నిజమైన కవిత్వానికి ఎజెండా ఉండదు. బుచ్చిబాబు చెప్పినట్టుగా అది నీకు జీవితాన్ని జీవించదగ్గదిగా మారుస్తుంది అంతే. ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు నీ ముందు సరికొత్తగా ఆవిష్కరిస్తుంది. కాని ఆ శక్తి అనన్యసామాన్యమైన శక్తి. అందుకనే పూర్వకాలంలో మతాలూ, ఇప్పటికాలంలో రాజకీయాలూ కవుల్నీ, కవిత్వాల్నీ తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనే చూస్తూ వచ్చాయి.
మెరుగైన బేరం
మామూలుగా మనం ఏమనుకుంటామంటే ప్రేమ లెక్కల్నీ, లాభనష్టాల్నీ చూసుకోదని. కాని ప్రేమకి తనదే అయిన ఒక అంకగణితం ఉంది. ప్రేమికులు తమ ప్రేమనీ, ప్రపంచాన్నీ తక్కెడలో వేసి చూసుకున్నాకనే, ప్రేమ ప్రపంచం కన్నా ఎన్నో రెట్లు విలువైందని గ్రహించాకనే ప్రపంచాన్ని పక్కకు నెట్టేస్తారు.
హాఫిజ్ చేసేదదే
జీవితంలో అన్ని దారులూ మూసుకుపోయినప్పుడు, పొద్దుపొడవనప్పుడు, దిక్కు తోచనప్పుడు దివాన్-ఇ-హాఫిజ్ తెరిస్తే ఏ వాక్యం కనిపిస్తే ఆ వాక్యాన్నే భగవంతుడి ఆదేశంగా పరిగణించేవాళ్ళు ప్రపంచమంతా ఉన్నారు. వాళ్ళల్లో ఒకణ్ణి కావాలన్నదే నా ఆశ కూడా.