పాల్ రోబ్సన్

97

శ్రీ శ్రీ కవిత్వమూ, పాల్ రోబ్సన్ సంగీతమూ ఒకటే రకం అంటుంది సౌరిస్’-ఈ వాక్యం చదవని తెలుగువాడుండడు. (సౌరిస్ కోరికమీద చలంగారు ఆ మాట యోగ్యతాపత్రంలో చేర్చారట.) 1950లో అరుణాచలంలో కూచుని పాల్ రోబ్సన్ గురించి తలుచుకుంటున్న ఆ తండ్రీకూతుళ్ళ ప్రపంచం మన ఊహకి అందనంత విస్తృతమైందని నేను ఇప్పుడు గ్రహించగలుగుతున్నాను. అట్లానే అక్కడ వాళ్ళ తలుపుతట్టేంతదూరం ప్రయాణించిన పాల్ రోబ్సన్ ఎంత అంతర్జాతీయమానవుడో కూడా ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను.

ఆ వాక్యం చదివిన చాలాకాలం దాకా, పాల్ రోబ్సన్ సంగీతం వినవచ్చునన్న ఊహగానీ, వినే అవకాశం ఉండగలదన్న ఆలోచనగానీ రానేలేదు, 80 ల మొదట్లో ఒకరోజు, రాజమండ్రిలో వరదా బ్రహ్మానందం గారు తన దగ్గర పాల్ రోబ్సన్ రికార్డులున్నాయని చెప్పేదాకా.

బ్రహ్మానందంగారు కమ్యూనిస్టు, విశాలాంధ్ర విలేకరిగా పనిచేస్తుండేవారు, కళాస్వాదకుడు, సాహిత్యాభిమాని, గొప్ప మనిషి. ఆయన మాకోసం ఆ రికార్డులు వినిపిస్తానన్నప్పుడు మేం చెప్పలేనంత ఉత్కంఠకి లోనయ్యాం.

ఒక తొలివేసవి సాయంకాలం, ఆయన తన ఇంటికి తీసుకువెళ్ళి, మేడ మీద, హాల్లో మమ్మల్ని కూచోబెట్టాడు. కొద్దిగా దూరంగా ఒక గదిలో గ్రామఫోను మీద ఆ రికార్డు పెట్టాడు. 78 ఆర్ పి ఎం రికార్డు మీద ముల్లు తిరగడం మొదలుపెట్టిన మొదటిక్షణాల గురగుర. బాల్కనీలోంచి సంపెంగల పరిమళం పలచగా అల్లుకుంటోంది. ఇంతలోనే ఒక గంభీరకంఠస్వరం వినపడటం మొదలయ్యింది. నా చిన్ననాటి అడవుల్లో వైశాఖ అపరాహ్ణాల్లో ఆకాశమంతా ఆవరించే ఉరుములాంటి స్వరం. ఆ పాట ఏమిటో, ఆ శైలి ఏమిటో, ఆ సంగీతమేమిటో మాకు తెలీనేలేదు. ‘ఆ అరుపుల్లో, చీకట్లో మొహాలూ, తోకలూ కనపడక వెతుక్కునే ప్రజల రొద, గాలిదెబ్బల కింద ఎదిరిపడే సముద్రపు తుపాను గర్జనం, మరఫిరంగుల మరణధ్వానం..దిక్కులేని దీనుల మూగవేదన, కాలికిందనలిగిన చీమల కాళ్ళు విరిగిన చప్పుడు, నీళ్ళులేక ఎండుతున్న గడ్డిపోచ ఆర్తనాదం..’- ఆ అనుభవాన్ని పోల్చుకోడానికి చలంగారి మాటలే మాకు దిక్కయ్యాయి. ఆ రికార్డు మీద ముల్లు పూర్తిగా తిరిగి ఆగిపోగానే మేం చెయ్యగలిగిందల్లా, ‘పాల్ రోబ్సన్ ని విన్నాం’ అని మాకు మేం చెప్పుకోవటమే.

ఇప్పుడు నేనీ వ్యాసాలు రాయడం మొదలుపెట్టాక, పూజ్యులు వేలూరి వెంకటేశ్వర రావుగారు, పాల్ రోబ్సన్ గురించి కూడా రాస్తున్నారు కదా అని అడగ్గానే ఆ నాకు ఆ సాయంకాలమే గుర్తొచ్చింది.

నేను ఏ పాల్ రాబ్సన్ గురించి రాయాలి? గాయకుడి గురించా, క్రీడాకారుడి గురించా, మొదటిసారి అమెరికన్ రంగస్థలమ్మీద ఒథెల్లో అభినయించిన మహానటుడిగురించా? నీగ్రోల హక్కుల గురించీ, నల్లజాతి అభ్యున్నతి గురించీ జీవితమంతా అలుపు లేని పోరాటం చేసిన ఉద్యమకారుడిగురించా? ఆసియా, ఆఫ్రికా దేశాల స్వాతంత్ర్యయోధులతో భుజం భుజం కలిపి ప్రపంచమంతా పెద్ద పెద్ద అంగలేస్తూ నడిచిన ఒక ప్రపంచ మానవుడిగురించా?

ఒకప్పుడు డుబ్వా ఆఫ్రికన్-అమెరికన్లు ఎటువంటి విద్యకి నోచుకోవాలని కోరుకున్నారో, అటువంటి అత్యున్నత విద్యావంతుడు పాల్ రోబ్సన్. న్యాయశాస్త్రం తో పాటు గ్రీకు, లాటిన్, హీబ్రూ, ఫ్రెంచి, జర్మన్, స్పానిష్, రష్యన్ లతో పాటు, ‘యొరుబా’,’ ఎఫిక్’, ‘త్వీ’, ‘గా’ లాంటి ఆఫ్రికన్ భాషల్లో కూడా పండితుడు, కన్ ఫ్యూషియస్ నుంచి కార్ల్ మార్క్స్ దాకా కాచివడబోసినవాడు. ఇరవయ్యవ శతాబ్దపు ఆఫ్రికన్-అమెరికన్లలో మాత్రమే కాదు, అమెరికన్లలో మాత్రమే కాదు, ప్రపంచపౌరుల్లోనే అగ్రశ్రేణిలో నిలబడగల మేధావి, పోరాటకారుడు, ముందుయుగం దూత.

పాల్ రోబ్సన్ అన్నిటికన్నా ముందు మానవప్రేమికుడు. తన జాతిని ప్రేమించాడు. ప్రపంచంలో ఎక్కడ బీదవాళ్ళూ, అన్యాయానికి గురవుతున్నవాళ్ళూ, హక్కులకు నోచుకోనివాళ్ళూ, అణచివేతకు గురవుతున్నవాళ్ళు కనబడ్డా వాళ్ళల్లో తన వాళ్ళని చూసాడు. వాళ్ళకోసం ప్రపంచమంతా వినేలా మాట్లాడేడు.

చరిత్రలో స్వాతంత్ర్యం అనేదానికి ఒక్కోదశలో ఒక్కొక్క అర్థం స్ఫురిస్తూ ఉంటుంది. డగ్లస్ కాలంలో స్వాతంత్ర్యం అంటే భౌతికస్వాతంత్ర్యం. మనిషికి తన శరీరాన్ని తనకు నచ్చినట్టు ఉపయోగించు కోగలగడం మీదా, తన జీవికమీదా ఉండే హక్కు. కాని పాల్ రాబ్సన్ కాలం నాటికి,స్వాతంత్ర్యం అంటే, అది కేవలం తన శరీరంమీదా, తన భావాలు ప్రకటించుకోవడం కోసం స్వాతంత్ర్యం మటుకే కాదు, ప్రపంచంలో ఎక్కడకైనా పోగలిగే స్వేచ్ఛ, కేవలం సంచరించడానికే స్వేచ్ఛకాదు, ప్రపంచంలో ఎక్కడ ఏ మానవసమూహం అణచివేతకు లోనవుతున్నా వాళ్ళని చూసి, కలిసి, వెన్నుతట్టి ధైర్యం చెప్పడానికి కావలసిన రాజకీయ స్వాతంత్ర్యం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక మనిషి ప్రపంచమానవుడిగా రూపొందగల, జీవించగల స్వాతంత్ర్యం.

వెంకటేశ్వర రావుగారు ఈ నెల న్యూయార్క్ రెవ్యూ ఆఫ్ బుక్స్ లో పాల్ రోబ్సన్ మీద పడ్డ ఒక వ్యాసం కూడా పంపించారు నాకు. Paul Robeson: The Artist as Revolutionary, No Way But This: In search of Paul Robeson అనే రెండు పుస్తకాలమీద సమీక్ష అది. అందులో మొదటి పుస్తకం మీద మరొక సమీక్ష గత ఏడాదే వచ్చింది, అది కూడా చదివాన్నేను. ఈ నేపథ్యంలో రాబ్సన్ లోని ఈ ధిక్కారపూర్వక, విప్లవశీల మానవుడి గురించి రాయడమే సముచితమనిపించింది.

ఒక గాయకుడు విప్లవకారుడిగా ఎట్లా మారాడో, ఎందుకు మారాడో పాల్ రాబ్సన్ స్వయంగా చెప్పుకున్న ఒక రచన ఉంది.

తననీ, తన వైఖరినీ,తన దృక్పథాన్నీ సుస్పష్టంగా వెల్లడిస్తూ రాసుకున్న Here I Stand (1956) అనే ఆ పుస్తకం గురించి చెప్పేముందు ఆ రచనా నేపథ్యాన్ని కూడా ప్రస్తావించాలి.

1946 నాటికే అంటే తన 48 ఏళ్ళ వయసునాటికే పాల్ రాబ్సన్ ఒక ఐకన్ గా మారిపోయేడు. ఆఫ్రికన్-అమెరికన్లకేకాదు, అమెరికాకే గర్వకారణంగా ప్రపంచం భావించే స్థితికి చేరుకున్నాడు. కాని, రెండవప్రపంచ యుద్ధం ముగియగానే ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. యుద్ధకాలంలో దేశం కోసం పోరాడిన నల్లజాతివాళ్ళు తమ స్వదేశస్థులైన శ్వేతజాతీయుల చేతుల్లో ఎదుర్కొన్న వివక్ష గురించి ప్రెసిడెంటుని ప్రశ్నించినందుకుగాను, రాబ్సన్ మీద అణచివేత మొదలయ్యింది. ఆ తర్వాత పదేళ్ళ పాటు అతణ్ణి దాదాపుగా గృహనిర్బంధానికిలోను చేసారు, పాస్ పోర్టు జప్తుచేసారు. సంగీత ప్రదర్శనలు ఇవ్వకుండా అడ్డుపడ్డారు. ఆర్థికంగా బలహీనుణ్ణీ, సాంఘికంగా ఏకాకినీ చెయ్యడానికి ప్రయత్నించారు.అంతేకాదు, అమెరికన్ మీడియా అతణ్ణొక దేశద్రోహిగానూ, సోవియెట్ తొత్తుగానూ చిత్రించడానికి శాయశక్తులా ప్రయత్నించింది. అంతదాకా, ఒక సమగ్ర మూర్తిమత్వంగా శోభించిన పాల్ రాబ్సన్ తన దేశస్థుల దృష్టిలో ఇద్దరు రాబ్సన్లుగా కనిపించడం మొదలుపెట్టాడు.

ఆ నేపథ్యంలో పాల్ రాబ్సన్ చేసిన సింహగర్జన ఆ పుస్తకం. సాధారణంగా ఇటువంటి కవితాత్మక విశేషణాలు రాయడం నాకు ఇష్టం ఉండదు. ఇట్లాంటి మాటలు అతిశయోక్తులుగానూ, పడికట్టుపదాలు గానూ వినిపిస్తాయి. కాని ఈ పుస్తకాన్ని వర్ణించడానికి మరొకమాట దొరకలేదునాకు.

ఒక్కమాటలో చెప్పాలంటే, నూటయాభై పేజీలు కూడా లేని ఆ రచన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనకు సమ ఉజ్జీగా నిలిచే ప్రకటన.

2

తన పుస్తకానికి Here I Stand అనే పదబంధాన్ని పాల్ రోబ్సన్ మార్టిన్ లూథర్ ప్రసంగం నుంచి తీసుకున్నాడు. అప్పటికి నాలుగువందల ఏళ్ళ కిందట, క్రైస్తవమతగ్రంథాల్ని ప్రజలభాషల్లోకి చేరువగా తీసుకువెళ్ళినందుకు, తన మీద అభియోగాలు మోపిన చర్చి ఎదట తనని తాను సమర్థించుకుంటూ, లూథర్ చేసిన ప్రసంగంలో చివరి వాక్యం అది. ఆ వాక్యాన్ని తన రచనకు శీర్షికగా పెట్టుకోవడంలో రోబ్సన్ గొప్ప వ్యంగ్యాన్నీ, ఔచిత్యాన్నీ కూడా చూపించాడు. మధ్యయుగాల్లో మతం ఏ పాత్ర పోషించిందో, ఆధునికకాలంలో రాజ్యం అదే పాత్రపోషిస్తోందని గుర్తుచేయడం అది.

ఆధునిక కాలంలో, ముఖ్యంగా, 20 వ శతాబ్దంలో మనిషి ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య, పైకి హేతుబద్ధంగానూ, కాని ఆచరణలో నిర్హేతుకంగానూ ప్రవర్తించే నిర్మాణాలతో ఎలా తలపడాలన్నదే. మతాధిపతుల్ని ధిక్కరించడానికొక మార్గం దొరుకుతుంది,వాళ్ళు పరలోకం గురించి మాట్లాడుతున్నారని ఎదురుతిరగవచ్చు. కానీ, ప్రజాస్వామ్యం పేరిట, రాజ్యాంగం పేరిట,శాసనవ్యవస్థ పేరిట, ప్రజల్ని అణచిఉంచే నిర్మాణాల్ని ఎట్లా ప్రశ్నించగలుగుతాం? ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాలన్నిటిలోనూ ఇదే సమస్య. ఎంతో rational గా కనిపించే ఈ irrational శక్తుల్ని ధిక్కరించడానికి ప్రతిహింస తప్ప మరో మార్గం లేదా? ఉందని చెప్పడానికి,ఎవరు ఎక్కడ ఏ చిన్న ప్రయత్నం చేసినా, – గాంధీ,మార్టిన్ లూథర్ కింగ్,మండేలా,ఎవరైనా గానీ – ప్రపంచమంతా కళ్ళల్లోకి ప్రాణాలు తెచ్చుకుని మరీ వాళ్ళ వైపు చూస్తున్నది. అటూవంటి ప్రజానీకానికి తాను మద్దతుగా ఉన్నానని ఎవరు ఎక్కడ మాట్లాడినా, ఒక కవిత రాసినా, బొమ్మగీసినా, పాటపాడినా, ప్రపంచప్రజ వాళ్ళకి తన హృదయంలో గూడుకట్టుకుంటోంది. అటువంటి వాళ్ళ గురించి వినడంలో, వాళ్ళ మాటల్ని తలుచుకోవడంలో, వాళ్ళ జీవితసంఘటనల్ని నెమరేసుకోవడంలో మనుషులకి అపారమైన స్ఫూర్తి చిక్కుతోంది.

పాల్ రోబ్సన్ జీవితం గురించి తెలుసుకుంటున్నప్పుడు మన రక్తం మరింత వేగంగా ప్రవహించడానికి కూడా ఇదే కారణం. తన గురించి అమెరికన్ మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తున్నప్పుడు, ఒక ఆఫ్రో-అమెరికన్ రచయిత రాసిన మాటలు రోబ్సన్ సగర్వంగా గుర్తుచేసుకున్నాడు. ఆ రచయిత ఇలా రాస్తున్నాడు:

‘పాల్ రాబ్సన్ విషయంలో మనకి అంతుపట్టని రహస్యమేదన్నా ఉందంటే అది ఇది: ఆధ్యాత్మికగీతాలు పాడుకుంటూ అతడు అటు ప్రజాదరణకీ, ఇటు కాసులపంటకీ కూడా నోచుకొని ఉండేవాడే. కాని, తన జాతికోసం పోరాడుతున్నందువల్ల అతడు భరించరానివాడుగా కనిపిస్తున్నాడు. అతడిముఖం మీదే తలుపులు మూసేస్తున్నారు. అలా జరుగుతుందని తెలిసీ అతడు పోరాటపంథాని ఎందుకు ఎంచుకున్నాడంటారా, అందుకు జవాబు మీరు అతడి ఆత్మలోతుల్లో వెతకవలసి ఉంటుంది.’

దుఃఖితులతో మమేకమవడం నీ ఆత్మస్వభావంగా మారిపోయేక, నీకు మరో ప్రత్యామ్నాయం ఉండదు. స్పానిష్ అంతర్యుద్ధాన్ని చూసిన తర్వాత పాల్ రోబ్సన్ ఇట్లా అనకుండా ఉండలేకపోయాడు:

‘ప్రతి ఒక్క కళాకారుడు, శాస్త్రవేత్త తానెక్కడ నిలబడతాడో ఇప్పుడే తేల్చుకోవలసి ఉంటుంది. అతడికి మరో ప్రత్యామ్నాయం లేదు. సంఘర్షణకి అతీతంగా పోయినిలబడటానికి ఏ దేవతాశిఖరాలూ లేవు. నిష్పాక్షికంగా చూసే నేత్రాలూ లేవు. ..ప్రతి చోటా రణరంగమే, పోయి తలదాచుకోడానికి ఎక్కడా చోటులేదు.’

అతడింకా ఇలా అంటున్నాడు:

‘స్వాతంత్ర్యంకోసం పోరాడటమా లేక బానిసత్వమా-ప్రతి ఒక్క కళాకారుడూ ఏదో ఒకటి ఎంచుకోకతప్పదు. నాకేది కావాలో నేను ఎంచుకున్నాను, నాకు మరోదారి లేదు.’

హక్కులకి నోచుకోక, అన్యాయానికి గురవుతున్నవాళ్ళ పక్షాన నిలబడటం మొదలయ్యాక నిజమైన రచయిత ఎక్కడో ఒకచోట ప్రశాంతంగా ఉండటం అసాధ్యం. 1927 నుంచి 1939 దాకా పాల్ రాబ్సన్ ఇంగ్లాండ్ లో ఉన్నాడు. అక్కడ అతడికి అపారమైన గౌరవం,ఆదరణ లభించాయి.అక్కడే శాశ్వత నివాసం ఏర్పరచుకోమనీ, అందుకు అన్ని వసతులూ తాము సమకూరుస్తామనీ బ్రిటిష్ సమాజం అతణ్ణి అభ్యర్థించింది. కానీ, రోబ్సన్ అమెరికా వెళ్ళిపోవడానికే ఇష్టపడ్డాడు. ఎందుకని? ఇలా చెప్తున్నాడు:

‘…కాని లండన్ బ్రిటిష్ సామ్రాజ్యానికి రాజధాని. అక్కడే నేను ‘ఆఫ్రికా’ ని కనుగొన్నాను. అట్లా ఏ క్షణాన కనుగొన్నానోగాని, అదిప్పటికీ నా జీవితాన్ని ప్రబావితం చేస్తూనే ఉంది. నేనింకెంతమాత్రం ఇంగ్లీషువాళ్ళ దత్తపుత్రుడిగా బతకలేనని అర్థం చేసుకున్నాను. నన్ను నేనొక ఆఫ్రికన్ గా సంభావించుకోడం మొదలుపెట్టాను.’

తనకన్నా ముందు డగ్లస్ కూడా ఇటువంటి నిర్ణయమే తీసుకున్నాడని రోబ్సన్ గుర్తుచేస్తాడు: తనని ఇంగ్లాండులోనే ఉండిపొమ్మని, అన్ని సౌకర్యాలూ సమకూరుస్తామనీ చెప్పిన బ్రిటిష్ పౌరుల్ని ఉద్దేశించి డగ్లస్ ఇలా అన్నాడట:

‘నేను ప్రశాంతంగా ఇంటిపట్టున కూచోడం కోసం అమెరికా వెళ్ళాలనుకోడం లేదు..నా సోదరులకోసం అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళ కష్టాలు పంచుకోడానికి, కలిసి చెమటోడ్చడానికి, అవమానాలు పంచుకోడానికి, ఆగ్రహం ప్రకటించడానికి. వాళ్ళ కోసం గొంతెత్తడానికి, వాళ్ళకి మద్దతుగా రాయడానికీ, మాట్లాడటానికీ..’

1934 లో సోవియెట్ రష్యాలో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు, పాల్ రోబ్సన్ కి తన జీవితంలో మొదటిసారిగా, తానొక నీగ్రో కాడనీ, ఒక మానవుడనీ అనిపించింది. పూర్తి మానవీయ గౌరవంతో తానక్కడ సంచరించానని చెప్పుకున్నాడు. తన చిన్నకొడుకుని అక్కడ పాఠశాలలో చేర్పించాడు కూడా. ఏళ్ళ తరువాత, అతడిమీద విచారణ చేపట్టిన అమెరికన్ కమిటీ అతణ్ణి ఈ విషయం మీద ప్రశ్నించినప్పుడు, ఒక సభ్యుడు, ‘అయితే నువ్వు రష్యాలోనే ఎందుకు ఉండిపోలేదు?’ అని అవహేళనగా అడిగాడు. అతడికి రాబ్సన్ ఇట్లా జవాబు చెప్పాడు:

‘ఎందుకంటే, మా నాన్న ఒక బానిసగా బతికాడు కాబట్టి. నా మనుషులు ఈ దేశాన్ని నిర్మించడంలోనే అసువులు బాసారు కాబట్టి. నేను కూడా నీకులానే ఈ దేశంలో భాగాన్ని కాబట్టి. నేను ఇక్కడే ఇక్కడే ఉంటాను. ఎట్లాంటి ఫాసిస్టు శక్తులూ నన్నీ దేశం నుంచి బయటకి తరమలేవు. అది మాత్రం స్పష్టం.’

ఒక జాతిని ప్రేమిస్తే రోబ్సన్ లాగా ప్రేమించాలి. నా ముందున్న వ్యాసం ముగిస్తూ ఆ రచయిత హ్యూగో టర్నర్ ఇలా రాస్తున్నాడు:

‘ పాల్ రోబ్సన్ మునుపెన్నటికన్నా కూడా ఇప్పుడు మనకి మరింత సన్నిహితంగా కనిపిస్తున్నాడు. అతడు మనకాలం వీరుడు. ఇప్పుడు, ఈ కోల్డ్ వార్ 2.0 ఉన్మాదాన్నీ రష్యన్ వ్యతిరేక జ్వరాన్నీ ..అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కోవడంలో అతడి అంతర్జాతీయతనుంచి మనం స్ఫూర్తి తెచ్చుకోవలసి ఉంటుంది… ఇంటర్నెట్ వర్ధిల్లిన ఈ కాలంలో, భాషలపట్ల అతడికున్న మక్కువకి, ఇప్పుడు సామ్రాజ్యవాదానికీ, వర్ణవివక్షకీ, యుద్ధానికీ, పెట్టుబడిదారీవాదానికీ వ్యతిరేకంగా సమస్త ప్రపంచాన్నీ కూడగట్టి ఉండేవాడు. 350 కోట్ల మంది ప్రజలకన్నా 62 మంది మనుషులు మాత్రమే ఎక్కువ సంపదకి నోచుకున్న ఈ ప్రపంచం కన్నా మెరుగైన ప్రపంచాన్ని ఎలాకలగనాలో మనకి నేర్పి ఉండేవాడు.’

అతడి వ్యాసంలో చివరి వాక్యమే ఇక్కడ నా చివరి వాక్యం కూడా-

‘రోబ్సన్ గతించిఉండవచ్చు, కాని అతడి ఉదాహరణ మాత్రం ప్రపంచాన్ని ఉత్తేజపరుస్తూనే ఉంటుంది.’

 

23-2-2018 & 24-2-2018

Leave a Reply

%d