నేను తిరిగిన దారులు-8

శివసాన్నిధ్య సుఖం

5  

శిలాతలనాట్యం

హైడల్‌ ప్రాజెక్టుల వైపు వెళ్తూ ఇప్పుడు మనం ఆధునికదేవాలయాల్ని చూడబోతున్నాం’ అన్నాను సుచితో. అప్పుడామె అన్న మాటలు నన్నాశ్చర్యపరిచాయి. ఆమె అంది కదా ‘అదేమి, మనం చూసిన బయోడైవర్సటీ ప్రాజెక్టు, చెంచుప్రాజెక్టు కూడా ఆధునిక దేవాలయాలే అనిపించింది నాకు. ఐ.టి.డి.ఏ లో ఉన్న కంప్యూటర్‌ ఆటోమేషన్‌, వి.శాట్‌, వైర్‌ లెస్‌, ఆధునిక సామాజిక జాగృతి ప్రయత్నాలు నన్ను అమెరికా గురించి సిగ్గుపడేటట్టు చేసాయి. మేముంటున్న పెనిసల్వేనియా రాష్ట్రం అమెరికాలో పురోగామి రాష్ర్టాల్లో ఒకటి. కాని మా ప్రొఫెసర్‌ కోలింగ్‌వుడ్‌ చెప్తూ ఉంటాడెప్పుడూ, పెనిసల్వేనియా పునాదులన్నీ అపలేచియన్‌ ఇండియన్‌ తెగల ఎముకల పైన నిర్మించినవేనని’

“నువ్వు ఒక కవి ఏడుశతాబ్దాల కిందట చెంచుసద్భక్తుల గురించి రాసాడన్నావు. ఇప్పుడు వారిని ఆధునిక వ్యవసాయంలోకి మళ్లించడానికి పెద్ద కార్యక్రమమే జరుగుతోంది. ఇది ఇండియాలాంటి డెమోక్రసిలో మాత్రమే సాధ్యం. అమెరికా కూడా డెమోక్రసినే. కాని ఆ సందర్భమే వేరు. రెండు శతాబ్దాలు కూడా తిరగకుండానే ‘సభ్య’ అమెరికా తన ఆదిమజాతుల్ని వేటాడి, బంధించి, బానిసలుగా అమ్మేసింది. అపలేచియన్‌ పీఠభూమిలో, ఆ లోయల్లో ఎక్కడ చూసినా నెత్తుటి చారికలు. కాని ఈ నల్లమల అడవుల్లో ఎక్కడ చూసినా శివసాన్నిధ్య ప్రకంపనాలే’

సుచి మాటలకు నా ఒళ్లు పులకరించింది. మెచ్చుకోలుగా ఆమెకొక షేక్‌హాండిచ్చాను.

‘ఇదుగో, శ్రీశైలం రిజర్వాయరు. 808 శతకోటి ఘనపుటడుగుల నీటిని నిలువ చేసే జలాశయం. ప్రధానంగా ఇది జలవిద్యుత్కేంద్రం. ఇక్కడ ఒక్కొక్కటి నూటపది  మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయగల ఏడు జనరేటర్లున్నాయి. నీటిని నిలువరించడానికి 470 అడుగుల ఎత్తున 1680 అడుగుల పొడవుగల మేసనరి కాంక్రీట్‌ ఆనకట్ట కట్టారు. ..’

ఎన్నోసార్లు ఎందరికో వివరించి ఈ అంకెలు నా నోటికి కంఠతా వచ్చేసాయి. కాని, ఆ ఆనకట్టనీ, జలాశయాన్నీ మొదటిసారి కళ్లతో చూసినప్పుడు కలిగే ఆ సంభ్రమం ముందు ఆ అంకెలు అదనంగా చెప్పేదేమీ ఉండదు. మేం కారు ఆపగానే రివర్‌ వ్యూ దగ్గర పొలారాయిడ్‌ కెమేరాతో ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. మా ఇద్దరినీ కలిపి ఇన్‌స్టంట్‌గా తీసిన చిత్తరువును చేతిలో పెట్టారు. ఆ ఫొటోలో మా వెనగ్గా నిశ్చలంగా ఉన్న డామ్‌ని చూపిస్తూ అన్నాను. ‘ఇదే కనుక సెప్టెంబర్‌ నెలలో అయిఉంటే ఒక్కొక్కటీ అరవైఅయిదు అడుగుల పొడవు, యాభై అయిదు అడుగుల వెడల్పూ ఉండే పన్నెండు కైస్ట్‌ గేట్లనుండి పదమూడులక్షల కూసెక్కుల మహాజలపాతం నిర్విరామంగా దూకుతుంటే మన వెనక ఆకాశమంతటా ఆవరించిన నీటి ఆవిరి తప్ప మరేమీ కనిపించిఉండేది కాదు.’

‘ఐ లవ్‌ టు కమ్‌ ఎగైన్‌’ అంది సుచి.

ఆ మధ్యాహ్నం మమ్మల్ని కదిలించిన మరొక స్థలం లెఫ్ట్‌ బాంక్‌ హైడల్‌ ప్రాజెక్టు. కుడివైపు ప్రాజెక్టు కన్నా రిజర్వాయర్‌కు మరింత దిగువగా జనరేటర్లను ఏర్పరచినట్లయితే ఉత్పత్తి సామర్ధ్యం పెంచవచ్చుననీ, నాన్‌-పీక్‌ డిమాండ్‌ వేళల్లో జనరేటర్లను పంపులుగా వాడినట్లయితే, అదే నదీజలాల్ని తిరిగి విద్యుదుత్పత్తి కోసం వాడుకోవచ్చుననుకునే ఆలోచన ఆ ప్రాజెక్టుకి ప్రాతిపదిక.

ఇందుకోసం దాదాపు పధ్నాలుగు సొరంగాలు, పవర్‌హౌస్‌, ట్రాన్స్‌ ఫార్మర్‌, మూడు సర్జ్‌ ఛాంబర్లు అండర్‌గ్రౌండ్‌లో నిర్మాణం చేపట్టారు. ఆ నిర్మాణం డిజైన్‌ని పటేల్‌కంపెని జనరల్‌మేనేజర్‌ ఎం.ఎం. పటేల్‌ మాకు వివరించారు. దేశంలో సొరంగాలు నిర్మించడంలో సిద్ధహస్తులైన పటేల్‌కంపెని తన పనిని నిర్ణీతకాలంలోనే పూర్తి చెయ్యగలిగిందనీ, జాతీయప్రమాణాల కన్నా తక్కువ స్థాయిలోనే ప్రమాదాలు సంభవించాయనీ ఆయన వివరించారు. ఆ తరువాత జెనరేషన్‌ కార్పొరేషన్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్లు జయరామిరెడ్డి, ప్రసాద్‌ మమ్మల్ని లోపలకు తీసుకువెళ్లి వర్క్‌ సైట్‌ చూపించారు.

గమ్‌బూట్లు, హెల్మెట్‌ ధరించి ఆ సొరంగాల్లో ప్రయాణిస్తుంటే ఆధునిక గుహాలయాల్లో ప్రవేశించినట్లుంది. పదిహేను మీటర్ల వ్యాసంతో 3438 మీటర్ల పొడుగునా రాళ్లను తొలిచి నిర్మించిన హెడ్‌రెస్ట్‌ టన్నెల్‌, దాన్నుంచి రెండుగా విడిపోయి కిందకి దూకిన ప్రెషర్‌షాఫ్ట్‌ లు, అక్కణ్ణుంచి ఒక్కొక్కటి తిరిగి మూడింటిగా విడిపోయిన పెన్‌స్టాక్‌లు, అండర్‌గ్రౌండ్‌ పవర్‌ హౌస్‌లను చూస్తూ ఉంటే దాన్ని నిర్మించింది మానవహస్తాలేనా అనిపించింది.

‘ఈ పనిలో ఎటువంటి అనుభవం కలిగింది?’ అని అడిగితే ఇంజనీర్‌ జయరామిరెడ్డి అన్నారు కదా ‘ఇది జీవితకాలంలో ఎవరికైనా సరే ఒక్కసారి మాత్రమే లభించే వర్క్‌ ఎక్స్‌ పీరియెన్స్‌. ఎనభైమీటర్ల పొడవుతో ఇరవైమీటర్ల వెడల్పుతో ఈ అండర్‌గ్రౌండ్‌లో మేం నిర్మించిన సర్జ్  ఛాంబర్‌ లాంటిది ప్రపంచంలోనే మరెక్కడా లేదు.’

ఆ తర్వాత మేం సొరంగాల నిర్మాణాన్ని సబ్‌కాంట్రాక్టుగా చేపట్టిన వేమారెడ్డిని కలిసినప్పుడు ఆయనన్నారు కదా ‘ఈ సొరంగాల నిర్మాణంలో టెక్నాలజీది పెద్దపాత్ర కాదు. అనుభవం ఇవ్వగల గైడెన్సు కూడా కొంతవరకే. ప్రముఖపాత్ర వహించేదంతా దైవానుగ్రహమే’.

ఆయన ఇంకా అన్నారు ‘కనీసం రెండుమూడు సార్లు మేం ఫాటల్‌ యాక్సిడెంట్లనుండి త్రుటిలో బయటపడ్డాం. ఆ ప్రమాదసంకేతాలు మాకెక్కడనుంచి అందాయంటే, అవి అనుభవంనుంచి వచ్చాయనిగానీ, సైరన్‌మోతవల్ల తెలిసాయనిగానీ చెప్పలేను. సొరంగం తవ్వడమంటే ఫైటింగ్‌ విత్‌ ద అన్నోన్‌. మేం ప్రధానటన్నెల్‌ తవ్వుతున్నప్పుడు మధ్యలో షియర్‌ జోన్‌ వచ్చింది. దానితో ప్రతిరోజు, ప్రతి క్షణం దాదాపు రెండేళ్ల పాటు యుద్ధమే జరిగింది. ఏమైతేనేం, ప్రాణనష్టం లేకుండానే పనిపూర్తి చేయగలిగాం.’

లెఫ్ట్‌ బాంక్‌ హైడల్‌ ప్రాజెక్టులో ప్రతి ఒక్క అంశం ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. సుచి అడుగడుగునా ప్రతి చిన్న వివరాన్నీ తన పాకెట్‌ నోట్‌బుక్‌లో ఎక్కించుకుంది. టన్నెల్‌లో స్టీలు ప్లేట్లు జతచేస్తున్నప్పుడు ఆల్ర్రాసోనిక్‌ స్క్రీనింగ్‌ చెయ్యడం దగ్గర్నుంచి, బయట క్రేన్‌ ఆపరేటరు అనుభవాల దాకా ప్రతి ఒక్కదాన్నీ మరీ మరీ అడిగి తెలుసుకుంది. “ఈ వివరాలన్నీ అంత అవసరమా? ఇవి ఎంతవరకూ గుర్తుంటాయి?” అని అడిగితే ‘డిటెయిల్స్‌ ఎలానూ మర్చిపోయేవే, కాబట్టే అంత శ్రద్ధగా ఎక్కించుకుంటాం. కాని ఈ ఇంప్రెషన్లు ఎక్కడకు పోతాయి? ఇక్కడ తిరుగుతుంటే కూడా నాకు శ్రీశైల ఆలయప్రాంగణంలో తిరుగుతున్నట్టే ఉంది’ అంది.

‘నువ్వు చెప్పావే, ఆ స్థానాధిపతి శాంతయ్య, ఆయన కట్టించిన ఆ ప్రాకారం దేవాలయానికెంత శోభనిచ్చిందని! కాని భగవంతుడు ఎన్నడో నిర్మించిపెట్టిన ఈ ప్రీ-కేంబ్రియన్‌ శిలాప్రాకారం మాట? ఈ అందం గురించి కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాలి’ అంది సుచి.

‘పూలపాన్పులు  ఎన్నో ఉండగా, శంభూ, నువ్వీ శిలాతలాల్లోనే ఎందుకు నాట్యం చేస్తావు?’ అన్నాడు కవి. ఈ సొరంగాల్నీ, బయటకు తవ్వి తీసిన ఈ పందొమ్మిదిలక్షల టన్నుల మట్టినీ చూస్తుంటే పరమశివుని శిలాతలనాట్యంలోని సౌందర్యం, ప్రయోజనం ఎంత చక్కగా బోధపడుతున్నాయి!

6

నిశ్శబ్దఉద్యమం

తిరిగి హైదరాబాద్‌ కి. జలాశయానికి ఎడమవైపు గట్టుమీద కొద్ది క్షణాలు ఆగేం. ఏ స్మృతికందని పూర్వయుగాల్లోనో వికసించిన మద్దిపూల మధ్య ఏ తుమ్మెద ఝుంకారమో ఇక్కడ ఈ స్వామినీ, ఈ శక్తినీ ప్రతిష్ఠించింది. ఆహారం కోసం వింటినారిని లాగిన చెంచువేటగాడూ, ఆదిశంకరులూ, మల్లికార్డునపండితుడూ, పాల్కురికి సోమనాథుడూ, వీరశిరోమంటపంలో తలలు నరుక్కుని పోగులు పోస్తున్న భక్తుల్ని చూసి చలించిన అనవేమారెడ్డీ, నవనాథచరిత్రకారుడు గౌరనా, శ్రీనాథుడూ, శ్రీకృష్ణదేవరాయలూ, శివాజీ, కల్నల్‌ కాలిన్‌ మెకంజీ, ఏనుగుల వీరాస్వామయ్యా, హైమండార్ఫ్‌, నిడదవోలు వెంకటరావు, పరబ్రహ్మశాస్త్రీ మొదలైన భావుకపరంపర ఇక్కడ ఏ శక్తి విజ్జృంభణాన్ని చూసి విభ్రములయ్యారో ఆ శక్తి ప్రజ్వలనంలోని ఏ శతాంశాన్నో మెగావాట్లుగా మార్చడానికి తీరానికి అటూ ఇటూ ఇప్పుడు హైడల్‌ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఆ విధంగానూ ఇది శక్తిపీఠమే అయ్యింది.

తస్కరులూ, నిషాదులూ, వాళ్ల కుక్కలూ, విల్లమ్ములూ, శిలలూ, వనచరాలూ ఉండే ఈ అడవి ఇక్కడ అడుగుపెట్టిన ప్రతివారికీ సజీవరుద్రసూక్తంగా గోచరించడంలో ఆశ్చర్యమేముంది?

సంబంధనాయనార్‌ తమిళతేవారం, బాణభట్టుని కాదంబరి, ఆదిశంకరుల శివానందలహరి, సీతారామశాస్త్రి శివదర్పణం ఈ మహిమాన్వితభూమి యుగయుగాలుగా చెప్తున్న ఏ రహస్యసందేశాన్నో పసిగట్టడానికి ప్రయత్నించినవే. సకల జీవజాలంలోని శివస్వరూపాన్ని చూడాలన్న సంకల్పమే కదా నేడు బయోడైవర్సటి సంరక్షణగా, పర్యావరణ పరిరక్షణగా రూపుదిద్దుకున్నది! శ్రీశైలం అనాదికాలం నుంచీ ఒక నిశ్శబ్దఉద్యమం.

నా అమెరికన్‌ బాలిక కళ్లల్లో కొంత బెంగ, ఎంతో వెలుగు. ఇప్పుడామె పెనిసల్వేనియాకి నూతనసందేశాన్ని తీసుకుపోగలుగుతోంది. ఏ వెబ్‌సైట్‌ ద్వారానూ కమ్యూనికేట్‌ చెయ్యలేని అనుతాపతరంగమొకటి నవసహస్రాబ్ది కోసం ఆమెలో ఎగిరిపడుతోంది. ఆధునిక ప్రపంచానికి ఇది రెండవ సహస్రాబ్ది అయిఉండవచ్చు. కాని ఈ పురాతన పుణ్యభూమికి ఇది ఎన్నవ సహస్రాబ్ది?

ఇక్కడ అడవిలో ఇప్పపూలు సదా రాలుతూనేఉంటాయి. చెంచుయువకులు వసంత కాలంలో తేనెపెరలు పెకలిస్తూనే ఉంటారు. మద్దిచెట్ల గుబుర్లలో తుమ్మెద సంగీతం పాడుతూనే ఉంటుంది. మారుతున్న ప్రపంచం నడుమ మార్పులేని సత్యసౌందర్యాల చల్లదనాన్ని ఇప్పుడామె హృదయం నిండుగా హత్తుకుంది.

ఇండియా టుడే వార్షిక సాహిత్య సంచిక, 2000


The Bliss of Shiva’s Presence

5

The Cosmic Dance on Bedrock

Heading toward the hydro-electric projects, I told Suchi, “We are now about to see the modern temples.”

Her response caught me by surprise. She said, “Why, Uncle, I felt that the biodiversity project and the Chenchu welfare project we just saw are modern temples in their own right. The computer automation, V-SAT, wireless networks, and modern social awareness initiatives at the ITDA made me feel embarrassed about America. Pennsylvania, where we live, is considered one of the progressive states in the US. Yet our Professor Collingwood always reminds us that all of Pennsylvania’s foundations were built over the bones of the Appalachian Indian tribes.”

“You told me a poet wrote about the noble Chenchu devotees seven centuries ago,” she continued. “Today, a major effort is underway to help transition them into modern agriculture. This is possible only in a democracy like India. America is a democracy too, but its history is entirely different. In less than two centuries, ‘civilized’ America hunted down its indigenous peoples, captured them, and sold them into slavery. Across the Appalachian plateau and its valleys, one sees only streaks of blood. But wherever you look across these Nallamala forests, you feel only the vibrations of Shiva’s presence.”

Suchi’s words sent a thrill through me. I gave her an appreciative handshake.

“Look, here is the Srisailam reservoir,” I said. “A vast water body impounding 808 TMC of water. Primarily, it is a hydro-electric station. It houses seven generators, each capable of producing 110 megawatts of power. To hold this water, a concrete gravity dam was built, rising 470 feet high and stretching 1,680 feet in length…”

Having explained these figures to so many visitors over the years, they rolled off my tongue effortlessly. Yet before the sheer awe of witnessing the dam and the reservoir in person, those numbers add little. As soon as we parked near the river viewpoint, photographers equipped with instant Polaroid cameras surrounded us. In moments, they placed an instant photograph of the two of us in our hands. Pointing to the calm dam behind us in the photo, I remarked, “Had this been September, with 1.3 million cusecs of water plunging relentlessly through twelve radial crest gates—each sixty-five feet wide and fifty-five feet high—you would see nothing behind us but an entire sky veiled in billowing water vapor.”

“I’d love to come again,” Suchi said.

Another site that stirred us deeply that afternoon was the Left Bank Hydro-Electric Project. The project is founded on the idea that installing generators much deeper below the reservoir level than those on the right bank would substantially boost generation capacity, and that during non-peak demand hours, these reversible units could act as pumps to draw water back up for regeneration.

For this endeavor, nearly fourteen underground tunnels, a powerhouse, a transformer cavern, and three surge chambers were constructed deep within the subterranean rock. M.M. Patel, General Manager of Patel Engineering Company, explained the engineering design to us. Masters in underground tunneling nationwide, Patel Engineering had completed the work within the targeted timeframe, keeping accidents well below national benchmarks. Later, Assistant Engineers of the Generation Corporation, Jayarami Reddy and Prasad, escorted us inside to view the subterranean worksite.

Walking through those subterranean tunnels in gumboots and safety helmets felt like stepping into modern cave temples. Gazing upon the headrace tunnel carved through solid rock with a 15-meter diameter spanning 3,438 meters, the pressure shafts splitting into two and plunging downward, the penstocks branching further into three, and the cavernous underground powerhouse, one wondered whether human hands had truly sculpted all of this.

When asked about his experience on this monumental task, Engineer Jayarami Reddy reflected, “This is a once-in-a-lifetime work experience. An underground surge chamber of this scale—eighty meters long and twenty meters wide—is virtually unmatched anywhere in the world.”

Later, when we met Vema Reddy, who undertook the tunneling subcontract, he observed: “Technology plays only a modest role in tunneling through these strata. The guidance derived from past experience also takes you only so far. What truly guides the work is divine grace.”

He added: “At least two or three times, we had narrow escapes from fatal accidents. Where those warning signals came from, I cannot tell—they came neither from experience nor from the sounding of an alarm siren. Digging a tunnel is truly fighting with the unknown. While excavating the main tunnel, we struck a shear zone. For nearly two years, every single day and every passing moment became a relentless battle. Yet, through it all, we managed to complete the task without a single loss of life.”

Every facet of the Left Bank Hydro-Electric Project sparked sheer fascination. Suchi jotted down every tiny detail in her pocket notebook. From ultrasonic screenings conducted while joining the steel liners inside the tunnel, to the lived experiences of the crane operator outside, she inquired into everything with keen interest. When I asked her, “Are all these minute details really necessary? How much of this will you remember?”, she answered, “Details will inevitably fade with time, which is why I record them so carefully. But how could these deep impressions ever disappear? Walking around here, I feel as if I am still walking through the sacred courtyards of the Srisailam temple.”

“You mentioned earlier how the chief pontiff Shantayya built the outer enclosure wall and added so much architectural grandeur to the temple,” Suchi observed. “What then about this grand Precambrian rock face that the Divine sculpted ages ago? We must celebrate this sublime beauty as well.”

An ancient poet once wondered: “When so many soft beds of blossoms await, O Shambhu, why choose the hard face of bare rock for your cosmic dance?” Standing before these cavernous tunnels and the 1.9 million tonnes of rock and earth excavated from the deep, the true beauty and purpose of Lord Shiva’s cosmic dance upon the bedrock revealed itself with luminous clarity.

6

A Silent Movement

Returning to Hyderabad. We paused for a few moments on the left bank of the reservoir. In some immemorial age beyond the reach of memory, amid the blossoming flowers of the Arjuna trees, the hum of a bumblebee must have consecrated this Lord and this Shakti here.

From the Chenchu hunter drawing his bowstring for sustenance, to Adi Shankara, Mallikarjuna Pandita, Palkuriki Somanatha, King Anavema Reddy—moved to awe watching devotees severing their heads in the Veera Shiromandapam—Gaurana, author of Navanatha Charitra, Srinatha, Sri Krishnadevaraya, Shivaji, Colonel Colin Mackenzie, Enugula Veeraswamayya, Christoph von Fürer-Haimendorf, Nidadavolu Venkata Rao, and P.V. Parabrahma Sastry: all of them stood spellbound before the blazing outburst of primal energy here. To convert a mere fraction of that flaming energy into megawatts of power, hydro-electric stations have now been established on either bank. In that modern sense as well, this place has truly become a seat of power—a living Shakti Peetham.

Is it any wonder that this forest—home to outlaws and hunters, their hounds and drawn bows, its rugged boulders and wild beasts—appears as a living Rudra Suktam to everyone who sets foot here?

Sambandar’s Tamil Thevaram, Banabhatta’s Kadambari, Adi Shankara’s Shivanandalahari, and Sitarama Sastri’s Shiva Darpanam were all humble attempts to glimpse the secret message whispered by this sacred land across the ages. Isn’t the resolve to behold the presence of Shiva in every living creature the very spirit that manifests today as the preservation of biodiversity and the protection of our ecology? Srisailam, since time immemorial, has been a silent movement.

In the eyes of my young American niece, there was a gentle wistfulness and a radiant light. She was now carrying a fresh message back to Pennsylvania. A wave of deep awakening that no website could ever transmit was stirring within her for the dawn of the new millennium. To the modern world, this might be the second millennium; but for this ancient, sacred soil, which millennium could this be?

In this forest, mahua blossoms will continue to fall forever. Chenchu youths will go on gathering wild honeycombs in spring. Amid the leafy canopy of Arjuna trees, the music of bees will never cease to hum. Amidst a fast-changing world, her heart had now fully embraced the soothing serenity of unchanging truth and timeless beauty.

India Today Annual Literary Issue, 2000

27-8-2026

3 Replies to “నేను తిరిగిన దారులు-8”

  1. ఇక్కడ ఏ శక్తి విజ్జృంభణాన్ని చూసి విభ్రములయ్యారో ఆ శక్తి ప్రజ్వలనంలోని ఏ శతాంశాన్నో మెగావాట్లుగా మార్చడానికి తీరానికి అటూ ఇటూ ఇప్పుడు హైడల్‌ ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఆ విధంగానూ ఇది శక్తిపీఠమే అయ్యింది.

    చాలా అద్భుతమైన భూగర్భ హైడల్ ప్రోజెక్టు.

  2. “ శ్రీశైలం అనాదికాలం నుంచీ ఒక నిశ్శబ్దఉద్యమం.”
    🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading