ఆధునిక తెలుగుశైలి

Reading Time: 3 minutes

37

ఈ నెల 17 వ తేదీ బుధవారం విజయనగరంలో డా. ఉపాధ్యాయుల అప్పలనరసింహమూర్తిగారి రచన ‘ఆధునిక తెలుగు శైలి ‘ పుస్తకాన్ని గురజాడకీ, గిడుగుకీ అంకితమివ్వడం కోసం ఏర్పాటు చేసిన సభ. వారి తరఫున మండలి బుద్ధప్రసాద్ గారు స్వీకరించారు. గొల్లపూడి మారుతీరావుగారు అధ్యక్షత వహించిన ఆ సభలో ఆ పుస్తకం మీద నేను మాట్లాడాలని నరసింహమూర్తిగారి కోరిక.

ఇప్పటికి సుమారు ముఫ్ఫై ఏళ్ళకింద 1986 లో గురజాడ అప్పారావుగారి మీద ప్రసంగించడం కోసం రామసూరి నన్ను విజయనగరానికి అహ్వానించారు. అప్పుడే ఆ ప్రసంగం తరువాత డా. యు.ఏ.నరసింహమూర్తి పరిచయమయ్యారు. ఆ తరువాత ఏడాదే నేను పార్వతీపురం సమగ్రగిరిజనాభివృద్ధి సంస్థలో శిక్షణ కోసం వెళ్ళవలసివచ్చింది. ఆ కాలంలో దాదాపు ఆరునెలలపైనే విజయనగరంలో గడపవలసివచ్చింది. రామసూరి ఇంట్లో ఉండేవాణ్ణి. ఆ రోజుల్లో దాదాపు ప్రతిసాయంకాలం నరసింహమూర్తిగారితో సాహిత్యచర్చలు చేసే అదృష్టానికి నోచుకున్నాను.

ప్రాచీన అలంకారశాస్త్రాలతో పాటు ఆధునిక సాహిత్యవిమర్శలో కూడా పటుతరమైన పాండిత్యం ఆయనది. క్షేమేంద్రుడి ఔచిత్యసిద్ధాంతాన్ని కళాపూర్ణోదయానికి అనువర్తింపచేస్తూ చేసిన డాక్టొరల్ పరిశోధన ఆయన ప్రస్థానంలో మొదటి మైలురాయి. ఆ తరువాత నారాయణబాబు, చాసో లమీద రాసిన వ్యాసాలతో పాటు, ‘చర్వణ’, ‘కవిత్వ తత్త్వదర్శనం’, ‘రంగుటద్దాలమేడ’ వంటి సాహిత్య విమర్శలతో పాటు సాహిత్య అకాడెమీకోసం జయంత్ మహాపాత్ర కవిత్వాన్ని ‘బాంధవ్యం’ పేరిట తెలుగు చేసారు. ఆదిభట్ల నారాయణదాసుగారు అచ్చతెలుగులోకి అనువాదం చేసిన రుబాయీలని సాహిత్య అకాడెమీ తరఫున ప్రచురింపచేసారు.

ఈ కృషి అంతా ఒక ఎత్తూ, ‘కన్యాశుల్కము-19 వ శతాబ్ది భారతీయ నాటకాలు’ పేరిట వెలువరించిన రచన మరొక ఎత్తూ. తులనాత్మక సాహిత్యంలో నాకు తెలిసి అటువంటి పరిశోధన తెలుగులోనే కాదు, భారతీయ భాషల్లోనే కాదు, ప్రపంచంలోనే రాలేదు. ‘డివైన్ కామెడీ’ మీదగాని, షేక్సిపియర్ నాటకాలమీదగాని, ‘వేస్ట్ లాండ్’ మీద గాని అటువంటి సమగ్ర తులనాత్మక పరిశోధన ఏదీ నా కంటపడలేదు. వివిధ భాషాసాహిత్యాలమీద రవీంద్రుడి ప్రభావాన్నీ, వివిధ భాషాసాహిత్యాలు రవీంద్రుడి మీద చూపించిన ప్రభావాన్నీ విశ్లేషించిన రచనలున్నాయిగాని, కన్యాశుల్కంలాగా ఒక్క రచనను ఒక శతాబ్ది కాలపు నాటకాలతో పోల్చిన ప్రయత్నమేదీ ఇంతదాకా జరగలేదు. అందులో ఆయన ప్రాచీన సంస్కృతనాటకాలైన మృచ్ఛకటికం వంటివాటితో పాటు, ఆధునిక ఐరోపీయనాటకాలు, ముఖ్యంగా గెర్టార్ట్ హౌప్ట్ మన్ రాసిన ‘ద వీవర్స్’ వంటి నాటకాలతో కూడా పోల్చి చేసిన విమర్శ నన్ను చకితుణ్ణి చేసింది. ఆ పుస్తకం ఆయన ఇంటిపట్టున కూచుని రాసింది కాదు. అరవయ్యేళ్ళ పైబడిన వయసులో కంటిచూపు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో ఆయన తన శ్రీమతితో కలిసి దేశం నలుమూలలా పర్యటించి, కన్నడ, మరాఠీ,అస్సామీ వంటి భాషల్లో 19 వ శతాబ్దంలో వచ్చిన నాటకాల్ని అక్కడి పండితులతో చదివించుకుని, అర్థం చెప్పించుకుని, ఆ నాటకాల్తో కన్యాశుల్కాన్ని పోలుస్తూ చేసిన రచన. బహుశా ఆధునిక తెలుగువిమర్శలో వచ్చిన శ్రేష్టరచనల్లో మొదటి మూడింటిని ఎంపిక చెయ్యమంటే, వాటిలో నేను ఈ పుస్తకాన్ని కూడా ఎంపిక చేస్తాను.

ఇప్పుడు ఆయన తీసుకువచ్చిన మరొక మహత్తర గ్రంథం ‘ఆధునిక తెలుగుశైలి’. సుమారు 900 పేజీల ఈ ఉద్గ్రంథాన్ని ఆధునిక తెలుగు వచన సర్వస్వంగా చెప్పవచ్చు. ఇందులో ఆయన ప్రధానంగా శైలిని పరామర్శించడానికి పూనుకున్నప్పటికీ, నన్నయనుండి నేటిదాకా తెలుగు వచన రచనా పరిణామాన్ని సమగ్రంగా పర్యావలోకించినట్టే అనిపించింది. ముఖ్యంగా పుస్తకం రెండవ అధ్యాయంలో శైలి గురించి ప్రాచీన భారతీయ లాక్షణికులు చెప్పిన అభిప్రాయాల్నీ పాశ్చాత్య విమర్శకులు చెప్తూ వచ్చిన అభిప్రాయాల్నీ చారిత్రికపద్ధతిలో సింహావలోకనం చేసారు. ఆ అధ్యయం దానికదే ఒక విలువైన మోనోగ్రాఫు కాగలదు. ఆ తరువాతి అధ్యాయాల్లో శైలి గురించి ఆధునిక తెలుగు రచయితలు వ్యక్తం చేసిన భావాల్ని వివరిస్తూ 26 రకాల శైలీ భేదాల్ని సూచిస్తూ, ప్రతి ఒక్క శైలీ విశేషానికీ,ప్రసిద్ధ తెలుగు వచన రచయితలనుంచి ఉదాహరణలు ఇచ్చారు. ఆధునిక తెలుగు వచనశైలీ నిర్మాతలు అనే అధ్యాయంలో ఆరుగురు రచయితలని ప్రత్యేకంగా పేర్కొంటూ, మళ్ళా పండిత శైలి, సంపాదకీయ శైలి, హాస్యశైలి అనే పేరిట మరికొందరు ప్రకాండులైన రచయితల్ని ఉదాహరించారు. ఇక చివరలో శైలీదోషాలు అనే పేరిట ప్రసిద్ధ రచయితలు, కాశీనాథుని నాగేశ్వరరావు మొదలుకుని రావిశాస్త్రిదాకా ప్రసిద్ధ రచయితల్లో కనవచ్చే తప్పుల్ని ప్రత్యేకంగా ఎత్తిచూపారు. ఇది చాలా సాహసోపేతమైన, చాలా అవసరమైన అధ్యాయం.

ఈ పుస్తకం పాఠకుల్నీ, పండితుల్నీ చాలా కవ్విస్తుంది. ఇందులో ఎవరి రచనలు ఉదాహరించబడ్డాయన్నదికాక, ఎవరి రచనలు ప్రస్తావించబడలేదో దానిమీద చాలా వాదోపవాదాలు చెలరేగనున్నాయి. శైలీభేదాలు ఇరవయ్యారేనా, ఇంకా ఎక్కువో, తక్కువో ఉండవచ్చుకదా అని కొందరు ప్రశ్నించకుండా ఉండరు. నాకై నాకే పుస్తకం చదువుతున్నంతసేపూ చాలా అభ్యంతరాలు, వేరే ఆలోచనలు కలుగుతూనే ఉన్నాయి.

కాని పుస్తకం వైశిష్ట్యం ఇటువంటి చిన్నవిషయాల్లో కాదు చూడవలసింది. 19 వ శతాబ్ది చివరిరోజుల్లో ఆధునిక విద్య తలెత్తుతున్న రోజుల్లో భాషాబోధన గురించి తెలుగులో గొప్ప సంఘర్షణ ఒకటి తలెత్తింది. సాహిత్యాన్ని, విద్యనీ ప్రజాసామాన్యానికి అందుబాటులోకి తెచ్చేటప్పుడు భాషని ఎట్లా బోధించాలన్నది ఆ ప్రశ్న. తొలితరం ఆధునికులు, అందుకు ప్రామాణీకరణని (standardization) ని పరిష్కారంగా చూపించారు. కాని ‘బ్రతుకునందులేని స్థిరత భాషకెక్కడిది?’ అని ప్రశ్నిస్తూ గురజాడ, గిడుగులు వ్యావహారిక భాష వైపు మొగ్గు చూపారు. కాని పూర్తి గ్రాంథిక భాష ఎట్లా కృతకమో, పూర్తి వ్యావహారిక భాష కూడా చలనశీలం, కాబట్టి లిఖిత రూపంలోకి ఒదగడం అసాధ్యం. ఈ రెండు మార్గాలమధ్యా ఒక మధ్యేమార్గాన్ని ఎంచుకోవడానికి ఇరవయ్యవశతాబ్ది వచనరచయితలు, పత్రికాసంపాదకులు ఎవరికి వారు ప్రయత్నిస్తూ వచ్చారు. ఆ ప్రయోగాల సాఫల్య, వైఫల్యాల సమగ్రసమీక్షగా ఈ పుస్తకం నాకు కనిపించింది.

ఒక విశ్వవిద్యాలయమో, ఒక పండితబృందమో చెయ్యవలసిన పని, వయోవృద్ధులైన భార్యాభర్తలు చేసారు. వారికి తెలుగు భాషా ప్రపంచం తిరిగిచెల్లించుకోలేనంతగా ఋణపడింది.

19-9-2014

Leave a Reply

%d bloggers like this: