మన పిల్లలకి మంచిది కాదు

308

“మృత్యువును చూసి కాదు నేను, జీవితాన్ని చూసి జంకుతున్నాను
హంతకుని కత్తి చూసి కాదు, కనుల ద్వేషం చూసి గొంకుతున్నాను
మనసులోని క్రౌర్యం చూసి జంకుతున్నాను ”

-బైరాగి (ఆగమగీతి: నాకు చావు లేదు)

గౌరీ లంకేష్ హత్య ఒక విషయాన్ని చాలా బిగ్గరగా, మనం ఎక్కడ వినకుండా పోతామో అన్నంత బిగ్గరగా, మన చెవులు చిల్లులుపడేటట్టుగా, భరించలేనంతగా ఘోషిస్తోంది, అదేమంటే: మనం రాజకీయంగా సరే, సాంస్కృతికంగా కూడా పతనం అంచులకి చేరుకున్నామని.

రెండవ ప్రపంచ యుద్ధం అయిన తరువాత ఇంటికి వస్తున్న జర్మన్ సైనికులకి (ఇంటికి తిరిగి రాగల అదృష్టానికి నోచుకున్నవాళ్ళు), తమ పదజాలమంతా హటాత్తుగా అదృశ్యమైపోయినట్టు అనిపించిందింట. ‘దేశం’, ‘కుటుంబం’, ‘మనిషి’, ‘ప్రేమ’,’మానవససంబంధాలు’-ఈ మాటలకి అర్థం లేదని అనిపించిందట.

గౌరిని హత్య చేసిన మర్నాడే, హత్యను ఖండించకపోగా, మరణానికి చింతించకపోగా,ఈ అమానుషాన్ని ప్రతి ఒక్కరూ తమ మీద తీసుకుని ఎంతో కొంత ప్రాయశ్చిత్తం ప్రకటించకపోగా, సోషల్ మీడియాలో నడిచిన, నడుస్తున్న కొన్ని వ్యాఖ్యలు నన్ను చాలా బాధిస్తున్నాయి, భయపెడుతున్నాయి. మనం ఏ దేశంలో ఉన్నాం? ఏ విలువల గురించి ఇంతకాలం గర్విస్తూ వచ్చాం? ప్రాచీన కాలం నుంచీ ఎవరిని మన ఆదర్శాలుగా ప్రకటించుకుంటూ వచ్చాం? నిర్దాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ చేసినహత్య కన్నా,నిర్దాక్షిణ్యంగానూ, నిస్సిగ్గుగానూ మాట్లాడుతున్న ఈ మాటలు నన్నెక్కువ కలవరపెడుతున్నాయి.

దుర్మార్గమైన ఈ రాతలు చదివి ఎందరో యువతీయువకులు, ముక్కుపచ్చలారని పిల్లలు తామేదో మహత్తర హిందూ సంస్కృతికి వారసులమనీ, తమ మతానికీ, సంస్కృతికీ ఏదో పెద్ద ప్రమాదం వాటిల్లుతోందనీ, అట్లాంటి ఒక ప్రమాదకరమైన మనిషిని చంపేస్తే వీళ్ళంతా ఎందుకిట్లా ఖండిస్తున్నారనీ, దుఃఖిస్తున్నారనీ ఆశ్చర్యపోతున్నారు. ఎవరు చెప్తారు వీళ్ళకి? ఈ రాజకీయ శక్తులు మాట్లాడుతున్న హిందుత్వానికీ, అనాదికాలంగా ఈ దేశంలో కొనసాగుతున్న హిందూ జీవనవిధానానికీ సంబంధమే లేదని. అసలు ‘హిందుత్వం’ వేరు, హిందూ జీవన విధానం వేరని. అసలు హిందూ మతమంటూ ఒకటి లేనేలేదని. పోనీ, అటువంటి మతమంటూ ఒకటుందని అనుకున్నా, ఇట్లాంటి అమానవీయ, militant ధోరణుల్ని అది గతంలో ఎప్పుడూ ఇంత నిస్సిగ్గుగా చూపించి ఉండలేదనీ, ఇప్పటీ ఈ దుర్మార్గస్వరూపం గ్లోబల్ పెట్టుబడికీ, రాజకీయకట్టుకథకీ పుట్టిన విషపుత్రిక అనీఎప్పుడు గుర్తిస్తారు!

మరొక మాట కూడా చెప్పాలి. నేను కూడా హిందువునే. కాని నా మతానికి బయటి మతాల వల్ల ప్రమాదం ఉందని నాకెప్పుడూ అనిపించలేదు. ఏ మతమైనా ఆ మతం పేరు చెప్పుకుంటూ కూడా దాన్ని అనుసరించలేని ఆత్మవంచనవల్ల, కాలక్రమంలో సంతరించుకునే దురాచారాల వల్ల ప్రమాదంలో పడుతుంది తప్ప బయటివాళ్ళ వల్ల కాదు. ఏ మతాన్నైనా కాపాడగలిగేది, ఆ మతం ప్రబోధించే మంచి విషయాల్ని విశ్వసించి అనుసరించగలిగేవాళ్ళే తప్ప, రాజకీయనాయకులూ, గూండాలూ కాదు.

నేనీ మాటలు రాస్తే, నేను ఎదుర్కోబోయే ప్రశ్నలేమిటో కూడా నాకు తెలుసు. అన్నిటికన్నా ముందు అడిగే ప్రశ్న: మరి వామపక్ష తీవ్రవాదులు అమాయికుల్ని చంపితే నువ్వెందుకు మాట్లాడలేదు అని, కేరళలోనో మరో చోటనో ఎవరో ఎవరినో చంపుతుంటే నువ్వెందుకు మాట్లాడలేదని. హింస ఎక్కడైనా హింసనే, ఎవరు చేసినా హింసనే. కత్తితో కుడివైపు నుంచి పొడిచినా, ఎడమవైపు నుంచి పొడిచినా కారేది రక్తమే, దుఃఖమే.కాని నేను ఈ దేశంలో ఇంతదాకా చూసిన హింసకీ, ఈ హింసకీ పోలికనే లేదు. గతంలో ఎవరైనా ఎవరినైనా చంపితే ఎంతో కొంత పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసేవారు. చివరికి గాడ్సే కూడా తన వాజ్మూలంలో గాంధీ పట్ల ఎంతో కొంత సానుభూతి కనపర్చకుండా ఉండలేకపోయాడు. కాని ఒక హత్యని ఇట్లా celebrate చేసుకుంటున్న అత్యంత హీనసందర్భాన్ని ఇప్పుడే చూస్తున్నాను. అది కూడా హిందుత్వం పేరిట!

ఆమె హత్యని ఎవరు ఖండించారన్నది కాదు. ఎవరు ఖండించలేదన్నది నన్నెక్కువ బాధపెడుతొంది. ఇది జాతికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, మన పిల్లలకి మంచిది కాదు.

బహుశా, చిదానంద రాజఘట్ట రాసుకున్న ఈ జ్ఞాపకాలు చదివి ఉండకపోతే, ఈ నాలుగు మాటలు మాట్లాడటానికి కూడా నా గొంతు పెగిలి ఉండేది కాదు.

మరీ ముఖ్యంగా ఈ వాక్యాలు:

Death was just incidental. Respect, affection, and admiration for the good people did and what they stood for was important.

Amazing Grace. Forget all other labels: leftist, radical, anti-Hindutva, secular etc. For me, there is just this: She is the epitome of Amazing Grace.

పిల్లలూ చదవండి, నీకు నచ్చని ప్రతి ఒక్కరినీ నిర్మూలించుకుంటూ పోనక్కర్లేదని తెలుస్తుంది. విభేదాలతో విడిపోయినా, స్నేహితులుగా కొనసాగడమెలానో తెలుస్తుంది. మనుషులుగా మిగలడం అన్నిటికన్నా ముఖ్యమని తెలుస్తుంది.

8-9-2017

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading