హార్లెం సౌందర్యశాస్త్రం

Reading Time: 3 minutes

34

కవిత్వం కూడా యవ్వనంలాగా, వసంతంలాగా, ఒక జీవితంలో ఒక్కసారి మటుకే వచ్చివాలుతుంది. నిర్మలమైన ప్రేమలాగా, యవ్వనారంభసమయంలోనే సాక్షాత్కరిస్తుంది. కవి అంటే పాతికేళ్ళలోపు, మహా అయితే, ముప్పై ఏళ్ళ లోపు కవిత్వం చెప్పినవాడే, కీట్స్ లాగా, రేంబో లాగా, తోరూదత్ లాగా, మహా ప్రస్థానగీతాలు రాసిన శ్రీ శ్రీ లాగా. ఆ తర్వాత కూడా కవిత్వం రాయొచ్చుగాని, అప్పుడది అయితే వచనమవుతుంది, లేదా ప్రవచనమవుతుంది.

లాంగ్ స్టన్ హ్యూస్ 23 ఏళ్ళకే పరిపూర్ణమైన కవిత్వం రాసేసాడు. ఎంత పరిపూర్ణమంటే, అతణ్ణి 23 ఏళ్ళకే ఆత్మకథ రాయమని ప్రచురణకర్తలు అడిగేటంత. 23 ఏళ్ళకే ఆ వ్యక్తిత్వ వికాసం పూర్తయిపోయింది. 1926 లో The Weary Blues ప్రచురించేటప్పటికి, ఆఫ్రికన్-అమెరికన్ ప్రజానీకం తమ హృదయాల్లో ఆ కవిరాకుమారుడికి పట్టాభిషేకం చేసేసుకున్నారు.

కాని, ఆఫ్రికన్-అమెరికన్ కవిత్వంలో, అమెరికన్ కవిత్వంలో, ఆధునిక కవిత్వంలో లాంగ్ స్టన్ హ్యూస్ ప్రస్తుత స్థానం ఏమిటి? ఈ ప్రశ్న గత అరవై డెభ్భై ఏళ్ళుగా అతడి సమీక్షకుల్నీ, విమర్శకుల్నీ చీకాకు పెడుతూనే ఉంది. చాలామంది సాహిత్యవిమర్శకుల దృష్టిలో అతడు పేలవమైన కవి. ఆధునిక జీవితం తాలూకు సంక్లిష్ట పార్శ్వాల్ని ఒక ఇలియట్ లాగా, ఒక పౌండ్ లాగా పట్టుకోలేకపోయిన కవి. భావోద్వేగపరంగాకాని, కవిత్వం ప్రకటించవలసిన లోతుల బట్టిగాని చూస్తే చాలా బోలు కవి. రిచర్డ్ రైట్, రాల్ఫ్ ఎల్లిసన్ లాంటి ఆఫ్రికన్-అమెరికన్ రచయితలు తలెత్తాక, 40 ల నాటికే, హ్యూస్ వెలవెలబోవడం మొదలయ్యింది. అతడు రాజకీయంగానూ, మతపరంగానూ తీవ్రమైన కవిత్వం కొంత రాసినప్పటికీ, తర్వాత రోజుల్లో మెకార్థీ కాలంలో, తాను కమ్యూనిస్టు పార్టీ సభ్యుణ్ణి కానంటో వాజ్మూలం ఇవ్వడం వల్ల, డుబ్వా, పాల్ రాబ్సన్ వంటి పోరాటకారుల దృష్టిలో కూడా పలచబడ్డాడు. తన 65 వ ఏట మరణించేదాకా, అతడు కవిత్వం, కథలు, నవలలు, నాటకాలు, మిత్రులకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నా, అతడి మొదటికవిత ‘ఆ నీగ్రో నదుల్ని గానం చేస్తున్నాడు’ దాటి అతడేమీ రాయలేకపోయాడనీ, ఆ రాసిందంతా, ఆ మొదటికవితకి కొనసాగింపు మాత్రమేననీ భావించేవాళ్ళు చాలామందే ఉన్నారు. చివరికి అతడి ఆత్మకథ The Big Sea కూడా అతడి స్థాయి రచయిత రాసినట్టుగాలేదని రాల్ఫ్ ఎల్లిసన్ లాంటివాడే తీసిపారేసాడు.

అతడి మొత్తం సాహిత్యసృజనకన్నా అతడి జీవితం చాలా విలువైందనీ, అది కూడా ఆర్నాల్డ్ రాం పెర్షాద్ రాసిన జీవితచరిత్రని బట్టే తనకి అర్థమయిందని హెరాల్డ్ బ్లూమ్ Bloom’s Modern Critical Views: Langston Hughes (2007) కి రాసిన ముందుమాటలో అభిప్రాయపడ్డాడు. అంతకుముందు రాసిన మరొక వ్యాసంలో, హ్యూస్ ఒక ఒంటరి అని, ఏకాకిగానే జీవించాడనీ, ఏకాకిగానే మరణించాడనీ కూడా రాసాడు. అతడు తన బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమకి నోచుకోకపోవడమే అతడి జీవితాన్ని అతడికి దూరం చేసేసిందని బ్లూమ్ విశ్లేషణ.

కాని, ప్రపంచ కవిత్వం, ప్రాచీనం,ఆధునికం చెప్పుకోదగినంతగా చదివిన నాకు, హ్యూస్ ఉత్తమోత్తమకవుల సరసన నిలబడగల కవిగా గోచరిస్తున్నాడు. సరళంగా రాయడం చాలా కష్టం.’గీతం వలె సులభత్వాన్ని సాధించే శిక్షణామార్గమే అన్నిటికన్నా కష్టమైనది’ అంటున్నది గీతాంజలి (చలం అనువాదం). తెలుగులో గురజాడ, ఇస్మాయిల్ చేసిందిదే. ఈ సరళసత్యవాఙ్మహిమవల్లనే వేమనని తన ఆరాధ్యకవిగా శ్రీ శ్రీ ప్రస్తుతించాడు.

హ్యూస్ తనని తాను ఒక మెస్సయ్యాగా ప్రకటించుకోలేదని ఆర్నాల్డ్ రామ్ పెర్షాద్ చెప్పినమాట హ్యూస్ ఆత్మని పట్టిచ్చే మాట. తనని తాను ఒక వక్తగానో, ప్రవక్తగానో సంభావించుకోకపోవడం వల్లనే, ఆ సత్యసంధతవల్లనే హ్యూస్ నాకు మరింత ఆరాధనీయంగా గోచరిస్తున్నాడు. హ్యూస్ తనని తన జీవితమంతా, ఎప్పుడో ఏ పురాతన కాలంలోనో కాంగో ఒడ్డున పాటలు పాడుకున్న ప్రాచీన ఆఫ్రికా గాయకుడిగానే భావించుకుంటూ వచ్చాడని మనం గ్రహించవచ్చు. అతడు కూడా విట్ మన్ లాంటివాడేననీ అయితే hermetic Whitman అనీ అంటున్నప్పుడు మటుకు బ్లూమ్ సత్యానికి సన్నిహితంగా వచ్చాడనిపిస్తున్నాడు. ఇటువంటి ఆదిమగాయకుణ్ణి, ఇటువంటి ఋషితుల్యుణ్ణి నాకు పరిచయం చేసినందుకు కన్నెగంటి రామారావు, నా హృదయాన్ని చేతుల్లోకి తీసుకుని మరీ, నీతో కరచాలనం చెయ్యాలని ఉంది.

నీగ్రో

నేనొక నీగ్రోని:
రాత్రి లాగా నల్లవాణ్ణి
నా అగాధమైన ఆఫ్రికా అంత నల్లవాణ్ణి.

నేనొక బానిసగా బతికాను:
తన వాకిలి చిమ్మమని సీజరు చెప్పాడు
వాషింగ్టన్ బూట్లు తుడిచాన్నేను.

నేనొక యోధుణ్ణి:
నా చేతుల్తోటే పిరమిడ్లు పైకి లేపాను
అమెరికా ఆకాశహర్మ్యాలకు సున్నం కలిపాను.

నేనొక గాయకుణ్ణి:
ఆఫ్రికానుంచి జార్జియా దాకా
శోకగీతాలు పాడుకుంటూ వచ్చాను
విషాదసంగీతం సృష్టించాను.

నేనొక బలిపశువుని:
కాంగోలో బెల్జియన్లు నా చేతులు నరికేసారు
మిసిసిపి ఒడ్డున నన్నింకా చిత్రవధ చేస్తున్నారు.

నేనొక నీగ్రోని:
రాత్రి లాగా నల్లవాణ్ణి
నా అగాధమైన ఆఫ్రికా అంత నల్లవాణ్ణి.

వలస

దక్షిణాదినల్లపిల్లాడొకడు
ఉత్తరాది బళ్ళో చేరాడు.
అక్కడ తెల్లపిల్లల్తో కలిసి
ఆడుకోడానికి భయపడ్డాడు.

మొదట్లో వాళ్ళతన్ని బాగానే చూసారు
చివరికి ఎగతాళి చేసారు
నీగ్రోగాడని పిలిచారు.

మరికొన్నాళ్ళకి
నల్లపిల్లలు కూడా
ఏవగించుకోడం మొదలుపెట్టారు

చిన్నపిల్లడు,నల్లపిల్లడు,
గుండ్రటి, నల్లటిముఖం,
పువ్వులు కుట్టిన తెల్లటి కాలరు.

భీతావహుడైన ఆ
చిన్నారిపిల్లణ్ణి తలుచుకుంటూ
భవిష్యత్తు చిత్రపటంలాంటి
ఓ కథ చెప్పుకోవచ్చు.

జొహన్నస్ బర్గ్ గనులు

జొహన్నస్ బర్గ్ గనుల్లో
2,40,000 మంది
ఆఫ్రికన్లు పనిచేస్తున్నారు.
దీన్నుంచి నీకెట్లాంటి
కవిత స్ఫురిస్తున్నది?
2,40,000 మంది ఆఫ్రికన్లు
జొహన్నస్ బర్గ్ గనుల్లో
కూలిపనిచేస్తున్నారు.

శిలువ

మా నాన్న ఒక తెల్లముసలాడు
మా అమ్మ ఒక నల్లముసలమ్మ
నేనెప్పుడేనా మా నాన్నని తిట్టుకునిఉంటే
ఆ శాపనార్థాలు వెనక్కి తీసుకుంటున్నాను

మా నల్లముసలమ్మ నరకానికి పోవాలని
శపించి ఉంటే, ఆ శాపనార్థాలన్నిటికీ
చింతిస్తున్నాను. ఆమె నిజంగా సుఖంగా,
సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.

ఆ ముసలాడు ఇంద్రభవనంలాంటి ఇంట్లో
మరణించాడు. మా అమ్మ సంకెళ్ళతోటే
చనిపోయింది. అటు తెలుపూకాక, ఇటు
నలుపూ కాక, నేను సమసిపోయేదెక్కడ?

ఆధ్యాత్మికగీతాలు

గండశిలలు, నేలలోకి తన్నుకొన్న చెట్లవేళ్ళు,
పొడుగ్గా సాగుతున్న కొండకొమ్ములు,
ఏవో ఒకటి, నా చేతులు ఆన్చుకోడానికి.

యేసయ్యా, పాట పాడయ్యా!
పాట బహుగట్టిది.
బతుకు గాయపరిచినప్పుడల్లా మా అమ్మ
పాటలుపాడుకోడం నేనెన్నోసార్లు విన్నాను

‘నడిపించు నా నావా, నడిసాంద్రమున దేవా ‘

దృఢంగా తన్నుకొన్న వేళ్ళమీంచి
చెట్ల కొమ్మలు పైకి లేస్తాయి,
బలంగా కుదురుకున్న నేలతల్లి
ఒడిలోంచి కొండలు పైకి లేస్తాయి,
బరువుగా పరుచుకున్న సముద్రమ్మీంచి
కెరటాలు పైకి లేస్తాయి.

నల్లనమ్మా, పాట పాడమ్మా!
పాట బహుగట్టిది.

హార్లెం సౌందర్యశాస్త్రం

ఆశ్చర్యం.
మర్యాదస్తుల భాష వినబడేచోట
ఏళ్ళ తరబడి నేను
వెతుక్కున్న జీవితం
ఇక్కడ, ఈ నీగ్రోలనడుమ
ముఖాముఖి తారసపడింది.
ఈ వీథిలో అడుగుపెట్టానో లేదో
నన్ను ముంచెత్తింది.

సంపెంగ పూలు

పూర్తిగా వికారంగా ఉన్న ఈ మూల
నిశ్శబ్దంగా వాడిపోతున్న జీవితం.

సంపెంగపూలు వెతుక్కుంటూ బయల్దేరాను
దొరకలేదు
సాయంసంధ్యవేళ సంపెంగపూలకోసం వెతుక్కున్నాను
దొరకలేదు.
ఉన్నదల్లా, ఈ మూల,
వట్టి వికారం.

క్షమించమ్మా
నిన్ను కావాలని తొక్కలేదు.

ఈ సాంధ్యవేళ
ఇక్కడెక్కడెక్కడో సంపెంగలు ఉండితీరాలి.

క్షమించమ్మా,
నిన్ను కావాలని తొక్కలేదు.

పర్సనల్

‘పర్సనల్ ‘
అని రాసి పెట్టిన కవర్లో
దేవుడు నాకో లేఖ రాసాడు

నేను నా జవాబు
రాసిన కవరు మీద కూడా
‘పర్సనల్ ‘ అని రాసిపెట్టాను.

పోషకుడితో కవి

జీతంకోసం
నా హృదయశకలాల్ని
వెదజల్లాలని ఎవరేనా
ఎట్లా శాసించగలరు?

బతకడానికి
అన్నంకోసమైతే, సరే
కాని ఆత్మనెట్లా
అమ్ముకునేది నీకు?

సుగంధభరితమైన ఫర్మానాతో
‘ఈరోజు ఏం వినిపిస్తున్నావు?’
అని అడిగించుకోడం కన్నా
కారుచౌక బత్తేనికి
కార్ఖానాలో కూలిపనినయం.

కొన్ని పదాలున్నాయి, స్వేచ్ఛలాంటివి

కొన్ని పదాలున్నాయి, స్వేచ్ఛ లాంటివి,
పలకుతుంటే మహామధురంగా ఉంటుంది.
నా హృదయతంత్రులమీద రోజంతా
స్వేచ్ఛ శ్రుతిచేస్తోనే ఉంటుంది.

కొన్నిపదాలుంటాయి, స్వాతంత్ర్యం లాంటివి,
వింటే చాలు, ఏడుపొచ్చేస్తుంది.
ఎందుకో నీకు తెలియాలంటే
నాకు తెలిసిందేదో నీకూ తెలియాలి.

18-2-2018

Leave a Reply

%d bloggers like this: