అంత మృదు ఋతుగానంలో ఆయనకి శస్త్రం ఎందుకు స్ఫురించింది? ఆ తర్వాత రానున్నది యుద్ధకాండ కాబట్టి అనుకోవాలా? కాదు. ఒక మనిషి మనసు ప్రసన్నం కావడమంటే చీకట్లు తొలగి దిక్కు తోచడం. తనని చుట్టుముట్టిన చీకట్లని చీల్చుకోడానికి ఒక శస్త్రం దొరకడం. శరత్కాలమంటే ఒక ఖడ్గసృష్టి. శస్త్రంలా శరత్కాలం సాక్షాత్కరించాక జైత్రయాత్ర ఎలానూ మొదలు పెట్టక తప్పదు.
మోహనరాగం: హేమంతం
'ఋతువులన్నింటిలోకీ నీకెంతో ఇష్టమయిన హేమంతం వచ్చింది చూడు' అంటాడు లక్ష్మణుడు రాముడితో. ఎందుకో వివరిస్తూ వరల్డ్ స్పేస్ రేడియో కోసం'మోహనరాగం' పేరిట వాడ్రేవు చినవీరభద్రుడు 2007 లో చేసిన ప్రసంగం.