ఋతుసౌందర్యాన్ని కీర్తించడం అన్ని భాషల్లోనూ, అందరు కవులూ చేసేదే అయినా, కొన్ని సంస్కృతులకి కొన్ని ఋతువులపట్ల ప్రత్యేకమైన ఇష్టముందనిపిస్తుంది. పాశ్చాత్యకవిత్వంలో ఋతువులు నాలుగే, వసంతం, వేసవి, హేమంతం, శిశిరం. దాదాపుగా జపాన్, కొరియాలాంటి దూరప్రాచ్యదేశాలదీ ఇదే పరిస్థితి. కాని, భారతీయకవిత్వంలో ముఖ్యంగా దక్షిణభారతీయ కవులకి అన్నిటికన్నా ఋతుపవనకాలమంటేనే చాలా ఇష్టమనిపిస్తుంది. వేసవి వేడికి మగ్గిపోయిన ద్వీపకల్పం మీద తొలి ఋతుపవనమేఘం కనబడ్డప్పుడు ఈ దేశపు రైతులాగే ఈ దేశపు కవి కూడా గొప్పపులకింతకు లోనవుతూ వచ్చాడు.
ఋతుపవనకాలమంటే వర్షఋతువు కాదు. అది వసంతకాలపు చివరిరోజులనుంచి మధ్యవర్షాకాలందాకా పరుచుకునిఉండే ఒక అద్వితీయమైన కాలం. వేసవివేడి నుంచి వర్షాకాలపు చల్లదనానికి ప్రయాణించే వాతావరణం.
ఋతుపవనమేఘాలు కేరళతీరాన్ని వైశాఖమాసపు చివరిదినాల్లో తాకుతాయి. సుమారు రెండువారాల రోహిణికార్తె ముగుస్తూ మృగశిరకార్తె మొదలుకాగానే తెలుగునేలమీద ఋతుపవనమేఘాల తొలకరి జల్లులు కురుస్తాయి. మరొక నెలరోజులకి ఆ మేఘాలు మధ్యభారతదేశాన్ని దాటి ఉత్తరభారతదేశంలో అడుగుపెడతాయి.
ఋతుపవనమేఘాలు తమ నేలల్ని తాకినప్పుడు పూర్వకాల సంగం కవులు, గాథాసప్తశతి, వజ్జాలగ్గం కవులు సంతోషంతో పులకించిన పలవరింతల్ని కాళిదాసు మేఘసందేశంగా తీర్చిదిద్ది భారతీయ ఋతుపవనాన్ని ఒక అజరామర కావ్యంగా మార్చేసాడు.
కాళిదాసు వర్ణించిన మేఘం వర్షాకాలపు మేఘం కాదు,అది ఋతుపవనమేఘమే. మధ్యభారతదేశానికి చెందిన కాళిదాసుకి ఋతుపవనమేఘం కనబడేది ఆషాఢమాసపు మొదటిరోజునే. అంటే మనకన్నా దాదాపు మూడునాలుగువారాలు ఆలస్యంగా. ఈ విషయం అర్థంకాక పూర్వకాలపు మేఘసందేశ వ్యాఖ్యాతలు కొందరు మేఘసందేశం మొదటిశ్లోకంలో మొదటిపదం ‘ఆషాడస్య ప్రథమ దివసే’ అన్నది పాఠాంతరమనీ, ఆ పదం నిజానికి ‘ఆషాడస్య చరమదివసే’ అనీ వాదించారు. వాళ్ళకి వ్యాకరణం తెలిసినంతగా, ఋతుపవన సౌందర్యశాస్త్రం తెలియలేదనుకోవాలి.
వర్షాకాలపు మేఘాలకీ, ఋతుపవనమేఘాలకీ ఉండే తేడా కాళిదాసుకి స్పష్టంగా తెలుసు. కనకనే ఆయన తన కావ్యాన్ని పూర్వమేఘమనీ, ఉత్తరమేఘమనీ విడదీసాడు. ఈ మధ్య ఆర్. ఆర్. కేల్కర్ అనే మరాఠీ పండితుడు ఈ విషయాన్నే మరింత వివరిస్తూ మేఘసందేశం మొదట్లో ఉరుములూ మెరుపులూ లేవనీ, మేఘం యాత్ర పూర్తిచేసుకునేటప్పటికే మెరుపుల వర్ణనలు కనిపిస్తాయనీ అన్నాడు.
ఋతుపవనమేఘంలో ఉరుములూ, మెరుపులూ ఉండవు. అది కాళిదాసు వర్ణించినట్టుగా కొంత పొగ, కొంత కాంతి, కొంత నీరు. కొంత గాలి. నగరాకాశం మీద ప్రయాణిస్తున్నఋతుపవన మేఘానికి నమస్కరిస్తూ, మేఘసందేశం నుంచి ఒక కవిత:
ఏనుగులాంటి మేఘం
లోపల కోరిక, తన స్త్రీనుంచి ఎడబాటుకు కృశించిన
ముంచేతులు, ముందుకుజారుతున్న కడియాలు, కొన్ని
నెలలుగడిచాక చూసాడొక చూడదగ్గ దృశ్యం, కొండని
కావిలించుకుని ఏనుగులాగా గోరాడుతున్న మేఘాన్ని.
12-6-2013