చిత్రకారులూ అనుకరించి చేసే కళాసృష్టి ఎంత సంతోషం కలిగిస్తుందో వాటిని నేరుగా చూసినప్పుడు కూడా అంతే మనోహరంగా కనిపిస్తాయి. ఆ అందాన్ని చూడగలిగిన మనిషి వృద్ధుడైన పురుషుడిలోనూ, వృద్ధురాలైన స్త్రీలోనూ కూడా పరిణతిని, సొబగునీ చూడగలుగుతాడు. యువతీయువకుల్లో కనిపించే ప్రేమాకర్షణని అతడు ఆ వృద్ధ వదనాల్లో, నిష్కలంక నేత్రాల్తో, దర్శించగలుగుతాడు. ప్రకృతినీ, ప్రకృతి గతినీ అర్థం చేసుకోగలిగిన వాడికి తక్కినవారికి ఆహ్లాదకరంగా ఉండని ఎన్నో అందాలు గోచరించడం మొదలుపెడతాయి.

ప్రకృతిని అర్థం చేసుకో, ప్రకృతిని అనుసరించి జీవించు అనేది స్టోయిక్కుల జీవితసూత్రం. వాళ్ళ దృష్టిలో ప్రకృతి మనం అనుకుంటున్న ప్రకృతి ఒకటి కాదు. వాళ్ళ ప్రకృతి ఋగ్వేద ఋషులు దర్శించిన ఋతం లాంటిది. అది ఒక సార్వత్రిక సార్వజనీన సూత్రం. అది హెరాక్లిటస్ చెప్పిన logos. దాన్నే నాలుగవ సువార్తీకుడు word లేదా వాక్యం అన్నాడు. మార్కస్ అరీలియస్ దాన్ని ప్రకృతి అనీ, ప్రాకృతిక సూత్రం అనీ, మానవ వివేచన అనీ, దైవమనీ, దేవతలనీ, రోమన్ల సర్వేశ్వరుడు జ్యూస్ అనీ రకరకాల పేర్లతో పిలుస్తాడు. తొలి స్టోయిక్కులు దేవుణ్ణి లేదా దేవతల ఉనికిని అంగీకరించినప్పటికీ, ఆ సర్వేశ్వరుడు ప్రపంచక్రమంలో జోక్యం చేసుకోడనే భావించారు. తొలి వైదిక ఋషులు వరుణుడి గురించి భావించినట్టుగానే. కాని మార్కస్ దృష్టిలో దేవతలు లేదా దేవుడు మనిషికి దారి చూపించగలరు. తనకి సమస్యలు ఎదురయినప్పుడు తనకి వారు అలా దారి చూపించారని కూడా ఆయన చెప్పుకున్నాడు. కాని మనిషి తననీ, విశ్వాన్నీ నడిపిస్తున్న సూత్రాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే దేవతలు దారిచూపించగలుగుతారు అని మార్కస్ పదే పదే గుర్తు చేస్తూనే ఉంటాడు.

ఆ సూత్రమేదో తెలుసుకున్నవాడు ఎలా ఉండాలి? మార్కస్ ఇలా (3: 7) అంటున్నాడు :

నీ వాగ్దానాన్ని ఉల్లంఘించేట్టు చేసేదాన్నిగాని, లేదా నీ ఆత్మగౌరవం పోగొట్టుకోవలసి వచ్చే పరిస్థితినిగాని, లేదా సాటి మనిషిని ద్వేషించేట్టు చేసేదాన్నిగాని ఎప్పటికీ శ్రేయోదాయకంగా భావించకు. తోటిమనుషుల్ని శపించేట్టుచేసేదాన్ని, లేదా అనుమానించేట్టు చేసేదాన్ని, లేదా ఆత్మవంచనకు పురికొల్పేదాన్ని ఆదరించకు. ఏదైనా పని చెయ్యడానికి గోడలూ, తెరలూ అవసరమనుకుంటే ఆ పని ఎప్పటికీ చెయ్యకు. ఎందుకంటే తన లోని వివేకంకన్నా, తనలోని దైవత్వంకన్నా, దాన్ని ఆరాధించడం కన్నా మరేదీ ముఖ్యం కానివాడికి జీవితంలో శోకించవలసిన పరిస్థితి కలగదు. ఆక్రోశించవలసిన అగత్యం ఏర్పడదు. అతడికి మందితో పని పడదు, ఏకాంతంతో పనిపడదు. అన్నిటికన్నా ముఖ్యం అతడు మృత్యువు కోసం ఎదురుచూడడు, అలాగని దాన్నుంచి పారిపోడానికీ ప్రయత్నించడు. తన దేహంలో ఆత్మ కొంతకాలమే ఉంటుందా, దీర్ఘకాలం మనుగడ సాగిస్తుందా అన్నది అసలు పట్టించుకోడు. ఒకవేళ ఈ లోకం నుంచి తక్షణమే సెలవు తీసుకోవలసి వస్తే, ఆ పని హుందాగానూ, ఒద్దిగ్గానూ చెయ్యడానికి వెనకాడడు. అతడు జీవితమంతా ఈ సూత్రాన్నే సాధన చేస్తాడు. పౌరసమాజంలో భాగంగా, వివేచనా శీలిగా తాను నిర్వహించవలసిన పాత్ర నుంచి తానెప్పుడూ పక్కకు తప్పుకోడు.

మెడిటేషన్స్ రెండు, మూడు అధ్యాయాలు అతడు యుద్ధభూమిలో రాసుకున్నట్టుగా ప్రస్తావనలు ఉన్నాయి. కొందరు మూడవభాగం నుంచి చివరిదాకా కూడా యుద్ధ క్షేత్రాల్లోనే రాసుకున్నాడని ఊహిస్తున్నారు. అందుకని ఆ పుస్తకంలో యుద్ధానికి సంబంధించిన రూపకాలంకారాలూ, ప్రతీకలూ తరచు కనిపిస్తుంటాయి. ఉదాహరణకి ఈ వాక్యాలు (3:5) చూడండి:

ఇష్టం లేకుండా ఏ పనీ చెయ్యకు. పదిమంది శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకోకుండా ఏ పనికీ పూనుకోకు. మంచి చెడులు విచారించుకోకుండా, లేదా చిత్తశుద్ధి లేకుండా పనులు మొదలుపెట్టకు. నీ ఆలోచనల్ని ఆడంబరంగా ప్రదర్శించకు. మరీ ఎక్కువ మాటాడుతుండకు, మరీ ఎక్కువగా వ్యాపకాల్లో మునిగి తేలకు. నీలో ఉన్న దైవం నీలోని సజీవమానవుణ్ణి సంరక్షించుకునేట్టు చూసుకో. మనిషిగా, పరిణత వయస్కుడిగా, రాజనీతిజ్ఞుడిగా, ఒక రోమన్ గా, ఒక పాలకుడిగా ప్రవర్తించు. కోటబురుజుని సంరక్షించే భటుడిలాగా జీవితం నిన్ను నీ బాధ్యతలనుంచి ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు వెళ్ళిపోడానికి సంసిద్ధుడుగా ఉండు. నువ్వు చెయ్యవలసిన పనులు చేస్తున్నావని చెప్పడానికి ఎటువంటి ప్రమాణాలూ పెట్టుకోనక్కర్లేదు, ఎవరి యోగ్యతాపత్రాలతోనూ పనిలేదు. సంతోషంగా ఉండు. ఎక్కణ్ణుంచీ ఏ బయటిసహాయం కోసం చూడకు. నీ మనశ్శాంతి ఇతరులనుంచి వస్తుందని ఆశపడకు. నిన్ను మనుషులు నిటారుగా సాగగొట్టడం కాదు, నువ్వే నిటారుగా నిలబడు.

ఇదంతా గ్రీకు భాషలో ఒక రోమన్ చక్రవర్తి రాసుకున్న అనాసక్తి యోగం అనడంలో ఆశ్చర్యం లేదు. ఒక కాపలాదారు లేదా ఒక సేవకుడు లేదా ఒక భటుడు, ఒక ఉద్యోగి తన బాధ్యతలు నిర్వహించినట్టుగా నీ జీవితాన్ని నువ్వు నడుపుకోవాలనుకోవడం అంటే అది అనాసక్తితో చేసే కర్మ కాక మరేమవుతుంది? అనాసక్తి అంటే బాధ్యతలేకపోవడం కాదు, ఇష్టం లేకపోవడం కాదు. నువ్వు చెయ్యవలసిన పని చేసి నీ సమయం ముగియగానే పక్కకు తప్పుకోవడం. దాన్నే టాగోర్ గీతాంజలిలో (16) ఇలా అంటున్నాడు:

ఈ ప్రపంచ ఉత్సవానికి నాకు పిలుపు వచ్చింది. నా జీవితం ధన్యమయింది. నా కళ్ళు చూసాయి. నా చెవులు విన్నాయి. ఈ విందులో నా వంతు వాద్యం నేను వాయించాను. నా శాయశక్తులా నా బాధ్యత నెరవేర్చాను. ఎట్టకేలకు ఇప్పుడు ఇక్కణ్ణుంచి సెలవుతీసుకుని నిన్ను సందర్శించి నీ మ్రోల  నిశ్శబ్దంగా మోకరిల్లడానికి సమయం ఆసన్నమయిందా అని అడుగుతాను.

ఇక్కడ మనం గమనించవలసిన ఒక మాట, నీ బాధ్యత తీరకుండానే నువ్విక్కణ్ణుంచి నిష్క్రమించవలసిన పరిస్థితి ఉండదని చెప్పడం. ఆ మనఃస్థితిని అలవర్చుకున్నవాడికి ఈ జీవితం పట్ల అసంతృప్తి ఉండదు, తాను ఇంకా చేయకుండా ఏదో మిగిలిపోయిన వెలితి ఉండదు. ఈ మాటలు (3:8) చూడండి:

పూర్తిగా సుశిక్షితుడై, ప్రక్షాళన పొందిన వాడి మనసులో ఎటువంటి మాలిన్యం, ఎటువంటి బాధల పొక్కులు, ఎట్లాంటి అవినీతి కనిపించవు. అతడికి ఈ లోకంలో కాలం తీరినప్పుడు ,తన పాత్ర పోషించకుండా రంగస్థలం దిగిపోయిన నటుడిలాగా అతడు చెయ్యవలసిందేదీ అసంపూర్ణంగా మిగిలి ఉండదు. అతనిలో కపటం, దంబం కనిపించవు. అతడు విషయాలకు పూర్తిగా అంటిపెట్టుకు పోయినవాడిలాగ ఉండడు, అలాగని వాటితో సంబంధం లేనివాడిలాగా కూడా ఉండడు. అతణ్ణి నిందించడానికి ఏమీ ఉండదు, అలాగని అతడికి దేన్నించీ ముఖం తప్పించుకోవలసిన అవసరం కూడా ఉండదు.

మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ లో పదే పదే వాడిన మాట గొప్ప నగరం, ఉన్నత నగరం, దివ్యనగరం. స్టోయిక్కుల దృష్టిలో ఈ విశ్వమంతా ఒక నగరం. ఈ ప్రపంచంలో ఉన్న మానవులంతా ఒకే నగరవాసులు. దాన్ని ఒక వసుధైకనగరం అనవచ్చు. ఈ నగరంతో పోలిస్తే తక్కిన మహానగరాలన్నీ కూడా చిన్న చిన్న నిట్రాతి గుడిసెల్లాంటివి. నువ్వు ఏ పనిచెయ్యదలచుకున్నా అటువంటి నగర పౌరుడిగా ఆలోచించి చెయ్యి. నీ పనులు మొత్తం ప్రకృతికీ, మనిషికీ మేలు చేసేవేనా అని ఆలోచించుకుని మరీ చెయ్యి అంటాడు. నీ కర్తవ్యాన్ని తెలుసుకోవడానికి ఈ ఒక్క సూత్రం చాలు, చరిత్రతోనూ, పుస్తకాలతోనూ పనిలేదంటున్నాడు. ఈ మాటలు (3:14) చూడండి.

ఊరికినే తిరగడం మానెయ్యి. ఎందుకంటే నువ్వు రాసుకున్న నీ జ్ఞాపకాలు మరోసారి నువ్వు చదువుతావనుకోను. పూర్వకాలపు గ్రీకులూ, రోమన్లూ ఏం చేసారో వాటిని నీ వృద్ధాప్యంలో చదువుకుందామని దాచుకున్న పుస్తకాలు కూడా పక్కన పెట్టెయ్యి. నీ ముందు పొంచి ఉన్న చరమాకం వైపు అడుగులు పడనివ్వు. అన్ని రకాల సోమరి ఊహల్నీ పక్కన నెట్టెయ్యి. ఇప్పుడే, నీ జీవితం ఇంకా నీ చేతుల్లో ఉన్నప్పుడే నీకు నువ్వు చేయూత అందించుకోడానికి సిద్ధపడు.

ఇక మూడవ అధ్యాయాన్ని ముగిస్తూ రాసుకున్న ఈ మాటలు (3:16:3) నిజంగా వజ్రాలు. చూడండి:

ఆ మనిషి తాను నిజంగా సరళంగా, మితంగా, తృప్తిగా జీవించాడని సాటి మనుషులు నమ్మడానికి ఇష్టపడకపోయినా కూడా అతడు వారిలో ఒక్కరిమీద కూడా కోపం తెచ్చుకోడు, తాను నమ్మిన దారినుంచి చివరిదాకా ఒక్క అడుగు కూడా పక్కకి తప్పుకోడు. తన జీవితలక్ష్యాన్ని అతడు నిర్మలంగా, శాంతంగా చేరుకోవడానికి సిద్ధంగా ఉండటమే కాక, తనకి లభించినదానితో పరిపూర్ణంగా సమాధానపడి ఉంటాడు.

పంచాగ్ని మధ్యంలాంటి ప్రభుత్వోద్యోగం చేసిన తరువాత, అరవయ్యేళ్ళ వయసులో ఈ వాక్యాలు చదువుకోవడం ఎంత ఊరటగా ఉందని!

30-10-2022

One Reply to “”

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading