
ప్రియమైన శాఫో
రెండు రోజుల విరామం తర్వాత మళ్ళా నీకు ఉత్తరం రాయడానికి కూచున్నాను. నాకు తెలుసు నువ్వు నా ఉత్తరం కోసం ఎదురుచూస్తూ ఉంటావని. కానీ ఈసారి నేను తలుచుకుంటున్న వాక్యం సామాన్యమైంది కాదు. Fragment 130 సమస్త ప్రేమసాహిత్యంలోనూ ఒక మహావాక్యం లాంటిది.
ప్రేమదేవత మళ్ళా నా దేహాంగాల్ని
తత్తరపరుస్తున్నాడు
నా ఒంట్లో చొరబడి
తిక్తమధురవేదన కలిగిస్తున్నాడు
ఇందులో అయిదారు పదాలు- ఏ ఒక్కదాని గురించి ఆలోచించినా మొత్తం ప్రాచీన గ్రీకు సాహిత్యం, తత్త్వశాస్త్రం చర్చించుకోవలసి ఉంటుంది. ఉదాహరణకి, నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో ఆ ప్రేమదేవత Eros ఎవరు? ప్రేమనా, మోహమా, కామమా? స్త్రీనా, పురుషుడా? ఆ దేవత మనలో జాగృతం చేసేది కాంక్షనా, వాంఛనా, లాలసనా? లేదా, ఇలా ఏ అవస్థనీ విడివిడిగా విడదీసి చూపించలేని ప్రేమజ్వరమా? నువ్వీ మాటలు రాసిన మూడు శతాబ్దాల తర్వాత ఒక సాయంకాలం అగధాన్ అనే వక్త ఇంట్లో కవులు, రచయితలు, నాటకకర్తలు ఒక పానగోష్ఠి నడిపారు. సోక్రటీసు కూడా ఆ గోష్ఠిలో పాల్గొన్నాడు. ఆ సాయంకాలం వారంతా చర్చించింది ఈ Eros గురించే. వట్టి చర్చ కాదు, స్తోత్రం చేసారు. కాని వారందరూ ఆ దేవతను అర్థం చేసుకున్నతీరు పరిపూర్ణంగా లేదని సోక్రటీసు తానొక పెద్ద ప్రసంగమే చేసాడు. అందులో తిరిగి మళ్ళా తానీ ప్రేమ విద్యని డయోటిమా అనే ఒక తాపసి నుంచి తెలుసుకున్నానని చెప్పాడు.
ప్రేమ విద్య! అవును. Eros గురించి తెలుసుకోవడం ప్రేమవిద్యనే. ప్రేమవిద్యకి పాఠపుస్తకాలంటూ ఉంటే అది కవిత్వమే. ఒజ్జలు లేరుగాని కనుగొనగలిగితే నీ వంటి కవులే ప్రేమవిద్యకి బోధకులు.
ఇంతదాకా చూసిన నీ కవితల్లో నువ్వు ఆఫ్రొడైట్ ని స్తుతిస్తూ కనిపించావుగాని, మొదటిసారి ఈ ద్విపదలో Eros గురించి మాట్లాడుతున్నావు. ఆయన్ని స్తుతించడం లేదు. ఆయన నీలో కలిగిస్తున్న సంచలనం గురించి చెప్తున్నావు.నిన్ను విచలితురాల్ని చేస్తున్న ఆ సంచలనానికి వాడిన విశేషణాలే తక్కిన పద్యపాదమంతా.
నాలుగు విశేషణాలు: ఒకటి, దేహాంగాల్ని తల్లకిందులు చేస్తున్నవాడు, రెండోది, తిక్తమాధుర్యాన్ని, గ్రీకులో glykypikron కలిగిస్తున్నాడు. మూడోది, orpeton, అంటే ఒక సర్పంలాగా లోపలకి చొరబడుతున్నాడు. నాలుగోది, అతడి చొరబాటు amakhanon , అది, ఏ విధంగానూ అడ్డగించలేనిది, ఆపలేనిది, అదుపు చెయ్యలేనిది. ఇందులో మూడు విశేషణాలు క్రియావిశేషణాలే కావడం గమనించాను. అంటే ప్రేమానుభవం అన్నింటికన్నా ముందు గతిశీలం. స్థితి శీలం కాదు. నువ్వు స్థిరంగా, ప్రశాంతంగా కూచోవాలనుకుంటే కూచోనివ్వదు. నిన్ను తల్లకిందులు చేసేస్తుంది. నీ దేహాంగాల్ని సడలిస్తుంది. నిన్నొక చిత్రమైన నిస్సత్తువ ఆవహిస్తుంది. కాని దాన్ని నువ్వు ఆపలేవు, అది అజేయం. ఎందుకని అజేయం? అది నీకు కలిగించే అనుభూతిలో ఎంత చేదు ఉందో అంత తీపి కూడా ఉంటుంది కాబట్టి. నిజానికి అది నీలో చొరబడుతుంటే, దాన్ని నీలో ఒకరు ఆపడానికి ప్రయత్నిస్తుంటే, నీలోనే మరొకరు దాని కోసం మొత్తం దేహంతో స్వాగతం పలుకుతుంటారు. మా అనంగుడిలానే మీ Eros కూడా పూలబాణాలే వేస్తాడు. కాని ఆ బాణాలకి నీలోనే ఒక పార్శ్వం గుండె తెరిచి పెడుతుంది. మరో పార్శ్వం గుండె తలుపులు మూసెయ్యబోతుంది.
అప్పుడు నీతోనే నీకు, నీలోనే ఒక పోరాటం మొదలవుతుంది. దాన్నే నువ్వు limb-loosening అని అన్నావు. హోమర్ యుద్ధక్షేత్రానికి వాడిన విశేషణం. హెసియోదునే దీన్ని మొదటిసారి ప్రేమకి కూడా వర్తింపచేసాడట. ఆర్కిలోకస్, ఆల్కేయస్ లు కూడా ఈ విశేషణం వాడారని విన్నాను. కానీ నువ్వు donei అనే క్రియాపదాన్ని తీసుకొచ్చావు. ఆ క్రియాపదం కూడా హోమర్ వాడిందేగాని, ఈ రెండూ, అంటే దేహాంగాల్ని సడలించడం, తల్లకిందులు చేయడం- ఈ రెండు క్రియాపదాల్నీ కలిపి నువ్వే మొదటిసారి ప్రయోగించేవట. David A Campbell రాసిన The Golden Lyre: The Themes of Greek Lyric Poets (1983) చదువుతుంటే తెలిసిన విషయమిది.
మా ఆంధ్రకవితా పితమాహుడు పెద్దన మనుచరిత్రలో ఇటువంటి విశేషణాలే వాడేడు. ఆయనకి నీ గురించీ, హోమర్ గురించీ తెలిసే అవకాశమే లేదు. కానీ ఆయన ‘అనంగ గ్లాని’ అనే పదం వాడేడు. సంస్కృతంలో అనంగుడు అంటే మన్మథుడు. అంటే అంగాలు లేనివాడు. ఆయన్ని శివుడు మూడో కంటి చూపుతో దగ్ధం చేసాడని కదా కథ. కథని పక్కన పెట్టి, అసలు అనంగుడు అనే పదంలో ఉన్న ధ్వనిని మాటల్లో పెట్టడం కష్టం. దానికి సరైన అనువాదం ఇదుగో ఈ limb-loosening అనే అనిపిస్తోంది నాకు. కాంక్ష, లాలస దేహాల్ని ఆశ్రయించుకునే పుడతాయనుకుంటారు మామూలుగా. కాదు. అది ప్రవేశించడం దేహాల్లోంచే ప్రవేశిస్తుందేమోగాని, ఆ orpeton, ఆ క్రిమి, లేదా ఆ monster, లేదా ఆ మహాశక్తి, ఒకసారి దేహంలోకి, నీ మాటల్లో చెప్పాలంటే, పాక్కుంటూ ప్రవేశించేక, దేహాన్ని కూల్చేస్తుంది. అప్పుడు కలిగే బాధని పెద్దన ‘ఇక్షుశరాసన సాయక వ్యథా ఖిన్నత’ అని అన్నాడు. ఇక్షు శరం అంటే చెరకువిల్లు. మన్మథుడి విల్లు. దానిమీంచి గురిపెట్టిన బాణం ‘ఇక్షుశరాసన సాయకం’. అది కలిగించే వ్యథ వల్ల పుట్టేది ‘ఖిన్నత’. అంటే shock కావడం, నిశ్చేష్టమైపోవడం. దాన్నే నువ్వు donei అనే క్రియాపదంతో సూచిస్తున్నావు. అంటే అది నిన్ను ఊపేస్తుంది, గుంజేస్తుంది, నిలవనియ్యకుండా కుదిపేస్తుంది.
ఇక ఆ తర్వాత వాడిన పదం, bitter-sweet, గ్రీకులో glykypikron, ఆ పదం మాత్రం మొదటిసారి నువ్వే వాడావని సాహిత్యచరిత్రకారులంతా చెప్తున్నారు. ఇన్ని యుగాల తరువాత, రాయడం నేర్చిన ప్రతి ఒక్కరూ, ఆ పదబంధాన్ని ఇష్టమొచ్చినట్టు వాడేసాక, అందులో ఇంకేం కొత్తదనముంటుంది? కాని, ప్రేమానుభవానికి లోనైనవాళ్ళకి, తమ అవస్థని వివరించడానికి, అంతకు మించిన పదం కూడా మరొకటి లేదు.
కానీ నాకో సంగతి స్ఫురిస్తోంది. ప్రేమ గురించి రాసిన కవులు, మగవాళ్ళు, ప్రేమలోని మాధుర్యాన్నీ, తిక్తత్వాన్నీ కూడా చెప్పగలిగారు గానీ, విడివిడిగానే. ఏకకాలంలో ఆ తీపినీ, చేదునీ చెప్పగలిగినవాళ్ళు స్త్రీలు మాత్రమే. వారు జీవిత పానపాత్రలోని ఒకే అమిశ్రమరుచిగా దాన్ని స్వీకరించారు. ఎవరున్నారు మా కాలంలో ఆ ప్రేమ తీవ్రతని ప్రకటించిన కవయిత్రులని ఆలోచించాను. ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకరు కమలాదాస్. ఆమె ఈ అవస్థ లోతుల్లోకీ దూకింది. ప్రతిఒక్క ప్రేమానుభవాన్నీ ఒక సాహస యాత్రగా అనుభవంలోకి తెచ్చుకుంది. కనుకనే ఇలా అనగలిగింది:
The sensuous woman must choose her illness as she
Chooses her clothes to suit her own style, a certain
Delicate condition invisible to the eye
Inspiring awe and tender sympathy. ..
అంటే ఈ అవస్థ ఎవరికి వారికి తమ దేహాల కొలతల్ని బట్టి, తమ అభిరుచిని బట్టి తమ దుస్తుల్ని ఎంచుకునేలాగా, ఎవరికి వారు ఎంచుకునే ఒక అస్వస్థత, కంటికి కనిపించని ఒక సున్నిత మనోదేహావస్థ. దివ్యమైన అలజడి. ఒక somatic truth. అంటే బుద్ధితోటీ, ఆ మాటకొస్తే మనసుతోటీ కూడా తెలుసుకోగలిగే సత్యం కాదు. అది దేహంతో మాత్రమే పట్టుకోగల సత్యం. తెల్లవారుతూనే పక్షులెందుకు మేల్కొంటాయి? వసంత ఋతువు రాగానే కోకిల ఎక్కడున్నా ఎంత దూరమ్నుంచైనా ఎందుకు ఇక్కడ అడుగుపెడుతుంది? హేమంతకాలంలో ముడుచుకుపోయే గులాబి వసంతఋతువులోనే ఎందుకు విప్పారుతుంది? అది నీ దేహం మాత్రమే గుర్తుపట్టే ఒక అనాది, ఆదిమ, అప్రజ్ఞానం. అదొక దైహిక సంజ్ఞానం. శిశువు నిద్రపోతున్నప్పుడు భయంతో ఉలిక్కిపడ్డప్పుడు తన చిన్నారి చేతుల్తో తన తల్లి దేహాన్ని వెతుక్కుని పెనవేసుకుపోతుందే, ఆ అక్షరపూర్వ, విజ్ఞాన పూర్వ జాగృతి.
అటువంటి కవినే రేవతీ దేవి కూడా. తెలుగు కవయిత్రి. తత్త్వశాస్త్ర విద్యార్థిని. సార్త్ర్ రాసిన Being and Nothingness మీద పరిశోధన చేసినామె. వివాహిత. కాని ఆమె ఎవరినో గాఢంగా ప్రేమించింది. ఎంత గాఢంగా ప్రేమించిందంటే, ఈ మర్త్యదేహంలో, ఈ మర్త్యదేహంతో ఆమెకి తన ప్రేమని పొందడం, నిలుపుకోవడం అసాధ్యమనిపించింది. అందుకని ఒక పున్నమి రాత్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. భావతీవ్రతలో చలంగారితో పోల్చవచ్చును. కాని ప్రేమదేవత ముందు ఆత్మ సమర్పణ చెయ్యడంలో ఆమె అద్వితీయ.
నాకు తెలిసి వెయ్యేళ్ళ తెలుగు కవిత్వంలో అంత రసోద్విగ్నతతో కవిత్వం చెప్పిన కవయిత్రి మరొకరు కనిపించరు. డాస్టొవిస్కీ గొగోల్ గురించి చెప్పినట్లే నేను కూడా రేవతీ దేవి గురించి చెప్పగలను: 1980 తర్వాత కవిత్వం రాయడం మొదలుపెట్టిన మాబోటి వాళ్ళందరికీ ఆమెనే దారిచూపిన దేవత అని.
ఇన్నేళ్ళుగా కవులూ, రచయితలూ bitter-sweet ప్రేమ ఎలా ఉంటుందో వర్ణిస్తూ వచ్చారు. కాని ఆమె దాన్ని రక్తాస్థిగతంగా అనుభవంలోకి తెచ్చుకుంది. నిజమైన ప్రేమవల్ల ఏం జరుగుతుందో ఆమె గుర్తుపట్టింది, కాబట్టే ఇలా అనగలిగింది:
నిష్క్రమణ
నువ్వంటే నాకెంతో ఇష్టం ఎవరంటేనూ లేని ఇష్టం
ఎన్నో రకాల అన్ని ఇష్టాలకీ అతీతమైన ఇష్టం
కానీ
నువ్వంటే నాకలాంటి ఇష్టం ఉంటే
ఈ లోకానికేదో అవుతుందిట
అందుకని
నీ నుంచి పారిపోవాలని
నువ్వున్నావని ఇంట్లోంచి వెళ్ళిపోయాను
నువ్వున్నావని ఊళ్ళోంచి వెళ్ళిపోయాను
నువ్వున్నావని హృదయంలోంచి
ఇందులో చివరి వాక్యం నువ్వు మాత్రమే రాయగలిగిన వాక్యం. కాదంటావా?
శాఫో, నువ్వు నీ రెండు వాక్యాల్లో రాసిన నలుగులాట మొత్తం ఒక ప్రేమికురాలు తనకై తాను విస్తరించి రాసుకుంటే, అది రేవతీదేవి రాసుకున్న ‘అనురాగ దగ్ధ సమాధి’ కవిత అవుతుంది. పెద్ద కవిత, కాని ఆ కవిత మొత్తం నీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. ఆమె ఇప్పుడు స్వర్గంలోనే ఉండి ఉంటుంది. నువ్వు కబురు చేస్తే తప్పకుండా వచ్చి తనే నీకీ కవిత చదివి వినిపిస్తుంది.
అనురాగదగ్ధ సమాధి
నేనెవరినో మీకెవరికీ తెలియదు
ఆర్తిసెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పుపువ్వును
నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన
జగల్లీలాకేళికా సప్తవర్ణ జ్వాలావలయాలు
ఆ కళ్ళు ఆ అనురాగంకళ్ళు
అనురాగం ఎంత అందంగా ఉండటానికి వీలుంటుందో
అంత అందంగానూ ఉండే ఆ అనురాగంకళ్ళు
లోకమంతట్లోనూ నన్నే చూసే ఆ అందమైన అనురాగంకళ్ళు
నాలోనే లోకమంతటినీ చూసే ఆ అనురాగపుటందమైనకళ్ళు
అనురాగ జలధులై
యుగయుగాల సమస్త ప్రాణికోటి అనురాగాన్నీ
నా పైన అవిరళంగా వర్షించే అనురాగమేఘాలు ఆ కళ్ళు
ఏమిటీ ఆ కళ్ళు మీకు తెలీదా
మూణ్నిమిషాల్లా గడిచిన ఐదు శతాబ్దాలుగా
అనుక్షణం చూస్తున్న నాకే తెలియదు
ఆ కళ్ళ అనురాగనీలిమలో కరిగికలిసి లీనమైపోవటం తప్ప
ఈ హృదయం
రసజ్వలిత దాహంతో వెచ్చగా విచ్చుకున్న నెత్తురుపువ్వు
ఆ మమతల చెక్కిలి చేర్చనిదే
ఈ సెగ చల్లారదు
ఎర్రని మధువుతో వెచ్చగా చిప్పిలే ఈ పెదాలతో
ఆ ఒళ్ళంతా తడవనిదే
ఈ సెగ చల్లారదు
వేడి నెత్తుటితీగలై సాగిన ఈ చేతుల బిగింపులో
ఆ మెత్తని నున్నటి గట్టి శరీరం చిదకనిదే
ఈ సెగ చల్లారదు
ఈ సాంద్ర లాలసాతప్త వేదనాస్తిత్వం
ఆ ప్రగాఢాత్మీయ సాన్నిధ్యసాయుజ్యం పొందనిదే
ఈ సెగ చల్లారదు
ఈ శరీరం మూగవోయిన శతతంత్రుల రసవీణ
ఆ శతసహస్ర ప్రకంపనల వేళ్ళు మీటనిదే
ఈ సెగ చల్లారదు
ఆ శ్వాసలో శ్వాసై ఆ ప్రాణంలో ప్రాణమై
ఆ ఊపిరిలో ఊపిరై ఆ జీవంలో జీవమై
భ్రమించి తపించి క్రమించి శ్రమించి గతించనిదే
ఈ సెగ చల్లారదు
ఆదిశంకర సౌందర్యలహరిలో పునీతమై తను
రాధామాధవ నైతికాద్వైత సమాగమంలో పవిత్రమై నేను
తనువంతటా మనసైన మనసంతటా తనువైన
నేనైన తనలో పరిపూర్ణమై మేము
ఈ కామమోక్ష మోక్షకామ అశాంతుల అగ్నిగోళ
మహారణ్యాల కాంక్షా సౌందర్య తాండవ కీలల్లో
దగ్ధమై ప్రభవించి ప్రభవించి దగ్ధమై
రమిస్తే శమిస్తే దమిస్తే శాంతి శాంతి శాంతి
10-5-2026

