ఒక మనిషి మరో మనిషికోసం

Reading Time: 4 minutes

98

లొరైన్ హాన్స్ బెర్రీ రాసిన నాటకం ఇతివృత్తం చాలావరకూ ఆమె స్వానుభవమే. ఆమె పసివయసులోనే ఆమె తండ్రి చికాగోలో తెల్లవాళ్ళ ప్రాంతంలో ఒక ఇల్లు కొనుక్కున్నాడు. కాని, అక్కడ అల్లరిమూకలు ఆ ఇంటిమీద దాడిచేసాయి. ఆమె తండ్రి సుప్రీం కోర్టులో కేసు వేసి గెలిచాడు. కాని, చట్టం వాళ్ళకి ప్రశాంతతని ఇవ్వలేదు. ఆ తర్వాత ఆమె కాలేజీరోజుల్లో ఒక ప్రసిద్ధ ఐరిష్ నాటకర్త రాసిన నాటకమొకటి చూసింది. ఒక బీదకుటుంబం జీవికకోసం పడే పాట్లు ఆనాటకవస్తువు. ఆమె తమ కుటుంబ అనుభవాన్ని ఆ ఐరిష్ నాటకం చూపించిన వెలుతుర్లో ఒక కొత్త రూపకంగా మలిచింది.

సాహిత్య ప్రయోజనం గురించి రాస్తూ కొడవటిగంటి కుటుంబరావు ఒక మాటన్నాడు, చట్టం చేయలేని పని సంస్కారం చేస్తుందనీ, సాహిత్యపరమార్థం అటువంటి సంస్కారాన్ని పెంపొదించడమేననీ. చట్టం చేయలేని పని హాన్స్ బెర్రీ నాటకం చేసి చూపించింది. 60 ల్లో వెల్లువెత్తిన పౌరహక్కుల ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన గొప్ప శక్తుల్లో ఆ నాటకం కూడా ఒకటని ఇప్పుడు సాహిత్యచరిత్రకారులు చెప్తున్నారు.

హాన్స్ బెర్రీ ముప్పై నాలుగేళ్ళ వయసులోనే కేన్సర్ తో మరణించినా ఎన్నో జీవితకాలాలకు సరిపడా కృషిచేసి వెళ్ళిపోయింది. To be Young, Gifted and Black -ఆమె ఆత్మకథకి పెట్టుకున్న పేరు. ఆ మూడు విశేషణాలకీ ఆమె పేరు సమానార్థకంగా నిలబడిపోతుంది.

ఈ నాటకం ప్రస్తుత ప్రాముఖ్యత కేవలం చారిత్రకమేనా? ప్రసిద్ధ ఆఫ్రికన్ అమెరికన్ అమిరి బరాకా ఆ ప్రశ్నకిట్లా జవాబిస్తున్నాడు: ‘మేం అప్పట్లో ఈ నాటకం అణచివేతని స్తబ్ధంగా ప్రతిఘటిస్తోందనే అనుకున్నాం. మేమా నాటకం ఆత్మని పట్టుకోలేకపోయామని ఇప్పుడు గుర్తిస్తున్నాం. ..ఆ నాటకం యథార్థ సంఘర్షణని కచ్చితంగానూ, మనల్ని నివ్వెరపరిచేలానూ చిత్రించిన సృజన అని చెప్పవలసి ఉంది.’

ఈ నాటకాన్ని విమర్శకులు రియలిస్టు నాటకంగా పేర్కొంటున్నారు కాని, నిశితంగా చూస్తే, ఇది నాచురలిజానికి చెందిన రచన. పందొమ్మిదో శతాబ్ది చివరలో యూరోప్ లో ప్రభవించిన ఇబ్సెన్, చెకోవ్, స్ట్రిండ్ బెర్గ్ ల రచనల సరసన నిలబడగల సృజన.

ఆ నాటకం నుంచి ఒక దృశ్యం.

ఒక మనిషి మరో మనిషికోసం

(మూడవ అంకం, మొదటి దృశ్యం)

అసగాయి: వచ్చేసాను.. నాక్కొంత తీరిక దొరికొంది. మీరు సామాన్లు సర్దుకుంటుంటే నేను కూడా కొంత సాయం చేద్దామనిపించింది. ఆ పాకేజి పెట్టెలు చూస్తుంటే నాకు భలే సరదాగా ఉంటుంది. మొత్తం కుటుంబం కుటుంబమంతా ప్రయాణానికి సిద్ధం కావడం! కొంతమందికి అది నిరుత్సాహంగా ఉంటుంది…కాని నాకు మటుకు…మరోలా అనిపిస్తుంది. మొత్తం జీవశక్తి పొంగిపొర్లుతున్నట్టుంటుంది, తెలుసా? చలనం, ప్రగతి.. నాకైతే ఆఫ్రికా గుర్తొస్తుంది.

బెణేతా: ఆఫ్రికా!

అసగాయి: ఏమిటిట్లా ఉన్నావు, నిన్ను చూస్తుంటే నాకెంత ఇదిగా ఉందో తెలుసా?

బెణేతా: వాడు మొత్తం డబ్బంతా ఇచ్చేసాడు, అసగాయి…

అసగాయి: ఎవరు? ఏ డబ్బిచ్చేసారు?

బేనేతా: మా అన్నయ్య. ఆ ఇన్సూరెన్సు డబ్బంతా ఇచ్చేసాడు.

అసగాయి: ఇచ్చేసాడా?

బెణేతా: వాడు దాన్ని పెట్టుబడి పెట్టాలనుకున్నాడు! ఎవడితోటో తెలుసా? చిన్నపిల్లాడు ట్రావిస్ కూడా వాడిదగ్గరున్న గోళీకాయలు అట్లాంటి వాడి చేతుల్లో పెట్టడు.

అసగాయి: ఆ డబ్బు పోయినట్టేనా?

బెణేతా: మొత్తం ఊడ్చుకుపోయింది,

అసగాయి: అయ్యో, చాలా కష్టంగా ఉంది వినడానికే..మరి నీసంగతి, ఇప్పుడెలా?

బెనేతా: నేనా?…నేనా?.. నా సంగతేముంది.. నేనేమీకాను. నేను చాలా చిన్నదానిగా ఉన్నప్పుడు..మేము మా ఇంట్లో పీటలు పట్టుకుపోయి శీతాకాలం ఆ కొండల మీద ఆడుకునేవాళ్ళం. కొండలంటే, పక్కింటివాళ్ళ ఇళ్ళ దగ్గర మంచుకప్పేసిన రాతిమెట్లన్నమాట. ఆ వీథిలో చివరిదాకా మంచే ఉండేది. మేమా పీటలనిండా మంచునింపుకుని ఆ వీథి చివరిదాకా దొర్లుకుంటూ పోయేవాళ్ళం. ..అది చాలా ప్రమాదకరం, తెలుసా…అక్కడ మరీ ఏటవాలుగా ఉండేది..ఒకరోజు మాలో ఒక పిల్లాడు, వాడి పేరు రుఫస్, మరీ వేగంగా దూసుకుపోతూ పక్కకి కొట్టుకుని కిందకి దొర్లిపోయాడు..నేనక్కడే నిలబడి చూస్తూన్నాను, నా కళ్ళముందే వాడి ముఖం బద్దలైపోయింది, రక్తంతో తడిసిపోయింది, వాడి పని అయిపోయిందనే అనుకున్నాను. కాని ఇంతలోనే అంబులెన్సు వచ్చింది, వాణ్ణి హాస్పటల్ కి తీసుకుపోయారు, అక్కడ ఆ ఎముకలు అతికి, చర్మం కలిపి కుట్టారు..నేను మళ్ళా వాణ్ణి చూసేటప్పటికి వాడి ముఖం మీద కిందదాకా నిలువునా ఒక చార..నేను దాన్నుంచిప్పటికీ బయటపడలేకపోయాను..

అసగాయి: దేన్నుంచి?

బెనేతా: అంటే ఒక మనిషి మరో మనిషికోసం ఏం చెయ్యగలడనే దాన్నుంచి. ఒక మనిషి సమస్యని రెండు చేతుల్తో పట్టుకుని, దాన్ని రెండుపక్కలా కలిపి కుట్టేసి, మళ్ళా మనిషిగా మార్చెయ్యడం..ఈ ప్రపంచంలో అంతకుమించిన అద్భుతం మరొకటేమీ లేదు.. నాకట్లా చెయ్యాలని ఉంది. ఈ ప్రపంచంలో ఒక మనిషి చెయ్యగల నిజమైన పనంటూ ఏదన్నా ఉంటే అది మటుకే. రోగాన్ని కనుక్కో, చూడు, మొత్తం మళ్ళా సరిదిద్ది ఒక్కటిగా చేసెయ్యి. దైవత్వమంటే అదీ…

అసగాయి: నువ్వు దేవుడివి కావాలనుకుంటున్నావా?

బెణేతా: లేదు, నేను రోగానికి చికిత్స కావాలనుకుంటున్నాను. ఆ ఆలోచన నాకు చాలా ముఖ్యంగా ఉంటూ వచ్చింది. నాకు చాలా ముఖ్యమైన విషయమది. నాకు చాలా శ్రద్ధగా మసలడం నేర్పిందది, మనుషుల్ని పట్టించుకోడం, వాళ్ళని ఎక్కడేనా కష్టపెడతానేమోన్న జాగ్రత్త పడటం..

అసగాయి: అంటే ఇప్పుడు పట్టించుకోటం లేదా?

బెణేతా: అవును- అలాగే అనిపిస్తోంది.

అసగాయి: ఎందుకని?

బెనేతా: (కటువుగా) ఎందుకంటే, మనుషుల్ని నిజంగా ఏది పట్టిపీడిస్తోందో దాన్ని తెలుసుకోవలసినంతగా అది తెలుసుకోవడం లేదు కాబట్టి, ఆలోచించవలసినంతగా పట్టించుకోకపోవడం కాబట్టి. అదంతా ఇంకా, ఇప్పటికీ ఒక చిన్నపిల్లలాగా ప్రపంచాన్ని చూడటంలాగే ఉంటోంది కాబట్టి-ఇంకా చెప్పాలంటే ఒక ఆదర్శవాదిలాగా చూడటం మటుకే కాబట్టి.

అసగాయి: చిన్నపిల్లలు కొన్నిసార్లు విషయాల్ని బాగా చూడగలరు-ఆదర్శవాదులింకా బాగా చూడగలరు.

బెణేతా: నాకు తెలుసు నువ్వట్లానే ఆలోచిస్తావని. నేనెక్కడనుంచి ముందుకొచ్చేసానో నువ్వింకా అక్కడే ఉన్నావు. నువ్వూ నీ మాటలూ, ఆఫ్రికా గురించి నువ్వు కనే కలలూ! ఈ ప్రపంచాన్ని చక్కబరచగలమనే నీ ఆలోచన. వలసవాదమనే మహావ్యాధికి (అవహేళనగా) స్వాతంత్ర్యమనే పెన్సిలిన్ తో చికిత్స చెయ్యొచ్చనే నువ్వింకా నమ్ముతున్నావు-!

అసగాయి: అవును!

బెణేతా: స్వాతంత్ర్యం, ఆ తర్వాత? మోసగాళ్ళూ, దొంగలూ, మూర్ఖులూ అధికారంలోకి వస్తారు, ఇంతకుముందులాగే దోపిడీ సాగిస్తారు-ఇప్పుడు మటుకే వాళ్ళు నల్లవాళ్ళు, రేపు కొత్తగా లభించే స్వాతంత్ర్యం పేరిట కొత్త దోపిడీ కొనసాగిస్తారు-వాళ్ళ సంగతేమిటి?!

అసగాయి: అది రేపటి సమస్య. ముందు మనమక్కడికి చేరుకోడం ముఖ్యం.

బెణేతా: కాని దానికి అంతెక్కడ?

అసగాయి: అంతమా? అంతం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? దేనికి అంతం? జీవితానికా? జీవించడానికా?

బెణేతా: దుఃఖానికి, వేదనకి, మూర్ఖత్వానికి! ప్రగతి అంటూ ఏదీ నిజంగా లేనేలేదని నీకు తెలియడం లేదా అసగాయి? ఉన్నదల్లా పెద్ద వలయం. దాన్లో దాని చుట్టూతానే మనం మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళం, మన చిన్న చిన్న భవిష్యచిత్రపటాల్ని మనముందు పెట్టుకుని మరీ, తిరుగుతున్నాం.-మన మన చిన్న ఎండమావుల్నే మనం మన భవిష్యత్తుగా ఊహించుకుంటున్నాం.

అసగాయి: అదే పొరపాటు.

బెణేతా: ఏది?

అసగాయి: ఇప్పుడు నువ్వు చెప్పిందే-వలయం గురించి చెప్పావు చూడు. అది నిజానికి వలయం కాదు-అదొక సరళరేఖ- నీకు జామెట్రీ తెలుసుకదా, సరళరేఖలెప్పుడూ అనంతంలోకి సాగిపోతాయి. ఆ రేఖ ఎక్కడ ముగుస్తుందో మనం చూడలేం కాబట్టి-అదెట్లా మారుతుందో కూడా చూడలేకపోతున్నాం. వినడానికి విచిత్రం గా ఉంటుందిగానీ, ఆ మార్పుని చూసేవాళ్ళు-అంటే ఎవరు కలలు గంటారో, ఎవరు చేతులెత్తెయ్యడానికి సిద్ధపడరో-వాళ్ళనే ఆదర్శవాదులని పిలుస్తున్నారు. అలాకాక, ఆ వలయాన్ని మటుకే ఎవరు చూస్తున్నారో-వాళ్ళని మనం యథార్థవాదులంటున్నాం!

బెణేతా: అసగాయి, నేనింకా, అక్కడ , ఆ మంచం మీద నిద్రపోతూ ఉండగానే,మనుషులు నా చేతుల్లోంచి నా భవిష్యత్తు లాగేసుకున్నారు! నన్నడిగినవాళ్ళు లేరు, నాతో మాట్లాడినవాళ్ళు లేరు-వాళ్ళట్లా కన్నుమూసి తెరిచేటంతలో నా జీవితాన్ని మార్చిపారేసారు!

అసగాయి: అది నీ డబ్బేనా?

బెణేతా: ఏది?

అసగాయి: అతడు పోగొట్టుకున్నది నీ డబ్బేనా?

బెణేతా: అది మా అందరి సొత్తు.

అసగాయి: అది నువ్వు సంపాదించావా? మీ నాన్న బతికి ఉండిఉంటే, చనిపోకపోయి ఉంటే, మీకా డబ్బొచ్చేదా?

బెణేతా: లేదు.

అసగాయి: మరలాగైతే, ఈ ఇంట్లో-అసలీ ప్రపంచంలోనే- ఏదో తేడాగా ఉందనిపించడం లేదూ- అన్ని కలలూ, మంచివీ, చెడ్డవీ, ఒక్క మనిషి చావుమీద ఆధారపడిఉండటం? మిమ్మల్నిట్లా చూస్తానని నేనెన్నడూ అనుకోలేదు. మీరు- మనిషి కేవలం తిండిమీదనే బతకడని అనుకునేవాళ్ళనుకున్నాను-కాని మీరు? మీ అన్న చేసింది పొరపాటే కాని, మీరంతా అతడికి ఋణపడి ఉండాలి, ఏందుకంటే దానిగురించి మీరు అస్వస్థమానవజాతి మొత్తాన్ని గాలికొదిలెయ్యడానికి సిద్ధపడ్డారు! నువ్వేమో పోరాటం దేనికంటావు, అసలేది మంచిదంటూ తర్కిస్తావు. మనమంతా ఎక్కడికిపోతున్నాం, దేని గురించి తలపట్టుకుంటున్నాం!

బెణేతా: దానికి నీ దగ్గర కూడా సమాధానం లేదు!

అసగాయి: (బిగ్గరగా అరుస్తూ) సమాధానమా? నా జీవితమే సమాధానం!(క్షణం పాటు ఆగి)మా ఊళ్ళో ఎవడేనా న్యూస్ పేపర్ చదవగలిగితే అదే గొప్ప విషయం. అసలేవడేనా ఓ పుస్తకం తెరవగలిగితే చాలు. అదే గొప్ప. నేను మా ఇంటికెళ్ళినప్పుడు నేనేది మాట్లాడినా మా ఊళ్ళోవాళ్ళకి చిత్రంగా ఉంటుంది. అలాగని నేను వాళ్ళతో చర్చించడం మానను, వాళ్ళకి వివరిస్తూనే ఉంటాను, పనిచేసుకుంటూపోతాను. మార్పు నెమ్మదిమీద కనిపిస్తూంటుంది. నెమ్మదిగానే, కాని, చురుగ్గా కూడా. ఒక్కొక్కప్పుడు అసలేమీ మారడంలేదా అన్నట్టుంటుంది. .అంతలోనే గొప్ప నాటకీయ సంఘటనలు సంభవిస్తాయి, చరిత్ర ఒక్కగెంతుతో భవిష్యత్తులోకి దూకుతుంది. మళ్ళా నిశ్శబ్దం. ఒక్కొక్కప్పుడు వెనకడుగు కూడా తీసుకుంటుంది. తుపాకులు, హత్య, విప్లవం. వాటన్నిటి బదులు, చప్పుడు చెయ్యకుండా, ప్రశాంతంగా ఉండిపోడం మంచిదికాదా అని నాక్కూడా అనిపించిన కొన్ని క్షణాలు లేకపోలేదు. కాని, మా ఊరు, వాళ్ళ నిరక్షరాస్యత, వెనకబాటుతనం, అనారోగ్యం కళ్ళముందు మెదిలినప్పుడు, నేను మరేమీ ఆలోచించను. బహుశా…బహుశా నేనొక మహామనీషిని కూడా కాగలనేమో…అంటే, ఆ సత్యసారాంశాన్ని గట్టిగా హత్తుకుని సరైనదారిలోనే ముందుకు పోగలుగుతానేమో..అట్లా సత్యాన్ని అంటిపెట్టుకున్నందుకు, బహుశా ఏ అర్థరాత్రో, సామ్రాజ్యవాద సేవకులు నన్ను నా పక్కలోనే నరికిపారేస్తారేమో..

బెణేతా: అమరవీరుడివవుతావు!

అసగాయి: (చిరునవ్వుతూ) …లేదా బహుశా నేను సుదీర్ఘకాలం పాటు నా వృద్ధాప్యందాకా జీవిస్తానేమో, నా కొత్త దేశంలో గొప్ప గౌరవానికి నోచుకుంటానేమో. బహుశా స్వాతంత్ర్యం వచ్చాక నేనేదన్నా పదవినధిరోహిస్తానేమో, ఇదే నేన్నీకు చెప్పాలనుకుంటున్నది, మనం భావిస్తున్నదే నిజం కాదు, నేనిప్పుడు కంటున్న కలలన్నీ రేపు నా దేశానికి ఎందుకూ కొరగాకపోవచ్చు, కాలం చెల్లిపోయినవి కావచ్చు, నేనది అర్థం చేసుకోకుండా, కేవలం నా పదవి కాపాడుకోడం కోసమే, దారుణాలకి ఒడిగట్టవచ్చునేమో కూడా. చూడు, అప్పుడు కూడా కొందరు యువతీయువకులు అక్కడుంటారు-బ్రిటిష్ సైనికులుగా కాదు, నా సొంతనల్లజాతి మనుషులుగానే వాళ్ళే సాయంకాలమో నీడలోంచి బయటకొచ్చి ఎందుకూ పనికిరాని నా పీక కోసెయ్యవచ్చు. ఇప్పటికే అట్లాంటివాళ్ళక్కడున్నారు…ఎప్పటికీ ఉంటారు కూడా. అప్పుడు నా మరణంలాంటిది కూడా ఒక ముందడుగే కావొచ్చేమో. వాళ్ళు, నన్నట్లా వధించేవాళ్ళు కూడా.. నిజానికి నేను పోగానే నన్నుమించిపోవచ్చు కూడా

21-2-2018

Leave a Reply

%d bloggers like this: