విద్యాసన్నద్ధత

380

ఉస్మానియా యూనివెర్సిటీ అకడమిక్ స్టాఫ్ కాలేజి డైరక్టరు ప్రొ.బాలకిషన్ గారు డిగ్రీ కళాశాలల లెక్చెరర్లకు, యూనివెర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఓరియెంటేషన్ కోర్సు నిర్వహిస్తున్నామనీ, నన్ను కూడా ఒక సెషన్ తీసుకొమ్మనీ అడిగారు. శిక్షణలో పాలుపంచుకుంటున్నవారిలో ఎన్నో విభాగాలకు చెందిన వారున్నారనీ, కాబట్టి, సాహిత్యం, సామాజికశాస్త్రాలు ఏ అంశం తీసుకున్నా సరేనన్నారు. కాని, నేను ఎప్పట్లానే విద్య గురించి మాట్లాడతానన్నాను. సాహిత్యమూ, తత్త్వశాస్త్రమూ నా హృదయానికి చాలా దగ్గర విషయాలే అయినప్పటికీ, నన్ను విద్య గురించిన ఆలోచనలు అస్తిమితపరిచినంతగా మరే ఆలోచనలూ బాధించవు. అందుకని, అందరు ఉపాధ్యాయుల్ని కలిసి మాట్లాడుకునే అవకాశం లభించినప్పుడు విద్య గురించి కాకుండా మరొక అంశం ఎట్లా ఎంచుకోగలుగుతాను?

దాదాపు మూడు గంటలపాటు వారిముందు నా హృదయం విప్పి పరిచాను. భారతదేశంలో విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడూ, ప్రతి ఒక్క విద్యాసంస్థా, పాలనాధికారీ ఎటువంటి ప్రయత్నాలు చేపట్టవచ్చో నా ఆలోచనలు, నాకు తెలిసిన కొన్ని ఉదాహరణలు వారితో పంచుకున్నాను. చుట్టూరా ఉన్న చీకటిని తిట్టుకోవడం కన్నా ప్రయత్నించి ఒక చిన్న దీపాన్ని వెలిగించిన కొన్ని ఉదాహరణల్ని వివరించే డాక్యుమెంటరీ సినిమాలు కూడా చూపించాను.

మారుతున్న కాలానికి తగ్గట్టుగా విద్య గురించి మన ఆలోచనలు మారటం లేదన్నది నా ఆవేదన. ముఖ్యంగా, భారతదేశానికి ఇప్పుడు జనాభాపరంగా లభించిన గొప్ప అవకాశాన్ని మనం చేజార్చుకుంటే, భవిష్యత్తు ప్రయోజనరహితంగానే కాదు, అత్యంత హింసాత్మకంగా కూడా ఉండబోతుంది. ఒక దేశ జనాభాలో అత్యధిక శాతం యువతరమే ఉండబోయే ఈ జనాభాసూచిని population dividend అంటారని మనకు తెలుసు. 2020 నాటికి, సగటు జపనీయుడి వయస్సు 48 ఏళ్ళు, యూరపియన్ వయస్సు 45, సగటు అమెరికన్, సగటు చీనీయుల వయస్సు 35 గా ఉండబోగా, సగటు భారతీయుడి వయస్సు 29 ఏళ్ళు మాత్రమే ఉండబోతున్నది. అంటే భారతదేశం నిజమైన ‘యంగ్ ఇండియా’ కాబోతున్నది. కాని, భారతీయ జీవితం ‘నవజీవన్’ కాబోతున్నదా?

ఈ ప్రశ్నకి ధైర్యంగా జవాబివ్వాలంటే, మనం చూడవలసింది, భూసంస్కరణలు, రాజకీయసంస్కరణలు, పాలనా సంస్కరణల వైపు కాదు, విద్యా సంస్కరణల వైపు. నిజమే, విద్యావ్యవస్థని సంస్కరించాలంటే భారతదేశాన్ని ముందు సామాజికంగా సంస్కరించాలి. కాని, ఆ సంస్కరణలకోసం పోరాడుతున్నవాళ్ళ ఎజెండాలో విద్య ఎక్కడుందన్నది కీలక ప్రశ్న.

మన సామాజిక చర్చల్లో, మన పత్రికాసంపాదకీయాల్లో, మన శాసనసభల్లో, మన రాజకీయ ప్రతిఘటనల్లో విద్య గురించిన చర్చ ఎంత సజీవంగా ఉంది? ఎంత లోతుగా ఉంది? మాట్లాడుతున్నవాళ్ళు ఎంత పరిజ్ఞానంతో మాట్లాడుతున్నారు?ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నారు?

ఈ పరిస్థితుల్లో విద్య గురించి, ముఖ్యంగా ఈ కొత్త శతాబ్దంలో విద్యావసరాల గురించి ఎవరు మాట్లాడినా, ఎక్కడ అ కొత్త అధ్యయనం కనిపించినా నాకు ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. అటువంటివాటిలో చెప్పవలసింది, The Economist పత్రిక గత సంవత్సరం వెలువరించిన The Worldwide Educating for the Future Index.

ఈ సూచికని యిడాన్ ప్రైజ్ ఫౌండేషన్ వారి కోరిక మీద, ఆ పత్రికకు చెందిన ఇకనమిస్టు ఇంటెలిజెన్సు యూనిట్ వారు రూపొందించారు. ఇందుకుగాను, విద్యారంగంలో 17 మంది అంతర్జాతీయ నిపుణులతో కూలంకషంగా చర్చించారు. అయితే ఈ సూచికలోని ప్రత్యేకత ఏమిటంటే, ఇది విద్యాఫలితాల మీద ఆధారపడ్డది కాదు. కొత్త కాలానికి అవసరమైన విద్యావ్యవస్థను రూపొందించుకోడానికి దేశాలు ఏ మేరకు సన్నద్ధంగా ఉన్నాయనే అంశాలమీద ఆధారపడ్డ సూచిక. 35 దేశాల్లో 15-24 వయసుగల విద్యార్థుల మీద దృష్టి పెట్టి రూపొందించిన సూచిక.

తమ అధ్యయనం కోసం ఎంపికచేసిన దేశాల్ని తాము రూపొందించిన సూచిక ప్రకారం నాలుగు తరగతులుగా వర్గీకరించారు. విద్యాభవిష్యత్తుకోసం ఆయాదేశాలు చూపిస్తున్న సన్నద్ధతను బట్టి

అ) అత్యుత్తమ సన్నద్ధత చూపిస్తున్న దేశాలు,

ఆ) చక్కటి సన్నద్ధత చూపిస్తున్న దేశాలు,

ఇ) తగుమాత్రం సన్నద్ధత కలిగిన దేశాలు

ఈ) పరిస్థితులు మెరుగుపర్చుకోవలసిన దేశాలు అని.

సహజంగానే భారతదేశం నాలుగవ కేటగరీలో ఉంది. కానీ గమనించ వలసిందేమంటే, అత్యుత్తమ సన్నద్ధత చూపిస్తున్న దేశాల్లో కూడా అమెరికా, చైనా, రష్యా లేవు. వాటికి బదులు, న్యూజీలాండ్, ఫిన్లాండ్, సింగపూర్, నెదర్లాండ్స్ లాంటి చిన్నదేశాలూ, యుకె, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలూ ఉన్నాయి.

ఇది ఎకనమిస్ట్ పత్రిక రూపొందించిన ఇండెక్సు అయినప్పటికీ, ఇది వాణిజ్యప్రయోజనాలకోసం చేపట్టిన అధ్యయనం కాదు. విద్య అంటే సమగ్ర విద్య అనే ఈ అధ్యయనం పదేపదే గుర్తుచేసుకొంటోంది.

ఈ కొత్త సందర్భంలో –

‘చరిత్ర చదివే విద్యార్థులకి గణితశాస్త్ర నైపుణ్యాలు కూడా తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే గణిత శాస్త్రజ్ఞులూ, భౌతికశాస్త్రజ్ఞులూ కూడా చరిత్రను అర్థం చేసుకోగలిగేవారుగా, నవలలు చదివేవారుగా, తాము చేస్తున్న పని తాలూకు నైతిక పర్యవసానాల గురించి తెలిసినవారుగా ఉండాలనీ కోరుకుంటున్నాం’ అంటున్నాడు ఇందులో ఒక విద్యావేత్త.

కొత్త ప్రపంచపు విద్యార్థి ‘కేవలం ఒక కెరీర్ మాత్రమే కాదు, ఒక వోటరు, ఒక ఇరుగుపొరుగు, ఒక పేరెంటు కూడా. మన భౌతికశాస్త్రవేత్తలూ, మన అకౌంటెంట్లూ కూడా ప్రపంచం గురించి ఆలోచించచేవాళ్ళుగా, చర్చించేవాళ్ళుగా ఉండాలి’ అంటున్నాడు మరొక విద్యావేత్త.

అన్నిటికన్నా ముఖ్యం, నేను పదే పదే చెప్పే వాక్యమే ఒక అంతర్జాతీయ స్థాయి విద్యావేత్త కూడా చెప్పడం నాకు సంతోషమనిపించింది. ఆయన అంటున్నాడు: ‘నేర్చుకోడమెట్లానో నేర్పడమే ఇప్పుడన్నిటికన్నా అత్యంత కీలకమైన అవసరం’ అని.

కొత్త శతాబ్దంలో భవిష్యత్తుకు అవసరమైన విద్యకోసం చేపట్టిన ఆ అధ్యయనం సారాంశం ప్రధానంగా 6 పరిశీలనలు. అవి:

అ) జీవితంలోనూ, పనిలోనూ కూడా సంభవిస్తున్న ప్రచండమైన మార్పులకు తగ్గట్టుగా కోట్లాది మంది యువతను సన్నద్ధుల్ని చేయడానికి చాలా ప్రభుత్వాలు చేయవలసినంత పని చేయడం లేదు.

ఆ) ప్రాజెక్టు బేసెడ్ లెర్నింగ్, గ్లోబల్ సిటిజెన్ షిప్ లాంటి కీలకాంశాల్ని పట్టించుకోవడం లేదు.

ఇ) ప్రభుత్వాలు విధాన నిర్ణయాలు తీసుకుంటే చాలదు, అందుకు తగ్గట్టుగా విద్యార్థులకి మార్గదర్శకత్వం చెయ్యగల ప్రతిభావంతులైన ఉపాధ్యాయదళాన్ని రూపిందించవలసిన బాధ్యత కూడా తప్పనిసరి.

ఈ) విద్య, తరగతి గదుల, ఇరుకుగోడలమధ్యనుంచి బయటపడాలి.

ఉ) ఉపాధ్యాయులకు తగినవేతనాలు, విద్యమీద పెట్టుబడి తప్పనిసరి, కాని నిధులు ఒక్కటే సర్వరోగనివారిణి కాదు.

ఊ) ఆ సమాజం ఎంత సహనశీలంగా, ఎంత ఓపెన్ గా ఉంది అన్నదాన్నిబట్టే అక్కడ విద్యావ్యవస్థకూడా అంత సమగ్రంగానూ, భవిష్యత్తును స్వాగతించడానికి సన్నద్ధంగానూ ఉంటుంది.

29-7-2018

Leave a Reply

%d bloggers like this: