జాతక కథలు

125

గడిచిన రెండువారాలుగా నేను జాతకకథల చుట్టూ పరిభ్రమిస్తున్నాను. తెలుగులో, ఇంగ్లీషులో, బయట, నెట్ లో ఎక్కడెక్కడ ఏ అక్షరం దొరికినా ఆతృతతో అల్లుకుపోతున్నాను.

మా చిన్నప్పుడు తాడికొండలో మా స్కూలు లైబ్రరీలో తల్లావఝ్ఝుల శివశంకరస్వామిగారు చేసిన అనువాదాలు ఆరు సంపుటాలూ ఉండేవి. ( ఊహించడానికే లేదు కదా, ఒక హైస్కూలు లైబ్రరీలో అంత గొప్ప సాహిత్య సంపద! కాని తాడికొండ గురుకుల పాఠశాల అట్లానే ఉండేది). ఆ తర్వాత ఆ పుస్తకాలు మళ్ళా నాకు దొరకలేదు.

ఇరవయ్యేళ్ళ కిందట సోమయ్యగారు నాకు బోధచైతన్య అనే ఆయన అనువదించిన ‘జాతక కథలు’, ‘దమ్మపదంకథలు’ అనే రెండు పుస్తకాలు ఇచ్చారు. అవి మళ్ళా నాకొక కనువిప్పు కలగచేసాయి. కాని వాటినెవరికో చదవమని ఇచ్చేను. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంటే, మళ్ళా 2009 లో పునర్ముద్రణ పొందిన ప్రతులు దొరికాయి. మూడు పుస్తకాలు. ఒకటి, బుద్ధఘోషుడు రాసిన ధమ్మపదం అట్టకథనుంచి సేకరించిన 76 కథలు. రెండవది, ఆర్య శూరకుడు సంస్కృతంలో రాసిన ‘జాతకమాల’ కు తెలుగులో సంక్షిప్తానువాదం. మూడవది, మరీ విలువైనది శివశంకర స్వామిగారి అనువాదం నుంచి ఎంపికచేసిన 21 కథలతో కూర్చిన ‘జాతక కథలు’.

ఈ మూడు పుస్తకాలూ తెలుగు పాఠకులు ప్రతి ఒక్కరూ అవశ్యం చదవదగ్గవి. మన సమకాలీన చర్చల్లోనూ, సాహిత్యచర్చల్లోనూ వినబడని ఒక మహావాజ్మయం, లోకాతీత లోకమొకటి దృశ్యాదృశ్యంగా ఈ పుస్తకాల్లో మనకి ద్యోతకమవుతున్నది. ఇవి చదివిన తరువాత, పాఠకుల ఆసక్తి జ్వలిస్తుంది కాబట్టి అప్పుడు వాళ్ళు, ఇ.డబ్ల్యు. బర్లింగేం పాళీ నుంచి అనువదించిన Buddhist Parables from Original Pali (1922), ప్రొ. ఇ.బి.కోవెల్ సంపాదకత్వంలో ఒక పండిత బృందం అనువాదం చేసిన The Jataka Or Stories of the Buddha’s Former Lives (1990) ఆరుసంపుటాలూ చదవాలని ఉర్రూతలూగుతారు.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రచలితంగా ఉన్న ఆధునిక కథ ఈ రూపానికి చేరుకోవడానికి మూలాధారం బౌద్ధ జాతకకథలేనని నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. బౌద్ధ జాతక కథల్ని పాశ్చ్యాత్య ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసిన టి.డబ్ల్యు. రైస్ డేవిస్ తన అనువాదానికి రాసినముందుమాటలో 1880 నాటికే ఈ విషయాన్ని సోదాహరణంగా, సాధికారికంగా నిరూపించాడు. ఉదాహరణకి సింహం తోలుకప్పుకున్న గాడిద కథ (సిహచమ్మ జాతక కథ, 189) మొదటగా జాతకకథగా కనిపించిన తరువాత, గ్రీకులో ఈసోపులో, మధ్యయుగాల ఫ్రెంచి, జర్మన్, టర్కిష్, ఇటాలియన్, చైనీస్ భాషలతో పాటు భారతీయభాషల్లోకి కూడా ప్రయాణించిందనీ, చివరికి దాని సుదూర ప్రతిధ్వని షేక్ స్పియర్ ‘కింగ్ జాన్’ నాటకంలో వినిపిస్తుందనీ వివరించేడు. ఇట్లానే ఎన్నో జాతకకథలు ఆరబిక్, పర్షియన్, గ్రీకు, లాటిన్, స్పానిష్, జర్మన్ జానపద కథలుగా మారిపోయాయి. కేవలం ప్రజాబాహుళ్య సాహిత్యంగానే కాదు, డాంటే డివైన కామెడీ కి కూడా ఒక జాతక కథ (నిమి జాతకం. 541) ఆధారమని భిక్కు శీలభద్రుడు నిరూపించాడు.

ప్రపంచమంతటా ప్రభావం నెరిపినందువల్ల మాత్రమే కాదు, మౌలికంగా తమ తాత్త్వికతవల్లా, విశిష్ఠ ప్రాపంచిక దృక్పథం వల్లా జాతకకథలు మన సంక్షుభిత సమయాల్లో మనకు దారిచూపే దీపాల్లాగా వెలుగుతున్నాయి.

ఈ మాటలు రాస్తున్నందువల్ల నాకు సంతృప్తి కలగడం లేదు. వరసగా ఒక్కొక్క కథా మీకు చెప్పాలనీ, ఆ కథలట్లా చెప్తున్నప్పుడు మీ వదనాల్లో కనిపించే హర్షాతిరేకాన్ని చూస్తూ నేను మరింత హర్షోన్మత్తుణ్ణి కావాలనీ ఉంది. ఆ కథనకుతూహలాన్ని అణచుకోవడం చాలా కష్టంగా ఉంది కూడా.

1-12-2015

Leave a Reply

%d bloggers like this: