
వుస్తాల సోమిరెడ్డి నిజామాబాదు జిల్లాలో ఎక్సైజు డిప్యూటీ కమిషనరుగా పనిచేస్తున్నారు. ఆయన సూర్యాపేట జిల్లా కోదాడలో తేజ విద్యాలయం అని ఒక పాఠశాలని 2013 లో ప్రారంభించారు. వారి శ్రీమతి రమ ఆ పాఠశాల నడుపుతూ ఉన్నారు. వందేమాతరం గీతం అవతరించి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మొన్న అయిదో తేదీన తమ పాఠశాలలో పిల్లల్తో ‘భారతీయం’ పేరిట పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి దానికి నన్ను కూడా ఆహ్వానించేరు.
చాలా నెలల తర్వాత మళ్ళా ఒక పాఠశాలలో అడుగుపెట్టాను. కాని ఒక్కరోజే ఎన్నో పాఠశాలల్ని సందర్శించినంత స్ఫూర్తి పొందాను. ఆశ్చర్యమనిపిస్తుంది, ఆదర్శపాఠశాలలూ, కొత్త బంగారు లోకాలూ ఎక్కడో సుదూరంగానో లేదా పుస్తకాల్లో మాత్రమే ఉంటాయనుకుంటాం. కాని ఇక్కడికి రెండువందల కిలోమీటర్ల దూరంలోనే ఒక అపురూపమైన విద్యావనం విలసిల్లుతోందని నాకిప్పటిదాకా తెలియనేలేదు.
మొన్న కార్యక్రమానికి నాతో పాటు పెద్దలు, రిటైర్డు ఐ.ఎస్.అధికారి చక్రపాణిగారితో పాటు, నేనెంతో గౌరవించే విద్యావేత్త ఎన్.ఉపేందర్ రెడ్డి కూడా హాజయరయ్యారు. అక్కడ మాటల మధ్యలో తెలిసిందేమంటే, అయిదారేళ్ళ కిందట, నేను సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టరుగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగానూ పనిచేస్తున్న కొన్ని innovative పాఠశాలల్ని గుర్తించి, వారు చేపడుతున్న కార్యక్రమాల గురించి డాక్యుమెంటు చెయ్యమని సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ వారిని అడిగానట. అందుకోసం సిప్స్ తరఫున ఉపేందర్ రెడ్డి దేశవ్యాప్తంగా 35 పాఠశాలల్ని ఎంపికచేసి వాటిలో 25 దాకా పాఠశాలల పైన డాక్యుమెంటేషన్ పూర్తి చేసారట. అలా ఆయన ఎంచుకున్న పాఠశాలల్లో తేజ విద్యాలయం కూడా ఒకటని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను చూడకముందే, నాకు తెలియకముందే ఆ పాఠశాలతో నాకు అనుబంధం ఏర్పడిందని అర్థమయింది.
‘భారతీయం’ ఒక సాంస్కృతిక కార్యక్రమం. అందులో ఆ పాఠశాల విద్యార్థులు దేశంలోని 25 రాష్ట్రాల్ని ఎంపికచేసుకుని, చిన్న చిన్న బృందాలుగా, తాము ఎంచుకున్న ప్రతి ఒక్క రాష్ట్రం గురించీ, అక్కడి సంస్కృతి, వేషభాషలు, ఆహారపు అలవాట్లు, ప్రసిద్ధ దర్శనీయ స్థలాలు మొదలైనవాటిని ఇంగ్లిషులో వివరించడమే కాక, ఆ రాష్ట్రాన్ని ప్రతిబింబించే ఒక పాట ఆ భాషలో పాడుతూ దానికి తగ్గట్టుగా నృత్యం కూడా చేసారు.
అంటే ప్రతి ఏటా రిపబ్లిక్ డే పరేడ్ లో భారతప్రభుత్వం న్యూఢిల్లీలో ఏర్పాటుచేసే కార్యక్రమం లాంటిది, ఇక్కడ ఒక చిన్నపట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేసింది. నేను అటువంటి ఒక రిపబ్లిక్ డే పరేడ్ న్యూఢిల్లీలో స్వయంగా చూసాను. అక్కడ రాష్ట్రాల సంస్కృతిని ప్రబిబించే శకటాల ప్రదర్శన ఉంటుందిగాని, ఆ రాష్ట్రాల సంస్కృతిని, చరిత్రని, సాహిత్యాన్ని వివరించి చెప్పడం ఉండదు. అలా చూసినట్టయితే ఇక్కడ ఈ చిన్నపాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఒక రిపబ్లిక్ డే పరేడ్ లో శకటాల ప్రదర్శన కన్నా మరెంతో సమగ్రంగా ఉందనిపించింది.

కార్యక్రమం మొదలవుతూనే ముందు చిన్నారుల్తో వందేమాతరం గీతం చరిత్రని చెప్పించారు. ఆ తర్వాత దేశంలోని నలుమూలల్నీ ప్రతిబింబించే వస్త్రధారణతో పిల్లలు వందేమాతరం ఒక బృందగానం చేసారు.

అలాగని ఇంతకీ ఆ పాఠశాల ఏదో ఒక రాజకీయ పక్షానికో లేదా మతతత్త్వ భావాలకో ప్రతినిధి కాదు. వందేమాతరం గీతాన్ని బంకిం రచించాక టాగోరు, అరవిందులు, లాల్-బాల్-పాల్, మహాత్ముడు మొదలైనవారంతా ఏ దేశభక్తి స్ఫూర్తితో హృదయానికి హత్తుకున్నారో అటువంటి స్ఫూర్తితోనే ఆ పాఠశాల ఆ గీతాన్ని తన ఔదల దాల్చింది. కాబట్టే ఆ కార్యక్రమం చూస్తున్నంతసేపూ అక్కడున్నవారందరికీ ఒళ్ళు ఉప్పొంగిపోతూ ఉంది.
‘వందేమాతరం’ బృందగానం పూర్తి కాగానే పిల్లలు వెంటనే ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ బృందగానం మొదలుపెట్టారు. నాకు చెప్పలేని పులకింత కలిగింది. బంకింతోపాటు సమాన గౌరవం దక్కిన గౌరునాయుడు నాకు తెలుసు అని ఆ క్షణాన నాకెంతో గర్వం కలిగింది.
2
భారతీయం కార్యక్రమం సాయంకాలం ఏర్పాటుచేశారు గాని నేను ఆ పాఠశాలలో పొద్దున్నే అడుగుపెట్టాను. సోమిరెడ్డి ఆ పాఠశాల ఎందుకు స్థాపించారు, ఏ ఉద్దేశ్యాలతో ఎటువంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు మొదలైనవి స్వయంగా తెలుసుకుందామని అనుకున్నాను. నేను ఏ పాఠశాలకి వెళ్ళినా చూడాలనుకునేది అక్కణ్ణుంచి తక్కిన పాఠశాలలకు అందించగల best practices ఏమున్నాయనేది. ఏయే అంశాల్లో ఆ పాఠశాల కొత్త పుంతలు తొక్కుతున్నదీ, అలా వేస్తున్న కొత్తదారుల్లో తక్కిన పాఠశాలలు కూడా తిరిగి చేపట్టగలిగేవి ఏవీ, ముఖ్యంగా వాటిలో low-cost, no-cost practices ఏమున్నాయనేది. అందుకని మొన్న పొద్దున్నంతా ఆ పాఠశాలలోనే గడిపాను. అక్కడ నేను చూసినవీ, తెలుసుకున్నవీ కనీసం పదిపదిహేనుదాకా అత్యుత్తమ ఆచరణలున్నాయి. వాటినే ఉపేందర్ రెడ్డిగారు డాక్యుమెంటు చేసారు. ఆయన ఆ సాయంకాలం ప్రసగంలో వాటిని స్థూలంగా సభాముఖంగా మరోసారి నలుగురికీ పరిచయం చేసారు కూడా. వాటిలో కొన్నింటిని ఇక్కడ పరిచయం చేద్దామనుకుంటున్నాను.
ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తి
తేజవిద్యాలయానికి చాలా పెద్ద ఆవరణ, యాభై వేల ఎస్.ఎఫ్.టి భవనసదుపాయం ఉన్నప్పటికీ, ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని 1:20 కే పరిమితం చేసుకున్నారు. ఇలా చెయ్యడం అసాధారణం. నాకు తెలిసి పబ్లిక్ స్కూళ్ళల్లోనూ, గురుకుల పాఠశాలల్లోనూ కూడా ఇంత ఆదర్శనిష్పత్తి లేదు. చివరికి విద్యాహక్కు చట్టం కూడా ఉన్నత పాఠశాలల్లో 1:35 నిష్పత్తి పాటించమని చెప్పింది. ఇరవై మంది పిల్లలకు మించని తరగతిగదిపట్ల ఉపాధ్యాయుడు చూపించగల శ్రద్ధ అపూర్వంగా ఉంటుంది. అందుకనే, తన పాఠశాలలోని 320 మంది విద్యార్థుల్లో ప్రతి ఒక్కరూ తనకు పేరు పేరునా తెలుసని సోమిరెడ్డి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం కలగలేదు.
ఆర్టు, సైన్సు, క్రాఫ్టు, లైబ్రరీ
మరి విద్యార్థుల సంఖ్య మీద పరిమితి పెట్టుకున్నప్పుడు అంత విస్తారమైన భవన సదుపాయాన్ని దేనికి ఉపయోగిస్తున్నట్టు అనే సందేహం వస్తుంది. కాని పాఠశాల అంటే తరగతి గదులు మాత్రమే కాదని సోమిరెడ్డికి తెలుసు. అందుకనే రెండంతస్థుల ఆ భవనంలో సంగీతానికి, నృత్యానికి, చిత్రకళకి, క్రాఫ్టుకి ప్రత్యేకంగా గదులున్నాయి. మాథ్స్, సైన్సు లాబులున్నాయి. ఇంకా గొప్ప విషయం ఉపేందర్ రెడ్డి చెప్పినట్లుగా, ఆ పాఠశాలలో ప్రైమరీ తరగతులకి ఒక గ్రంథాలయం, హైస్కూలు తరగతులకి మరో గ్రంథాలయం వేరువేరుగా ఉన్నాయి.

పిల్లల పఠనావసరాల పట్ల ఇంత ఔదార్యం నాకు మా తాడికొండ పాఠశాలలో కూడా కనిపించలేదు. సోమిరెడ్డి నన్ను ఆ గదులన్నీ తిప్పి చూపించారు. ప్రతి ఒక్క గదిలోనూ చైతన్యం వెల్లివిరుస్తూ ఉంది. ఇప్పుడు కొత్తగా మరో బ్లాకు కడుతున్నారు, కాని అడ్మిషన్లు పెంచడం కోసం కాదు. ఆ కొత్తబ్లాకులో ఆర్టిఫిషియలు ఇంటలిజెన్సుకోసం ప్రత్యేకంగా ఒక విభాగం తెరవబోతున్నారు.
సత్సంగాలు
మామూలుగా పాఠశాలలు పొద్దున్నే స్కూల్ అసెంబ్లీతో ప్రారంభమవుతాయి. కాని ఇక్కడ సత్సంగాలు నడుస్తాయి. సత్సంగమంటే మళ్ళా ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమం అనుకునేరు. కాదు. పాఠశాల ప్రాంగణం మొత్తాన్ని పది సత్సంగాలుగా విభజించారు. ఒకచోట జ్ఞాన సత్సంగం, మరో చోట క్రీడా సత్సంగం, ఇంకోచోట సాధనా సత్సంగం. వారం మొదలవుతూనే పిల్లలకి ఒక అంశాన్నిస్తారు. అది ఏదేనా ఒక సమస్య కావచ్చు, లేదా ఒక ప్రణాళిక కావచ్చు, లేదా పేదరికం, యుద్ధం, కళలు ఏదేనా కావొచ్చు. పిల్లలు ప్రతి రోజూ సత్సంగంలో నలభై నిమిషాల పాటు ఆ అంశాన్ని చర్చిస్తారు. అలా వారం రోజులూ దాన్ని కూలంకషంగా చర్చించి తమ చర్చల్ని, ప్రతిపాదల్ని డాక్యుమెంటు చేస్తారు. అందుకోసం లైబ్రరీ, ఇంటర్నెట్టు, క్షేత్ర పరిశీలనలు మొదలైన ప్రతి ఒక్క వనరునీ వినియోగించుకుంటారు.
సృజనాత్మక కార్యక్రమాలు
ఒత్తిడిలేని చదువు తమ పాఠశాల ఉద్దేశమనీ అందుకోసం తాము సృజనాత్మక కార్యకాలాపానికి పెద్దపీట వేస్తున్నామనీ సోమిరెడ్డి చెప్పారు. ఎవరేనా తల్లిదండ్రులు పిల్లల్ని ఐఐటినో, మెడిసినో చదివించే ఉద్దేశ్యంతో తమదగ్గరికి వస్తే తమ పాఠశాలలో ఆ దినుసు దొరకదని చెప్పేస్తామన్నారు. కానీ ఒత్తిడి లేని చదువు, మాతృభాషా మాధ్యమం లాంటివి శ్రద్ధగా అమలు చేసినప్పుడు అక్కడ చదువుకున్న విద్యార్థులు సాధించలేనిదంటూ ఉండదు. కాబట్టే తేజ విద్యాలయం విద్యార్థిని ఒకామె ప్రధానమంత్రితో కలిసి చంద్రయాన్ వీక్షించే అవకాశానికి నోచుకుంది. ఇక తేజ విద్యాలయం విద్యార్థులు ఎంతోమంది ప్రతి ఏటా ఐ.ఐ.టిలో, మెడిసిన్ లో ప్రవేశాలు సంపాదిస్తూండటంలో ఆశ్చర్యం ఏముంది? Creative activities కి పాఠశాల వేస్తున్న ఈ పెద్దపీటను పాఠశాల వ్యవస్థాపకుల్లో ఒకరైన డా. నాగేశ్వరరావు ఒక్క వాక్యంలో చెప్పారు: ‘తేజవిద్యాలయంలో తరగతి గది ఆటస్థలం, ఆటస్థలం పరిశోధనాలయం’ అని. ఇంతకన్నా మించిన ఆచరణీయ విద్యాదర్శాన్ని నేను ఊహించలేను.
క్షేత్ర పర్యటనలు, long walks, భారత్ దర్శన్
ఏదేనా నిజంగా నేర్పాలనుకుంటే, ఏదేనా నిజంగా నేర్వాలనుకుంటే, ఆరుబయటి ప్రపంచంకన్నా మించిన తరగతి గదిలేదని తేజ విద్యాలయం నమ్ముతోంది. అందుకనే వారు విరివిగా క్షేత్ర పర్యటనలు, long walks, trekkingలు చేపడుతున్నారు. వీటితో పాటు ప్రతి ఏడాదీ భారత్ దర్శన్ యాత్రలు చేపట్టడం మరో విషేషం. వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో ఆ రూటుమాపు ముందే తయారుచేసుకుని అక్కడ బేస్ కాంప్ దాకా రైల్లో వెళ్ళి, తాము చూడాలనుకున్న ప్రదేశాల్లో వీలైనన్ని స్థలాలు కాలినడకనే చూసేటట్టు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. తాము మౌంట్ అబూ వెళ్ళినప్పుడు ఆ మొత్తం పర్యటనలో దాదాపు లక్షానలభై వేల అడుగుల ట్రెక్కింగ్ చేసామని చెప్పారు సోమిరెడ్డి. భారత్ దర్శన్ యాత్ర ముగించుకుని రాగానే voices of Young Explorers పేరిట ఆ యాత్రాకథనాల్ని పుస్తక రూపంలో వెలువరిస్తారు. అటువంటి ఒక పుస్తకాన్ని మొన్న విడుదలచేసారు కూడా.
ఉత్తరాలు రాయడం
లేఖారచన దాదాపుగా కనుమరుగైపోయిన ఇప్పటి రోజుల్లో తేజ విద్యార్థులు ఇంకా ఉత్తరాలు రాస్తున్నారు. వారు ప్రతి ఒక్కరికీ ఉత్తరాలు రాస్తారు. సామాజిక సమస్యలమీద రాస్తారు. విజేతలని ప్రోత్సహిస్తూరాస్తారు. ఐ.ఐ.టి హైదరాబాదు, ఇస్రో లాంటి సంస్థల్ని అభినందిస్తూ రాస్తారు. తల్లిదండ్రులకి రాస్తారు. మిత్రులకి రాస్తారు. తోటి పాఠశాలలకి రాస్తారు. అలా ఉత్తరాలు అందుకున్నవారు తిరిగి వారికి మళ్ళా జవాబులు రాస్తున్నారు కూడా.
పిల్లల మూల్యాంకనా పత్రాలు
పిల్లల పరీక్షాఫలితాల్ని చూపిస్తూ తల్లిదండ్రులకి ప్రొగ్రెస్ కార్డులు పంపడానికి కూడా పాఠశాలలు సుముఖంగా లేని కాలమిది. కాని తేజవిద్యాలయంలో ప్రతి ఒక్క విద్యార్థి ఒక తరగతి పూర్తిచేయగానే ఆమె సమగ్ర మూల్యాంకనంతో ఎనిమిది పేజీల Individual Assessment Report వెలువరిస్తున్నారు. అందులో ఆ విద్యార్థికి చదువుచెప్పిన ప్రతి సబ్జెక్టు ఉపాధ్యాయుడూ ఆ విద్యార్థి పనితీరు పట్ల ఇచ్చిన మూల్యాంకనంతో పాటు క్లాసి టీచరు ఇచ్చే సమీక్ష కూడా ఉంటుంది. ఇక్కడ మీకోసం ఒక నమూనా మూల్యాంకనా పత్రం పొందుపరిచాను. చూడండి.
ఇటువంటి మూల్యాంకనాల్తో కూడిన ఒక Cumulative Record Sheet ని గాని మనం రూపొందించి అమలు చెయ్యగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది!
A Walk Down Memory Lane
పిల్లలు పదో తరగతి పూర్తి చేసుకుని పాఠశాల వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కనీసం గ్రూపు ఫొటో కూడా ఇవ్వాలన్న ఆలోచన రాని పాఠశాలలెన్నో. కాని తేజ విద్యాలయం ఒక గ్రూపుఫొటో తో పాటు, ఆ తరగతిలోని విద్యార్హులందరి ఫొటోలతో పాటు, వారికి చదువు చెప్పిన ఉపాధ్యాయుల ఫొటోలతో పాటు వారికి సేవలందించిన బోధనేతర సిబ్బంది పోటోలు కూడా నాలుగు పేజీల డాక్యుమెంట్ గా అందిస్తున్నది. అటువంటి ఒక నమూనా ఇక్కడ పొందుపరుస్తున్నాను చూడండి. ఇది తక్షణమే ప్రతి ఒక్క పాఠశాలా అమలు చెయ్యదగ్గ ఉత్తమ కార్యాచరణ అనడంలో నాకు సందేహం లేదు.
Lights, Camera, Education
సినిమాల ద్వారా విద్యానైపుణ్యాలు పెంపొందించవచ్చనేది తేజ విద్యాలయం చేపడుతున్న మరొక ఆచరణ. 2025-26 లో ముప్ఫై చలనచిత్రాలు పిల్లలకు చూపించి వాటిమీద పిల్లలతో సమీక్షలు రాయించారు. ఆ సమీక్షల్ని ఒక పుస్తకరూపంగా మొన్న విడుదల చేసారు. Education Through Movies అని ఆ పుస్తకానికి శీర్షిక పెడితే ఒక పిల్లవాడు దాన్ని Lights, Camera, Education అని మార్చాడట. ఆ పుస్తకం కూడా ఇక్కడ చూడొచ్చు.
ఇటువంటి కార్యాచరణలు తక్కిన పాఠశాలలు అనుసరించదగ్గవి, ఈ పాఠశాలనుంచి నేర్చుకోదగ్గవి చాలానే ఉన్నాయి. వాటిని ఉపేందర్ రెడ్డి బృందం ఎలానూ డాక్యుమెంటు చేసారు. కాని ఇటువంటి కార్యాచరణని స్వయంగా పోయి చూడటంకన్నా మించింది లేదు. కాబట్టి ఇటువంటి చదువుల పట్ల ఆసక్తి ఉన్న యాజమాన్యాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ పాఠశాలని స్వయంగా సందర్శింస్తే మరింత స్ఫూర్తిపొందగలరని భావిస్తున్నాను.
3
ఒక్క మనిషి! ఇంత నిశ్శబ్దంగా ఇంత అద్భుతాన్ని ఎలా పెంచిపోషించగలుగుతున్నాడు? ఆయనతో మాట్లాడుతుండగా ఒక ఆల్బం నా ఎదట పెట్టాడు. అది తన కుమారుడు రిషివేలీ పాఠశాలలో చదువుతున్నప్పుడు తాను ఆ పిల్లవాడికి రాసిన ఉత్తరాలు. పిల్లవాడు తనకి దూరంగా ఉన్నాడనే బెంగకి లోనుకాకూడదని తాను రాసిన ఉత్తరాలు. పోస్టు కార్డులు. తనకి వీలుచిక్కినప్పుడల్లా ఆ కార్డులు రాసిపెట్టుకుని రోజూ ఒక కార్డు పోస్టు చేసేవారట. కొన్నాళ్ళకు ఆ కార్డుల కోసం ఆ పిల్లవాడితో పాటు ఆ ప్రిన్సిపాలూ, తక్కిన టీచర్లూ కూడా ఎదురుచూడటం మొదలుపెట్టారట!
ఇక్కడ ఒక కార్డు ఫొటో పొందుపరిచాను చూడండి.


జవహర్ లాల్ నెహ్రూ జైల్లో ఉండగా తన కుమార్తె కి ఉత్తరాలు రాసిన సంగతి విన్నాం. Glimpses of World History పేరిట ఆ ఉత్తరాలు మనం కూడా చదివాం. కాని ఇలా మన మధ్యనే మరొక తండ్రి తన కుమారుడికి ఉత్తరాలు రాసేడని మనమిప్పుడే వింటున్నాం. ఆ ఉత్తరాలు చూడగానే నా మనసు పరిపరివిధాల పోయింది. మనం తండ్రులం, నిజంగా, మన పిల్లల్ని ప్రేమించవలసినట్టుగా ప్రేమిస్తున్నామా అని ఆలోచిస్తూనే ఉన్నాను ఆ ఉత్తరాలు చూస్తున్నంతసేపూ!
పిల్లల్ని మనం ఎలా ప్రేమించాలో తెలిస్తే అది మన పిల్లల్ని ప్రేమిచడంతోటే ఆగిపోదు. అది ప్రపంచంలోని పిల్లలందర్నీ ప్రేమించేదాకా విస్తరిస్తుంది. మన ప్రభావపరిథిలోకి ఎవరు ప్రవేశిస్తే వారికి కూడా అది అంటుకుంటుంది. మొన్న తేజపాఠశాల కార్యక్రమంలో ఒక దృశ్యం చూసాను. స్టేజీమీద లోయర్ కిండర్గార్టన్ చిన్నారులు బుడిబుడి నృత్యం చేస్తుంటే, ఆ స్టేజి ఎదట, కింద ఇద్దరు ఉపాధ్యాయినులు ఆ పిల్లలకి గైడెన్సుకోసం తాము కూడా డాన్సు చేస్తూ ఉన్నారు. అలా నాట్యం చేస్తున్నంతసేపూ ఆ ఉపాధ్యాయినుల ధ్యాసంతా ఆ పిల్లలమీదే ఉంది. ఆ కొన్ని క్షణాలూ వారు తక్కిన ప్రపంచాన్ని, తామొక మహాజనసభముందు నాట్యం చేస్తున్నామన్న విషయాన్ని, మర్చిపోయేరు. నేను జీవితంలో చూసిన అత్యంత సుమధుర దృశ్యాల్లో ఆ క్షణాల్ని కూడా లెక్కపెట్టుకుంటాను. పిల్లల్ని ఒక్కరు ప్రేమించినా సరే, ఆ నైతికసంస్కారం మొత్తం ఒక సంస్థకీ, ఒక ప్రాంగణానికీ, ఒక పట్టణానికీ విస్తరిస్తుందనడంలో సందేహం లేదు. అది నెమ్మదిగా ఒక నైతికోద్యమంగా మారగలుగుతుందనే నా నమ్మకం తేజ విద్యాలయాన్ని చూసేక మరింత బలపడింది.
7-4-2026


Reminded me of your “కొన్ని కలలు కొన్ని మెలకువలు” in some ways, Sir.
Very happy to know that such schools exist.
Such great low-cost and no cost take aways!!
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
Extraordinary experience sir. Thankyou sir
ధన్యవాదాలు సార్!
మీరెంతో అదృష్టవంతులు సర్. ప్రతి విషయాన్ని అత్యంత ఆసక్తి, ఆనందం కలిగించేలా చెప్తారు. మీతో మేము ఉన్నట్లు. మీ అక్షరాలకి, భావన లకి ఆ శక్తి ఉంది. శ్రద్ధగా చదివించే శక్తి కూడా. నమోనమః
ధన్యవాదాలు మేడం.
అదృష్టవంతులు మీరు. మీ పూర్వజన్మ సుకృతమో.. మీ తల్లిదండ్రుల మహోన్నత వ్యక్తిత్వఫలమో.. మీకు ఇలాంటి మహత్తర సంగతులు, పాఠశాలలు, ప్రదేశాల వివరాలు తెలుస్తాయి. దర్శించి పులకించే అపురూప అవకాశాలు లభిస్తాయి. మానవత్వపు వికృత రూపాలను అమోఘంగా చిత్రీకరించే దారుణ అంశాలు, వార్తలు మమ్మల్ని వదలకుండా కంటబడతాయి. వెంటాడతాయి. నిత్యమూ.. క్షణ క్షణమూ మనసూ శరీరమూ చీదరించుకునే వెకిలి చేష్టలు.. మానవత్వాన్నీ అపహాస్యం చేసే కథనాలు.. వినక తప్పని బ్రతుకులు మావి. అదృష్ట వంతులు మీరు. మీరంటే అసూయ సార్.. నాకు..నాబోటి మాకు!!
అయ్యా! సార్! మీరు చరిత్రకారులు. మంచీ, చెడూ రెండు చూసే దార్శనికులు.
The word feels great pleasure when it is used at this great places.
Thank you Sir!
ఆ పక్కన ఎక్కడో విలేజ్ లో పుట్టి కోదాడలో పెరిగి, చదివి, పెళ్ళి చేసుకోవడం వల్ల కోదాడను వదిలిన నాకు.. 15 ఏళ్ల తర్వాత అక్కడ ఒక అత్యుత్తమ పాఠశాల ఆరంభించారని.. అది 13 వసంతాలు పూర్తి చేసుకున్నదని తెలిసి చాలా ఆనందం కలిగింది. మా ఊళ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ వచ్చిందన్నమాట..
ధన్యవాదాలు సర్
ధన్యవాదాలు మేడం!