నీటిరంగుల గాయకుడు

Reading Time: 2 minutes

382

తైలవర్ణాల చిత్రలేఖనం ఒక పురాణకాలంనాటి మాటగా మారిపోయేక, ఏక్రిలిక్ కూడా నిన్నటిమాటగా మారిపోతూ, జీవితపు సమస్తరంగాలూ డిజిటల్ గా మారిపోయినట్టే, చిత్రలేఖనం కూడా డిజిటల్ గానూ, గ్రాఫికల్ గానూ మారిపోయేక, న్యూస్ పేపర్లనుండి, సినిమాలదాకా, చేతిలో స్మార్ట్ ఫోన్ నుంచి రోడ్డుమీద అడ్వర్టయిజ్ మెంట్లదాకా ప్రతి ఒక్కటీ రంగులవలగా మారిపోయేక, చిత్రలేఖనం మళ్ళా మొదటికొచ్చింది. వ్యాపార ప్రకటనలు కూడా చిత్రలేఖన రహస్యాల్ని ఆకళింపుచేసేసుకున్నాక, చిత్రకారులు ఇప్పుడు ఏమి చిత్రించాలి? ఎటువైపు చూడాలి?

పందొమ్మిదోశతాబ్దిలో ఫొటోగ్రఫీ కనిపెట్టినప్పటిరోజుల్లోలాగే, ఇప్పుడు కూడా చిత్రకారులముందు రెండే దారులు.ఒకటి బాహ్యవాస్తవంతో, బయటిప్రపంచపు ఆకృతులు,కొలతలు, రంగులు, విలువలు-వేటీతోటీ సంబంధంలేకుండా, తమ ఆంతరంగిక ప్రపంచాన్ని ఆవిష్కరించుకుంటో పోవడం. యాబ్ స్ట్రాక్ట్ గా, ఎక్స్ ప్రెషనిస్టిక్ గా, ఆబ్ స్ట్రాక్ట్ ఎక్స్ ప్రెషనిస్టిక్ గా గీతలు గియ్యడం, రంగులు పుయ్యడం, హృదయాన్ని కత్తిరించి ఆ పేలికల్ని కొలాజ్ గా అతకడం.

కవి అన్నట్టుగా, ఇది ‘చిమటల, గబ్బిలాల దారి’. మరి ‘నీలి ఆకసంలో ఎగిరే పక్షుల దారి’ ఎవరిది?

కొందరు అపురూపమైన నీటిరంగుల చిత్రకారులది.

వాళ్ళు కళారంగంలో సంభవించే ఉద్యమాలతోనూ, సామాజిక, రాజకీయ ప్రకంపనల్తోనూ సంబంధంలేకుండా, తమ దారిన తాము, కఠినాతికఠినమైన చిత్రలేఖన నియమాలకి తమకై తాము కట్టుబడి, అహర్నిశలు కాంతినీ,నీడల్నీ పట్టుకోవడమెలా అనే తపిస్తుంటారు. మామూలు వాస్తవికతా ప్రమాణాల మేరకు చిత్రించే ఆ చిత్రాల్ని మనం realistic అనీ, representative అనీ అనడం మరో మాట దొరకనందువల్లే. అలాగని ఆ చిత్రలేఖనాల్లో ప్రతిబింబించే వాస్తవికత ఈ ప్రపంచం గురించిన మన తాత్త్విక అవగాహనని వీసమెత్తుకూడా మార్చగలిగేది కాదు. పైగా, మనని ఏమార్చడమే దాని ప్రయోజనం కూడా.

వాళ్ళందా దాదాపుగా లాండ్ స్కేప్ చిత్రకారులు. ఆ మాట మరీ సంకుచితంగా ఉందని, కొందరు సిటీస్కేప్, సీ స్కేప్, స్కై స్కేప్ అనే పదాలు వాడవచ్చుగాని, వాటి ఇతివృత్తం బాహ్యదృశ్యాలే. కాని, అవి అన్వేషించేది, బయటి ప్రపంచపు ఆకృతుల్ని కాదు. ఒకప్పుడు ఇస్మాయిల్ గారు తన కవిత్వం గురించి చెప్తూ, బయటి ప్రపంచమూ, లోపలి ప్రపంచమూ ఏకమయ్యే దిగ్వలయంలో తన కవిత్వాన్ని దర్శిస్తున్నానని చెప్పుకున్నారు. ఈ నీటిరంగుల చిత్రకారులు చేసేది కూడా ఆ పనే. కావడానికి వీళ్ళు బయటి దృశ్యాల్ని చిత్రిస్తున్నా, చిత్రిస్తున్నట్టు కనబడినా, నిజానికి వీళ్ళు చిత్రించేది తమ మనోభావాల్నే. గొప్ప హిందుస్తానీ గాయకులు రాగాలాపన చేస్తున్నప్పుడు, రాగాన్నీ, ఆ రాగాన్ని ఆలపిస్తున్న కాలాన్నీ అనుసంధానించి తమ మనోధర్మాన్ని మన ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్టే, ఈ చిత్రకారులు కూడా ఏదో ఒక వేళ ఒక దృశ్యాన్ని చిత్రిస్తున్న నెపం మీద తమ మానసిక ప్రశాంతినే చిత్రిస్తుంటారు.

అటువంటి చిత్రకారుల్లో మొదట తలుచుకోవలసినవాడు జోసెఫ్ జుబ్కొవిచ్. 1952 లో క్రొయేషియాలో జన్మించిన జుబ్కొవిచ్ యుగోస్లేవియా అంతర్యుద్ధం వల్ల తన పద్ధెనిమిదో ఏటనే తన తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియాకి తరలిపోయాడు. ప్రస్తుతం మెల్బోర్న్ లో నివసిస్తున్న జుబ్కొవిచ్ ఆస్ట్రేలియన్ ఆకాశాల్నీ, సూర్యకాంతినీ రంగుల్తో పట్టుకోడానికే గత నలభయ్యేళ్ళుగా సాధన చేస్తూ ఉన్నాడు.

మూడ్ అనే పదాన్ని మనం మనోభావమని అనువదించుకుంటే, ఆ మనోభావాల్ని కాంతిమంతంగా చిత్రించడంలో జుబ్కొవిచ్ చేసే ఇంద్రజాలం మాటల్లో చెప్పలేనిది. కాని అతడొక మహాసౌందర్యాన్ని చూస్తున్నాడనీ, దాన్ని మనకు అందించాలని ప్రయత్నిస్తున్నాడనీ మటుకు తెలుస్తూంటుంది.

Mastering Atmosphere and Mood in Watercolor (2002) అనే తన పుస్తకానికి రాసుకున్న ముందుమాటలో అతడిట్లా రాసాడు:

‘నేను సౌందర్యసన్నిధిలో అడుగుపెట్టిన క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. అప్పుడు నాకు ఆరేళ్ళ వయసు. మా నాయనమ్మ పొలంలో గడ్డికుప్పమీద వెల్లకిలా పడుకుని మొక్కజొన్న చేలల్లో సూర్యుడు నెమ్మదిగా కుంకుతున్న దృశ్యం చూస్తూ ఉన్నాను. ఆ వేసవి సాయంకాలం గాల్లో ఎగురుతున్న వేలాది పురుగుల రెక్కల బంగారుధూళి నా కళ్ళముందు తేలియాడుతూ ఉంది. మా తాత అప్పుడే గుర్రాల గొలుసులు విప్పుతున్నాడు. దూరంగా వినవస్తున్న చర్చిగంటల సవ్వడిలో ఆ గొలుసుల చప్పుడు మిళితమై వినబడుతూంది. వంటింట్లోంచి వేడివేడి ఘుమఘుమలు. ఒక్కసారిగా నేనేదో కాలాతీత భావనకు లోనయ్యాను. అదేమిటో మాటల్లో చెప్పలేను. ఆ దృశ్యంలోని కైవల్య సౌందర్యం నన్ను పూర్తిగా ముంచెత్తింది. ఆ క్షణం అప్పటినుంచి ఇప్పటిదాకా నాతోటే ఉండిపోయింది.’

‘అదేమీ చెప్పుకోదగ్గ సంఘటన కాదు. జొన్నచేలు, గుర్రాలకొట్టం, చిన్నపొలం. అంతే. కాని, ఆ క్షణాన నేను మొదటిసారి చూసిన ఆ నిశ్శబ్ద సౌందర్యాన్ని పట్టుకోడానికే ఇప్పటికీ ప్రయత్నిస్తున్నాను.’

‘బొమ్మలెక్కడైనా వెయ్యగలనుగానీ, జీవితంలోని ప్రశాంత క్షణాలకోసమే ప్రధానంగా నా అన్వేషణ. నాది తట్టుకోలేనంత రొమాంటిసిజం. ఈ రోజుల్లో దాన్ని చాలామంది పాతకాలపు లక్షణంగా పరిగణిస్తారు, అయితే ఏమిటి? నాకు మరోలా ఉండటం చాత కాదు.’

జుబ్కొవిచ్ బొమ్మలు చూడండి. వాటిలో గాలీ, నీళ్ళూ, వీథులూ, భవనాలూ, తోటలూ,అడవులూ అన్నీ వెలుతురులో తడిసిపోతుంటాయి. ఆ వెలుతురుని అతడెట్లా పట్టుకున్నాడో చెప్పమని ప్రపంచమంతా అతడి చుట్టూ మూగుతూనే ఉంది. అతడొక పుస్తకం రాసాడు. ఎన్నో వీడియో డిమాన్ స్ట్రేషన్లు ఇచ్చాడు. నిర్విరామంగా వర్క్ షాపులు నడుపుతూనే ఉన్నాడు. కాని, మరొక జుబ్కొవిచ్ మటుకు ఇప్పటిదాకా కనబడలేదు.

దుఃఖభరితంగానూ, ద్వేషపూరితంగానూ ఉండే ఈ లోకాన్ని కూరగాయలుపండించే రైతులూ, తియ్యటిపాటలు కట్టిపాడుకునే గాయకులూ,శాంతికాముకులైన భిక్షువులూ బతికిస్తున్నట్టే జుబ్కొవిచ్ లాంటి నీటిరంగుల చిత్రకారులు కూడా పడిపోకుండా నిలబెడుతున్నారనే నాకు నేను చెప్పుకుంటూ ఉంటాను.

3-7-2018

 

Leave a Reply

%d bloggers like this: